పసిపిల్లల వీపున ఇక స్కూల్ బ్యాగుల మోత ఉండదు

పసిపిల్లల వీపున ఇక స్కూల్ బ్యాగుల మోత ఉండదు

Wednesday July 19, 2017,

3 min Read

ఎల్కేజీ పిల్లాడి స్కూల్ బ్యాగు బరువు ఆరు కిలోలు! ఏడో తరగతి పుస్తకాల వెయిట్ 12 కిలోలకు తక్కువుండదు. టెన్త్ క్లాస్ విద్యార్థి 17 కిలోల బ్యాగు మోయాలి. బండెడు పుస్తకాల బరువు మోయలేక పిల్లలు అలవికాని రోగాల బారినపడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి తెలంగాణ విద్యా శాఖ చర్యలు ప్రారంభించింది. స్కూల్ బ్యాగ్ బరువులు తగ్గిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.

image


స్కూల్ బ్యాగ్! పసిపిల్లల వీపుల మీద బండెడు బరువు. ఎల్కేజీ చదివే పిల్లాడు ఆరు కిలోల బ్యాగు మోయలేక అడుగులో అడుగేసుకుంటూ వెళ్తుంటే- ఎవరికైనా మనసు చివుక్కుమంటుంది. పిల్లల బాధ చూడలేక చాలా మంది పేరెంట్స్ స్కూల్ దాకా బ్యాగులు మోసుకెళ్లి దిగబెట్టి వస్తున్నారు. ఆ రోజుల్లో ఒకే రఫ్ బుక్‌ను మూడు సబ్జెక్టుల కోసం ఉపయోగించే వాళ్లం. ముందు నుంచి తెలుగు మొదలు పెట్టి, వెనక పేజీల్లో ఇంగ్లిష్ రాసుకొని, మధ్యలో మ్యాథ్స్ చేసుకునేవాళ్లం.

ఇప్పుడలా కాదు. ప్రతి సబ్జెక్టుకు ఒక రఫ్ బుక్ కంపల్సరీ! ఇవి చాలవన్నట్టు గైడ్లు, డ్రాయింగ్ బుక్స్, స్క్రాప్ బుక్, డైరీలని స్కూల్ బ్యాగుల్లో కిలోల కొద్దీ పుస్తకాలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 6 నుంచి 12 కిలోల బరువైన బ్యాగులు.. ఉన్నత పాఠశాలల విద్యార్థులు 12 నుంచి 17 కిలోల బ్యాగులను ప్రతి రోజు వీపు మీద మోస్తున్నట్టు విద్యా శాఖ సర్వేలో తేలింది. రోజూ ఇంతింత బరువులు మోయడం, ఐదారు ఫ్లోర్స్ ఎక్కి క్లాస్ రూమ్ దాకా వెళ్లడం కారణంగా చాలా మంది పిల్లలు వెన్ను నొప్పి, జాయింట్ పెయిన్స్ బారిన పడుతున్నారు. ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది.

పిల్లలకు కిలోల కొద్దీ బ్యాగుల మోతను తగ్గించేలా రాష్ట్ర విద్యా శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. వాటి ప్రకారం ఒకటి, రెండో తరగతుల పుస్తకాల బరువు బ్యాగుతో సహా 1.5 కిలోలు మాత్రమే ఉండాలి. మూడు, నాలుగు, ఐదు తరగతులకు 3 కిలోలు.. ఆరు, ఏడు తరగతులకు 4 కిలోలు.. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు నాలుగున్నర నుంచి 5 కిలోల వరకు మాత్రమే బ్యాగు బరువు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశించింది.

ఆరు, ఏడు తరగతులకు మూడు లాంగ్వేజ్ బుక్స్తోపాటు మ్యాథ్స్, సైన్స్, సాంఘిక శాస్త్రం సహా మొత్తం 6 పుస్తకాలే ఉండాలి. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు ఈ ఆరు పుస్తకాలకు తోడు జీవశాస్త్రం కలిపుకొని ఏడు బుక్స్ ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు 200 పేజీల నోట్‌ బుక్‌ మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఎఫ్ఏలకు, స్లిప్ టెస్టులకు వినియోగించాలి. ఇవి కూడా రోజూ తీసుకురావాల్సిన అవసరం లేదు. పాఠ్యాంశాల చివరన ఉన్న ఎక్సర్‌ సైజ్‌లను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే పూర్తి చేయించాలి. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్లను కేటాయించాలి. ఆరు నుంచి పదో తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు కేటాయించేలా ప్రణాళిక ఉండాలి. ఏ సబ్జెక్టుకు ఏ రోజు అనేది ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించి నిర్ణయించాలి.

విద్యార్థులు ఏ రోజు ఏయే పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్ తెచ్చుకోవాలో టీచర్లు ముందుగానే చెప్పాలి. బరువు సమానంగా పరుచుకునేలా.. రెండు వైపులా వెడల్పాటి పట్టీలు కలిగిన స్కూల్‌ బ్యాగులను ఉపయోగించాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించాలి. పిల్లలు స్కూల్ బస్సు కోసం ఎదురు చూసేటప్పుడు, స్కూల్‌ అసెంబ్లీలో నిల్చున్నప్పుడు బ్యాగును కింద పెట్టాలి. బరువైన స్కూల్‌ బ్యాగుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.

ఎన్సీఈఆర్‌టీ నిర్దేశించిన పుస్తకాలు కాకుండా ఇతరత్రా క్లాసుల కోసమంటూ అదనపు, బరువైన, ఖరీదైన పుస్తకాలను సూచించవద్దు. స్టేట్‌ సిలబస్‌ను అమలు చేసే అన్ని పాఠశాలలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్ణయించిన పుస్తకాలనే వినియోగించాలి. అంతకుమించి అదనపు పుస్తకాలేవీ ఉపయోగించకూడదు.

స్కూల్ బ్యాగుల బరువు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విద్యా శాఖ చాలా మంచి నిర్ణయం తీసుకుందని విద్యా వేత్తలు, విద్యార్థి సంఘాలు హర్షిస్తున్నాయి.