హలో కరీ చేతుల్లోకి ఫస్ట్ మీల్
ఫుడ్ స్పేస్‌లో లీడర్‌గా ఎదగాలనే లక్ష్యం
హైదరాబాద్‌కు చెందిన క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్ హలో కరీ.. బ్రేక్‌ఫాస్ట్, మీల్ బాక్స్ సెగ్మెంట్లోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఫస్ట్ మీల్ అనే ఫుడ్ అండ్ డెలివరీ స్టార్టప్‌ను సొంతం చేసుకుంది. డీల్ సైజ్ తెలియకపోయినప్పటికీ కొంత క్యాష్, కొంత ఈక్విటీ రూపంలో డీల్ కుదిరినట్టు సమాచారం.
ఇప్పటికే పరాటా పోస్ట్ వంటి సంస్థలను విలీనం చేసుకున్న హలో కరీ.. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఉంది.
హైదరాబాద్, పుణె, బెంగళూరులో 33 ఔట్‌లెట్లను మొదలుపెట్టిన హలో కరీ.. తన రెవెన్యూ మోడల్ విషయంలో చాలా క్లియర్‌గా ఉంది. ప్రతీ యూనిట్ లాభాల్లోకి ఉండటంతో నిలకడైన మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. వివిధ ఫార్మాట్లలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా ఇదే విషయంపై శ్రద్ధ తీసుకుంటోంది. సదరు సంస్థ కాన్సెప్ట్ ఇన్నోవేటివ్‌గా ఉండడంతో పాటు మొదటిరోజు నుంచి లాభాల్లో ఉన్న వాటినే ఎక్కువగా ఎంపిక చేసుకుంటోంది.
ప్రతీ యూనిట్ లెవెల్‌లో ప్రాఫిటబులిటీ ఉంటేనే ఆ మోడల్ నిలబడుతుంది. లేకపోతే లాంగ్ రన్‌లో అలాంటి మోడల్స్ ఎంత ఫండింగ్ వచ్చినా నిలబడలేవు. పరాటా పోస్ట్, ఫస్ట్ మీల్ సంస్థల కొనుగోళ్ల తర్వాత ఈ విషయం మీకే అర్థమై ఉంటుంది - రాజు భూపతి, హలో కరీ ఫౌండర్
ఫ్యూచర్ అంతా సబ్‍స్క్రిప్షన్ బ్యాలెన్స్‌డ్ మీల్ బాక్స్‌లదేనా ?
రొటీన్ కరీలు, బిర్యానీల నుంచి జనాలు మెల్లిగా దూరం జరుగుతున్నారు. జనాల్లో కాస్ట్ కాన్షియస్‌తో పాటు హెల్త్ కాన్షియస్ కూడా బాగా పెరుగుతున్న నేపధ్యంలో బ్యాలెన్స్‌డ్ మీల్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఎంత తింటున్నామో కాకుండా ఏం తింటున్నామో ఆలోచిస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను క్యాష్ చేసుకోవాలని హలో కరీ భావిస్తోంది.
ఇందులో భాగంగానే ఫస్ట్ మీల్‌ను సొంతం చేసుకుంది. ఫస్ట్ మీల్ సంస్థను ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ సెగ్మెంట్లో పాగా వేసింది. నాలుగైదు రకాల హెల్తీ బ్రేక్ ఫాస్ట్ మెనూతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులను డోర్ దగ్గరికే డెలివర్ చేస్తూ మార్కెట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. నెలకు 10,000 మీల్ బాక్సులను సరఫరా చేస్తోంది. రూ. 70-80 ప్రైస్ రేంజ్‌లో వచ్చిన మోడల్ కావడంతో రెస్సాన్స్ కూడా పెరుగుతూ వచ్చింది. మరింత ముందుకు దూసుకువెళ్లే ప్రయత్నంలో ఉండగానే.. ఫస్ట్ మీల్ స్టార్టప్.. హలో కరీ వశమైంది.
'' ఏడు నెలల పాటు టీమ్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ డీల్‌తో మాకు చాలా సంతోషం కలుగుతోంది. మా వేల్యూయేషన్స్‌కు తగ్గట్టు హలో కరీలో మాకు కొద్దిగా ఈక్విటీ కూడా దక్కనుంది '' - యువరాజ్
ఫస్ట్ మీల్ సంస్థను యువరాజ్ పూసర్ల మరికొంత మందితో కలిసి కొన్ని నెలల క్రితం ప్రారంభించారు.
'' రాబోయే రోజుల్లో బ్యాలెన్స్‌డ్ మీల్ బాక్స్ కాన్సెప్ట్ రాబోతోంది. మనం తినే ఫుడ్‌లో విటమిన్స్ ఎన్ని, ప్రోటీన్స్ ఎన్ని అని లెక్కవేసుకుని తినే పరిస్థితి వస్తుంది. అందుకే ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నాం. వీటికి తోడు ఆన్ డిమాండ్ కంటే సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌ను, లాభాలను ముందే ఊహించేందుకు అవకాశం ఉండడమే దీనికి కారణం '' - రాజు భూపతి.