సంకలనాలు
Telugu

తమ శక్తి ఏంటో మహిళలకు తెలిసేలా చేస్తున్న కల్పన తటవర్తి

మహిళా సమానత్వం కోసం పోరాడుతున్న కల్పన తటవర్తిలింగ వివక్ష రూపు మాపేందుకు ఇతోధిక ప్రయత్నాలు మహిళల అంతర్గత శక్తి బయటకు తెచ్చే వర్క్‌షాపులుమహిళలపై సమాజంలో నెలకొన్న చిన్నచూపే అసలు సవాల్ అంటున్న కల్పన

Poornavathi T
24th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

“లింగ వివక్ష లేని ప్రాంతంలో పని చేయాలనే తపనే... నన్ను ఈ తరహా ఉద్యోగ విధుల్లోకి చేర్చింది. మహిళలతో ఉంటూ వారికోసం పని చేయగలగడం చాలా ఆనందాన్నిస్తోంది. నేను అనుకున్నట్లే అంతా జరుగుతోంది. ”అంటున్నారు ఇంటర్‌వీవ్ కన్సల్టింగ్ భాగస్వామి కల్పన తటవర్తి. వైవిధ్య భరితమైన సమ్మేళనాలకు ఈ కంపెనీ కన్సల్టెన్సీ సర్వీసులు నిర్వహిస్తుంది.

కల్పన తటవర్తి

కల్పన తటవర్తి


శక్తివంతమైన మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్న కుటుంబంలో పుట్టారు కల్పన. అత్త-పిన్ని వరసయ్యేవారు, నలుగురు సోదరీమణుల మధ్య పెరగడంతో.. మహిళల మధ్యే పని చేయాలనే ఆలోచన ఆమెకు రావడం అంతగా ఆశ్చర్యపరచే విషయం కాదు. తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చినపుడు... మార్కెటింగ్ హెడ్ కల్పనను అడిగిన ప్రశ్న ఆమెకు ఇంకా గుర్తే. మీ కల ఏమిటి అన్న ప్రశ్నకు... ఆమె ఇచ్చిన సమాధానం ఇది. “నేను మహిళల కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. వంటింటి కుందేలు చందంగా బతుకుతున్న ఆడవారికి... వారి అంతర్గత సామర్ధ్యాన్ని బయటకు తీసే విధంగా.. బాటలు వేయాలని అనుకుంటున్నా”. అయితే ఇప్పుడామె నిర్వర్తిస్తున్న విధులు పూర్తిగా విభిన్నమైనవి కావడం విశేషం.

మహిళా సాధికారితను పెంపొందించడం, లైంగిక హింసను అరికట్టడం, కార్పొరేట్ రంగంలో మహిళల శక్తి సామర్ధ్యాలను పెంపొందించి నిరూపించడమే... తన ప్రాథమిక లక్ష్యాలుగా చెప్తారు కల్పన తటవర్తి. ఇంటర్‌వీవ్‌కు ముందు 'మార్పిడి' అనే సంస్థను స్వయంగా ఏర్పాటు చేశారామె. అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసి... నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు.

నమ్మకం, ఆత్మవిశ్వాసం.. ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, అనుకున్న లక్ష్యాన్ని అందుకోవడం కోసం ఈ రెండు చాలా ముఖ్యం అంటారు కల్పన. నలుగురు అక్కాచెల్లెళ్ల మధ్యన పెరగడంతో... టామ్‌బాయ్ టైపులో ఉండేవారామె. “మా అక్కా చెల్లెళ్లలో ఎలాంటి బేధభావాలు ఉండేవి కావు. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అనే ఉద్దేశ్యాలు ఎవరికీ లేవ”ని గర్వంగా చెబ్తారు కల్పన. చిన్నపుడు చదువంటే అసలు పడేది కాదనీ, ఆటలంటే చాలా ఇష్టమనీ, స్కూల్ అంటే ఎప్పుడూ ద్వేషం కలిగేదంటున్నారు కల్పన.

తన చుట్టూతా ప్రతిభావంతులైన మహిళలు ఉండడంతో... ఆడవారు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే... జీవితంలో ఎంతటి మార్పు సాధించచ్చో ప్రత్యక్షంగా చూశారు కల్పన. నానమ్మ, అమ్మ, పిన్ని వరసయ్యేవారు, సోదరీమణులు, ఇరుగుపొరుగు మహిళలు... అలాగే పెళ్లైన తర్వాత ఇద్దరు అత్తయ్యలు (ఆమె భర్తను కన్నతల్లి, దత్తత తీసుకున్న తల్లి)... ఇలా చిన్నప్పటి నుంచి శక్తివంతమైన, బాధ్యతాయుతమైన మహిళలు ఆమె జీవితంలో ఉన్నారు. గౌరవప్రదమైన ఉద్యోగాన్ని పెళ్లైన తర్వాత వదులుకున్న తన తల్లి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు కల్పన. 

“కాలంతో పాటు జీవిత అనుభవాలు మారుతున్నా... ప్రతీసారీ నా చుట్టూ ప్రతిభావంతులైన మహిళలు ఉండేవారు. అయితే గత తరం ఆడవారు తమ భావాలను అంత తేలికగా బయటకు వ్యక్తపరచగలిగేవారు కాదు. పురుషాధిక్య సమాజం కావడంతో.. వారిలోని ప్రతిభ పూర్తిగా బయటకు రాలేకపోయింది” అంటారు కల్పన. అందుకే తాను లింగ వివక్షను అధిగమించి... మహిళల సాధికారత కోసం ప్రయత్నించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతారామె.
ఒక వర్క్‌షాప్‌లో కల్పన తటవర్తి(ఎడమ)

ఒక వర్క్‌షాప్‌లో కల్పన తటవర్తి(ఎడమ)


దుర్గ... ఈ పేరుతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ బోర్డులో ఉన్నారు కల్పన. ఈ సంస్థ పబ్లిక్ ప్లేసుల్లో మహిళల భద్రత కోసం పాటు పడుతోంది. అలాగే పేదరికంతో మగ్గిపోతున్న నిమ్న తరగతి వర్గాల మహిళలకు... స్వయం ఉపాధి కోసం తోడ్పడే NGOలతో కలిసి పని చేస్తున్నారు ఆమె. ఛార్లీ బ్లెయిర్ ఫౌండేషన్‌కు మెంటర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సాధనలో ఎదురైన సవాళ్లు

మహిళల విషయంలో సమాజంలో నిండిపోయిన భావజాలమే కల్పన ఎదుర్కున్న అతి పెద్ద సవాల్. “నేను చేస్తున్న పనులకు ఫలితాలు అందేందుకు ఏళ్ల తరబడి సమయం అవసరం. దీనికి పురుషులే కాదు. మహిళలు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. మహిళల బాధ్యత ఇంటి పని మాత్రమే అనేలా మనకు చిన్నప్పటి నూరిపోసేస్తారు. అందుకే ఆర్థిక రంగం ఎదుగుదలలోనూ, ఆర్థిక స్వావలంబనలోనూ మహిళలు ఎప్పుడూ వెనకబడే ఉంటారు. ప్రపంచం ఆర్థికంగా పుంజుకునంటున్నా.. మహిళలు, ప్రధానంగా మన దేశంలో ఆడవారు వెనకబడిపోవడానికి కారణం ఇదే. కొన్ని తరహా పనులను మహిళలు మాత్రమే చేయాలనే మాటలకు, ఆంక్షలకు వ్యతిరేకంగా నేను పని చేస్తున్నా. ఇంట్లో చిన్న పిల్లల ఆలోచనల తీరుతెన్నులు మార్చడంలోనూ, వారి ఎదుగుదలలోనూ మహిళలే కీలకపాత్ర పోషిస్తున్నారనే విషయాన్ని కూడా చాలా మంది తెలుసుకోలేరు, తెలిసినా అంగీకరించలేరు. అలాగే... లింగ వివక్ష లేకుండా చిన్నపిల్లలను తీర్చిదిద్దడం తమ బాధ్యతే అన్న విషయాన్ని కూడా పెద్దవారు గ్రహించడం లేదం”టూ మండిపడుతున్నారు కల్పన.

ఒక్క ఇంటర్‌వీవ్‌లోనే.. దాదాపు 15 వందల మంది మహిళలకు ఆమె ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా 6వందల మంది మేనేజర్లు కూడా కల్పన దగ్గర శిక్షణ పొందారు.

నిజానికి కల్పన నిర్వహించే విధులు ఆసక్తికరమైనవి, అలాగే బాధ్యతతో కూడుకున్నవి కూడా. మహిళల్లో ప్రతిభను వెలికితీసే సంస్థలతో కలిసి పని చేస్తారామె. మహిళల కోసం మహిళలే ఏర్పాటు చేసి, వారే నిర్వహించి... మహిళా సమాజాన్ని ఆర్ధికంగా పరిపుష్టి చేసే కార్యకలాపాల్లో భాగం అవుతారు. ఆ తరహా కంపెనీలు, వర్క్‌ప్లేసుల ఏర్పాటుకు తోడ్పడతారు. ఇల్లు ఎంతగా ముఖ్యమో.. అంతగానే స్వయంస్వావలంబన ముఖ్యమని... మహిళలు గ్రహించేలా చెబుతారు. అలాగే వారి ప్రతిభకు తగిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలియచేస్తారు కల్పన.

మహిళల ప్రతిభను వెలికితీసే అనేక సంస్థలతో కలసి పని చేశారు కల్పన. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాతో కలిసి ఇంటర్‌వీవ్ కన్సల్టింగ్ సంస్థ.. పని చేసి మానేసిన మహిళలను తిరిగి ఉద్యోగ విధుల్లోకి తేవడం అనే అంశంపై అడ్డంకులపై ఒక స్టడీ నిర్వహించింది. ఇంటర్‌వీవ్ తమ కార్యకలాపాలు నిర్వహించిన ప్రాంతాల్లో... ఈ తరహాగా ఉద్యోగ విధుల్లోకి తిరిగి చేరుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని... ఈ సర్వే ద్వారా వారు గ్రహించారు. మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని భావించే కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోందని చెబ్తున్నారు కల్పన. లింగవివక్ష లేకుండా... పురుషులు, మహిళలకు సమానంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని... ఇది సంతోషకరమైన విషయం అంటారు కల్పన.


కల్పనకు మరో వైపు...

ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల మహిళలకు వడ్డీ లేకుండా రుణ సౌకర్యం కల్పిస్తే... వారు సమర్ధవంతమైన మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని కల్పన గుర్తించారు. మహిళలు అర్ధికంగా పరిపుష్టి చెందితే సమాజంలో గుర్తించదగ్గ మార్పు వస్తుందంటారు కల్పన. “వారి శక్తి దుర్వినియోగం కావడం వంటివి జరగదు, అలాగే వారి పిల్లలు కూడా తమ తల్లి సాధించిన విజయాలనుంచి ఎన్నో నేర్చుకుంటారు. అందుకే ఆర్ధిక రంగంలో మహిళలు నిలవడం చాలా ముఖ్యం అంటాను. అనేక రంగాల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చి, ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానాన్ని ఆక్రమించి అమెరికానే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ” అంటున్నారు కల్పన.

కల్పనకు ప్రేరణ ఇచ్చిన అంశాలివే

రోజువారీ సమాజంలో వస్తున్న మార్పులే.. కల్పనకు ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించేలా ప్రేరేపించాయి. “నేను మార్చిన ప్రతీ వ్యక్తి... సమాజంలో మార్పునకు కారణమవుతారు. సమాజాన్ని మార్చాలంటే.. ప్రతీవారు వ్యక్తిగతంగానూ కష్టపడాలి. అనేక మంది విభిన్న మనస్తత్వాలు కలవారు ఒకచోట పనిచేసే అవకాశాన్ని కల్పించే సంస్థలు, వ్యవస్థలు సమాజానికి ప్రతిరూపాలు”అంటారు కల్పన.

తానెంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా.. స్వయంగా ప్రతీ రోజూ ఎంతోకొంత నేర్చుకోవడం, మార్చుకోవడం, అర్ధవంతమైన జీవితాన్ని గడపడం, అందించడం తనకు ఎంతో సంతోషం కలిగించే విషయంగా చెబ్తారు కల్పన. ఏదైనా వర్క్‌షాప్ నుంచి ఎవరైనా స్నేహితురాలు ఫోన్ చేసి అభినందించడమే ఘనతగా భావిస్తారామె. “వీలైనంత ఎక్కువమంది మహిళల్లో ప్రేరణ కలిగించడం, వారి జీవితాల్లో వెలుగులు చూడడమే నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంద”ని చెబ్తున్నారామె.

మహిళలందరూ తనకూ రోల్ మోడల్సే అంటున్నారు కల్పన. ఎప్పుడూ బిజీగా ఉండే వర్కింగ్ ఉమెన్, సక్సెస్ సాధించి మహిళా పారిశ్రామికవేత్త, ఇంటిని సమర్ధవంతంగా నిర్వహించే గృహిణి, తన ఇంట్లో పని చేసే మహిళలు, ఆర్థికంగా వెనుకబడ్డ సమాజం నుంచి ఇప్పుడే ఎదుగుతున్న ఆంట్రప్రెన్యూర్స్.. ఇలా అందరూ తనకు రోల్ మోడల్స్‌గా చెబుతారు కల్పన.

మద్దతిచ్చే కుటుంబమే విజయానికి ఆలంబన

కల్పన తటవర్తి నిర్వహించే కార్యకలాపాలకు ఆమె భర్త, పిల్లలు మద్దతుగా నిలుస్తున్నారు. ఎంతో గర్వంగా ఫీలవుతారు. ఆమె నిర్వహించే అనేక కార్యకలాపాల్లో వారు స్వచ్ఛందంగా భాగస్వాములవుతారు కూడా. కల్పన భర్త కూడా అనేక విధాలుగా ఆమెకు సాయం చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినులకు మ్యాథ్స్ బోధించడం వంటివి చేస్తుంటారు. ‘రేప్‌లను నిరోధించడం’అనే అంశంపై.. కల్పన 16 ఏళ్ల కుమారుడు స్కూల్‌లో ఒక థీసిస్ సబ్మిట్ చేశాడు. పాఠశాలల్లో లింగవివక్షపై పలు కార్యకలాపాలు నిర్వహించబోతున్నాడు అతను. అలాగే ఓహియోలోని కాలేజ్‌‍లో చదువుతున్న ఆమె 20 ఏళ్ల కూతురు... బిలియన్ డాలర్ నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించడం విశేషం.

“ సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. కుటుంబాలు ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే మేల్కొంటే.. అనేక సమస్యలు ఏర్పడకుండా నిరోధించనవారమవుతాం. ప్రతీ ఇంట్లోనూ రాత్రి పూట అందరూ భోజనం చేసే సమయంలో... మహిళలు, పురుషులు సమానమే అని వారి పిల్లలకు బోధిస్తే... ఈ సమాజంలో పెనుమార్పులు తీసుకురావచ్చ”ని చెబ్తున్నారు కల్పన.
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags