సంకలనాలు
Telugu

బుల్ బుల్ యాప్స్ తో కథలు చెబుతున్న భీమవరం బుల్లోడు..!

ashok patnaik
1st Mar 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఇప్పుడంటే అంతా కంప్యూటర్ యుగం. ఈ కాలం పిల్లలకు కథలేంటో, వాటి నుంచి నేర్చుకునే నీతేంటో తెలియదు. ఎంతసేపు పుస్తకాలు, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్స్. అంతేగాని జిత్తులమారి నక్కబావ, పరోపకారి పాపన్న, పట్టువదలని విక్రమార్కుడు, నిజాయితీగల ఆవు.. ఇవేవీ ఈ కాలం పిల్లలకు తెలియవు. దానికి కారణాలనేకం. ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనిషిని యాంత్రికంగా మార్చేశాయి. పిల్లలూ అంతే తయారయ్యారు. బట్టీ యంత్రాలుగా మారిపోయారు. ర్యాంకులనే కలగంటూ మార్కులనే మంత్రంగా జపిస్తున్నారు. మారిన ఈ పరిస్థితుల్లో కథలు కనుమరుగైపోయాయి. వెన్నెల వెలుగుల్లో ఆరుబయట అరుగు మీద పదిమంది పిల్లలను పోగేసుకుని కథలు చెప్పే బామ్మ లేదు.. తాతయ్యా లేడు. ఒకవేళ చెబుదామన్నా ఊ కొట్టే పిల్లలు లేరు.? 

అందుకే యాప్ తీసుకొచ్చింది

అయితే దీనికి పరిష్కారం చూపించడానికే ముందుకొచ్చారు ప్రకాశ్ దంతులూరి. అందునా ఒక భాష కాదు.. దేశంలో అన్ని లాంగ్వేజీలకు ఉపయోగపడేలా యాప్ తయారు చేశారు. దానిపేరే ‘బుల్ బుల్’. ప్రకాశ్ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. బీఈ చేసిన తర్వాత 1997లో అమెరికా వెళ్లిపోయారు. ఆరేళ్ల తర్వాత సినిమాల మీద ఇంట్రస్టుతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. 2009లో సత్యభామ అనే మూవీకి డైరెక్షన్ చేశారు. 2010లో ప్యారడైజ్ క్రియేషన్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా మారారు. ప్రొడ్యూసర్ గా ఓం శాంతి అనే సినిమా నిర్మించారు. సినిమాలకు స్టోరీ చెప్పడంలో ఎదురైన సమస్యను అధిగమించే ప్రయత్నంలోనే యాప్ ఆలోచన చేశారు ప్రకాశ్. 

స్టార్టప్స్ గ్రోత్ ని దగ్గరి నుంచి చూసిన ప్రకాశ్ దాని మీద సీరియస్ గా వర్కవుట్ చేశారు. 2014 లో బుల్ బుల్ యాప్స్ మొదలు పెట్టారు. వాస్తవానికి యాప్ స్టోర్ లో చిన్నపిల్లల యాప్స్ కోసం చూసినప్పుడు, అన్నీ ఇంగ్లీష్ రైమ్స్ తప్పితే పెద్దగా లోకల్ లాంగ్వేజీలో ఏం కనపడలేదు. పైగా రైమ్స్, మ్యూజిక్ కి విజువల్ కూడా యాడ్ చేస్తే మరింత నాణ్యమైన కంటెంట్ వస్తుంది అనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే వెర్నాక్యులర్, రీజనల్ ప్రాధాన్యం ఉన్న యాప్ తయారు చేశారు. 

బుల్ బుల్ యాప్ లో కంటెంట్ లోడ్ చేస్తే, దాన్ని వీడియోగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో అన్ని చోట్లా జానపదాలు ఉన్నాయి. వాటిని టెక్నాలజీ ఉపయోగించి విజువలైజ్ చేయడమనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతచేసినా కానీ క్వాలిటీ అవుట్ పుట్ ఊహించడం కష్టమే. దీన్ని మొబైల్ యాప్ ద్వారా పరిష్కారం చూపించాలనుకున్నారు ప్రకాశ్. బుల్ బుల్ యాప్స్ చూపించిన సొల్యూషన్ ఇదే. ఎవరైనా, ఎలాంటి కంటెంట్ అయినా అందించినా.. అది గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో స్టోరీలాగా మార్చే టూల్ లాగా బుల్ బుల్ ఉపయోగపడుతుంది. 

ప్రస్తుతం మిలియన్ డాలర్ల స్టార్టప్ బుల్ బుల్ యాప్. ప్రకాశ్ తో పాటు టెక్, కంటెంట్ లో కలిపి 8మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా భారత్ లోనే 20 లక్షల మంది పిల్లలు మొబైల్ గేమ్స్ ను వాడుతారని తేలింది. ఈ లెక్క ప్రకారం తమలాంటి యాప్స్ వాడకం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చని ప్రకాశ్ అంటున్నారు.

అంచనాలకు మించి..

బుల్ బుల్ లో ప్రపంచ వ్యాప్తంగా 700 మంది ఆర్టిస్టులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటిదాకా 78 దేశాల్లో ఈ యాప్ కు యూజర్లున్నారు. యాప్ డౌన్ లోడ్స్ సంఖ్య మిలియన్ దాటింది. దాదాపు 5 మిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారు. డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంది. భారతదేశంలో తెలుగు, హిందీ భాషల్లో బుల్ బుల్ అందుబాటులో ఉంది. పర్సనల్ కంటెంట్ లోనే ఎక్కువ మంది యూజర్లున్నారు. స్థానిక కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం కనక అదే తమ మార్కెట్ ప్లేస్ అంటున్నారు ప్రకాశ్. యూట్యూబ్ కంటెంట్ కంటే తమది మెరుగైన కంటెంట్ అంటున్నారు. భవిష్యత్ లో మొబైల్ ప్లాట్ ఫాంలో యూట్యూబ్ లాగా బుల్ బుల్ యాప్స్ మారినా ఆశ్చర్య పోనక్కర్లేదనేది అతని అభిప్రాయం. 

image


ఫ్యూచర్ ప్లాన్స్

గతేడాది అమెరికాకు చెందిన ఏంజిల్ ఇన్వెస్టర్ మిలియన్ డాలర్ల పెట్టుబడులను బుల్ బుల్ యాప్స్ లో పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సిరీస్ ఏ రౌండ్ ఫండ్స్ రెయిజ్ చేయబోతున్నామని ప్రకాశ్ అంటున్నారు. దాదాపు 3 మిలియన్ డాలర్ల ఫండ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. యాప్ ని అమెరికా తోపాటు ఇతర దేశాలకు విస్తరించడానికి వీటిని వినియోగిస్తామన్నారు ప్రకాశ్. టుక్ టుక్ పేరుతో బుల్ బుల్ నుంచి మరో ప్రాడక్ట్ వచ్చింది. దీన్ని దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు.

“భారత దేశంలో ఉన్న 380 మిలియన్ల చిన్నారులు మిస్ అవుతున్న అమ్మమ్మ, తాతయ్య కథలను మా యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకు రాగలిగితే అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుందని చిరునవ్వుతో ముగించారు ప్రకాశ్”
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags