ఉదయం భిక్షాటన.. మధ్యాహ్నం కాలేజీ..!! లా చదువుతున్న ఓ బెగ్గర్..!!

ఉదయం భిక్షాటన.. మధ్యాహ్నం కాలేజీ..!! లా చదువుతున్న ఓ బెగ్గర్..!!

Tuesday January 05, 2016,

2 min Read

సాధించాలన్న తపన ఉండాలే గానీ అసాధ్యమంటూ లేదు. ఒక యాచకుడు లా కోర్సు చదువుతున్నాడంటే నమ్మశక్యం కాదు. పేదరికం వెక్కిరించినా, దేవుడు శారీరక లోపం పెట్టినా- అతడు కించిత్ భయపడలేదు. నల్లకోటు వేసుకోవాలన్న కల కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతున్నాడు.

image


చదువంటే ప్రాణం..

జైపూర్ లో శివ్ సింగ్ అంటే ఎవరికీ తెలియదు. బెగ్గర్ శివ్ సింగ్ అంటే ఇట్టే గుర్తుపడతారు. వయసు 48 ఏళ్లు. ఉదయం పూట జైపూర్ వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. వచ్చిన నాలుగు డబ్బులతో కడుపు నింపుకుంటాడు. మధ్యాహ్నం మూడు అయిందంటే సీన్ రాజస్థాన్ యూనివర్సిటీ కాలేజ్ కు మారుతుంది. అక్కడ అందరిలాగే శివ్ సింగ్ కూడా ఒక స్టూడెంట్! ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. భుజానికి చిరుగుల సంచి. అందులో కాసిన్ని పుస్తకాలు. తోటి విద్యార్థులు కూడా శివ్ సింగ్ ఒక బెగ్గర్ అంటే నమ్మలేకపోతున్నామంటారు. క్లాసులో సిన్సియర్ గా ఉంటాడని, క్లాసు లేనప్పుడు లైబ్రరీలో బుద్ధిగా చదువుకుంటాడని చెప్తారు. ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ కాడని సహ విద్యార్థులు అంటున్నారు.

పేదరికం నుంచి..

శివ్ సింగ్ ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కన్నవారు కాయకష్టం చేసి శివ్ సింగ్ కు చదువు చెప్పించారు. గంగాపూర్ గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ దాకా చదివాడు. ఆర్థిక ప‌రిస్థితుల వ‌ల్ల చ‌దువు అక్క‌డితో ఆగిపోయింది. తర్వాత శివ్ సింగ్ కు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయితే రెండు చేతులూ పనిచేయకపోవడంతో శివ్ సింగ్ కు ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. దాంతో ఇల్లు గ‌డ‌వ‌డం క‌ష్ట‌మైంది. చివ‌రికి భార్యాబిడ్డలు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. వేరే దారిలేక శివ్ సింగ్ యాచకుడిగా మారాడు.

ఏదైనా పనిచేసుకొని బతకొచ్చుగా అని జనం ఎత్తిపొడిచేవారు. అడుక్కోవడానికి సిగ్గులేదా అని తిట్టిపోసినవాళ్లూ లేకపోలేదు. దేవుడు తనకు చేసిన అన్యాయానికి శివ్ సింగ్ లోలోపల కుమిలిపోయేవాడు. ఆ దుఃఖంలో నుంచే కసి పెరిగింది. సాధించాలన్న తపన మొదలైంది. ఎలాగైనా చదివి తీరాలనుకున్నాడు. పైసా పైసా కూడబెట్టి లా పుస్తకాలు కొన్నాడు. అతి కష్టమ్మీద రాజస్థాన్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. లా పూర్తి చేసి, నల్లకోటు వేసుకోవాలన్నదే అతడి లక్ష్యం. దాని కోసం ఎవరేమనుకున్నా పట్టించుకోనంటాడు శివ్ సింగ్. నిజంగా ఇలాంటి వాళ్లే అసలైన స్ఫూర్తి ప్రదాతలు.