రండి సర్ ఎక్కండి..! హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ బస్ !!

Tuesday February 23, 2016,

4 min Read

సీన్ నెంబర్ 1:

బేగంపేట రైల్వే స్టేషన్. సమయం ఉదయం 9.50. లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళ్లే ఎంఎంటీఎస్ రైలు ప్లాట్ ఫారం మీద ఆగింది. అరనిమిషంలోనే ట్రైన్ ఖాళీ అయిందా అన్నంత దిగారు జనం. ఒకటీ రెండు తప్ప అన్ని కంపార్టుమెంట్లు రిలాక్స్.

సీన్ నెంబర్ 2:

ఉప్పల్ డిపో. టైం ఉదయం 8.45. 113(కే) మెట్రో లైనర్. డిపో నుంచి బస్టాపు దగ్గరికి వచ్చిందో లేదో- క్షణాల్లోనే జనం కిటికీలకు వేళాడారు. నిండుగర్భిణిలా బస్సు అపసోపాలు పడుతూ, ఉప్పల్ రింగురోడ్డు నుంచి వయా రామాంతపూర్, ఫీవర్ హాస్పిటల్ మీదుగా లక్డీకాపూల్ దాటుకుని, అమీర్ పేట చేరుకుని, కూకట్ పల్లి, మియాపూర్, చివరికి లింగంపల్లి దగ్గర ఆగింది. గంటన్నర- రెండు గంటల జర్నీ. మధ్యమధ్యలో ఎక్కేవాళ్లే కానీ, దిగేవాళ్లేరి?

సోమవారం నుంచి శనివారం దాకా ఆఫీస్ అవర్స్ లో సిటీలో ఇలాంటి సీన్లు ఎన్నని? ఇంత గందరగోళ ప్రయాణంలో భయ్యా నా షర్ట్ నలిగిపోతుంది.. బాస్ నా షూస్ తొక్కుతున్నారు.. అని అని అరిస్తే అది అరణ్యరోదనే.

ఇన్ని బస్సులు, ఇన్ని ఎంఎంటీఎస్‌ ట్రిప్పులున్నా సౌకర్యవంతమైన ప్రయాణం మాత్రం అందని ద్రాక్షే. దాదాపు కోటి జనాభాగల నగరంలో ఇంతకు మించిన సుఖప్రయాణం ఆశించడం కూడా అత్యాశే. పోనీ ఆటోలోనో, క్యాబ్‌లోనే వెళ్దామంటే నెలలో ఎన్ని రోజులని ఖర్చు భరించాలి. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు, 15వేల బొటాబొటి జీతంలో వెళ్లదీసే సగటు ఉద్యోగి తట్టుకోగలడా?

హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మందికిపైగా ఐటీ ఎంప్లాయిస్ ఉన్నారు. అందులో దాదాపు 60 వేల మంది లేడీసే. వాళ్ల కోసం కొన్ని సంస్థలు క్యాబ్ సర్వీస్‌లు ఏర్పాటు చేసినా, అంతటా ఆ సదుపాయం లేదు. ఫలితంగా మెజార్టీ ఎంప్లాయిస్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ నే నమ్ముకున్నారు. ఆఫీసు దగ్గర్లో ఉన్నవాళ్లు బైకులను నమ్ముకున్నారు. కానీ 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ల పరిస్థితేంటి? అన్నన్ని డబ్బులు తగలేసి రోజూ క్యాబుల్లో, ఆటోల్లో తిరగాలంటే పర్సు వుంటుందా చిల్లుపడి పోతుందా? అప్ ఒక్కటే కాదు.. డౌన్ కూడా సేమ్ సిట్యువేషన్.

అందుకే ఈ సమస్యకు పరిష్కారం చూపింది ఈజీ కమ్యూట్. ఇది మొబైల్ బేస్డ్ బస్ సర్వీస్. ముఖ్యంగా ఐటీ పీపుల్ ఆఫీస్ ప్రయాణాన్ని సులభతరం చేసిందీ స్టార్టప్. టైంకి ఆఫీసులో దించి, మళ్లీ టైంకి ఇంట్లో దించే అద్భుతమైన ట్రాన్స్ పోర్టు సిస్టమ్. మొత్తం 18-19 రూట్లలో సర్వీసులున్నాయి.

బస్సులు తిరిగే రూట్లు ఇవే..

నిజాంపేట్ –ఇనార్బిట్ మాల్: వివేకానందనగర్-విప్రో: ఎల్బీ నగర్–విప్రో: అమీర్ పేట-విప్రో: ప్రగతినగర్–విప్రో: మీనాక్షి టవర్స్– రామాంతపూర్: ఇనార్బిట్ మాల్–జేఎన్టీయూ: విప్రో-వివేకానందనగర్: రాంనగర్-మీనాక్షి టవర్స్: నాగోల్–కొండాపూర్ ఆర్టీవో ఆఫీస్: ఎల్బీనగర్-విప్రో: విప్రో-ప్రగతి నగర్: ఇనార్బిట్ మాల్-నిజాంపేట్: కొండాపూర్ ఆర్టీవో ఆఫీస్-నాగోల్: రామాంతపూర్-మీనాక్షి టవర్స్. మీనాక్షి టవర్స్-రాంనగర్: వనస్థలిపరం-విప్రో: కొత్తపేట్-మైండ్ స్పేస్. త్వరలో ఎల్బీ నగర్-విప్రో సర్వీసు రాబోతోంది.

సర్వీసులను వాడుకునేదెలా..?

ఏం లేదు. సింపుల్. మొబైల్లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. పికప్, డ్రాప్ పాయింట్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ దిగాల్సిన స్టాప్ ఆ రూట్లో లేకుంటే, యాప్ లోనే రూట్ సజెషన్ ఉంటుంది. దాని ద్వారా ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోవచ్చు. ఇక పేమెంట్ చేతికివ్వాల్సిన పనిలేదు. అంతా ఈ-వాలెట్ ద్వారానే. సీటు దొరకదు.. నిలబడాలి అన్న టెన్షన్ లేదు. ముందు బుక్ చేసి ఆ తర్వాత రైడ్ క్యాన్సిల్ అయినా ఏం ఫికర్ లేదు. యాప్ మెనూలో బోర్డింగ్ పాస్ మీద క్యాన్సిల్ రైడ్ కీ టాప్ చేస్తే చాలు. ఆటోమేటిగ్గా మీ బుకింగ్ రద్దవుతుంది. పదినిమిషాల ముందుగా చేస్తేనే రిఫండ్ వుంటుంది. ఆలోపయితే కష్టం. 

ఇక మీరు బస్ కోసం బస్టాపులో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. బోర్డింగ్ పాస్ బటన్ మీద.. ట్రాక్ యువర్ బస్ అని వుంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే మీరు ఎక్కాల్సిన బస్ ఎంత దూరాన వుందీ.. మీ పాయింటుకు ఎప్పుడొస్తుంది అనేది క్షణాల్లో తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ ఫెసిలిటీ మహిళలకు ఎంతో శ్రేయస్కరం. బస్టాపులో గంటల తరబడి నిలబడి, పోకిరీల వెధవ కామెంట్లు వినే ఖర్మ తప్పుతుంది. ఒకవేళ మీరు వచ్చేసరికి బస్ వెళ్లిపోయినా దిగలుపడాల్సిన పనిలేదు. తర్వాతి షటిల్ లో మీ సీటు మీకుంటుంది. అన్నట్టు మీ ఫ్రెండ్స్, కలిగ్స్, ఎవరికైనా మీరు ఈ బస్ సర్వీసును రిఫర్ చేస్తే- ప్రతీ ఒక్క రెజిష్టరుకు 10 క్రెడిట్ల చొప్పున మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. ఇప్పటికైతే సోమవారం నుంచి శుక్రవారం వరకే సర్వీసులున్నాయి. శని, ఆదివారాల్లో కూడా నడపాలనేది వీరి ఫ్యూచర్ ప్లాన్. ఒకవేళ మీరు వెళ్లే రూట్లో బస్ సౌకర్యమే లేదనుకోండి.. యాప్ లో సజెషన్ రూట్ ఉంటుంది. అక్కడ మీ స్టాప్ వివరాలను ఎంటర్ చేస్తే, వచ్చే ఎంట్రీల ఆధారంగా ఆ రూట్లో బస్ నడిపేందుకు ప్లాన్ చేస్తారు.

బస్సులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే..

కంప్లీట్ ఏసీ. హై స్పీడ్ వై-ఫై. హాయిగా పెండింగ్ పనులేమైనా ఉంటే ఆఫీసుకు వెళ్లేలోపే చేసుకోవచ్చు. టికెట్ రేటు ఏమంత కాస్ట్ కాదు. మంచి ఎకానమీలోనే ప్రయాణం. ప్రతీసారి డబ్బులు తీసివ్వడం, చిల్లర కోసం తంటాలు పడటంలాంటి జంజాటం లేదు. ట్రాన్సాక్షన్లన్నీ ఆన్ లైనే. మొబైల్ లో చిన్న యాప్ పడేస్తే చాలు.. ఆఫీసు ప్రయాణం హాయి. ఇకపోతే, బస్సులో సీటు పక్కా. నిలబడి పోవాలేమో అన్న టెన్షన్ ఉండదు. అన్నిటికంటే ముఖ్యమైంది సేఫ్ జర్నీ. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. రియల్ టైం ట్రాకింగ్ సిస్టమ్ అన్నిటికంటే ప్లస్ పాయింట్. బస్సు ఎక్కడుందీ, ఎప్పుడొస్తుందీ అనేది ఒక్క టచ్ తోనే తెలిసిపోతుంది.

ఈజీ కమ్యూట్ టీం

రాహుల్, మయాంక్ కలసి దీన్ని ప్రారంభించారు. దీనికి ముందు రాహుల్ ఓ సాఫ్ట్ ఆర్కిటెక్ గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి అయిన మయాంక్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ డొమైన్ లో పీహెచ్డీ చేశారు. బెంగళూరు జీఈలో పనిచేశారు. వీరితో పాటు మరో 12 మంది వర్క్ చేస్తున్నారు.

పోటీదారులు

ఈజీ మ్యూట్ లాంటి ట్రాన్స్ పోర్ట్ ని జనంలోకి తీసుకెళ్లడం అనుకున్నంత ఈజీకాదు. క్యాబ్స్ దగ్గరనుంచి ఆఫీసు ట్రాన్స్ పోర్టు దాకా ప్రతీది వీరికి పోటీయే. ఎటొచ్చీ కాస్ట్ విషయంలో తమదే చౌక బేరం. మార్కెట్ స్ట్రాటజీలో కలిసొచ్చే అంశం కూడా అదే అంటున్నారు రాహుల్.

ఫ్యూచర్ ప్లాన్స్

ప్రస్తుతం రోజుకి 170 నుంచి 180 రైడ్స్ ఉంటున్నాయి. వచ్చే నెలకల్లా ఇది 300 లకు చేరుతుందని అంచనా. ప్రతి 15 నిమిషాలకు ఒక షటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే 4 నెలల్లో 25 వేల యూజర్లతో రోజుకి ఎంతలేదన్నా మినిమం 2వేల రైడ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.