సంకలనాలు
Telugu

ఆర్గానిక్ ఫుడ్స్‌తో అంతులేని విజయం

బ్యాక్ యార్డ్ టూ గ్లోబల్ డీల్స్ మనుజ్ తేరాపంథీ ఆర్గానిక్ ఫుడ్ స్టార్టప్ అనూహ్య విజయంఓపెన్ చేసిన ఏడాదికే బ్రేక్ ఈవెన్.ఫోకస్, ఓర్పు, కస్టమర్లకు వేల్యూ...ఇవే సక్సెస్ సూత్రాలంటున్న మనుజ్

team ys telugu
15th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఆరోగ్యమే మహాభాగ్యం ..హెల్త్ ఈజ్ వెల్త్..ఈ సామెతలకు అర్ధం ఇప్పుడు ప్రతి ఒక్రికీ తెలిసి వచ్చింది. ఓవైపు ఎంత ఖర్చు పెడుతున్నా తీసుకునే ఆహారం పరిశుభ్రమైనదా కాదా అనే సందేహం వెంటాడుతూ ఉంది. అందుకే ఆర్గానిక్ ఫుడ్స్ ప్రొడక్ట్స్‌కి ఇప్పుడు బాగా ఆదరణ పెరుగుతోంది. పేరు చివర ఆర్గానిక్ అని కన్పిస్తే చాలు జనం వెంటబడిపోతున్నారు. 2002 నుంచి 2012 వరకూ ఈ రంగంలో ఎగుమతుల విలువ చూస్తే.. 12 మిలియన్ డాలర్ల నుంచి 125 మిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. అంటే పదేళ్లలో పదిరెట్లు అమాంతం ఓ జంప్ స్టార్ట్ ఇచ్చినట్లైంది. ఇక ఈ ఏడాది చివరికి ఇది బిలియన్ డాలర్లకు చేరుతుందని ఓ అంచనా.

లెక్కకు మించి స్టార్టప్స్, సోషల్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలు ఈ ఆర్గానిక్ ఫుడ్స్‌లో తమ వాటా పంచుకుంటుండగా.. వాటన్నింటిలో కొన్ని మాత్రమే ఈ కామర్స్ ద్వారా బిజినెస్ చేయగలుగుతున్నాయ్. అలాంటి వాటిలో మంచి పేరు సంపాదించింది 'ఆర్గానిక్ షాప్'. 2010లో మనుజ్ తేరాపంథి స్థాపించిన ఆర్గానిక్ షాప్ ..ఇప్పుడు అతి పెద్ద ఆన్‌లైన్ రిటైలర్‌గా మారింది. ఈ షాప్‌లో 6వేలకుపైగా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆర్గానిక్ షాప్ ప్లాట్‌ఫామ్‌గా చేసుకుని స్థానికంగా వ్యాపారం చేసే కంపెనీలతో పాటు..దేశంలో ఇతర రిటైలర్ షాపుల ప్రొడక్ట్స్ కూడా లభిస్తాయ్. ఖచ్చితమైన నాణ్యత, పారదర్శకతతో కూడిన మార్కెటింగ్ ఆర్గానిక్ షాప్ ప్రత్యేకత.

మనుజ్ తేరాపంథీ, ఆర్గానిక్ షాప్ వ్యవస్థాపకులు

మనుజ్ తేరాపంథీ, ఆర్గానిక్ షాప్ వ్యవస్థాపకులు


" ఆర్గానిక్(సేంద్రియ) పదార్ధాల ఉత్పత్తులంటే మాకు ప్రాణం. భవిష్యత్ తరాలకు ఓ మంచి ప్రపంచాన్ని, భద్రతతో కూడిన జీవనాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మేం నమ్ముతున్నాం. ఆహారం, దుస్తులు, రంగులు, అలంకరణ సామాగ్రి, ఇలా అనేక ఉత్పత్తులు కలుషితం అయిపోతున్నాయ్. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ" అని ఆర్గానిక్ షాప్ వ్యవస్థాపకుడు మనుజ్ తేరాపంథీ చెప్తారు.

ఆర్గానిక్ ఫుడ్స్ ఎంచుకోవడంలో కస్టమర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల తీర్చాలనే తపన ఆయన మాటల్లో కన్పిస్తుంది.." ఈరోజుల్లో మనుషులు ఎంత బిజీగా మారారంటే వారేం తింటున్నారో..తాగుతున్నారో కూడా గమనించలేనంత తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆర్గానిక్ అని రాసి ఉంటే చాలు కొనేస్తున్నారు తప్ప, రోజువారీగా తమకేం కావాలో తెలుసుకోలేకపోతున్నారు. అలానే సేంద్రియ ఆహార పదార్ధాలు అన్నీ ఒకే చోట మార్కెట్లో దొరకడం కూడా కొద్దిగా కష్టమే. ఒక్కో ఐటెమ్ ఒక్కో చోట దొరుకుతుంది. ప్రస్తుతం అర్బన్ పీపుల్‌తో పాటు మిగిలిన సమూహాల్లో కూడా ఆర్గానిక్ కాన్సెప్ట్‌కు బాగా ఆదరణ లభిస్తోంది. జనం అవసరాలకు తగ్గట్లుగా మార్కెట్ విస్తరించలేదు. ఇదే ఆర్గానిక్ ఫుడ్స్‌ను స్థాపించడానికి ఓ రకంగా కారణమైంది.." తమ సంస్థ పుట్టుక వెనుక కథను గుర్తుకు చేసుకున్నారు మనుజ్ తేరాపంథీ. ఆర్గానిక్ ఫుడ్స్ కేవలం జనంలో వీటి పట్ల అవగాహన కల్పించడమే కాకుండా బిజినెస్ ఎక్స్‌పర్ట్స్‌కు కూడా ఈ రంగంలో ఉన్న డిమాండ్ ను తెలియజేయడం తమ ప్రధాన లక్ష్యమని మనుజ్ చెప్తారు.

అన్ని స్టార్టప్స్ లానే ఆర్గానిక్ షాప్ కూడా ముందు కష్టాలనెదుర్కొంది. "2010లో స్టార్టప్ ఆలోచన వచ్చినా తమతో కలసివచ్చేవాళ్లకోసం అన్వేషిస్తూ.. 2011వరకూ కాలం వెళ్లదీశాం. చివరకు నలుగురు బృంద సభ్యులతో 1200 ప్రొడక్ట్స్‌తో అతి తక్కువ పెట్టుబడితో ఓ కేటలాగ్‌ను విడుదలచేశాం. వీటికి 100శాతం సేంద్రియ పదార్థాలనే సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాం. తర్వాతి సంవత్సరమే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నాం. ప్రారంభించిన సంవత్సరంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడం మాపై మాకు నమ్మకాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో మార్కెట్లోకి దూసుకెళ్లాం.."

ఆర్గానిక్ షాప్ బాగా విజయవంతం కావడంతో విస్తరించడానికి కావాల్సిన నిధుల సమకూర్చుకోవడం సులభతరమైంది. "2013లో ఇంటి వెనుక ఖాళీస్థలంలో (బ్యాక్ యార్డ్) లో ప్రారంభమైన మా స్టార్టప్‌కు రాజస్థాన్ ఏంజెల్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ముప్పైలక్షల నిధులు సమకూర్చింది. అలా మేం తర్వాతి స్థాయికి వెళ్లేందుకు ఓ మార్గం దొరికింది. మా ఉత్పత్తులను మరింత పెంచాం. అలానే కొత్త ప్రొడక్ట్స్‌ను కేటలాగ్‌లో చేర్చాం. ప్రొడక్ట్స్ ఆఫర్స్ కూడా ప్రకటించాం. ఇప్పుడు 45 రిజిస్టర్డ్ బ్రాండ్స్‌తో 6వేలకు పైగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ను అమ్మేస్థాయికి చేరాం. అలానే 2013 నుంచీ మేం వివిధ రకాల కంపెనీల ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కూడా చేపట్టాం" అని తమ విజయగాధను వివరించారు.

image


అలానే ఆర్గానిక్ షాప్ ఎదుర్కొన్న సవాళ్లలో ఒకటి ట్రాన్స్‌పోర్ట్. ఈ కామర్స్ రంగానికి వచ్చేసరికి సరుకును సురక్షితంగా, చెడిపోకుండా కస్టమర్లకు చేర్చడమనేది పెద్ద ఛాలెంజ్. మిగిలిన వారికీ తమకూ తేడా చూపించడానికి మనుజ్ తేరాపంథీకి ఇదో అవకాశంగా కన్పించింది. ఆ సవాల్‌ను సమర్ధవంతంగా స్వీకరించి కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నారు మనుజ్ అతని టీమ్.

ఆర్గానిక్ షాప్ గత కొద్ది సంవత్సరాలుగా మంచి గ్రోత్ రేటు సాధిస్తూ వస్తోంది. కానీ మనుజ్ దాంతో తృప్తి పడటంలేదు. ఇంకా ఇంకా విస్తరించాలనేది అతని ప్లాన్. "రీసెంట్‌గా మేం యూరోపియన్ మార్కెట్‌లోకి ఎంటరయ్యాం. అక్కడి ప్రొడక్ట్స్‌ను కూడా మిగిలిన దేశాలకు అందించాలనేది మా టార్గెట్. ఈ ఏడాది జనవరిలో డీల్ పూర్తైంది. యూరప్‌లోనే ఎందుకు ప్రవేశించాలనుకుంటున్నామంటే ప్రపంచంలోనే అత్యుత్తమ, అతి పెద్ద ఆర్గానిక్ ఉత్పత్తిదారులు యూరప్‌లోనే ఉన్నారు. కానీ మిగిలిన ప్రపంచంతో అక్కడి ఉత్పత్తులను టై అప్ చేసే వ్యవస్థ ఏర్పాటవలేదు. అదే మమ్మల్ని ఉత్సాహపరుస్తోంది. మా ద్వారా యూరోపియన్ ఉత్పత్తులు మిగిలిన దేశాల్లో..మనదేశంలోని ఉత్పత్తులు అక్కడ కస్టమర్లకు చేర్చుతాం" తమ కొత్త లక్ష్యాన్ని మనుజ్ వివరించారు.

ఆర్గానిక్ షాప్ స్టార్ట్ అప్ సక్సెస్ స్టోరీ వింటుంటే ఎవరికైనా ఉత్సాహభరితంగా అన్పించకమానదు. మూడేళ్లలోనే ఇంత గొప్పస్థాయికి చేరిందంటే మిగిలిన వారికీ అదో నమ్మకం కలిగిస్తుంది. బ్యాక్ యార్డ్ నుంచి గ్లోబల్ ఈ కామర్స్ సైట్ వరకూ ఎదగడానికి సీక్రెట్ ఏంటంటే.."లక్ష్యం పై దృష్టి.. సహనం కోల్పోకపోవడం.. కొత్త కొత్త ఐడియాలతో కస్టమర్లను ఆకట్టుకోవడం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం " అంటూ ముగించారు మనుజ్ తేరాపంథీ

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags