సంకలనాలు
Telugu

గెలుపు నిర్వచనం చెబుతున్న వినయ్ భరద్వాజ్

SOWJANYA RAJ
7th May 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


వ్యక్తి విజయాన్ని ఎలా అంచనా వేస్తాం..?

మంచి ఇల్లు, కారు, ఆస్తులు... ఇలా ఒక్కో క్వాలిఫికేషన్ పెరిగేకొద్దీ అతని విజయం కూడా అంతస్తుల మేర పెరుగుతూ ఉంటుంది. కానీ ఇదంతా ప్రపంచం దృష్టిలో...! నిజానికి ఆ సంపాదనపరునికి తను విజయం సాధిస్తున్నాడనే సంతృప్తి ఉంటుందా..?

అంతస్తులు కూడబెట్టేందుకు ఇష్టమైన పనులన్నీ వదిలేయడం విజయమా..?

మనసుకు ఆనందాన్నిచ్చే చిన్న చిన్న సరదాలూ తీర్చుకోలేకపోవడం విజయమా..?

ప్రాణానికి ప్రాణం అయిన కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం విజయమా..?

నిజానికి ఇదేది నిఖార్సయిన విజయం కాదు...!

సంపద గమ్యానికి చేరే క్రమంలో కోల్పోయిన ఆనందక్షణాలు, కోట్ల ఖర్చు పెట్టినా రాని జీవితానుభవాలు చెబుతాయి... సాధించిన విజయం మేడిపండేనని.

విజయం అంటే ఏమిటో కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల వినయ్ భరద్వాజ్ జర్నీ చెబుతుంది. వృత్తిరీత్యా మార్కెటింగ్ ప్రొఫెషనల్ అయినా.. ఫ్యాషన్స్ పై ఉన్నఆసక్తి ఆ రంగంలోనూ నిలబడేలా చేసింది. అంతేనా.. వ్యక్తిగత జీవితంలో తట్టుకోలేని ఘటనలు సంభవించినప్పుడు మనిషి మానసిక పరిస్థితి ఎంత అల్లకోల్లలంగా ఉంటుందో స్వయంగా అనుభవించాడు కాబట్టి.. అలాంటి డిజాస్టర్ నుంచి ఇతరులను బయటపడేయడానికి ఓ టాక్ షోను కండక్ట్ చేస్తున్నారు వినయ్. ఈ షోను ప్రసారం చేయడానికి టీవీ చానళ్లు ముందుకొచ్చినా.. తన విజయ లక్ష్యం డబ్బు సంపాదన కాదు కాబట్టి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. యూట్యూబ్ లో మాత్రమే ఉంచుతున్నారు.

విజయానికి నిర్వచనం

సింగపూర్ లో ఉద్యోగం, భార్యబిడ్డలతో హ్యాపీ లైఫ్. ఆనందకర జీవితం. కానీ మనసులో ఏ మూలో చిన్న అసంతృప్తి. తనకు ఇష్టమైన వ్యాపకం చేయలేకపోతున్నాను అనేదే ఆ అసంతృప్తి. అతి క్లిష్టమైన పరిస్థితి నుంచి జీవితంలో ఉన్నత శిఖరాలను ఎదిగిన విశిష్ట వ్యక్తుల గురించి ప్రపంచానికి విభిన్న కోణంలో అందించాలనేది వినయ్ భరద్వాజ్ కు మొదటినుంచి ఉన్న కోరిక. దాని కోసం వృత్తి, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత "లెట్స్ టాక్ విత్ వినయ్" అనే కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకున్నారు. ముందుగా బెంగళూరు సిరీస్ ను ఇరవై మందితో పూర్తి చేశారు. వీరిలో బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప, సింగర్ రఘుదీక్షిత్, కౌన్సెలర్ అన్నా చాందీ, డిజైనర్ ప్రసాద్ బిదప్ప, సింగర్-యాక్ట్రెస్ వసుంధరా దాస్, క్రికెటర్ కేఎల్ రాహుల్ లాంటి వారున్నారు. లెట్స్ టాక్ విత్ వినయ్ కి యూట్యూబ్ లో మత్రమే ఉంచుతున్నారు. దీనికి విశేషమైన ఆదరణ లభిస్తూండటంతో... ప్రసారం చేసేందుకు కొన్ని ఎంటర్ టైన్మెంట్ చానళ్లు ముందుకొచ్చాయి. కానీ డబ్బు సంపాదన కోసం లెట్స్ టాక్ విత్ వినయ్ చేయడం లేదుకాబట్టి.. ఆ ప్రతిపాదనను వినయ్ తిరస్కరించారు.

స్ఫూర్తి మంత్రం

లెట్స్ టాక్ విత్ వినయ్ లో గెస్ట్ లు అంతా చాలా స్ట్రగుల్ కి గురై తమరంగాల్లో ముందుకెళ్తున్నవారే ఉంటారు. వారి జర్నీలో ప్రారంభం, స్ట్రగుల్స్, సపోర్ట్ లాంటి వన్నింటినీ వినయ్ హృద్యంగా ఆవిష్కరించేలా చేస్తారు. స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ మీద ఏ మాత్రం నమ్మకం లేని వినయ్.... సంభాషణ ఎమోషన్ కు కనెక్ట్ అవ్వాలని భావిస్తారు. ఉదాహరణకు... బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్పను వినయ్ ఇంటర్ఫ్యూచేశారు. వాటిలో వినయ్ అడిగిన ఓ ప్రశ్న... 

"మొదటిసారి ఓడిపోయినప్పుడు మీకేమనిపించింది..?" 

ఆ ప్రశ్న అశ్విని పొన్నప్పను తన స్ట్రగుల్స్ ను గుర్తుచేసేలా చేసింది. ఆమె దానికి ఎమోషనల్ రిప్లయ్ ఇచ్చారు. ఆ పరాజయం తనకు నేర్పిన పాఠాలను వివరించారు. కచ్చితంగా వినయ్ కూడా ఇలాంటి ఎమెషనల్ టచ్ టాక్స్ నే కోరుకుంటారు.

బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్పతో వినయ్ భరద్వాజ్<br>

బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్పతో వినయ్ భరద్వాజ్


నిజానికి ఈ టాక్ షోకి అంతా రెడీ చేసుకున్న సమయంలో వినయ్ కి తగిలిన ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. యాబై నాలుగు రోజుల వ్యవధిలో తనకు అత్యంత ఇష్టమైన కుటుంబసభ్యులు ముగ్గురిని వరుసగా పోగొట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి తనను గారాబంగా పెంచిన అమ్మమ్మ వృద్ధాప్యంతో చనిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే క్యాన్సర్ తో బాధపడుతూ తల్లీ కన్నుమూసింది. తర్వాత అనారోగ్య కారణాలతో తండ్రి కాలును తొలగించాల్సి వచ్చింది. ఇవన్నీ యాభై నాలుగు రోజుల వ్యవధిలోనే జరిగాయి. ఇంత విషాదంలోనూ టాక్ షో టార్గెట్ ను వినయ్ మర్చిపోలేదు. ఈ టాక్ షోలో మొట్టమొదటి గెస్ట్ HCG హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ బి.ఎస్.అజయ్ కు్మార్. వినయ్ తల్లి క్యాన్సర్ చికిత్స చేసింది కూడా అజయ్ కుమారే. ఈ ఏపిసోడ్ చూసిన తర్వాత ఒక్కరైనా క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని రెగ్యులర్ టెస్టులు చేయించుకుంటే అదే తన విజయమంటారు.

అందరూ తిరస్కరించిన ఐడియా

లెట్స్ టాక్ విత్ వినయ్ కి మొత్తం ప్రిపేర్ చేసుకునే దశలో ఓ సారి మిత్రుడు... ఓ సినీ నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాడు. మొత్తం కాన్సెప్ట్ విన్న నిర్మాత రిజెక్ట్ చేశాడు. ఈ కాన్సెప్ట్ ను మరింత మెరుగుపర్చమని చెప్పి ఉంటే నేను సంతోషించేవాడినని కానీ అలా జరగలేదని నిరుత్సాహపడ్డారు. కానీ ఆశ వదులుకోలేదు. తర్వాత ఈ షోలో ఐదుగురు ఫిల్మ్ స్టార్స్ పాల్గొన్నారు. వినయ్ టాక్ షోకు ఓ ప్రత్యేకమైన గెస్ట్ లిస్ట్ ఉంటుంది. సింగపూర్ లో ఫుల్ టైమ్ కార్పొరేట్ జాబ్, అలాగే పరిశ్రమవర్గాలతో ఎలాంటి పరిచయాలు లేవు. మరి గెస్టులు ఎలా గేదర్ చేయగలిగారు..?

నేను దాదాపు పదిహేను వందల ఫోన్ కాల్స్ చేశాను. మొట్టమొదటిసారిగా వసుంధరదాస్ అనుమతి పొందగలిగాను. అలా నాకు తెలియని రంగంలో మొదటి అడుగు వేశా. బెంగళూరులో మరో సీజన్ టాక్ షో చేయాలనుకుంటే.. నా దగ్గర ఇప్పటికిప్పుడు ఇరవై మంది గెస్టుల లిస్టు రెడీగా ఉంది" వినయ్ భరద్వాజ్

కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీ పరిచయాలున్న ఓ మిత్రుడు వినయ్ కు కొంత సాయం చేశారు. తన కాన్సెప్ట్ కు స్పాన్సర్ షిప్ కోసం దాదాపు 35 సంస్థలను వినయ్ సంప్రదించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఓ స్నేహితుడు మాత్రం రుణం కింద పెట్టుబడిని సమకూర్చారు. దాంతో లెట్స్ టాక్ విత్ వినయ్ పట్టాలెక్కింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ టాక్ షో కోసం పని ప్రారంభించారు. డిసెంబర్ లో షూటింగ్ చేశారు. షో బెంగళూరు ఎడిషన్ చివరి గెస్ట్ బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా. ఈ ఎపిసోడ్ జూన్ మూడున యూట్యూబ్ లో ఉంటుంది. దీంతో టాక్ షోలో మొదటి ఎడిషన్ కంప్లీట్ అయినట్లవుతుంది.

బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షాతో వినయ్ భరద్వాజ్<br>

బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షాతో వినయ్ భరద్వాజ్


ఇష్టపడి పైపైకి...

బెంగళూరులో స్కూల్, కాలేజీ చదువుల సమయంలోనే ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవారు వినయ్. ఆ తర్వాత ఉన్నతవిద్య కోసం లండన్ వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. మల్టీనేషనల్ కంపెనీల్లో మార్కెటింగ్ రంగంలో పట్టుసాధించారు. మొదటినుంచి ఫ్యాషన్స్ పై కూడా వినయ్ కు మంచి ఆసక్తి ఉండేది. అందుకే లండన్ లో ఉన్నప్పుడు... స్నేహితురాలు శిల్పా అజిత్ తో కల్సి షైనాయేలే అనే బ్రాండ్ ను ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ కల్చర్ ను ప్రతిబింబించేలా డిజైన్లను ఈ బ్రాండ్ అందిస్తుంది. వీటితో పాటు పలు కాలేజీల్లో విద్యార్థులకు స్ఫూర్తినింపే ప్రసంగాలను ఇస్తూంటారు. వినయ్ టాకింగ్ పవర్ అద్భుతం కావడంతో.. పేరుపొందిన కాలేజీలన్నీ విద్యార్థుల ముందుస్పీచ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తులు పంపుతూంటాయి. ప్రస్తుతం ఐ డొనేషన్ మీద ఓ డాక్యుమెంటరీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దీనికంతటికి సమయం ఎలా వస్తుందని ప్రశ్నిస్తే... " మనసుకు చేయాలనిపిస్తే అసాధ్యమైనదేదీ ఉండదని" ఒక్క ముక్కలో తేల్చేస్తారు.

చెన్నై ఎడిషన్

మొత్తం ఇరవై ఎపిసోడ్ల బెంగళూరు ఎడిషన్ ను వినయ్ కంప్లీట్ చేశారు. ఇప్పటికే పదిహేను యూట్యూబ్ లో ఉన్నాయి. మరో ఐదు కూడా జూన్ లోపు అప్ లోడ్ చేస్తారు. ఆ తర్వాత లెట్స్ టాక్ విత్ వినయ్.. చెన్నై ఎడిషన్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే గెస్టుల లిస్టు సిద్ధం చేసుకున్నారు. వోకలిస్ట్ పద్మభూషణ్ సుధా రఘునాథన్, అంకాలజిస్ట్ డాక్టర్ వి శాంత, విద్యావేత్త మధువంతి అరుణ్, సింగర్స్ కార్తీక్, శ్రీనివాస్, అంట్రప్రెన్యూర్ ఉపాసనా కామినేని, పియానిస్ట్ అనిల్ శ్రీనివాసన్ తదితరులు ఇప్పటికే తమ అంగీకారం తెలిపారు. సౌత్ ఈస్ట్ ఏషియాలో పార్మినెంట్ పర్సనాలిటీస్ ను ఇంటర్ఫ్యూ చేసి... కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు తేవాలని వినయ్ లక్యంగా పెట్టుకున్నారు. భార్య, సోదరుడు, మిత్రులు తనకు ఈ జర్నీలో పిల్లర్స్ గా నిలబడ్డారు.

" మీరు ఏదైనా అనుకుంటే దాని కోసం ఓ సారి ట్రై చేయండి. మీరు ఫెయిలైనా పర్వాలేదు. ఇరవై ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రయత్నించినందుకు మీకు గర్వంగా ఉంటుంది" వినయ్ భరద్వాజ్

ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. కలలు కనేవాళ్లు కొందరయితే.. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించేవారు మరికొందరు. కలలను సాకారం చేసుకునేవారి జాబితాలోకి వస్తారు వినయ్ భరద్వాజ్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags