భవిష్యత్‌లో ప్రధానమంత్రి అవుతా - 13 ఏళ్ల అమన్
13 ఏళ్ల పిల్లాడి మైండ్ సెట్ ఎలా వుంటుంది ? చదువు- హోంవర్క్- ఆట- టీవీ- సినిమా. ఇంతకు మించి ఆ వయసు వారికి వేరే వ్యాపకం ఇంకేముంటుంది. కానీ ఆ కుర్రాడు అందరిలా కాదు. అతని ఆలోచనా పరిజ్ఞానమే వేరు. వ్యవహరించే తీరే వేరు. అతనిలో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఒక టీచర్ ఉన్నాడు. ఒక టీం మేనేజర్ ఉన్నాడు. అన్నిటికి మించి అతడిలో ఒక మంచి నాయకుడున్నాడు.
సాధారణంగా 13 ఏళ్ల పిల్లాడిని నువ్వేం అవుతావు అని అడిగితే- వాడు ఏ డాక్టరో ఇంజినీరో అంటాడు. కానీ అమన్ ఏమంటాడో తెలుసా? భవిష్యత్‌లో నేను ప్రధానమంత్రి అవుతా అంటాడు! అసలు అలాంటి ఆన్సర్ వస్తుందని- అడిగేవాళ్లు కూడా ఊహించి ఉండరు! ఆమాట అనడానికి కుర్రాడికి ఎన్ని గట్స్ ఉండాలి! గుండెలో ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి!
టాప్ 10 ర్యాంకర్లలో ఒకడు
బీఎంసీ(బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) స్కాలర్ షిప్ సాధించడం అంటే మాటలు కాదు. మహారాష్ట్రలో టాప్ 10 ర్యాంకర్లలో ఇతనూ ఒకడు. అలా అని చదువొక్కటే కాదు. సామాజిక స్పృహ కూడా ఉంది. రోజూ స్కూల్ అయిపోయిన అమన్ వెళ్లేది ఆటస్థలానికి కాదు. పుస్తకాలు తీసుకుని తోటి విద్యార్ధుల దగ్గరికి వెళ్తాడు. టీచర్ అవతారం ఎత్తి, చదువులో వెనుకబడిన వాళ్లకు లెస్సన్స్ చెప్తాడు. కుటుంబ నేపథ్యం కూడా ఏమంత చెప్పుకోదగ్గది కాదు. తండ్రి బొరివలిలో ఖాదీ వ్యాపారం చేస్తాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఏడాదికి రెండుసార్లు మాత్రమే అమ్మను చూసేందుకు వెళ్తుంటాడు.
లెర్నింగ్ సర్కిల్ ఇలా మొదలైంది
మోహినీ పాండే టీచర్. 2015లో ఫెలోషిప్ పూర్తి చేసింది. హిస్టరీ ఫ్యాకల్టీ. గత రెండేళ్లుగా బొరివలిలోని ఏక్సర్ తలావో మున్సిపల్ స్కూల్లో చెప్తోంది. పాఠాలు చెప్పామా.. జీతం తీసుకున్నామా! ఇలా ఉండటం మనస్కరించలేదు. విద్యావ్యవస్థలో ఎన్నో అసమానతలున్నాయి. మరెన్నో లోపాలున్నాయి. 6-14 ఏళ్ల మధ్య వయసు గల బాలబాలికలు స్కూల్లో చేరే సంఖ్య ఏటా 96 శాతం పెరుగుతోంది. 2010, 2012 మినహాయిస్తే, ఐదో తరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో కంటే, ప్రైవేటు స్కూళ్లలోనే ఎక్కువ ఉన్నారు. ఈ వ్యత్యాసం ఏటికేడు పెరిగిపోతూ ఉంది. ఈ గణంకాలు భవిష్యత్‌లో అత్యంత ప్రమాదకరం. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని మోహినీ పాండే భావించారు.
అమన్ సహా ఇంకొందరు విద్యార్ధులతో కలిసి ఈ విషయంపై మోహిని చర్చించారు. ఆ చర్చలోంచి వచ్చిన ఆలోచనే- లెర్నింగ్ సర్కిల్. దీని కాన్సెప్ట్ ఏంటంటే- విద్యార్ధులే ఇతర విద్యార్ధులకు పాఠాలు చెప్తారు. అలాగే బడికి వెళ్లలేని చిన్నారులకు కూడా లెస్సన్స్ చెప్తారు. అలా పాఠాలు చెప్పడం అమన్ నుంచి మొదలుపెట్టారు మోహిని టీచర్.
చదువులో వెనకబడ్డ విద్యార్ధికి పుషప్ ఇవ్వాలంటే కష్టమే. అలాంటి వారికి కొంచెం ఎక్కువ సాయం అవసరమవుతుంది. క్లాస్రూంలో ఉండే ప్రతీ విద్యార్ధి పైనా దృష్టి పెట్టడం ఏ టీచర్కైనా అసాధ్యమే. అందుకే మోహినీ మేడం ఈ ఆలోచనకు కార్యరూపమిచ్చింది.
విద్యార్ధుల నుంచే లీడర్స్
ఐడియా అద్భుతంగా వర్కవుట్ అయింది. పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. వాళ్ల ఆలోచనా పరిధి పెరిగింది. 6 నెలల క్రితం పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. మోహినీ టీచర్ మార్పుని స్పష్టంగా గమనించారు. స్టూడెంట్ లీడర్స్ కూడా ఈ విషయాన్ని గ్రహించారు. ప్రాజెక్ట్ ప్రాథమికంగా విజయవంతమైంది. ప్రతీ రోజూ స్కూల్ ముగిసిన తర్వాత గంటన్నరపాటు లెర్నింగ్ సర్కిల్ క్లాస్ ఉంటుంది. విద్యార్ధులు లీడర్ ఇంటికి వెళతారు. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే... గ్రూప్‌లోని మరో వ్యక్తి ఇంటికి వెళ్లి చదువుకుంటారు. అంతేతప్ప మరో లెర్నింగ్ సర్కిల్ క్లాస్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదు.
"ప్రతీ రోజూ అందరు లీడర్లతో కలిసి ఆ రోజు ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. దీనివల్ల ప్రతీవారికీ టీం వర్క్ అలవాటవుతుంది. దాని ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది. ప్రతీ సెషన్ లోనూ వర్క్ షీట్ ద్వారా పార్టిసిపెంట్స్ మాగ్జిమం ప్రాక్టీస్ చేసేలా చూస్తాం. స్టూడెండ్ లీడర్స్ అందరూ కలిసి టెస్ట్ పేపర్స్ సిద్ధం చేస్తాం"-అమన్
సొంతంగా ప్లాన్స్
అంతేకాదు.. లీడర్లు నేర్పుతున్న తీరు, వారి ప్రవర్తనలపై ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశం పార్టిసిపెంట్స్ కు ఉంటుంది. విద్యార్ధుల ఊహా స్థాయిని పెంచడమే కాకుండా..వారిలో ఊహించని మార్పు కనిపిస్తోంది. సెషన్స్ ను, టార్గెట్‌ను మోహిని టీచర్ డిజైన్ చేస్తారు. వీటికి అనుగుణంగా ప్రణాళికలు మార్పు చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్ లీడర్స్ పై ఉంటుంది. మొదట్లో ఐడియాలు టీచరే ఇచ్చినా.. ఇప్పుడు సొంత ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు అమన్, అతని ఫ్రెండ్స్.
కొంత రిస్క్ తప్పదు
ఈ విధానంలో విద్యార్ధులు కొంత రిస్క్ చేయాల్సి ఉంటుంది. వారి కోసం మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఫలితంగా ఒకరి మీద ఒకరికి ఇష్టం, అనుబంధం ఏర్పడుతాయి. నిష్కల్మషంగా మసులుకోవడం అలవడుతుంది. అలాంటి యాటిట్యూడ్ -వయసు పెరిగినా కొద్దీ లీడర్ షిప్ లక్షణాలను పెంచుతుందంటారు మోహిని టీచర్.
మిగతావారి సంగతి పక్కన పెడితే అమన్‌లో ఊహించని మార్పు వచ్చింది. మానసికంగా ఎంతో పరిణితి సాధించాడు. తెలివైన విద్యార్ధి మాత్రమే కాదు. ఇతరుల పరిస్థితిని అర్ధం చేసుకోగలిగే తత్వం ఉన్నవాడు. దేనికైనా తొందరగా స్పందిస్తాడు. లెర్నింగ్ సర్కిల్లో అతడు తోటి పిల్లలకు బోధించే విధానం ఒక టీచర్తో సమానంగా ఉంటుంది. అతని ఆలోచనా విధానమే కారణమంటారు మోహిని.
భవిష్యత్ లో ప్రధానమంత్రి అవుతా!
లెర్నింగ్ సర్కిల్ ప్రారంభించిన తర్వాత మునుపటికంటే ఆత్మవిశ్వాసం రెట్టింపయింది అమన్‌లో. కొన్ని కొన్ని విషయాల్లో సొంతంగా నిర్ణయం తీసుకుంటాడు. అందుకేనేమో పెద్దయ్యాక నువ్వేం అవుతావు అంటే-ఏదో ఒకరోజు భారత దేశానికి ప్రధానమంత్రి అవుతానంటాడు. ఆ సమాధానం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంకా లోకం పోకడ తెలియని బాలుడు- ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ ని అవుతాను అంటే- వినడానికి సిల్లీగానే ఉండొచ్చు. కానీ అలా అనగలిగాడంటే- అతనిలో ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేయాలి. అతడి ఆలోచనా పరిధిని అభినందించాలి.
"ఒకవేళ నేను ప్రధాని కాలేకపోయినా ఫరవాలేదు. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చేందుకైనా రాజకీయాల్లోకి వస్తాను. నా చుట్టూ ఉన్న సమాజం మారితే దేశం మొత్తంలో మార్పు సాధించచ్చు. సపోర్ట్గా ఏమీ లేకపోయినా భారతదేశంలో ఉన్నామనే ధైర్యం ఉండేలా చేస్తాను"-అమన్.
సమస్యలున్నాయి నిజమే. అంతమాత్రం చేత సమాజాన్ని తిట్టుకుంటూ బతికేయాలా? ఆ సమస్యలేవో తమ పరిధిలో, తమ శక్తిమేరకు పరిష్కరించ గలిగితే..దేశం ఆటోమేటిగ్గా మారదా? ఇదే అమన్ నమ్మే సిద్ధాంతం