చౌక ధరల్లో ఏసి బస్సు ప్రయాణం - సక్సెస్ అయిన 'సిటీఫ్లో' కాన్సెప్ట్

By Sri
13th Nov 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

జీవితమే ఓ ప్రయాణం అంటారు. కానీ కొందరికి అలా కాదు. ప్రయాణమే జీవితమైపోతుంది. పొద్దున్నే ఆఫీసుకెళ్తే... తిరిగి ఇంటికొచ్చేసరికి ఏ రాత్రో అవుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి సంగతి పక్కన పెడితే... ప్రయాణంలో అంతకు మించిన ఒత్తిడి విసుగుతెప్పిస్తుంది. ముంబైలాంటి మహానగరంలో ఓ పది కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేయాలంటే చుక్కలే కాదు గ్రహాలు కూడా కనిపిస్తాయి. రద్దీగా ఉండే బస్సులో చెమటలు కక్కుతూ గమ్యం చేరుకునే లోగా ఒంట్లో శక్తి అంతా ఆవిరైపోతుంది. ఉదయాన్నే ఇంటి దగ్గర బయల్దేరి ఆఫీసుకి చేరుకునేలోగా అలసిపోతున్నారు. ఇలా ముంబైకర్లు రోజూ పడుతున్న కష్టాలకు చెక్ చెబుతోంది సిటీఫ్లో. ప్రయాణికుల జేబులకు భారం కాకుండా ప్రభుత్వ బస్సుల ఛార్జీలకు సమానంగా వసూలు చేస్తూ ఏసీ బస్సుల్లో ప్రయాణాన్ని అందిస్తోంది. కేవలం నగర పరిధిలోనే వేర్వేరు రూట్లలో బస్సులను నడుపుతున్నారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తున్న సిటీ ఫ్లోకి ఫుల్ డిమాండ్ పెరిగింది.

ప్రయాణమే ఓ జీవితం

జెరీన్ వీనద్... ముంబై ఐఐటీ గ్రాడ్యుయేట్. గతంలో Ernst & Young కోసం పనిచేశారు. తన సహోద్యోగులు ముంబై లోకల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ గురించి చేసే ఫిర్యాదులు వినీవినీ అతడికి విసుగొచ్చింది.

"ప్రయాణం ప్రతీ ఒక్కరికీ పెద్ద సమస్య. నిత్యం లక్షలాది మందిని వేధిస్తున్న సమస్య. గతంలో నేను నా ఆఫీసుకు వెళ్లాలంటే కనీసం రెండు గంటలు ప్రయాణించాల్సి వచ్చేది. తిరిగి ఇంటికెళ్లేసరికి బాగా అలసిపోయేవాడిని. వెంటనే నిద్రపోయేవాడిని. మళ్లీ నిద్రలేవడం... మరుసటి రోజూ అదే దినచర్య. నా ఒక్కడికే కాదు... చాలా మందికీ ఇదే సమస్యని నాకు తెలుసు" అంటారు జెరీన్.

పోనీ ఈ ప్రయాణ కష్టాలకు చెక్ చెప్పేందుకు క్యాబ్ తీసుకెళ్లాలంటే చాలా ఖర్చవుతుంది. ఆఫీసులకు వెళ్లేవాళ్లు రోజుకు రెండుసార్లు క్యాబ్ తీసుకెళ్లాలంటే జీతంలో సగం డబ్బులు ప్రయాణానికే ఖర్చయిపోతాయి. మధ్యతరగతి ఉద్యోగులకు ఈ అవకాశమే ఉండదు. స్వయంగా ఈ సమస్యను ఎదుర్కొన్న జెరీన్... తన ఐఐటియన్ స్నేహితులతో కలిసి పరిష్కారం కోసం ఆలోచించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రూట్లల్లో ప్రైవేట్ మినీ ఏసీ బస్సులను నడిపితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వీరికి. అంతే... ఈ ఏడాది ప్రారంభంలో జెరీన్ Ernst & Youngలో జాబ్ మానేశాడు. తన ఐడియాపై కసరత్తు చెయ్యడం మొదలుపెట్టాడు. స్వయంగా ప్రయాణికుల్ని కలిసి ఆఫీసులకు వెళ్లడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నాడు. తన ఐడియాకు తగ్గట్టుగానే వారి ఆలోచనలున్నాయని జెరీన్ కు అర్థమైంది.

సిటీఫ్లో టీమ్

సిటీఫ్లో టీమ్


సిటీఫ్లో టీమ్

ఈ ఐడియాపై ఉన్న నమ్మకంతో ముంబైలో సెప్టెంబర్ 2015లో సిటీ ఫ్లోని ప్రారంభించాడు. జెరీన్‌తో పాటు అంకిత్ అగర్వాల్, సుభాష్ సుందర వడివేలు, రుషబ్ షా, అద్వైత్ విశ్వనాథ్, సంకల్ప కేల్షికర్‌లు స్టార్టప్‌కి సపోర్ట్ గా నిలిచారు. పొవైకి చెందిన Housing.com కో-ఫౌండర్ అద్వితీయ శర్మ... ఈ స్టార్టప్ మార్గదర్శకుడు. హ్యాండీహోమ్ తర్వాత ఆయన మెంటార్‌గా నిలుస్తున్న రెండో స్టార్టప్ ఇది.

"రియల్ ఎస్టేట్ సమస్యల్లాగానే బస్సు ప్రయాణికుల సమస్యలు అంతటా ఉన్నవే. కొన్నేళ్లుగా ఈ రంగంలో ఎలాంటి ఆవిష్కరణలు లేకపోవడంతో ఈ స్టార్టప్ పై నాకు ఆసక్తిని పెంచింది" అంటారు అద్వితీయ శర్మ.

ముంబైలోని పది దారుల్లో సిటీ ఫ్లో బస్సుల్ని నడుపుతోంది. ప్రముఖ ప్రాంతాలు, కార్యాలయాలు ఎక్కువగా ఉండే ఏరియాలను కనెక్ట్ చేస్తూ రూట్లను ఎంపిక చేసింది. పశ్చిమ శివారు ప్రాంతాలైన మీరా భయాందర్, బోరివలి, కాందీవలి, తూర్పు శివారు ప్రాంతాలైన థానె, ములుంద్, నవీ ముంబైలోని వాషి, ఖోపర్ ఖైరేన్ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకూ బస్సులు ఉంటాయి. ఇటీవల అంధేరీకి కూడా రూట్లను నడుపుతున్నారు. అయితే వీరికి రూట్లను ఎంపిక చెయ్యడంలో సమస్యలున్నాయి. టెక్నాలజీ సాయంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటున్నారు.

"ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించడానికి గూగుల్ మ్యాప్స్ బాగా ఉపయోగపడుతోంది. ఎక్కువ జన సాంద్రత ఉన్న ఏరియాలను మేం గుర్తించాం. కార్పొరేట్ హబ్స్, నివాస ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని రూట్లను నిర్ణయిస్తున్నాం. రవాణా సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రాంతాలపై మరింత దృష్టిపెడుతున్నాం. అందుకే ప్రయాణికుల నుంచే కొత్త రూట్ల గురించి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం" అంటారు జెరీన్.

సిటీ ఫ్లో ఎలా పనిచేస్తుంది ?

సిటీ ఫ్లో పనిచేస్తున్న విధానం చూస్తే ఫణీంద్ర సామ ప్రారంభించిన రెడ్ బస్ గుర్తొస్తుంది. కాకపోతే... సిటీ ఫ్లో నగరం లోపల మాత్రమే బస్సుల్ని నడుపుతుంది. ఇక్కడ టికెట్ బుకింగ్ కోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మూడంటే మూడు క్లిక్స్‌తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ముందు రూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రయాణ సమయాన్ని సెలెక్ట్ చేసి బుక్ చేస్తే చాలు. ఒకే రూట్ లో రోజూ వచ్చే ప్రయాణికుల కోసం రీసెంట్ రైడ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో బుకింగ్ మరింత వేగవంతం అవుతుంది. ప్రైవేట్ బస్సుల యజమానులు సిటీలోపల బస్సుల్ని నడపడం చాలా తక్కువ. చాలావరకు కంపెనీలే వారి సిబ్బంది కోసం నగరం లోపల బస్సులు నడుపుతున్నాయి. బస్సుల యజమానులకు సిటీ ఫ్లో ద్వారా వారి బస్సులను వేర్వేరు దారుల్లో మరింత సమర్థవంతంగా నడిపేలా సిటీఫ్లో సాయపడుతోంది. ప్రస్తుతం ముంబైలో పది బస్సు ఆపరేటర్లతో ఈ స్టార్టప్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతీ వారం ఈ సంఖ్య పెరుగుతోంది అంటున్నారు జెరీన్.

ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్‌గా సిటీ ఫ్లో

భారతదేశంలో ట్రావెల్ అండ్ టూరిజం మార్కెట్ విలువ 42 బిలియన్ యూఎస్ డాలర్లు. కనీస వార్షిక వృద్ధి రేటు వచ్చే పదేళ్ల పాటు 10.2 శాతం వృద్ధి ఉంటుందని ఓ అంచనా. మొత్తం బుకింగ్‌లల్లో ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్స్‌వే 17.5 శాతం ఉంటాయి. ఈ లెక్కన సిటీ ఫ్లో ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్‌లానే పనిచేస్తున్నట్టే. redBus, iBibo, cleartrip, makemytrip లతో పోటీ పడుతోంది. దేశంలో ఇంట్రా సిటీ బస్ బుకింగ్స్‌లో మరో నాలుగు పోటీ సంస్థలున్నాయి. ముంబై నుంచే rBus ఉంది. గుర్గావ్‌కు చెందిన స్టార్టప్స్ Shuttl, Zipgo కూడా ఉన్నాయి. ఓలా కూడా ఇటీవల బస్సుల రంగంలోకి ఓలా షటిల్ పేరుతో అడుగుపెట్టింది. 

సిటీ ఫ్లోలో టికెట్ల ధర కిలోమీటర్‌కు 3 రూపాయలు. ఇప్పటివరకు బుక్ చేసిన టికెట్ల సగటు అరవై రూపాయలు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు నడిపించే లోకల్ సిటీ బస్సుల్లో టికెట్ ధరలతో సమానంగా సిటీ ఫ్లో ఏసీ బస్సుల ప్రయాణ ఛార్జీలు ఉంటాయి. ప్రస్తుతం ఈ స్టార్టప్ లో రోజుకు 1800 సీట్లు బుక్ అవుతున్నాయి. ఈ స్టార్టప్ కు పెద్దపెద్ద పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలో ఫస్ట్ రౌండ్ ఫండింగ్ పూర్తయ్యేట్టు ఉంది.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India