సంకలనాలు
Telugu

ఈ స్కూల్ గురించి మీరెప్పుడైనా విన్నారా..?

GOPAL
9th Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఆ పాఠశాల పేరు వింటే ప్రకృతి కూడా పరశిస్తుంది. పశుపక్ష్యాదులు కూడా ఆనందంతో తాండవం చేస్తాయి. ఆ స్కూల్ ప్రాంగణమంతా సంగీత కళామతల్లి ఆవహించి ఉంటుంది. జలపాతాల హోరు, పక్షుల కిలకిలారావాలు, చందన సుంగధ పరిమళాలు మొసుకొచ్చే పిల్లతెమ్మరలు, చివరకు నిశ్శబ్దం కూడా మృదుమధుర సంగీత నాదంలా వినిపిస్తుంది. ఇంతకూ ఏంటా స్కూల్.. ఎక్కడుందది?

image


కళలకు ఎల్లల్లేవు.. స్కూల్‌కు గోడల్లేవు!

కల్కేరీ సంగీత విద్యాలయా. కర్ణాటక ధార్వాడ్కు 18 కిలోమీటర్ల దూరంలో ఉందీ మ్యూజిక్ స్కూల్. కల్కేరి పాఠశాల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అది సంగీత ప్రేమికలు స్వర్గధామం. కళకు ఎల్లలు లేవు అని చెప్పడానికి అన్నట్టు- ఆ స్కూల్ కి గోడలు కూడా ఉండవు. ఫలానానే నేర్చుకోవాలి అని బండ రూల్స్ కూడా కనిపించవు. చదువు.. ఆడు.. పాడు.. ఇష్టమొచ్చింది చేయొచ్చు. ఎవరూ అభ్యంతరం పెట్టరు.

సాధారణంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్తే అక్షరాలు, పాఠాలు మాత్రమే నేర్చుకుంటారు. కానీ ఇక్కడ జీవితానికి అవసరమయ్యే ప్రతీదీ నేర్చుకుంటారు. 2002లోఈ స్కూల్ ప్రారంభమైంది. మాథ్యూ, అగాథే దీని వ్యవస్థాపకులు. ఇద్దరూ సంగీతాభిమానులే. హిందూస్థానీ నేర్చుకోవడానికి ఇండియాకు వచ్చారు. 12 ఏళ్లు అనేక ప్రదేశాలు తిరిగారు. ఎక్కడెక్కడికో వెళ్లారు. చివరికి కల్కేరి దగ్గర ఆగిపోయారు. మొదట్లో సాయంత్రం పూట మాత్రమే మ్యూజిక్ క్లాసులను నిర్వహించేవారు. తర్వాత పూర్తిస్థాయి సంగీత విద్యాలయంగా మార్చారు.

image


స్వచ్ఛందంగా పాఠాలు

సంగీతం, నృత్యం, నాటకం, టైలరింగ్, పెయింటింగ్. ఎవరికి ఇష్టమైన పని వారు చేయొచ్చు. హాస్టల్ వసతి, బట్టలు, వైద్యం అన్నీ ఉచితమే. ప్రతిరోజు 3 గంటల పాటు మ్యూజిక్ క్లాసులుంటాయి. డాన్స్, వోకల్, ఇన్ స్ట్రుమెంటల్, ఏది నచ్చితే అది. మధ్యాహ్నమంతా శ్రద్ధగా పాఠాలు వింటారు. ఈ సంగీత పాఠశాలలతో దాదాపు 250 మంది పిల్లలు చదువుకుంటున్నారు. దేశ, విదేశీ కళాకారులు, సంగీతం టీచర్లు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా కల్కేరికి వచ్చి పిల్లలకు పాఠాలు చెబుతుంటారు.

image


కళల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులు చిన్న వయసులోనే తబలా, సితార, వయోలిన్ వాయిద్యకారులుగా స్థిరపడ్డారు. ఎన్నో వేదికలపై గాన కచేరీలు చేస్తున్నారు. దాతల విరాళాలతో నడుస్తున్న ఈ పాఠాశాల విద్యార్ధుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో సక్సెస్ స్టోరీ. సమాజంలో ఎక్కడికెళ్లినా సమ్ థింగ్ స్పెషల్. ఆ పిల్లలను అందరూ గౌరవిస్తారు. ఆ విద్యాలయాలో చేరిన 257 మంది జీవితాలు అద్భుతంగా మారిపోయాయి

యాత్రికులతో మాట్లాడుతున్న మ్యాథ్యూ ఫోర్టియర్

యాత్రికులతో మాట్లాడుతున్న మ్యాథ్యూ ఫోర్టియర్


ఒక్కో విద్యార్ధిది ఒక్కో కథ

డులో అడోల్కర్. ఈ విద్యార్ధి కథ చాలా విచిత్రమైంది. అప్పుడతనికి ఎనిమిదేళ్లు. ధర్వాడ్ జిల్లా హన్సికుమారి అనే చిన్న కుగ్రామం అతనిది. రోజులాగే పశువులను తోలుకుంటూ అడవిలోకి వెళ్లాడు. అక్కడ ఒక చోటినుంచి సంగీతం వినిపించింది. దగ్గరగా వెళ్లి చూశాడు. స్కూల్ కాదుగానీ- స్కూల్ లాంటిదే. తనలాంటి పిల్లలు అక్కడ డాన్స్ చేస్తున్నారు. తబలా వాయిస్తున్నారు. అంతా వింతగా అనిపించింది. ధైర్యం చేసి లోపలకి వెళ్లాడు. సంగీత కళామతల్లి ఏ అద్భుతం చేసిందో గానీ- ఒక్కసారిగా పిల్లాడి మనసు మారిపోయింది. గుండెచప్పుడు శ్రుతిలయలుగా మారిపోయాయి. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల్లో సరిగమలు పాదుకున్నాయి. విషయం ఇంట్లో చెప్పాడు. తండ్రి సరే అన్నాడు. కానీ ఊరివాళ్లు ఏవేవో లేనిపోని భయాలు నూరిపోశారు. వాళ్లు విదేశీయులు. పిల్లల్ని ఎత్తుకెళ్లి కిడ్నీలు తీసి అమ్ముకుంటారు అని భయపెట్టారు. కానీ డులో తండ్రి గ్రామస్తుల మాటల్ని లెక్కచేయలేదు. నీ ఇష్టంరా అన్నాడు. ఆ మాటలు డులో జీవిత గమనాన్నే మార్చేశాయి.

కట్ చేస్తే 23 ఏళ్ల డులో- ధర్వాడ్ యూనివర్సిటీ నుంచి మ్యూజిక్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. కాలేజీ టాపర్ కూడా. డులో తమ్ముళ్లు డుండూ, జాను ఇదే సంగీత విద్యాలయంలలో సితార, తబలా నేర్చుకుంటున్నారు. యువర్ స్టోరీ అడిగిన కొన్ని ప్రశ్నలకు డులో నవ్వుతూ బదులిచ్చాడు. ఒకప్పుడు తనని భయపెట్టిన గ్రామస్తులు పూర్తిగా మారిపోయారంటున్నాడు.

image


తబస్సుమ్. తొమ్మిదో తరగతి విద్యార్థిని. వాయొలిన్ వాయించడంలో దిట్ట. హిందీ లెక్చరర్ కావాలన్నది ఆమె కోరిక. ఐదో తరగతి చదువుతున్న తేజస్వినికి ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్. పెద్దయిన తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ కావాలని ఆ చిన్నారి కలలు కంటున్నాడు. ఎనిమిదో తరగతి చదవుతున్న సునీల్ మంచి వోకలిస్ట్ కావాలని ఆంబిషన్ పెట్టుకున్నాడు. ఈ స్కూల్లో నీకు ఏదీ నచ్చదు అని ప్రశ్నిస్తే సునీల్ ఒకటే అంటాడు. నాకు ఇక్కడ నచ్చనిదంటూ ఏదీ లేదు.

మాస్టర్ డిగ్రీ వరకు సహకారం

కర్ణాటక సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు గుర్తింపు పొందిన కేఎస్వీకి- కర్నాటక ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నది. చేరిన ప్రతి విద్యార్థి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసేవరకూ స్కూల్ సహకరిస్తుంది. పెద్ద చదవులు చదివే విద్యార్థులకు ఆర్థిక సహకారం, మెంటర్షిప్ను కూడా అందిస్తున్నది. కాకపోతే చాలామంది అమ్మాయిలు పదో తరగతితోనే చదువు ఆపేస్తున్నారు. బాలికలు ఇలా మధ్యలోనే విద్యను ఆపేయడం బాధాకరం అంటాడు ఆడమ్. అయినా సరే మా ప్రయత్నాలు మేం చేస్తాం అంటున్నాడు. మొత్తం 65 శాతం మంది అబ్బాయిలున్నారు. బాలబాలికల నిష్పత్తి అదే విధంగా ఉండేలా స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తున్నది. చుట్టుపక్కల 40 కిలోమీటర్ల నుంచి విద్యార్థులు ఈ స్కూల్ చదువుకోవడానికి వస్తారు.

image


ప్రస్తుతం 20 మంది విదేశీ వాలంటీర్లు ఈ స్కూల్లో పాఠాలు చెప్తున్నారు. ఒక్కో ఫారిన్ వాలంటీర్ 5 నుంచి 6 నెలల పాటు ఈ స్కూల్లో గడుపుతారు. ఇక ఇండియన్ వాలంటీర్లు తమకు వీలైనట్టుగా ఈ స్కూల్ కి సేవలందిస్తారు. నెలా, రెండు నెలలు కూడా చిన్నారులకు పాఠాలు చెప్తారు. ఒక్క పాఠాలే కాదు, తలాకొంత విరాళం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీయులైతే 1500 రూపాయలు, భారతీయులైతే 500 రూపాయలు.

కేఎస్‌వీ లైబ్రరీ.

కేఎస్‌వీ లైబ్రరీ.


విలాసవంతమైన అపార్టుమెంటులో ఉండాలని, ఖరీదైన సోఫాల్లో కూర్చోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. వెస్ట్రన్ కంట్రీస్‌లో మన గొప్పతనం మనకు తెలియదు. అలా అని ఏ ఒక్కరో ఈ ప్రంపంచాన్ని మార్చలేరు. విదేశాల్లో ప్రజలు ఎవరికి వారే ఉంటారు. పంచుకోవడం అనే మాటకు వారికి అర్థమే తెలియదు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఎలాంటి అరమరికలు లేకుండా కలిసిపోతారు. విదేశాల్లో పిల్లలు కేవలం వర్చువల్ ప్రపంచంలోనే బతుకుతున్నారు. వారికంటే ఈ చిన్నారులు ఎంతోనయం- ఆడమ్

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువను ఉన్న కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న మ్యాథ్యూ, ఆడమ్, మీరా అభినందనీయులు. వారి బాటలోనే మరికొంత మంది పయనించాలని యువర్ స్టోరీ కోరుకుంటోంది.

ఫొటో క్రెడిట్స్: ప్రద్నేశ్ (సాకు)

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags