2019లో కూడా మోడీ చరిష్మా కంటిన్యూ అవుతుందా?

ఆమ్ ఆద్మీ సీనియర్ నేత అశుతోష్ సునిశిత విశ్లేషణ

2019లో కూడా మోడీ చరిష్మా కంటిన్యూ అవుతుందా?

Sunday March 19, 2017,

4 min Read

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కాలమ్ రాద్దామని అనుకున్నాను. కానీ ఆగిపోయాను. ఎందుకంటే అప్పటికి ఇంకా క్లియర్ పిక్చర్ రాలేదు. వారం రోజుల పాటు చర్చలు.. ఊహాగానాలు, రకరకాల విశ్లేషణలు సాగాయి. ఈ క్రమంలోనే ఒక మూడు పాయింట్ల మీద లోతైన ఆత్మశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించి ఈ ఆర్టికల్ రాస్తున్నాను.

1. మోడీ నడిపిస్తున్న ఫుల్లీ లోడెడ్ వెహకిల్ కి ప్రస్తుతానికైతే ఎదురులేదు. 2019 పార్లమెంట్ ఎలక్షన్ల వరకు అది అప్రతిహతంగా సాగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2. కాంగ్రెస్ కోల్పోయిన అస్థిత్వాన్ని తిరిగి సాధించే పనిలో పడింది. దాంతోపాటు రాహుల్ గాంధీ ఆ పార్టీ బహదూర్ షా జాఫర్ అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

3. సాంప్రదాయ జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీయే అని జనంలో చర్చ నడుస్తోంది.

image


నిన్నటి యూపీ ఎన్నికల్లో బీజేపీ సాధించింది అతి పెద్ద విజయమని అందరూ ఒప్పుకుని తీరాల్సిన విషయం. పోలింగ్ జరగడానికి ముందు నేను కొందరు రాజకీయ విశ్లేషకులతో మాట్లాడాను. ఆ చర్చల సందర్భంలో చాలామటుకు వినింపించిన మాట-త్రిముఖ పోటీ. మరికొందరు బీజేపీయే గంపగుత్తగా సీట్లన్నీ ఊడ్చేస్తుందని అన్నారు. బీఎస్పీ మాత్రం దారుణంగా 18 సీట్లతోనే సరిపెట్టుకుంటుందని ఎవరూ ప్రిడిక్ట్ చేయలేకపోయారు. యూపీలో బీజేపీ 80 శాతం సీట్లను గెలుచుకోవడం మిరకిల్ అని అందరూ అంటున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షం కలిసి 73 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దాంతో పోలిస్తే ఈ గెలుపు వండరే కదా. ఇటు ఉత్తరాఖండ్ లో బీజేపీ చెప్పుకోదగ్గ విజయాన్నే నమోదు చేసింది. అయినా సరే యూపీ విజయమే హాట్ టాపిక్ అయింది. అందరూ దాని గురించే అంతా చర్చించారు. మెడీ పనితీరు, జనంలో నాటుకున్న భయాలు ఈ దెబ్బతో పటాపంచలయ్యాయి. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుంటే 2019లో తిరిగి బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పొచ్చు.

అయితే 2019 ఇప్పట్లో లేదు. దానికింకా రెండేళ్ల సమయం ఉంది. రాజకీయాల్లో ఒక్కోసారి వారం రోజులు కూడా భారంగా గడుస్తాయి. ఇదీ అలాంటి పీరియెడే కావొచ్చు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో ఎవరూహించారు? చరిత్రే దానికి సాక్షీభూతం. 1971లో ఏం జరిగిందో తెలియంది కాదు. పాకిస్తాన్ విభజన, బంగ్లాదేశ్ ఏర్పాటు అనంతరం ఇందిరాగాంధీని దుర్గామాతలా కీర్తించారు. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేదాకా వచ్చింది. అది ఎప్పటిదాకా..? 1972 చివరి వరకు. ఆ తర్వాత ఏమైంది? ఇందిరా గ్రాఫ్ మెల్లిగా పడిపోయింది. 1975 నాటికి జనంలో పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఎమర్జెన్సీ విధింపుతో ఆమె ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకున్నారు. 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనటువంటి పరాజయాన్ని చవిచూసింది. మొదటిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఊహించని పరిణామం కాదా?

ఇలాంటి సిట్యువేషనే రాజీవ్ గాంధీ పీరియెడ్ లో జరిగింది. 1984లో కాంగ్రెస్ 405 సీట్లను గెలుచుకుంది. ఈవెన్, వాళ్ల తాత, అమ్మ టైంలో కూడా అన్ని సీట్లు రాలేదు. కానీ 1987 లో జరిగిన బోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్ పార్టీని ఒక కుదుపు కుదిపింది. ఫలితంగా 1989లో వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. 2004లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బీజేపీని ముందుకు నడిపింది. అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతా బాగుందన్న భ్రమలో ఆరు నెలల ముందే ముందస్తుకి పిలుపునిస్తే జనం తదాస్తు అన్నారు. బీజేపీకి దిమ్మదిరిగి బొమ్మ కనిపడింది. 2009లోనూ ఆ పార్టీ కోలుకోలేదు. ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యే సరికి 2014 వరకు ఫ్యూచర్ లేదని అందరికీ అర్ధమైంది. 2019 ఎన్నికలకు ట్రై చేస్తేగానీ ఫాయిదా వుండదని అంతా అనుకున్నారు. కానీ అంతలో కాంగ్రెస్ తన గోయి తానే తీసుకుంది. అదే తరుణంలో మోడీ గాలి దేశవ్యాప్తంగా వీచింది. ఇదే ఊపు వచ్చే ఎన్నికల నాటికి వుంటే, అప్పటికీ ఏం జరగకుండా ఉంటే, నిజంగా చరిత్ర లిఖించినట్టే.

ఇక్కడ ఇంకో కోణం కూడాద వుంది. యూపీ, ఉత్తరాఖండ్ లో మోడీ చరిష్మాతోనే బీజేపీ/ఎన్డీయే గెలిచాయనుకుందాం. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం లేదు కాబట్టి లెక్క సరిపోయింది. మరి పంజాబ్, గోవాలో పీఠం కమలం పార్టీదే కదా. అక్కడెందుకు మట్టి కరిచింది? మణిపూర్ లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పంజాబ్ లో అకాలీ-బీజేపీ కాంబినేషన్ కాంగ్రెస్ ముందు నిలవలేకపోయాయి. గోవాలో బీజేపీని జనం తిరస్కరించారు. మణిపూర్ లో కూడా కమలనాథులకు షాక్ తగిలింది. మోడీ చరిష్మా నిజమే అయితే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు గెలవలేదు..?

అయితే కాంగ్రెస్ మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాహుల్ గాంధీ తానేంటో ఇంకా నిరూపించుకోలేదు. గోవా, పంజాబ్, మణిపూర్ లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఆ క్రెడిట్ చినబాబుకి రాకపోవడం విచారకరం. పైగా పార్టీలో సణుగుడు ఎక్కువైంది. నాయకత్వాన్ని మార్చాలనీ, రాహుల్ తన శైలి మార్చుకోవాలని రకరకాలుగా పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీలో అధినాయకుడిపై అలాంటి విమర్శలు రావడం ఒకింత జాలి కలిగించే విషయమే. అవి అతని పాపులారిటీనే ప్రశ్నిస్తున్నాయి. అరుణాచల్ సీఎం తొలగింపు అయితే ఏంటి, ఉత్తరాఖండ్ ఓటమి అయితే ఏంటి .. ఇవన్నీ కాంగ్రెస్ లేవనెత్తిన అసంబద్ధ జాతీయవాదానికి ఉదాహరణలు. గోవా, మణిపూర్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయాయి. అందుకు బీజేపీ దూకుడే కారణం. రాహుల్ శైలి మరీ రక్షణాత్మక ధోరణిలో ఉండటం బీజేపీకి కలిసొచ్చింది. సోనియా గాంధీలాగా రాహుల్ కి పార్టీ సీనియర్ల మీద కమాండ్ లేదు. అతని వ్యవహారం మార్చుకోనంత వరకు కాంగ్రెస్ భవిష్యత్ ప్రశ్నార్ధకమే.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ ఎన్నికల్లో బాగా ఆశపడింది. 3/4 మెజారిటీ వస్తుందని మీడియాతో సహా అందరూ ఆశించారు. గోవాలో కూడా అలాంటి రిజల్టునే ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ పంజాబ్ లో 22 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గోవాలో అయితే ఖాతాయే తెరవలేదు. అయితే రానున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టబోతోందనడంలో సందేహం లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఉటంకిస్తూ వచ్చిన విమర్శల మాటలు ఎలావున్నా.. ఆప్ గెలుపు మాత్రం ఎంసీడీలో ఖాయం. అయితే ఇక్కడ మరిచిపోకూడని విషయం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా పసికూనే. దాని వయసు నాలుగేళ్లే. అంత షార్ట్ టైంలో కూడా ఢిల్లీలో రెండుసార్లు గవర్నమెంటుని ఫామ్ చేసింది. హేమాహేమీలను ఢీకొట్టి గెలిచింది. అంటే, ఇదే పెద్ద గెలుపుని పొంగిపోవడం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే ఆప్ గెలిచిన తీరు చెప్పుకోదగ్గదే. ఆ మాటకొస్తే యూపీలో బేజేపీ తిరిగి గెలవడానికి రెండు దశాబ్దాలు పట్టింది.

విమర్శకులు అడుగడుగునా ఆమ్ ఆద్మీని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ఆప్ వెరువడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. దేశం బలమైన ప్రత్యామ్నాయ రాజకీయాలను కోరుకుంటోంది. ప్రభుత్వ ఒంటెత్తు పోకడలను, అప్రజాస్వామిక ధోరణిని నిలదీసే రాజకీయ వేదిక కావాలంటోంది. దేశంలో అల్ప సంఖ్యాక వర్గాల హక్కులను కాపాడాలి. మెజారిటీ వర్గం పెత్తనాలకు వారు బలికాకుండా కాపాడాలి. భిన్నత్వంలో ఏకత్వం వర్ధిల్లాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ సహనం.

రచయిత: అశుతోష్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్