సంకలనాలు
Telugu

ఏం సాధించాలో తెలిస్తే, ఎలా సాధించాలో నేర్పుతారు!

ఉద్యోగాలకు కావలసిన తెలివితేటలు మప్పే 'తలేరంగ్‌' భారతీయ యువతకు భవిష్యత్తు చూపుతున్న శ్వేత రైనా

team ys telugu
23rd Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

శ్వేత రైనా అందరిలా ఆలోచించే ఆంట్రప్రెన్యూర్‌ కాదు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూలు నుంచి వచ్చిన శ్వేతకు చాలా అంచనాలున్నాయి. దేశంలో సుశిక్షితులైన కార్యవాహకులు లేరని గుర్తించింది. సంస్థలు తమకు కావలసిన సిబ్బందిని ఎంచుకునే అవకాశం లేదని లెక్కలు వేసింది. అంతే, ఇండియాకి తిరిగి వచ్చేసి తలేరంగ్‌ పేరుతో ఒక కొత్త వెంచర్‌ని ఆరంభించింది.

అండర్‌గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ నిమిత్తం బ్రౌన్‌ యూనివర్సిటీలో చేరేనాటికి ఆమె వయసు 17 ఏళ్లు! అప్పటికి ఆమెకెలాంటి ఆలోచనలు లేవు. ఆ ఈడు పిల్లలందరికిలానే శ్వేత కూడా చాలా ఇంటర్న్‌షిప్‌లు తీసుకుంది. కొంతకాలం న్యూయార్క్‌లోని మెకెన్సే అండ్‌ కోలో పనిచేసింది. ఆ తర్వాత టీచ్‌ ఫర్‌ ఇండియా, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ సంస్థల్లో పనిచేసినప్పుడే తలేరంగ్‌ ఐడియా తట్టింది.

విద్యార్థుల ఆలోచనలకు మెరుగుపెడ్తున్న శ్వేతా రైనా

విద్యార్థుల ఆలోచనలకు మెరుగుపెడ్తున్న శ్వేతా రైనా


ఆ ఐడియా వివరాల గురించి శ్వేతను అడిగాం.

యువర్ స్టోరీ - అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? కొత్త కంపెనీ పెట్టాలని ఎందుకు అనిపించింది ?

శ్వేత : నా అండర్‌గ్రాడ్యుయేట్‌ చదువు కేవలం జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాను అనేదానిపైనే సాగింది. వేసవి సెలవుల్లో ఫ్రాన్స్‌లోని ఒక కమ్యూనికేషన్‌ ఫర్మ్‌లో పనిచేశాను. మరో వేసవిలో ముంబై వచ్చి ఒక బ్యాంక్‌ కోసం పనిచేశాను. తదుపరి సమ్మర్‌లో అమెరికాలోనే గోల్డ్‌మేన్‌ సాచ్స్‌లో గడిపాను. గ్రాడ్యుయేషన్‌ అనంతరం న్యూయార్క్‌లోని మెకెన్సేలో చేరాను. అక్కడ నేను చేసిన పని ఆషామాషీ కానప్పటికీ, కొంతకాలానికి నా వాస్తవ గమ్యం సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వైపేనని గ్రహించాను.

ఆ సమయంలో మెకెన్సే వారు టీచ్‌ ఫర్‌ ఇండియాతో కలిసి పనిచేస్తున్నారు. టీచ్‌ ఫర్‌ ఇండియా గురించి నెట్‌వర్క్‌ ద్వారా తెలుసుకున్నాను. ఇండియాకి వచ్చి సిఈవోని కలిశాను. ఆమె నన్ను టీచ్‌ ఫర్‌ ఇండియా మొదటి బృందంలోకి తీసుకున్నారు. వారి మార్కెటింగ్‌ను, నియామకాలను ఏకకాలంలో నిర్వహించాను. దీని నిమిత్తం దేశవ్యాప్తంగా 100 కాలేజీ క్యాంపస్‌లను తిరిగాను. టిఎఫ్‌ఐ ఫెలోషిప్‌ తీసుకొమ్మని వాళ్లను ఒప్పించడమే నా బాధ్యత.

బహుశా ఆ ప్రయాణ సమయాల్లోనే తలేరంగ్‌ ఆలోచనకు బీజం పడిందేమోననిపిస్తుంది. వందలాదిమంది ఇంజనీర్లు, లా, హ్యుమానిటీస్‌ విభాగాలకు చెందిన యువతను కలిశాను. నిజంగానే భారతీయ యువతకు జీవితంపట్ల అవగాహన లేదు. జీవనోపాధికి ఏ మార్గాన్నెంచుకోవాలనే స్పష్టతకూడా లేదని గ్రహించాను. ఒక మంచి కాలేజీలో చేరినంతమాత్రాన మీ జీవితం స్థిరపడిపోయినట్లు కాదు. నేను హెచ్‌బిఎస్‌లో ఉన్నప్పుడు ఒక సమ్మర్‌ని హిందుస్తాన్‌ యూనిలీవర్‌లో గడిపాను. ఆ సమయంలో నేను సర్వీస్‌ టీమ్‌ సభ్యులు చాలామందితో ముచ్చటించాను. వాళ్లంతా చాలా తెలివైనవాళ్లు. కానీ, వాళ్లు చదువుకున్న చదువు... ఎంచుకున్న బాధ్యతలకు అనువుగా తీర్చిదిద్దలేదు. విభిన్న పరిస్థితులను తమకు అనుకూలంగా ఎలా మలచుకోవాలో వివరిస్తూ, సర్వీస్‌ సెంటర్‌లోనే శిక్షణ నిర్వహించాను.

హిందుస్తాన్‌ లీవర్‌ నుంచి వచ్చాక, తిరిగి హార్వార్డ్‌ బిజినెస్‌ స్కూలుకి వెళ్లిపోయాను. నా అదృష్టం కొద్దీ నా ఆలోచనలను ప్రోత్సహించగల ప్రొఫెసర్‌ ఒకరు దొరికారు. ఇండియాలో పని-సామర్థ్యత సమస్యను అధిగమించడానికి ఆయన నాతోపాటుగా కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నారు. మేము ప్రయోగపూర్వకంగా ఇండియాలోని కొన్ని కాలేజీల్లో పైలట్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించాం. అదే తలేరంగ్‌కి ప్రాథమిక దశ. విభిన్న తరహాలో ఉక్కిరిబిక్కిరి చేసే అనుభవాలద్వారా సమర్థవంతమైన, నైపుణ్యమైన శ్రామికశక్తిని అభివృద్ధి చేయాలన్నది మా తలేరంగ్‌ లక్ష్యం.

image


ఇంతవరకు సాగిన ప్రయాణం ఎలా ఉంది ?

శ్వేత - మొదట్లో నా తీరు కొత్త కంపెనీ ఆరంభించామన్నట్టుగా ఉండేది. అందువల్ల అందుకు తగ్గట్టుగానే పనిచేశాను. తలేరంగ్‌ ద్వారా మొట్టమొదటి రోజునుంచే సామాజిక ప్రభావం చూపగలిగే స్థిరమైన వ్యాపారంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాను. మా లక్ష్యం ప్రభావపూరిత దశలో ఉండగానే రెవెన్యూ ఆశావహంగా ఉన్నందున ఊహించని స్థాయిలో నాకు సంతృప్తి కలుగుతోంది. మేము నీడ్‌-బ్లైండ్‌ పద్ధతిని అవలంబిస్తున్నాం. అంటే, ఆర్థిక స్తోమత లేని కారణంగా అభ్యర్థులను తిప్పిపంపకూడదన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. దీనివల్ల వత్తిడి ఏర్పడినా దేని విలువ దానిదే !

రాబోయే మూడు నుంచి అయిదేళ్లలో జాతీయస్థాయిలో ఎదగాలన్నది మా ప్రణాళిక. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీలలో మా సంస్థ పనిచేస్తోంది. వచ్చే మూడేళ్లలో 10,000 మందికి పైగా విద్యార్థులను, కార్పొరేట్‌ ఉద్యోగులను చేర్చుకోవాలనుకుంటున్నాం. ఇందుకుగాను వేర్వేరు రకాలను రూపొందిస్తున్నాం. మొత్తమ్మీద మా ప్రోగ్రాం ద్వారా మా స్టూడెంట్‌ ఎవరైనా మంచి ఉద్యోగం సంపాదించాడంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే, సరైన ఉద్యోగం-చేతినిండా డబ్బు అనేవి మనిషికి ఎనలేని సంతోషాన్నిస్తాయి.

image


తలేరంగ్‌ శిక్షణ పద్ధతిని చెప్పండి ? దీనిద్వారా ఉద్యోగాలకు సంసిద్ధులయ్యేలా అభ్యర్థులను ఎలా తీర్చిదిద్దగలరు ?

యువతకు స్పష్టత లేకపోవడమనేది పెద్ద లోపం. వాళ్లు చేరిన ఆరు నెలలకే వెళ్లిపోతుంటారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా మళ్లీ మళ్లీ మారుతూనే ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ సంస్థలన్నిటిలోనూ పరిపాటిగా మారిపోయింది.

మా ఫస్ట్‌ మాడ్యూల్‌లో వ్యక్తిగత అవగాహనను ఏర్పరుస్తాం. వారు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తదుపరి మాడ్యూల్‌లో వారి విలువలు, విజన్‌ వంటి అంశాలపై ఉంటుంది. ఈ రెండు సెషన్లు గ్రూప్‌ థెరపీలాంటివి. ఇది ఇండియాకి చాలా కొత్త పద్ధతి. ఈ సెషన్లలోనే చాలామంది ఉద్వేగానికి గురవుతుంటారు. ఏడ్చేస్తుంటారు. వాళ్లలో చాలా తెలివి, చొరవ ఉన్నవాళ్లు ఉంటారు. అయినప్పటికీ, తమ గురించిగానీ, తాము చేయాలనుకునేదాని పర్యవసానాల గురించిగానీ గతంలో వాళ్లు దృష్టి పెట్టి ఉండరు. అలాంటివాళ్లు మా దగ్గర చేరి, తమనుతాము పూర్తిగా మార్చేసుకున్నారు. నా వరకూ ఇది చాలా అర్థవంతమైన మార్పుగా అనిపిస్తుంది.

తర్వాత మాడ్యూల్స్‌... నీ గురించి నీవు తెలుసుకో, నీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో గ్రహించు ? అనే అంశాలపై ఉంటాయి. ఉదాహరణకు, మనం చాలా చక్కగా మాట్లాడగలం, రాయగలం, మంచి కమ్యూనికేషన్‌ కలిగి ఉన్నాం. అలాంటివారికి మా దగ్గర 'వర్కింగ్‌ స్మార్ట్‌' మాడ్యూల్‌ ఉంది. ఇది ప్రాధాన్యతా క్రమం, సమస్యల పరిష్కారం, లక్ష్య నిర్దేశానికి చెందినది. దీనిద్వారా ఉద్యోగం ఎలా పొందాలి, రెజ్యుమె ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ స్కిల్స్‌ ఏమిటి, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌ వాడడం ఎలా వంటివి బోధిస్తాం. నెట్‌ వర్కింగ్‌ ఈవెంట్‌లో కలిసినవారితో సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలనేదికూడా నేర్పిస్తాం. ఇవన్నీ కెరీర్‌ పురోగతికి అత్యంత విలువైన నైపుణ్యాలు.

శిక్షణ అనంతరం, మా స్టూడెంట్లను ఇంటర్న్‌షిప్‌ నిమిత్తం కొన్ని సంస్థలకు పంపుతాం. అక్కడ తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకుంటారు. దేశంలోని అగ్రశ్రేణి అండర్‌గ్రాడ్యుయేట్‌ యూనివర్సిటీలలో చదివే విద్యార్థులలో సగంమందికి ఇంటర్న్‌షిప్‌ దక్కదు. దీనివల్ల వర్క్‌ కల్చర్‌ తెలిసే అవకాశమే లేదు. ఇదీ ఇండియాలోని వాస్తవ పరిస్థితి. మనం ఉన్నత విద్యావంతులను ఆరితేరిన ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags