సంకలనాలు
Telugu

కల్తీలేని తాజాపండ్లు, కూరగాయలు ఇంటికి తెచ్చిచ్చే ఫ్రెష్ బాక్స్

hari prasad
2nd Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

రసాయనాల జాడ లేని తాజా పండ్లు, కూరగాయలు... ఈ కాలంలో అది ఊహకు కూడా అందని విషయం. కానీ మేం తెచ్చిపెడతాం అంటోంది హుబ్లీకి చెందిన ఫ్రెష్ బాక్స్ వెంచర్స్. అదీ మీరు అడుగు కూడా కదిపే అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వస్తామంటోంది. రోహన్ కులకర్ణి అనే 31 ఏళ్ల ఎంబీయే గ్రాడ్యుయేట్ చేసిన ఈ వినూత్న ఆలోచన అటు రైతులకు.. ఇటు ఫ్రెష్ బాక్స్ వెంచర్స్ కు లాభాల పంట పండిస్తోంది. ఇటు సేంద్రీయ పండ్లు, కూరగాయలు తింటూ వినియోగదారులు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.

image


ఏడేళ్ల కార్పొరేట్ జీవితం రోహన్ ను ఈ దిశగా ఆలోచించేలా చేసింది. వేర్వేరు ప్రదేశాలు తిరగాల్సి రావడంతో ఇంటికి దూరంగా ఉండటంలో ఉన్న బాధేంటో అతనికి తెలిసొచ్చింది. ఇంటి భోజనం తినే అదృష్టం లేకపోయినా.. తాజా పండ్లు, కూరగాయలు మాత్రం ఎక్కడున్నా అందించవచ్చని రోహన్ పసిగట్టాడు. అనుకున్నదే తడువుగా గతేడాది సెప్టెంబర్ లో కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా ఫ్రెష్ బాక్స్ వెంచర్స్ ప్రారంభించాడు. పెద్ద నగరాలను ఇప్పటికే బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్, పెప్పర్ ట్యాప్ వంటి స్టార్టప్ లు ఆక్రమించేయడంతో రోహన్ హుబ్లీని ఎంచుకున్నాడు. ఇన్ఫోసిస్ లాంటి పెద్దపెద్ద ఐటీ కంపెనీలు తమ క్యాంపస్ లను హుబ్లీలో స్థాపిస్తుండటంతో ఈ నగరంలో తన స్టార్టప్ కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అతను భావిస్తున్నాడు.

ఇంటికే పండ్లు, కూరగాయలు

రసాయనాల జాడ లేని తాజా, సేంద్రీయ పండ్లు, కూరగాయలను వినియోగదారుల ఇంటికే తెచ్చి ఇవ్వడం ఫ్రెష్ బాక్స్ ప్రత్యేకత. కస్టమర్లు సంస్థ వెబ్ సైట్ లేదా కాల్ సెంటర్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలతో వినియోగదారులు కేన్సర్ వంటి ప్రాణాంతక రోగాలబారిన పడుతున్నారని, అందుకే తాను ఈ స్టార్టప్ ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నానని రోహన్ చెబుతున్నాడు. ఫ్రెష్ బాక్స్ శుక్రవారం వరకు కస్టమర్ల నుంచి ఆర్డర్లు సేకరించి వాటిని రైతులకు అందజేస్తుంది. శనివారం ఉదయం సంస్థ వాహనం పొలాల దగ్గరికే వెళ్లి పండ్లు, కూరగాయలను సేకరిస్తుంది. వాటిని తీసుకొచ్చిన తర్వాత కడగడం, బరువు తూచడం, కోయడంలాంటివి చేస్తుంటారు. ధార్వాడ్ లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ తో కలిసి పనిచేస్తున్న ఫ్రెష్ బాక్స్.. వ్యవసాయ ఉత్పత్తులను ఎలా పెంపొందించాలన్నదానిపై రైతులకు శిక్షణ కూడా ఇస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్టప్ 24 మంది రైతులతో కలిసి పనిచేస్తోంది. అయితే రోజురోజుకూ పెరుగుతున్న ఆర్డర్లతో రైతుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. 

‘వినియోగదారుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కానీ దాని ఫలితం మాత్రం రైతులకు దక్కకపోవడంతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మధ్యవర్తులే లాభాలు ఆర్జిస్తూ డిమాండ్, సప్లైలలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ సమస్యను రూపుమాపడం కోసం మేం కృషి చేస్తున్నాం. రైతులకు కనీస మద్దతు ధర అందించడంతో పాటు మా వినియోగదారుల సంఖ్య పెరిగితే తిరిగి కొనుగోలు చేస్తామన్న హామీ ఇస్తున్నాం’ - రోహన్

టెక్నాలజీ తోడుగా..

పండ్లు, కూరగాయల్లో ఉండే రసాయనాలను తొలగించడానికి ఓజోన్ టెక్నాలజీ సాయం తీసుకుంటోంది ఫ్రెష్ బాక్స్. ఈ టెక్నాలజీలో ఓజోన్ జతచేసిన నీటిలో పండ్లు, కూరగాయలను ఉంచుతారు. ఓజోన్ మంచి ఆక్సిడైజర్ కావడంతో అది పండ్లు, కూరగాయల్లోని ప్రమాదకర బ్యాక్టీరియా, రసాయనాలను తొలగిస్తుంది. రూ. 3 లక్షల మూలధనంతో మొదలైన ఫ్రెష్ బాక్స్.. ప్రస్తుతం భారీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తోంది. ఏడుగురు వ్యక్తులు స్టార్టప్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఒకరు బిల్లింగ్, మరొకరు ఆర్డర్లు చూస్తుండగా, మిగిలిన వాళ్లు లేబర్ తో క్లీనింగ్, ప్యాకేజింగ్ పనులు చేయిస్తుంటారు. 

‘స్టార్టప్ ప్రారంభించిన 45 రోజుల్లోనే వందశాతం వృద్ధి నమోదు చేయగలిగాం. హుబ్లీలో 120 మంది కస్టమర్లను సంపాదించాం. ప్రస్తుతం నెలకు 400 ఆర్డర్ల వరకు వస్తున్నాయి’ -రోహన్

ఫ్రాంచైజ్ మోడల్ సాయంతో సమీప భవిష్యత్తులో ధార్వాడ్, బెల్గాం, గోవాలకు కూడా విస్తరించాలని ఫ్రెష్ బాక్స్ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కస్టమర్ల సంఖ్యను 4000కు పెంచడంతోపాటు సగటు ఆర్డర్ ధరను రూ.1200కు పెంచాలని చూస్తోంది. దీనిద్వారా సుమారు రూ.5.76 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది. విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లలో తయారుచేసే పాపడ్, పచ్చళ్లు, మసాలాలతో తొందర్లోనే కొన్ని సేంద్రీయ దుకాణాలను మొదలుపెట్టబోతోంది ఫ్రెష్ బాక్స్. ఈమధ్యే దేశ్ పాండే ఫౌండేషన్ నిర్వహించే సాండ్ బాక్స్ స్టార్టప్ చాలెంజ్ లో ఫ్రెష్ బాక్స్ వెంచర్స్ అవార్డు సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా రూ.లక్ష ఫండ్ స్టార్టప్ కు దక్కింది.

image


భవిష్యత్ పై భరోసా

కొత్తకొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తుండటంతో భవిష్యత్ లో వ్యవసాయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఆ దిశగా పనిచేస్తున్నాయి. రైతులు సేంద్రీయ వ్యవసాయంవైపు మొగ్గు చూపేలా ఉచితంగా విత్తనాలు, సలహా సహకారాలు అందజేస్తోంది అనుబల్ ఆగ్రో. 

ఇక సేవ్ ఇండియన్ గ్రెయిన్.ఓఆర్జీ విషయానికి వస్తే చిన్న, సన్నకారు రైతుల కోసం ఆధునిక గిడ్డంగుల అభివ్రుద్ధితోపాటు సరైన మార్కెట్ వసతి కల్పించేలా క్రుషి చేస్తోంది. పంట దిగుబడిని పెంచే తమ ఉత్పత్తి జింగోకు సరైన మార్కెట్, పంపిణి వ్యవస్థ కల్పించడానికి బెంగళూరుకు చెందిన సీ6 ఎనర్జీ స్టార్టప్ తో ఒప్పందం కుదుర్చుకుంది మహీంద్రా అగ్రి బిజినెస్. వీటన్నిటితోపాటు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా జీడీపీలో 14.2 శాతం ఉందని, ఏడాదికి 1.9 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాయని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక చెప్తోంది. ఈ నివేదిక భవిష్యత్ లో ఈ స్టార్టప్ ల సక్సెస్ పై భరోసా కలిగిస్తున్నాయి. వినూత్న పద్ధతులతో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంతోపాటు రైతుల జీవన ప్రమాణాలు పెంచడంలో కూడా ఇలాంటి స్టార్టప్ లు కీలకపాత్ర పోషించనున్నాయి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags