నాడు నెలకు రూ. వెయ్యి జీతం.. నేడు సక్సెస్ ఫుల్ కంపెనీకి ఫౌండర్.. అమలాపురం కుర్రోడి విజయగాథ

నాడు నెలకు రూ. వెయ్యి జీతం.. నేడు సక్సెస్ ఫుల్  కంపెనీకి ఫౌండర్.. అమలాపురం కుర్రోడి విజయగాథ

Friday May 13, 2016,

9 min Read


డాక్టర్ కావాలనుకున్నాడు. కాలం కలిసిరాలేదు. జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు. అన్నీ కల్లలైపోయాయి. ఎన్నో ఒడిదొడుకులు. ఇంకెన్నో ఆటుపోట్లు. వైఫల్యాలు వెక్కిరించాయి. అయినా ఓటమిని అంగీకరించలేదు. జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను, కష్టాన్ని గుణపాఠం అనుకున్నాడు. కష్టపడి పనిచేశాడు. సీన్ కట్ చేస్తే.. కార్పొరేట్ కొలువు. కోట్ల రూపాయల జీతం. హైఫై లైఫ్. జీవితంలో ఎంతో సాధించాడు. అయినా తృప్తి లేదు. ఏదో చేయాలన్న తపన. ఇంకెంతో సాధించాలన్న పట్టుదల. కష్టాలు ఆయనను పరీక్షిస్తే తీసుకునే నిర్ణయాలు విజయం ముంగిట నిలిపేవి. అలాంటి నిర్ణయాల్లోంచి పుట్టుకొచ్చి ఫుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న స్టార్టప్.. హలో కర్రీ. 

భూపతి రాజు. ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన ఈయనే హలో కర్రీ ఫౌండర్. తండ్రి నరసింహ రాజు. హోమియోపతి డాక్టర్. గొప్ప సమాజ సేవకుడు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తనదగ్గరకొచ్చే వారందరికీ ఉచితంగా వైద్యం చేసేవారు. తండ్రి డాక్టర్ కావడంతో సహజంగానే భూపతి రాజు కూడా డాక్టర్ కావాలని కలలుకన్నాడు.

“నాన్నగారు పేరున్న డాక్టర్. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. నయాపైసా తీసుకోకుండా ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేశారు. ఉచిత వైద్యం కావడంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చేవారు. ఇంట్లో రోజూ జాతర జరుగుతున్నట్లు అనిపించేది. ఆయన చుట్టు ఎంత జనం గుమికూడేవారంటే ఒక్కోసారి ఆయన దగ్గరకు వెళ్లేందుకు కూడా వీలయ్యేది కాదు. ఆయన ఎప్పుడో ఏదో ఒక పనిలో బిజీగా ఉండేవారు. నాన్నను చూసి నేను కూడా ఆయనలాగే అవ్వాలనిపించేది. ఆయన వారసత్వాన్ని కొనసాగించాలనిపించేది. అందుకే డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నా.

భూపతి రాజు ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూప్‌ తీసుకున్నాడు. కాలేజీలో చేరేంత వరకు బాగానే అనిపించింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు కొరుకుడు పడలేదు. చదువుపై ఏకాగ్రత తగ్గింది. తండ్రి మాత్రం భూపతి రాజు డాక్టర్‌ అవ్వాలని కోరుకునే వారు.

“బైపీసీలో జాయిన్ అయ్యాను. లెక్చరర్లు ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. నిజానికి ఏడో తరగతి వరకు బాగానే చదివేవాడిని. మంచి మార్కులొచ్చాయి. ఆ తర్వాతే ఏమైందో తెలియదు. ఏ విషయంపైనా దృష్టి పెట్టలేకపోయేవాడిని. మెడిసిన్‌ సీటు కోసం కష్టపడి ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ రాశా.”

image


ఎంసెట్‌లో భూపతి రాజుకు ఐదంకెల ర్యాంకు వచ్చింది. డబుల్‌ డిజిట్‌ ర్యాంక్‌ వచ్చిన వారికే సీటు దొరకడం కష్టం. అలాంటిది ఐదంకెల ర్యాంకు. కుటుంబ సభ్యులంతా బాధపడ్డారు. ఎంబీబీఎస్‌ కాకపోయినా హోమియోపతి, డెంటల్‌ కోర్సుల్లో సీటొచ్చే ఛాన్సుంది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు హోమియోపతి కోర్సులో చేరమని సలహా ఇచ్చారు. మంచి కాలేజీని వెతికే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎంతో ప్రయాస తర్వాత కర్నాటక హుబ్లీలోని హోమియోపతి కాలేజ్‌ లో చేర్చాలన్న నిర్ణయానికొచ్చారు. హుబ్లీ కాలేజ్‌లో సీటు కన్ఫమ్‌ అయింది. ఫీజు కట్టి చేరడమే ఆలస్యం. హుబ్లీ కాలేజ్‌ గురించి అక్కడి లైఫ్‌ గురించి కలలు కంటూ ఊహల్లో తేలిపోయా. కొత్త ప్రపంచం, అందమైన అమ్మాయిలు, కొత్త ఫ్రెండ్స్‌, సెపరేట్‌ రూం, కుటుంబానికి దూరంగా. ఫుల్‌ ఫ్రీడం. అని సంబరపడ్డా. ఫీజు కట్టేందుకు బాబాయితో కలిసి హుబ్లీ వెళ్లా. ఫీజు కట్టి అట్నుంచి అటే గోవా వెళ్లాలన్నది ప్లాన్‌.

“కాలేజ్‌ గేట్‌ బయట పీసీఓ ఎస్టీడీ బూత్‌ ఉంది. బాబాయ్‌ నువ్వెళ్లి ఫీజ్‌ కౌంటర్‌ క్యూలో నిలబడు. ఒక ఫోన్‌ చేసి వస్తానన్నాడు. సరేనని తలూపి లోపలికెళ్లా. కలల లోకంలో విహరిస్తుండగా బాబాయ్‌ వచ్చి మీ నాన్న వెంటనే తిరిగొచ్చేయమంటున్నారు. అక్కడే లోకల్‌ కాలేజీలో అడ్మిషన్‌ దొరుకుతుందట అన్నాడు. ఈ మాట వినగానే కలలన్నీ ముక్కలయ్యాయి. అందమైన ఊహా ప్రపంచం రెప్పపాటులో మాయమైంది. అప్పటికి క్యూ లైన్ లో కంప్యూటర్ కు చాలా దగ్గరలో ఉన్నాను. మరికొన్నిక్షణాల్లో నా వంతు వస్తుంది. అలాంటి సమయంలో బాబాయ్ వచ్చి ఇంటికి తిరిగెళ్దాం అనేసరికి చెప్పలేనంత బాధకలిగింది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి ఒక అడుగుదూరంలో ఉండగా ఎవరో తోసేస్తే భూమ్మీద వచ్చి పడ్డట్లనిపించింది.

హుబ్లీ నుంచి తిరిగొచ్చాక గుడివాడలోని మెడికల్ కాలేజీలో సీటు దొరుకుతుందన్న విషయం చెప్పారు. భూపతి రాజు ఎన్సీసీ క్యాడెట్ కావడంతో ఆ కోటాలో సీటు దొరికే ఛాన్సుంది. గుడివాడ కాలేజ్ వెయింటిగ్ లిస్టులో మొదటి పేరు భూపతి రాజుదే. ఆ విషయం తెలియగానే ఊహలకు మళ్లీ రెక్కలొచ్చాయి. కానీ విచిత్రం ఏంటంటే ఏ రోజైతే కాలేజీలో భూపతి రాజు ఇంటర్వ్యూ ఉందో అదే రోజు ఎన్సీసీ కోటాను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూపతి రాజు కల కలగానే మిగిలిపోయింది.

ఊరికి తిరిగి వెళ్లి లోకల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం భూపతికి ఇష్టం లేదు. లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ అయి మరుసటి ఏడాది మళ్లీ ఎంసెట్ రాశాడు. ఈసారి ర్యాంకు ఐదంకెల నుంచి ఆరంకెలకు చేరింది. ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశమే లేకపోడంతో నిరాశ ఆవహించింది. ఎంట్రెన్స్ టెస్ట్ లో రెండోసారి కూడా మంచి ర్యాంకు రాకపోడంతో సొంతూరెళ్లేందుకు ముఖం చెల్లలేదు. డాక్టర్ కావాలన్న కోరిక నెరవేసే పరిస్థితి కనిపించడంలేదు. ఇంటర్ బైపీసీ చదవడంతో బీఎస్సీ కోర్సులో చేరడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. కాకినాడలోని ఓ డిగ్రీకాలేజీలో జాయిన్ అయ్యాడు. డిగ్రీ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి డిగ్రీలో భూపతికి కెమిస్ట్రీలో వరుసగా మూడేళ్లు వచ్చిన మార్కులు 35 మాత్రమే. అంటే ఒక్క మార్కు తక్కువొచ్చినా ఫెయిల్ అయ్యేవాడు. అత్తెసరు మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన భూపతి భోపాల్ లోని ఓ యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన జీవితం కొత్త మలుపు తిరిగింది.

image


ఒక్కోసారి జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లాలి. భూపతి అదే చేశాడు. ఐటీ సెక్టార్ లో ఉన్న అన్న సలహా మేరకు నెలరోజుల పాటు ఐటీ కోచింగ్ కు వెళ్లాడు. నిజానికి క్లాస్ లో చెప్పిన సబ్జెక్ట్ సరిగా అర్థం కాకపోయినా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. అదే సమయంలో అమెరికా నుంచి తిరిగొచ్చిన పొరుగింటాయన కొత్తగా కంపెనీ పెట్టాడు. ఒకరోజు భూపతిని పిలిచి కంపెనీలో ఉద్యోగం చేస్తావా అని అడిగాడు. మొదటి జాబ్ ఆఫర్. ఎవరైనా తనకు ఇలా జాబ్ ఆఫర్ చేస్తారని భూపతి కలలో కూడా ఊహించలేదు. అన్నయ్య సలహాతో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఉద్యోగంలో చేరితే సంపాదనతో పాటు సంతోషం తిరిగొస్తుందనుకున్నాడు. కుటుంబసభ్యులు కూడా సంతోషపడతారని ఉద్యోగంలో చేరాడు.

చేరిన రోజే షాక్‌. భూపతికి అప్పజెప్పిన పని ల్యాబ్‌ అసిస్టెంట్‌. కంపెనీ ఓనర్ నెలకు వెయ్యి రూపాయల జీతం ఇస్తాన్నాడు. ఆ మాట వినగానే మళ్లీ షాక్ కొట్టినట్లనిపించింది.

“ఆ రోజుల్లో నా బైక్‌ పెట్రోల్‌ కోసం 5వేల రూపాయల దాకా ఖర్చుచేసేవాన్ని. కూలీ పని చేసేవాడు కూడా అంతకన్నా ఎక్కువ సంపాదిస్తాడని తెలుసు. మనసులో ఎన్నో ప్రశ్నలు. నేను అంత పనికి రానివాడినా అనిపించింది. అయితే మరో అవకాశం లేకపోవడంతో ఉద్యోగంలో చేరిపోయా. జీతం సంగతి అమ్మానాన్నలకు చెప్పాలంటే సిగ్గేసింది. అందుకే చెప్పలేదు. మొదటి నెల జీతం అందుకున్నాక ఆశ్చర్యం కలిగింది. 1500 రూపాయలు చేతిలో పెట్టిన ఓనర్‌ తను ఆశించిన దానికన్నా ఎక్కువ పనిచేశానని మెచ్చుకున్నాడు. అందుకే ఐదొందలు ఎక్కువిస్తున్నానని చెప్పాడు. నా పనిని గుర్తించి ప్రశంసించిన తొలి వ్యక్తి ఆయనే. ఆ ప్రశంస వినగానే నేను ఏమైనా సాధించగలనన్న నమ్మకం కలిగింది. అందుకే ఆ రోజును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను”అంటారు భూపతి రాజు.

ఓనర్ ప్రశంసతో భూపతి రాజులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆరు నెలల పాటు కష్టపడి పనిచేశాడు. ఎంతోమంది కొత్తవాళ్లు కంపెనీలో చేరారు. వాళ్లకు 9-10 వేల జీతం ఆఫర్ చేసి ఉద్యోగంలోకి తీసుకున్నారు. అప్పటికి రాజుకు ఇస్తున్న జీతం 1500 రూపాయలే. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన తనకు 1500 ఇస్తూ గ్రాడ్యుయేట్లకు మాత్రం 10వేల రూపాయల జీతం ఎందుకిస్తున్నారో భూపతికి అర్థం కాలేదు. వాళ్లకన్నా తాను ఏ విషయంలో తక్కువ? ఈ ప్రశ్న ఆయనను వేధించేది. అయితే వాళ్లంతా బీటెక్ గ్రాడ్యుయేట్లు. అందుకే అంత జీతం ఇస్తున్ననారన్న అసలు విషయం తెలిసింది. భారత్‌లో డాక్టర్లు, ఇంజనీర్లకు మాత్రమే మంచి ఉద్యోగాలు దొరుకుతాయా? సంప్రదాయ డిగ్రీలు చదివిన వారు ఎందుకూ పనికిరారా? అలాంటి వారు బ్యాంకులు, గవర్నమెంట్‌ ఆఫీసుల్లో క్లర్క్‌ ఉద్యోగాలు చేసుకోవాల్సిందేనా? ఈ ప్రశ్నలు భూపతిని ఎంతగానో వేధించాయి. అప్పుడే ఓ నిర్ణయానికొచ్చాడు. ఏడాదిలోపే ఇంజనీర్లతో సమానంగా జీతం అందుకోవాలని డిసైడయ్యాడు. దాన్నో ఛాలెంజ్ గా తీసుకున్న సక్సెస్ అయ్యాడు.

“నాన్ టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ వాళ్లను ఎప్పుడూ తక్కువగానే చూస్తారు. ఐఐఎం, ఐఐటీల నుంచి వచ్చిన వారే బాగా పనిచేస్తారని అనుకుంటారు. వాళ్లు ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలరాలేదా అనే విషయం తెలుసుకోకుండానే ఉన్నత హోదాల్లో నియమిస్తారు. నాన్ టెక్నికల్ వారికి ఎన్ని తెలివితేటలున్నా పట్టించుకోరు.”

image


2001లో ఏప్ ల్యాబ్ కంపెనీలో చేరాడు భూపతి రాజు. తన తెలివితేటలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ పదేళ్లలో మేనేజర్ స్థాయి నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. అయితే ఈ పదేళ్ల కాలంలో ఆయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా రెండు ఘటనల్ని ఎప్పటికీ మర్చిపోలేనంటారు భూపతి. అమెరికా ఉండలేక ఇండియాకు తిరిగి వచ్చేయడం అందులో ఒకటైతే... అమెరికాలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగిరావడం రెండోది.

ఏడేళ్లు పనిచేసిన తర్వాత కంపెనీ తరఫున భూపతిని అమెరికా పంపారు. అయితే అక్కడికి వెళ్లాక ఆయన ఆ వాతావరణంలో ఇమడలేకపోయారు. తిరిగొచ్చేయాలని నిర్ణయించుకుని సీఈఓకు నిర్ణయం చెప్పాడు. ఒకవేళ ఇండియా తిరిగి వెళ్లాలనుకుంటే ఇకపై కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరంలేదని కరాఖండిగా చెప్పేశాడు సీఈఓ. అప్పటికి భూపతి భార్య గర్భవతి. చేతిలో డబ్బు కూడా ఎక్కువ లేదు. తర్జనభర్జన తర్వాత మనసు సొంతగడ్డ వైపే మొగ్గుచూపింది. మరుసటి రోజు రిజైన్ చేసేందుకు కంపెనీకి వెళ్లాడు. సీఈఓ రెండు నెలల తర్వాత వెళ్లమనడంతో సరేనన్నాడు. 2 మాసాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. 

ఈ ఘటన జరిగిన ఐదారేళ్ల తర్వాత భూపతి మరోసారి అమెరికా వెళ్లాడు. అప్పటికే తమ బంధువుల్లో చాలా మంది ఫారిన్ లో సెటిల్ అయ్యారు. అలాంటప్పుడు తానెందుకు అమెరికాలో స్థిరపడకూడదు అనిపించింది భూపతికి. అమెరికాలో 500 మంది ఉద్యోగులు తనకింద పనిచేస్తున్నారు. సంపాదన బాగానే ఉండటంతో అక్కడే సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఓ సరస్సుకు ఎదురుగా పెద్ద బంగళా కొనుక్కున్నాడు. బంగళాలో ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంట్లో సమాను సర్ది టీవీ ఆన్ చేసేందుకు రిమోట్ పట్టుకోగానే సీఈఓ నుంచి ఫోన్ చ్చింది. ఇండియాకు తిరిగొచ్చేయమన్నది ఫోన్ కాల్ సారాంశం. అమెరికాలోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నానన్న విషయం చెప్పాలనుకున్నా. కానీ ఆయనిచ్చిన ఆఫర్ ను కాదనలేకపోయా. గ్లోబల్ పొజిషన్ కు ప్రమోషన్. 5వేల మందికి హెడ్. 15రోజుల్లోనే అమెరికాలో పేకప్ చెప్పి ఇండియాకు తిరిగొచ్చేశాడు భూపతి రాజు.

భూపతి రాజు అప్పటికి ఉద్యోగంలో చేరి అప్పటి 12ఏళ్ల. ఈ పుష్కర కాలంలో 14 ఇళ్లు మారాడు. ఈసారి అలాంటి ఛాన్స్ లేదు. 7స్టార్‌ జాబ్. ఒకప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన భూపతిని కలుసుకునేందుకు ఇప్పుడు ఎంతో మంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంత పెద్ద పొజిషన్ లో ఉన్నా భూపతి మనసులో ఏదో తెలియని వెలితి.

“జీవితంలో ఎంతో సాధించాను. అయితే ఇంతకు మించి ఏమీ లేదా? ఐటీ సెక్టార్ లో ఇంతకు మించి ఏమీ చేయలేనా? ఈ రంగానికి చేయాల్సిందంతా చేశాను. ఇంకా ఐటీలోనే ఉండటం కరెక్టేనా ఈ ప్రశ్నలు భూపతిని వేధించాయి. వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేశాడు. కోట్ల జీతం వచ్చే ఉద్యోగం వదిలి తనకెంతో ఇష్టమైన సంగీతంపై దృష్టి పెట్టాడు. సొంతంగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేశాడు.

“15ఏళ్ల వరకు బాగానే పనిచేశా. అయితే ఇన్నేళ్లలో నేనేం సాధించాన్నది అర్థం కాలేదు. అంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టడమంటే మాటలు కాదు. అయినా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా. నా భార్య అన్ని విషయాల్లో అండగా నిలిచింది. అనవసరంగా ఉద్యోగం మానేశానన్న బాధ ఏనాడూ కలగలేదు.”

image


ఉద్యోగం వదిలేశాక తండ్రి నర్సింహరాజు జీవితగాధ రాయడం మొదలుపెట్టాడు భూపతి. రెండు నెలల్లో ఆ పని పూర్తైంది. నిజానికి భూపతి రాజుకు తండ్రితో చాలా కొద్ది సమయమే గడిపే అవకాశం దొరికింది. ఆయనకు లక్షమంది కిపైగా అభిమానులున్నారు. ఆయన రాసిన పుస్తకాలు చదవి ఆయనలో దాగిన కొత్త కోణాన్ని తెలుసుకున్నాడు భూపతి. తనతండ్రి ఎంత గొప్పవాడో ఇంకా బాగా అర్థమైంది.

ఉద్యోగం మానేశాక భూపతికి మరే కంపెనీలోనూ జాబ్ చేయాలనిపించలేదు. అయితే తన బాగు కోరే ఓ వ్యక్తి మాట కాదనలేక కన్సల్టెన్సీ తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత తనకు అత్యంత సన్నిహితుడైన సందీప్ తో కలిసి ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టాడు. మొదట్లో ఆ పని చాలా ఈజీ అనిపించింది. ఇడ్లీ తయారీకి ఐదు రూపాయలు ఖర్చయితే దాన్ని 50 రూపాయలకు అమ్మేవారు. 45 రూపాయల లాభం. ఫుడ్ ఇండస్ట్రీలో ఇంకేమైనా కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో టేక్ అవే చెయిన్ స్టార్ట్ చేసి హోమ్ డెలివరీ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. భారత్ లో ఫాస్ట్ ఫుడ్ హోమ్ డెలివరీ చైయిన్ లలో తమదే మొట్ట మొదటిదని ధీమాతో చెబుతారు భూపతి రాజు. ఈ స్టార్టప్ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ఫండింగ్ ప్రారంభమైంది. వ్యాపారం పెరిగింది. బిజినెస్ ను మరింత విస్తరించి గ్లోబల్ చెయిన్ గా మార్చాలని నిర్ణయించుకున్నారు.

దేశంలో ఇంత పెద్ద ఫుడ్ చెయిన్ ను ప్రారంభించిన భూపతి రాజు కుకింగ్ లో ఎక్స్ పర్ట్ అయి ఉంటారనుకుంటే పొరపాటే. ఆయనకు కనీసం ఆమ్లెట్ వేయడం కూడా రాదు. అయినా ధైర్యం చేసి ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ఏసీ రూముల్లో కూర్చుని చేసే కార్పొరేట్ కొలువు వదులుకుని చిన్న గ్యారేజీలో వ్యాపారం ప్రారంభించాడు. హైదరాబాద్ లో జీరోతో మొదలైన కంపెనీ కొన్ని రోజుల వ్యవధిలోనే దక్షిణ భారత దేశమంతటా నెంబర్ వన్ స్థాయికి చేరింది. ఇక ఖండాంతరాలకు విస్తరించడమే తదుపరి లక్ష్యం. అయితే ఇందుకు చాలా సమయమే పడుతుంది. ఫుడ్ సెక్టార్ లో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఒక సవాల్ ఎదురవుతుందంటారు భూపతి. 8 – 9 వేల రూపాయల జీతం తీసుకునే డెలివరీ బాయ్స్ ఏ నిమిషంలో పని మానేస్తారో ఎవరూ ఊహించలేరు. ఇక కస్టమర్లు ఎప్పుడు ఏ ఫుడ్ ను మెచ్చుకుంటారే ఎప్పుడు బాగోలేదంటారో తెలియదు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించి వ్యాపారాన్ని సజావుగా కొనసాగించేందుకు, కస్టమర్ల మనసు అర్థం చేసుకునేందుకు భూపతిరాజు కొన్ని టెక్నాలజీ కంపెనీలను టేకోవర్ చేశారు. మరికొన్ని ఫుడ్ కంపెనీలను కొనుగోలు చేశారు.

ఉద్యోగం చేయడమన్నది సులువైన పని అన్నది భూపతిరాజు అభిప్రాయం. ఉద్యోగికి ఏ పని ఎలా చేయాలో ముందే తెలిసి ఉంటుంది. పని గంటలు, సెలవులు, జీతం ఇవన్నీ ముందే ఫిక్స్ చేసుకుంటారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఉద్యోగులు తమ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ విషయంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి ఉద్యోగం చేయడంలో సుఖం ఉంటే మరికొందరికి వ్యాపారం చేయడంలో సంతోషం కలుగుతుంది. కొందరు ఇతరుల కంపెనీల్లో పనిచేసేందుకు ఇష్టపడితే ఇంకొందరు సొంత కంపెనీలోనే పనిచేయాలనుకుంటారు. మరికొందరు ఇతరుల కన్నా భిన్నంగా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటారు.

భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలకు సంబంధించి భూపతి రాజు ఎంతో స్పష్టతతో ఉన్నారు. హలో కర్రీని ఖండాంతరాలు తీసుకెళ్లడమన్నదే ప్రస్తుతం ఆయన కల. వాస్తవానికి హలో కర్రీ ఏర్పాటుచేసిన కొద్ది కాలంలోని కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. బెంగళూరులో ఆరు ఔట్ లెట్లు ప్రారంభిస్తే అందులో నాలిగింటిని మూసుకోక తప్పలేదు.

“తప్పు ఎక్కడ జరిగిందన్నది తెలుసుకున్నాం. ఏ పని ప్రారంభించినా దానిపైనే పూర్తి దృష్టి పెట్టాలి. అసలు ఆ పని చేసేందుకు అవసరమైన అర్హతలు మీకున్నాయో లేదో తెలుసుకోవాలి. రెండు కిలోమీటర్ల దూరం నడవలేనివారికి మారథాన్ లో పాల్గొనాలన్న ఆలోచనే రాకూడదు. గతేడాది డిసెంబర్ నాటికి మేం మళ్లీ జీరోకి వచ్చాం. ఆర్డర్లు వస్తున్నాయే తప్ప రియల్ బిజినెస్ లేదు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడంతో మళ్లీ పూర్వవైభవం వచ్చింది.”

ఫోకస్ ఈ పదమే తన విజయ రహస్యం అంటారు భూపతి రాజు. లక్ష్యాన్ని సాధించాలంటే దానిపైనే దృష్టి కేంద్రీకరించాలి. ఒకట్రెండు నెలలు పనిచేసి వైఫల్యాన్ని అంగీకరించకూడదు. పూర్తి నమ్మకంతో ముందుకెళ్లాలి అంటారాయన.

“తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఉద్యోగంలో చేరిన కొత్తలో సహోద్యోగులతో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయలేకపోయేవాడ్ని. అలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు క్లయింట్లకు కంపెనీ గురించి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంగ్లీష్ సరిగా రాకపోవడంతో చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పలేకపోయా. చాలా అవమానంగా అనిపించింది. నా బలహీనతేంటో అర్థమైంది. వెంటనే ఇంగ్లీష్ పై పట్టు పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టా. ఆరు నెలల తర్వాత 3వేల మంది ముందు ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చా. ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.

జీవితం తనకు నేర్పిన పాఠాల గురించి ఇతరులకు చెప్పేందుకు భూపతి రాజు ఏమాత్రం సంకోచించరు. జీవిత ప్రయాణంలో మంచో చెడో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే ఉత్తమమంటారాయన. నిర్ణయం తీసుకున్న తర్వాత పని పూర్తి చేసి ఎలాంటి ఫలితం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

“జీవితంలో భయం అనే పదం అంటేని నాకు భయం. అందుకే భయపడకుండా చేయాలనుకున్న పని ధైర్యంగా చేయండి. వైఫల్యాలు ఎదురైనా జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించవచ్చు. సమయం వృథా చేసుకోవద్దు. 35ఏళ్ల లోపే రిస్క్ తీసుకోండి. చేయాలనుకున్నది చేసేయండి. కేవలం డబ్బు సంపాదించాలన్నదే ధ్యేయంగా ఉండకూడదు. ఏమైనా సాధించాలన్న పట్టుదల ఉండాలి.”

మనిషి ఊహించలేనిదే జీవితం. వెయ్యి రూపాయలతో జీవితాన్ని ప్రారంభించిన భూపతి రాజు 3కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని అందుకుంటాడని ఏనాడూ ఊహించలేదు. ల్యాబ్ అసిస్టెంట్ కాస్తా ఓ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అవుతారని కలలో కూడా అనుకోలేదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆయనను కలల్ని నిజం చేసుకునే స్థాయికి చేర్చాయి. అందుకే కలలు కనండి. వాటిని నిజం చేసుకోండి.