నోరులేని జీవాల కోసం ఆంబులెన్స్..

నిస్వార్ధసేవ చేస్తన్న పీపుల్ ఫర్ ఆనిమల్స్ ట్రస్ట్  

7th Jan 2017
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

ఈ భూమ్మీద ప్రతీ ఒక్క ప్రాణికి జీవించే హక్కుంది. మనిషిగా సాటి ప్రాణుల్ని కాపాడే బాధ్యత కూడా మనమీదేఉంది. కానీ మనలో ఎంతమంది నోరులేని మూగజీవాల రక్షణ కోసం పాటు పడుతున్నారు. కుక్కల్ని, పిల్లుల్ని,పక్షుల్ని పెంచుకోవడం మాట అటుంచితే- మిగిలిన జంతువుల పట్ల మనం చూపించే జాలి, దయ, కరుణ ఏపాటి? అట్లీస్ట్ వీధికుక్కల విషయంలోనూ మనం చూపించే ఆదరణ ఏమాత్రం ఉంది?

పీపుల్ ఫర్ ఆనిమల్స్ ట్రస్ట్. జంతువుల సంక్షేమం కోసమే ఏర్పాటైన ఆర్గనైజేషన్. రవి దుబే అనే 31 ఏళ్లయువకుడు వణ్యప్రాణులు, సాధు జంతువుల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లోని పల్వాల్ చుట్టుపక్కల మొదలుకొని మథుర దాకా పీఎఫ్ఏ ద్వారా జంతువుల కోసం పాటుపడుతున్నాడు.

భూమ్మీద మనిషి పెత్తనం చెలాయించవచ్చు గాక, కానీ మానవులతో పాటు ఇతర ప్రాణులకూ బతికే హక్కుంది. వాటి హక్కుల కోసం రవి దుబే ఉద్యమాన్ని లేవదీశాడు. ప్రతీ ప్రాణిని గౌరవించేలా నలుగురిలో చైతన్యం రగిలిస్తున్నాడు.

image


ఏ జంతువైనా ప్రమాదంలో పడినా, దానికి ఎలాంటి ఆపద వాటిల్లినా వెంటనే తమ ఆర్గనైజేషన్ కు తెలియజేయడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టాడు. వాటికోసం రెండు ఆంబులెన్సులు ఏర్పాటు చేశాడు. ఒకటి పల్వాల్ లో ఉంటే, రెండోది హోదాల్ లో తిరుగుతుంది. గాయపడ్డా, ట్రాఫిక్ లో ప్రమాదం జరిగినా హెల్ప్ లైన్ ద్వారా సమాచారం చేరవేస్తే వెంటనే ఆంబులెన్స్ వెళ్లి రెస్క్యూ చేస్తుంది.

ఫరీదాబాద్ బల్లాబ్-గఢ్ సెంటర్లో ఉన్న ఆస్త షెల్టర్ హోం అందిరికీ సుపరిచితమే. అక్కడే గాయపడ్డ జంతువులకుచికిత్స చేస్తారు. గాయం మాని మళ్లీ అది లేచినడిచే దాకా అక్కడే ఉంచుకుంటారు.

ఇదొక ఎత్తయితే.. వైల్డ్ లైఫ్ రెస్క్యూ రిహాబిలిటేషన్- సంస్థ యాక్టివిటీలో మేజర్ రోల్ పోషిస్తుంది. ఆనిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి గుర్తింపు పొందిన ఈ ఆర్గనైజేషన్- యూకే లోని వరల్డ్ సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఆనిమల్స్(WSPA)లో మెంబర్ కూడా.

ఎన్నో మేజర్ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థ సమ్మర్ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ కూడా కంటిన్యూ చేస్తోంది. వేసవిలో నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని- మూగజీవాల కోసం ఫరీదాబాద్, ఢిల్లీ చుట్టుపక్కల సిమెంట్ నీటి తొట్టెలను ఏర్పాటు చేయబోతోంది.

image


వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. ఫలితంగా జింకలు, దుప్పులు, కోతులు నీళ్లకోసం మైదానం బాట పడతాయి. ఫరీదాబాద్, గూర్గాం ప్రాంతాల్లో రోడ్లమీద వన్యప్రాణులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. నీళ్లకోసం అవి ఇటూ ఇటూ ఉరుకులాడుతుంటాయి. ఆ క్రమంలో వాహనాలు ఢీకొని మృత్యువాత పడతాయి. లేదంటే ఏ వేటగాడి వలలోనూ చిక్కుతాయి.

అలాంటి ప్రమాదం జరగకుండా రోడ్డుకు ఇరువైపులా సిమెంట్ నీళ్ల తొట్టి పెడతారు. 200 లీటర్ల నీళ్లు పట్టే 150 తొట్టిలను ఫరీదాబాద్, గూర్గావ్ ఏరియాల్లో ఏర్పాటు చేశారు. వాటర్ టాంకర్లను అద్దెకు తీసుకుని ప్రతీ నీటి తొట్టి నిండుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎండాకాలం మొత్తం అదే పనిమీద ఉంటారు.

మూగజీవాల దాహర్తి తీర్చడమే కాదు.. వందల సంఖ్యలో జీవుల్ని ప్రాణాపాయ స్థితిలోంచి కూడా బయటపడేశారు. ఒకసారి మెట్రో పిల్లర్ కింద ఇరుర్కున్న పిల్లిపిల్లను కాపాడిన తీరుని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు సంస్థ ప్రతినిధులు. 2015లో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ వాళ్ల కళ్లముందుంది. ఫరీదాబాద్ మెట్రో పిల్లర్ కింద పిల్లికూన ఇరుక్కుపోయిందని ఒకరోజు ఆఫీసుకు కాల్ వచ్చింది. రెస్క్యూ చేయడానికి వెళ్తే అక్కడ సిట్యువేషన్ ఏమాత్రం సహకరించలేదు. నానా తంటాలు పడి దాన్ని బయటకు తీయడానికి రెండు రోజులు పట్టింది. పిల్లికూనను రక్షించే క్రమంలో సంస్థ ప్రతినిధి ఒకాయన 40 అడుగుల ఎత్తునుంచి కిందపడిపోయాడు. దెబ్బలు తగిలాయి.

image


ఆ రోజు నుంచి ఆర్గనైజేషన్‌ లో పనిచేసే వాళ్లు ఎవరైనా గాయపడితే ఆర్ధికంగా కూడా ఆదుకుంటున్నామని రవి దుబే అన్నారు. మూగజీవాల కోసం నిరంతరం తపించే తమ సంస్థకు ఇంతవరకు ఎవరూ ఫైనాన్షియల్ సపోర్టు ఇవ్వడం లేదని ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు. పదుల సంఖ్యలో వలంటీర్లు ఉన్నప్పటికీ సంస్థ ఏనాడూ ప్రచారం కోసం అర్రులు చాచలేదు. కాలేజీ కుర్రళ్ల దగ్గర్నుంచి వృద్ధుల దాకా అందరూ సంస్థల స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. తమవంతు సాయంగా పనిచేస్తామని ఎవరు వచ్చినా స్వాగతిస్తామని రవి అంటున్నారు.

కేవలం జంతువులను కాపాటడం, వాటి దాహర్తి తీర్చడమే కాదు.. స్కూళ్లలో కాలేజీల్లో వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తోంది సంస్థ. మనం మాత్రమే ఈ భూమ్మీద బతకడం కాదు.. మనతో పాటు సకల చరాచర ప్రాణాలు కూడా మనగలగాలి అనే కోణంలో చైతన్యం తెస్తున్నారు. వీధి కుక్కల సంతతి నియంత్రించడానికి స్టెరిలైజ్ కార్యక్రమం చేపడతారు. వాటికి యాంటీ రెబిస్ వాక్సినేషన్ ఇస్తారు. గత తొమ్మిదేళ్లలో దాదాపు 5వేల కుక్కలకు వాక్సినేషన్ ఇవ్వడంతోపాటు స్టెరిలైజ్ చేశారు.

image


పీపుల్ ఫర్ ఆనిమల్స్ ఆన్ వీల్స్ కోసం ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఎందుంకంటే ఆల్రెడీ ఉన్న రెండు ఆంబులెన్సులతో పాటు మరో మొబైల్ ఆంబులెన్స్ కూడా తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. దానికోసమే క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్. స్పాట్ మెడికల్ కోసమే కాకుండా షెల్టర్ దగ్గర వెటర్నరీ ఫెసిలిటీ కోసం కూడా దాన్ని ఉపయోగించుకుంటారు.

భవిష్యత్ లో మొబైల్ ఆంబులెన్సులను విస్తృత పరిచి, నోరులేని జీవాలకు ఇంకా మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది పీపుల్ ఫర్ ఆనిమల్స్ ట్రస్ట్. వారి ఆశయానికి పదిమంది మద్దతు దొరకాలని యువర్ స్టోరీ మనసారా కోరుకుంటోంది.

 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Share on
  close
  Report an issue
  Authors

  Related Tags