నాటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.. నేడు బి-స్కూల్ స్పాన్సర్
ప్రభుత్వ స్కూళ్లలో చదవడమంటే.. ఒకప్పుడు వానాకాలం చదువులని వెటకరించే వారు. సరైన సౌకర్యాలు లేక.. వర్షం వస్తే ఆ రోజు స్కూల్‌కి సెలవే. వాస్తవానికి ఇప్పటికీ అధిక శాతం ప్రభుత్వ స్కూళ్లలో అలాంటి ఇబ్బందే ఉంది. కార్పొరేట్ చదువులు రాని రోజుల్లో ఇలాంటి పాఠశాలల్లో చదివి ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్న వారు చాలామంది ఉన్నారు. ప్రైవేటు స్కూల్స్ తప్ప ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడని రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో మునిసిపల్ స్కూల్లో చదివి ఉన్నత స్థానానికి చేరిన సీమా కాంబ్లీ విజయగాథ ఇది.
అర్థం చేసుకోవడంకంటే నేర్పడంపైనే శ్రద్ధ
నాలెడ్జ్ కంటే అక్షరాస్యతకే ప్రాధాన్యత ఇచ్చే రోజులవి. అర్థం చేసుకోవడం కంటే నేర్పడంపైనే అప్పట్లో శ్రద్ధ ఎక్కువగా చూపేవారు. సీమా కాంబ్లీ విద్యారంగంలో అసమానతపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తాను చదివే స్కూల్లో కఠిన దండనలు ఉండేవి. చాలాసార్లు అలాంటి పనిష్మెంట్లూ తీసుకున్నారు. ఆమె కుటుంబం ఓ మురికివాడలో జీవించేది. అక్కడున్న పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రణగొణ ధ్వనులు, చిన్నచిన్న తగాదాలు. ఈ నేపథ్యంలో సీమా కాంబ్లీ చదువు సరిగా సాగేది కాదు. ఏకాగ్రత అనేది.. దివిటీ పెట్టి వెదికినా కనిపించేది కాదు.
ఐదో తరగతి చదివేటప్పుడు వర్లికి నివాసం మార్చేశారు సీమా ఫ్యామిలీ. ఆరో తరగతి నుంచి ఆమె ఎడ్యుకేషన్ స్టయిల్ మారిపోయిది. అప్పటివరకూ ఉన్న పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. వర్లీలో నెహ్రూ ఫ్లానెటోరియంలో వారు స్థాపించిన ఆకాంక్ష ఫౌండేషన్‌లో ఆరో తరగతిలో చేరింది. జీవితంలో ఏం సాధించాలో టీచర్లే నిర్దేశిస్తారు. వారి మార్గదర్శకత్వంలో మనం ముందుకి సాగాలంటారు సీమా. సామాజిక విలువలు, వ్యక్తిగత క్రమశిక్షణ ఎంతో ముఖ్యం అంటారామె. ‘‘నేను చదువుకునే రోజుల్లో మా టీచర్ రాజేశ్వరి ఎంతో బాగా చూసుకునేవారు. ఎన్నో విషయాలు నాకు బోధించేవారు. అప్పట్లో టీచర్‌ని దీదీ అంటే అక్క అని మగవారిని అయితే భయ్యా అంటే అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవారు.
ఉపాధ్యాయులంతా మాతో చాలా బాగా ఉండేవారు. విద్యారంగంలో ఉన్నత విలువలు సాధించాలంటే ఏం చేయాలో వారి దగ్గరే నేను నేర్చుకున్నాను అని చెబుతున్నారు సీమా.
మహారాష్ట్ర మునిసిపల్ స్కూల్స్‌లో ఒక పద్ధతి ఉండేది. సెవెంత్ క్లాస్ వరకూ మాత్రమే ఇంగ్లీషు మీడియం ఉండేది. దీంతో ఎనిమిదో తరగతి చదివేందుకు ఓ ప్రైవేటు స్కూల్‌కి వెళ్ళారు సీమా. మునిసిపల్ స్కూల్ ప్రమాణాల కంటే ప్రైవేటు స్కూల్ విద్యా ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే వాటిని అందుకోవడానికి సీమా ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. మళ్ళీ చిన్నచిన్న ఇబ్బందులు మొదలయ్యాయి. వాటిని ఎలాగోలా అధిగమించింది. ఆకాంక్ష స్కూల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఏ కారణం లేకుండానే స్కూల్‌కి డుమ్మా కొట్టేది సీమా. అప్పట్లో రాజేశ్వరి టీచర్ తర్వాత రోజు ఇంటికి వచ్చి మరీ తిట్టి క్లాస్‌కు తీసుకువెళ్ళేది. సీమా వాళ్ళ అమ్మతో చెప్పి స్కూల్‌కి పంపమని రాజేశ్వరి టీచర్ కోరేవారట. టీచర్ వెళ్ళాక అసలు కథ మొదలయ్యేది. తమ కుటుంబం గురించి, సీమాపై పెట్టుకున్నఆశల గురించి వివరంగా చెప్పేది. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవని, వాటిని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలని తల్లి చెప్పే మాటలు సీమాలో మార్పులు తీసుకువ చ్చాయి. అలా పదవతరగతి పూర్తిచేసింది సీమా కాంబ్లీ.
ఉదయం కాలేజ్ స్టూడెంట్ ....సాయంత్రం ట్యూషన్ టీచర్
టెన్త్ తర్వాత కాలేజ్‌లో చేరాక తన పని తాను చేసుకుంటూ పోవాలని అనుకోలేదు సీమా. సమాజానికి తాను ఏవైనా చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా ఉదయం కాలేజ్‌కి వెళుతూ.. సాయంత్రం పూట ఖాళీ టైంలో దగ్గరలో ఉన్న స్కూలుపిల్లలకి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది సీమా కాంబ్లీ. గతంలో తాను చిన్నదానిగా ఉన్నప్పుడు రాజేశ్వరి దీదీ చెప్పినట్టు, ఇప్పుడు సీమా దీదీ మారిపోయింది. ‘‘నేను ఓ టీచర్‌గా మారితే ఎంతో బావుంది. నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. ఉదయం కాలేజ్ నుంచి వచ్చాక ట్యూషన్ సెంటర్‌కి వెళితే తిరిగి వచ్చేది రాత్రి పది తర్వాతే. కాస్త అలసిపోయినట్టుగా అనిపించినా... ఈవిధంగా నాకు తెలిసింది పదిమందికీ నేర్పడం ఆత్మతృప్తిని ఇస్తోంది’’ అంటారు సీమా.
తాను గతంలో చదువుకున్న ఆకాంక్ష ఫౌండేషన్‌లో ఫుల్‌టైం జాబ్ సంపాదించింది. పబ్లిక్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్‌లో చేరిందామె. అప్పుడే తానూ ఓ బిజినెస్ స్కూల్ ప్రారంభించాలని అనుకుంది. అయితే అంతకంటే ముందు ఎంబీఏ చేయాలని షాహీన్ దీదీ పట్టుబట్టారు. ఆమె బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్. అంతేకాదు ఆకాంక్ష ఫౌండేషన్ ఫౌండర్ కూడా. బిజినెస్ స్కూల్ పెట్టాలంటే వ్యాపార సూత్రాలు తెలియాలని, అలాగే ఎంబీఏ డిగ్రీ అవసరమని ఆమె ఒప్పించారు. చివరకు దీదీ మాటలను వినక తప్పలేదు. అందులో ఫెలోగా జాయిన్ అవుతానని ఆమె అనుకోలేదు. 2009 లో ఎంబీయే చేయాలని పట్టుబడితే 2010 లో ఎంట్రన్స్ రాసింది సీమా. తన మూవ్‌మెంట్‌కి ఈ డిగ్రీ ఎలా అవసరమో షాహీన్ చాలా చక్కగా వివరించారు. దీంతో తనకు తప్పదన్నట్టు సీమా ఎంబీయే పూర్తిచేసింది. వెల్లింగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ద్వారా ఫెలోషిప్ కూడా అందుకుంది సీమా. ఆమెతో పాటు మరికొందరు పేద విద్యార్ధులు కూడా ఎంబీఏ చేసేందుకు ఆమె ప్రయత్నం చేసింది.
సీమా ఏకాసంతాగ్రాహి. ఆమెలో ఉన్న టాలెంట్‌ని గమనించిన విద్యార్ధులు ఆమెతో క్లాస్‌లు చెప్పించుకునేవారు. వారితోనే ఆమెకి సరిపోయేది. చివరకు చిన్న వయస్సులోనే ప్రిన్సిపల్ స్థాయికి చేరుకుంది. అయితే ఆ స్థానానికి తాను న్యాయం చేయగలనా అని ఆలోచించేది. ఎప్పటికప్పుడు తన నాలెడ్జ్‌ని పెంచుకుంటూ ముందుకు సాగిపోయేది.
స్టూడెంట్స్‌తోనే మమేకం
‘‘నా టైం అంతా నా స్టూడెంట్స్‌తోనే సరిపోయేది. వారితో అన్ని విషయాలు చర్చించేదాన్ని. బాగా చదివే విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇస్తూ.. కొత్తగా ఆలోచించాలని సూచిస్తాను. కరిక్యులం డిజైన్, ఫండింగ్ విషయాలు మాట్లాడేదాన్ని. అలా మా విద్యార్ధుల మదిలో మెదిలింది చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది నాకల. దాన్ని వారు నిజం చేశారు. ఈ స్టార్టప్ గురించి ప్రభుత్వ అధికారులకు తెలియచేశాం. మా వాళ్లు తయారు చేసిన చాక్టెట్లు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళంతా ఎంతో ఆశ్యర్యపోయారు. ఇదంతా మునిసిపల్ స్కూలు పిల్లలు చేశారంటే వారు నమ్మలేకపోయారు’’ అని చెప్పారు సీమా.
ప్రిన్సిపల్ నుంచి టీచర్‌గా
టీఎఫ్ఐలో నాతోపాటు చదువుకున్న గౌరవ్‌తో బిజినెస్ స్కూల్ విషయం గురించి చర్చించాను. అతనికి కూడా నిరుపేదల కోసం బిజినెస్ స్కూల్ ప్రారంభించాలని అనిపించింది. అయితే తానేం స్వంతంగా స్కూలు ప్రారంభించలేనని గతంలో చెప్పడం నాకు గుర్తుంది. అప్పటికే గౌరవ్ 3.2.1 అనే పేరుతో స్కూల్ ఉంది. నా ఆలోచన ఆయనకు బాగా నచ్చింది 2012 లో నా ప్రాజెక్టులో ఆయన భాగస్వామిగా చేరాడు. అప్పటికే నా హెల్త్ కండిషన్ బాగా లేదు. 3.2.1 స్కూల్స్‌లో కిండర్‌గార్టెన్ టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. అయితే తాను ఫుల్‌టైం టీచర్ జాబ్ చేయలేనని తేలిపోయింది. అయితే నా మైండ్‌సెట్‌ని గౌరవ్ మార్చేశాడు.
కిండర్‌గార్టెన్‌లో 120 మంది విద్యార్ధులు ఉంటారు. వీరికి మామూలు పాఠాలతో పాటు, మానవీయ విలువలు, మైండ్‌సెట్‌ను మార్చే పనిచేయాలి. సీమా ఇలాంటి పనే చేస్తోంది. 3.2.1 లో అకాడమిక్ హెడ్‌గా ఆమె బాధ్యతలు చేపడుతోంది. ఓ ప్రిన్సిపల్ బాధ్యతలకు దీనికి పెద్దగా తేడా లేదు. చాలామంది పెద్దవారికి బోధించడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ చిన్నపిల్లలకైనా, పెద్దల కైనా కొన్ని బోధనా పద్ధతులు మామూలుగా ఉంటాయి. మనదేశంలో విద్యారంగంలో అసమానతలు ఉన్నాయి. వాటిని రూపుమాపాలంటారు సీమా.
నిరుపేదలు చదువుకోవడానికి తగిన సదుపాయాలు లేవు, స్కూళ్ళలో పరిశుభ్రత లోపించింది. వారికి మంచి పౌష్టికాహారం లేదు. బాలారిష్టాలు భారతీయ విద్యావ్యవస్థలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు స్కూళ్ళు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పాతకాలం నాటి పద్ధతులే అమలులో ఉన్నాయి. వాటిని మార్చాల్సిన అవసరం ఉందంటారు సీమా కాంబ్లీ.
సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్ధులు తరచూ వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటప్పుడు ప్రతిరోజూ స్కూల్‌కు రావడం, చదువుమీద శ్రద్ధ పెట్టడం అనేది ఎలా సాధ్యం ? అంటారు సీమా. నెలకు ఐదువేలు సంపాదించే ఓ కుటుంబం తమ పిల్లలకు నాణ్యమయిన, ఉన్నతమయిన విద్య ఎలా అందించగలుగుతుంది?
దేవుడు కంటే గురువే ప్రధానం
టీచింగ్ అనేది ఓ వృత్తిలాంటిది. గురువుకు మన సంప్రదాయంలో ఎంతో విలువ ఉంది. ఒకానొక సందర్భంలో తాను ముందుగా ఎవరి పాదాలు పట్టుకోవాలో తెలీక తర్జన భర్జన పడతాడు ఓ విద్యార్ధి. అందరికంటే ముందు గురువు పాదాలు పట్టుకోవాలని ఓ క్లారిటీకి వస్తాడు. దేవుడు కంటే గురువు గొప్పవాడంటారు. సమాజంలో గురువుకు ఉన్న విశిష్టతకు ఈ ఉదాహరణ చాలంటారు సీమా కాంబ్లీ.
ఎందులోనూ సీటు రాకుంటే చివరి గమ్యంగా టీచింగ్‌ని మనవాళ్ళు ఎంచుకుంటారు. నిజానికి అన్ని కోర్సుల కంటే ఎంతో ఉన్నతమయింది టీచింగ్. టీచింగ్‌పై ఖర్చుపెట్టడం అంటే లాభదాయకం కాదని మన ప్రభుత్వాలు భావిస్తాయి. ప్రభుత్వ పథకాల్లోనూ, బడ్జెట్‌లోనూ విద్యారంగం, టీచర్లు అంటే చిన్నచూపే ఇప్పటికీ ఉందంటారు సీమా.
ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం వల్లనైనా నిరుపేద చిన్నారులకు కాసింత ప్రయోజనం కలుగుతుందంటారు. విద్యాహక్కుచట్టం పకడ్బందీగా అమలుచేయాలంటారు సీమా. పేద పిల్లలు చదువుకు దూరం కాకుండా చూడాలనేది సీమా ఆలోచన. విద్య అంటే కేవలం అక్షరాస్యత కాదు. బాగా చదవడం, రాయడం, మంచి విలువలు నేర్చుకోవడం.పిల్లల శారీరక, మానసిక వికాసానికి విద్య ఒక సాధనం అంటారు సీమా. మంచి విద్యార్ధి తయారవ్వాలంటే మంచి నైపుణ్యం కలిగిన టీచర్ ఉండాలి. ప్రభుత్వ పాలసీలు కూడా ఇలాంటి విద్యావిధానానికి చేయూత నివ్వాలంటారు సీమా.
ప్రభుత్వం మంచి విద్యావిధానాలు అమలుచేయడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా తమవంతు సాయం చేయాలి.టీచర్లు, నాయకులు, పారిశ్రామికవేత్తలు తమ సామాజిక బాధ్యతలను మరచిపోకూడదు. అన్ని రంగాలకంటే విద్యారంగంలో టీచింగ్‌కి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనేది సీమా ఆలోచన, అందుకు అనుగుణంగా మనందరి దృక్పథం ఉండాలంటారామె.
దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే అక్కడున్న విద్యావ్యవస్థను పరిశీలిస్తే తెలిసిపోతుందంటారు సీమా. నిజమే కదా...