Telugu

డోర్ డెలివరీ అంటూ దివాలాకి డోర్ తెరిచిన ‘వెబ్‌వాన్’.

20వ శతాబ్దంలోనే హోం డెలివరీ కాన్సెప్ట్30నిమిషాల్లో డోర్ డెలివరీ చేస్తామన్న వెబ్‌వాన్సొంత హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, రోబోటిక్ వ్యవస్థ కోసం పాకులాటనిపుణులైనా, అనుభవం లేని వ్యక్తులతో కంపెనీ నడిపిస్తే ఇంతేనా ?

ABDUL SAMAD
9th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

సంస్థాగత మదుపర్ల నుంచి ఓ నిత్యావసరాల ఈ-విక్రయి కంపెనీ 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5 వేల కోట్లు) సేకరించింది. అంతే కాదు ఐపీఓ ద్వారా పబ్లిక్ ఆఫర్‌కూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకే బోర్డ్ తిప్పేసింది. అందనంత ఎత్తుకి ఎదుగుతుందని అనుకుంటున్న సమయంలో దివాలా ప్రకటించిన కంపెనీ ఫెయిల్యూర్ స్టోరీ ఇది.

స్టార్టప్‌లు అప్పుడప్పుడే మొదలవుతున్న టైం అది. ఆర్డర్ చేసిన 30నిమిషాల్లో సరుకులు ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పిందో కంపెనీ. ఇందుకోసం ప్రత్యేకమైన రోబోటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది కూడా. పనితీరు, గుణగణాలు ప్రకటించినప్పటి నుంచే దానికి వేలంవెర్రిగా క్రేజ్ ఏర్పడింది. క్రేజ్ ఉన్నపుడే క్యాష్ చేసుకోవాలని, ఎదిగిపోవాలని అనుకున్న ఆ కంపెనీ అక్షరాలా 1.2 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించేసింది. అందులో 830 మిలియన్లు నష్టాలు రావడంతో నెలల వ్యవధిలోనే దివాలా ప్రకటించాల్సి వచ్చింది. ఇంత జరిగింది ఇప్పుడేం కాదు... 16 ఏళ్ల క్రితం కథ ఇది. చరిత్రలో మిగిలిన 1999నాటి గొప్ప పరాజయం ఇది. స్టార్టప్‌లకు గుణపాఠం లాంటిది కూడా. వెబ్‌వాన్... స్టార్టప్‌లకు ఏమేం ఉండకూడదో, నిర్వాహకులు ఏమేం చేయకూడదో చెప్పే ఓ అపజయం ఈ వెబ్‌వాన్.

వెబ్‌వాన్ డెలివరీ ట్రక్

వెబ్‌వాన్ డెలివరీ ట్రక్


అమెరికా నిత్యాసవరాలు, కిరాణ మార్కెట్ విలువ ఏడాదికి 603 బిలియన్ డాలర్లు. ఇందులో కేవలం 1.2శాతం ఆన్‌లైన్ ద్వారా జరుగుతోంది ఇప్పటికీ. గ్రాసరీ వ్యాపారంలో ఆన్‌లైన్ విభాగంలో లాభాల శాతం కేవలం 1.1 శాతమే. పెట్టుబడి మీద వచ్చే రాబడి అతి స్వల్పమైన ఈ రంగంలో మేజర్ కంపెనీగా ఎదగాలంటే చాలా కష్టమైన విషయం. ఇలాంటి మార్కెట్లోనే చావుదెబ్బ తినింది వెబ్‌వాన్.

ఆదిలోనే అంతులేనన్ని నిధులు

సెకోయా కేపిటల్, బెంచ్‌మార్క్ కేపిటల్, సాఫ్ట్ బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ శాక్స్, యాహూ వంటి కంపెనీల నుంచి 800 మిలియన్ డాలర్ల బ్లూచిప్ వెంచర్ కేపిటల్ ఫండ్స్ సేకరించింది వెబ్‌వాన్. అంతేకాదు ఐపీఓ ద్వారా ఒక్కో షేరును 15డాలర్ల చొప్పున 2.5 కోట్ల షేర్లు విక్రయించి మరో 375 మిలియన్ డాలర్లను కూడా సమీకరించింది. ఇదంతా కంపెనీ ప్రారంభించిన నెలల వ్యవధిలోనే జరిగిపోయిందంటే ఆశ్చర్యం వేయకమానదు.

సెకోయా సంస్థ భాగస్వామి అయిన మైక్ మార్టిజ్... వెబ్‌వాన్‌లో బోర్డ్ మెంబర్ కూడా. “మా మొదటి మార్కెట్ బే ఏరియాలో ఇంకా విజయం సాధించకుండానే ఖండాంతరాలు దాటి వ్యాపారం విస్తరించాలని చేసిన ప్రయత్నమే అన్నిటికంటే పెద్ద తప్పు. నిజానికి మేం విస్తరణ కార్యకలాపాల్లో బిజీగా ఉండడంతో... కంపెనీ మొదలైన చోట అపజయాన్ని విశ్లేషించుకునే సమయం కూడా లేదు.” అంటారు మైక్.

కాలిఫోర్నియాలోని ఫాస్టర్ సిటీ కేంద్రంగా వెబ్‌వాన్ కార్యకలాపాలు నిర్వహించేది. శాన్‌ఫ్రాన్సిస్కోని బేఏరియాలో తమ ప్రోడక్ట్ సక్సెస్ అవకముందే మొత్తం 26 నగరాల్లో విస్తరించేందుకు స్కెచ్ వేసిందీ కంపెనీ. శాన్‌ఫ్రాన్సిస్కో, శాండియాగో, లాస్ ఏంజల్స్, శాక్రమెంటో, కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కంట్రీ, డల్లాస్, సీటెల్, పోర్ట్‌ల్యాండ్, అట్లాంటా... ఈ నగరాలకు సంబంధించిన మార్కెట్ల నుంచి సర్వీసులు అందించేలా ఈ కంపెనీ కార్యాచరణ ప్రకటించింది. ఇవన్నీ బహుదూరంగా ఉండే ప్రాంతాలు, రాష్ట్రాలు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా కోసం డిజైన్ చేసిన వ్యాపార ప్రణాళిక... మిగిలిన ప్రాంతాలకు ఏమాత్రం సరిపోతుందో కనీసం మార్కెట్ రీసెర్చ్ కూడా చేయకుండానే వాణిజ్య విస్తరణకు ప్రయత్నించింది వెబ్‌వాన్.

సూపర్ మార్కెట్ల పైనా అవగాహన లేని సుపీరియర్లు

వెబ్‌వాన్‌ వ్యవస్థాపకుడు లూయిస్ బోర్డర్స్. ఈయన 1971లో మొదలైన బోర్డర్స్ బుక్ స్టోర్ వ్యవస్థాపకులు కూడా. ఈ బుక్ స్టోర్ 2011 వరకూ కార్యకలాపాలు నిర్వహించింది. అలాగే ఇప్పుడు అక్సెంచర్‌గా పిలుస్తున్న ఆండర్సన్ కన్సల్టింగ్ సంస్థకు సీఈఓ జార్జ్ షహీన్‌ను కూడా బోర్డులోకి తీసుకుంది. ఈయన హయాంలో ఆండర్సన్ కన్సల్టింగ్ ఆదాయం 1.1 బిలియన్ డాలర్లనుంచి 8.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే వెబ్‌వాన్ నష్టాలు పెరిగిపోవడంతో జార్ష్ షహీన్‌ను తప్పించాల్సి వచ్చింది. అయితే ఈయనకు ఏడాదికి 3.75లక్షల డాలర్ల మొత్తం జీవితాంతం చెల్లించే ఒప్పందం చేసుకుంది కంపెనీ. అలాగే వెబ్‌వాన్‌కు తర్వాతి సీఈఓగా వచ్చిన రాబర్ట్ స్వాన్ కూడా జీఈ సంస్థ నుంచి వచ్చినవారే. వీరెవరికీ సూపర్ మార్కెట్ వ్యాపారంలో అనుభవం లేదు... ఒట్టి అవగాహన తప్ప. ఇలా సీనియర్ మేనేజ్మెంట్ మొత్తం అనుభవం లేని వారి కావడంతో ఆ ప్రభావం సంస్థ పనితీరుపై స్పష్టంగా పడింది. ఒక మనిషికి సంబంధించిన వ్యక్తిగత ఇమేజ్ కోసం మదుపర్ల సొమ్ములు మొత్తాన్ని పణంగా పెట్టిన కంపెనీ వెబ్‌వాన్.

వేగంగా ఎదగడమా ? కనీస లాభమా ?

ఇప్పటి పారిశ్రామికవేత్తలందరూ జపిస్తున్న మంత్రం ఒకటే. అదే మినిమమ్ వయబుల్ ప్రోడక్ట్. కనీస లాభం అందించే ఉత్పత్తికే ప్రాధాన్యతనిస్తున్నారు. మార్కెట్ విలువ తెలుసుకోవడానికి, సామర్ధ్యాన్ని పరీక్షించడానికి తమకున్న వనరులను పరిమితంగా దీనిపై ఉపయోగిస్తున్నారు. కానీ 1990-2000ల మధ్య పరిస్థితి ఇలా ఉండేది కాదు. వీలైనంత వేగంగా ఎదగడమే లక్ష్యంగా ఉండేది కంపెనీలకు. ఏం చేసైనా సరే పెద్ద కంపెనీగా ఎదిగిపోవాలని చూసేవారు. వెబ్‌వాన్ కూడా అదే బాట పట్టి చివరకు ఇరుక్కుపోయింది.

ఎంత ఎక్కువ వ్యాపారం చేస్తే అంతగా వృద్ధి సాధించినట్లనే ఉద్దేశ్యంతో చేపట్టిన 26నగరాల్లో విస్తరణ ప్రణాళిక.. వెబ్‌వాన్‌ను చావుదెబ్బ తీసింది. ఉన్న రెండేళ్ల కాలంలోనే నష్టాల్లో మరో డెలివరీ బేస్డ్ స్టార్టప్‌ హోమ్ గ్రాసర్‌ను టేకోవర్ చేశారు కూడా. అప్పటి సీఈఓ జార్జ్ షహీన్ ఆకాశమే హద్దు అన్నట్లుగా వృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. చివరకు 2001లో దివాలా ప్రకటించేప్పటికి ఆ సంస్థ ఉద్యోగుల సంఖ్య 2వేలకు పైగానే.

సొంతగానే అన్నీ రూపకల్పన

రోబోటిక్ వ్యవస్థతో గోడౌన్, డిస్పాచింగ్ ప్లాన్ చేసిన వెబ్‌వాన్... అప్పటికే ఉన్న విధానాలకు ఉపయోగించుకోకుండా... తమదైన ప్రత్యేక వ్యవస్థ కోసం పాకులాడింది. ఇందుకోసం బెచెల్ కంపెనీతో పూర్తిగా రోబోట్లతో ఉండే ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల కోసం 1 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. ఇది ప్రోడక్టుల ఎంపిక, షిప్పింగ్‌లో వేగం పెరగడం కోసం ఉపయోగపడుతుందని వెబ్‌వాన్ ఉద్దేశ్యం. అంతే కాదు ఈ రోబోటిక్ తరహా గోడౌన్ల కోసం ఒక్కో వేర్‌హౌస్‌కు 30 మిలియన్ డాలర్ల చొప్పున వెచ్చించారు.

అక్లాండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో 5 మైళ్ల కన్వేయర్ బెల్ట్ ఉండేది. ఇది 10వేల వస్తువులను ఆటోమేటిక్‌గా పార్సెల్ చేసి షిప్పింగ్ చేయగల సామర్ధ్యం దీని సొంతం. ఇలా హార్డ్‌వేర్ విషయంలోనే కాదు.., సాఫ్ట్‌వేర్ కూడా పూర్తిగా తమకే ప్రత్యేకమైనది ఉండాలని వెబ్‌వాన్ నిర్ణయించడంతో.. ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది.

కంపెనీ దివాలా

1999నాటికే ఈ కంపెనీ ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్వహించాలనుకుంది. నిజానికి అప్పటికి ఈ-కామర్స్ అభివృద్ధి చెందలేదు. కనీసం ఇంటర్నెట్ కనెక్షన్ల విషయంలోనూ వాటికి తగినంత స్పీడ్ ఉండేది కాదు. అయితే ఇది ప్రపంచ వ్యాపార రంగంలో మార్పులు తీసుకురాబోతున్న కంపెనీగా జరిగిన ప్రచారానికి లొంగిపోయిన చాలామంది మునిగిపోయారు. కనీసం పునాదులు కూడా సరిగా పడని కంపెనీలో పెట్టుబడులు పెట్టడమే అతి పెద్ద తప్పుగా పరిణమించింది.

వేర్‌హౌస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కివా రోబోట్స్

వేర్‌హౌస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కివా రోబోట్స్


అన్నిటికంటే విషాదం ఏంటంటే కథ ఇక్కడితో అయిపోలేదు. మరో పారిశ్రామిక వేత్త జెఫ్ బెజోస్‌కు మేలు చేసేలా వెబ్‌వాన్ స్టోరీ చివరికి చేరింది.

- కివా రోబోటిక్స్‌ను 2012లో 775 మిలియన్ డాలర్లతో అమెజాన్ కొనుగోలు చేసింది. వెబ్‌వాన్ వేర్‌హౌస్‌ల నిర్వహణ కోసం రూపొందించిన టెక్నాలజీయే కివా రోబోటిక్స్‌ ఉపయోగించుకుంది.

- అప్పటి వెబ్‌వాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు డౌగ్ హెరింగ్‌టన్, పీటర్ హామ్, మిక్ మౌంట్జ్, మార్క్ మస్తాండ్రాలను జెఫ్ బోజోస్ నియమించుకున్నారు. వెబ్‌వాన్ చేసిన తప్పిదాలను తెలుసుకుని, దాని ప్రకారం కార్యాచరణ రూపొందించుకున్నారాయన. ఇప్పుడు అమెజాన్ ఫ్రెష్ పెరుతో నిర్వహిస్తున్న సరుకు రవాణా వ్యవస్థలో భాగమయ్యారు జెఫ్.

- వెబ్‌వాన్ ఏదైతే చేయాలని భావించిందో... ఇప్పుడా ప్లాట్‌ఫాంను అమెజాన్ టీం పర్ఫెక్ట్‌‍గా ఉపయోగించుకుంటోంది.

చింత చచ్చినా...

ఇంత జరిగినా గుణపాఠం నేర్చుకోలేదు వెబ్‌వాన్ సహ వ్యవస్థాపకుడు లూయిస్ బోర్డర్స్. త్వరలో మరో సరుకుల హోం డెలివరీ స్టార్టప్ ప్రాజెక్ట్ లాంఛ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారాయన. “పలు రిటైలర్లకు ఆర్డర్ చేసిన వస్తువులన్నిటికీ ఒకే లాట్‌గా మార్చి, డెలివరీ చేస్తాం. అలాగే రిటర్నులను కూడా వేగంగా ప్రాసెస్ చేస్తాం. మేం పేటెంట్ పొందిన ఆటోమేటిక్ సరఫరా వ్యవస్థను లాంఛ్ చేయబోతున్నాం” అని చెప్పారు లూయిస్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags