Telugu

తల్లైన కొత్తలో... అమ్మకు ప్రేమతో...

Sri
8th Mar 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


తొలిసారి తల్లయ్యారా? ఇక ఎన్నో సందేహాలు. ఏం తినాలి? ఏం తినకూడదు? ఎలా నడవాలి? ఎలా నడవకూడదు? నెలలు నిండుతున్నకొద్దీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా అన్నీ ప్రశ్నలే. ప్రశ్నల మీద ప్రశ్నలు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కాబట్టి పెద్దల ద్వారా ఈ సందేహాలన్నీ ఎప్పటికప్పుడు తీరేవి. కానీ ఇప్పుడు ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీలే. భార్య, భర్తలతో చిన్న కుటుంబం... చింతలేని కుటుంబం అనుకుంటారు కానీ... ఇలాంటి సమయాల్లో పెద్దల అవసరం తెలిసొస్తుంది. కానీ రకరకాల కారణాల వల్ల జంటలు ఇలా వేరుగా ఉండాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇల్లాలు గర్భవతి అయితే మైండ్ లో క్వశ్చన్ బ్యాంక్ రెడీ అవుతుంది. కుప్పలుతెప్పలుగా ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాన్ని వెతుక్కోవడానికి మదర్ హెన్ యాప్ ను తీర్చిదిద్దారు అదితి జుస్సావాలా.

మదర్ హెన్ పుట్టుక

మదర్ హెన్... కాబోయే అమ్మల కోసం కొత్త యాప్. ఇందులో ఏముంటాయి అని అడిగితే చాలానే ఉంటాయని చెప్పొచ్చు. భారతదేశంలో కేవలం అమ్మల కోసమే రూపొందించిన తొలి కమ్యూనిటీ యాప్ ఇది. తొలిసారి తల్లైనా, మరోసారి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉద్యోగం చేస్తున్న అమ్మయినా... అందర్నీ ఒకే ప్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చిన యాప్ ఇది. మీలా మీ ప్రాంతంలో ఉన్న అమ్మలతో మీ అనుభవాలను, మాతృత్వపు అనుభూతుల్ని పంచుకోవచ్చు. ఒంటరితనం అనే భావన ఉండదు. మొదట్లో అదితి జుస్సావాలా కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆమెలో ఎన్నో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. సందేహాలు తీర్చేవారికోసం నిస్సహాయంగా ఎదురుచూసింది. నానమ్మలు, చిన్నమ్మలు ఇచ్చిన సలహాలేవీ ఆ సమయానికి ఉపయోగపడలేదు. చాలావరకు మెడికల్ వెబ్ సైట్లల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం ఉన్నా ఏదీ పనికిరాలేదు. అప్పుడే అనిపించింది. తనలా సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లందర్నీ ఒకే ప్లాట్ ఫామ్ పైకి తీసుకొస్తే ఒకరికొకరు ఎంతో హెల్ప్ ఫుల్ గా ఉంటారనిపించింది.

"అర్థరాత్రుళ్లు పిల్లలు గుక్కపట్టి ఏడుస్తుంటే ఏ తల్లైనా కంగారుపడుతుంది. ఎంత ఓదార్చినా, ఊరడించినా పిల్లలు ఏడుపు మానకపోతే తల్లికి తెలియని ఆందోళన ఉంటుంది. నేనూ అలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాను. ఎన్నో రాత్రుళ్లు మేల్కొన్నాను. ఏడుస్తున్న పిల్లల్ని ఎలా ఊరుకోబెట్టాలన్నదానిపై ఏవేవో చదివాను. అర్థరాత్రి రెండు గంటలకు పిల్లలు గుక్కపట్టి ఏడుస్తుంటే ఆ సమయంలో ఎవరి సలహాలు అడుగుతాం? ఎవరితో మాట్లాడతాం? పిల్లల్ని అలా ఎలా వదిలిపెడతాం?" అంటూ గతానుభవాలను వివరిస్తున్నారు అదితి.

అదితి జుస్సావాలా... కోల్ కతాలో ఓ మార్వాడీ కుటుంబంలో పుట్టిపెరిగారు. కామర్స్, ఐటీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్న సమయంలో అదితి ఆస్ట్రేలియాలో స్వతంత్రంగా జీవించింది. ఓ కార్పొరేట్ కంపెనీలో కొన్నాళ్లు పనిచేసిన తర్వాత కోల్ కతాకు తిరిగొచ్చింది. పెళ్లి తర్వాత ముంబైకి వెళ్లింది. అక్కడే తొలిసారి తల్లైంది. అప్పుడు తెలిసింది. ఇందులో ఉండే సమస్యలేంటోనని. గర్భం దాల్చిననాటి నుంచి తొలిబిడ్డకు జన్మనిచ్చి పెంచేవరకు అంతా గందరగోళమే.

"ముంబైలాంటి నగరంలో తల్లైన కొత్తలో... మాతృత్వపు అనుభూతుల్ని సంతోషంగా అనుభవించే అవకాశమే ఉండదు. సంతాన సమస్యలు మనస్సును ప్రశాంతంగా ఉండనివ్వలేదు. చైల్డ్ ఎక్స్ పర్ట్స్ తో మాట్లాడి సందేహాలు తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఏ క్లినిక్ కు వెళ్లినా పెద్దపెద్ద క్యూలు కనిపించేవి. కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వచ్చేది. అప్పుడే నాకనిపించింది ఏ సమయంలో అయినా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, నిపుణుల సలహాలన్నీ చేతివేళ్లపై ఉండాలనుకున్నాను. దాంతోపాటు నాలా గర్భవతులుగా ఉన్నవారిని కలిసి అనుభవాలు పంచుకోవాలన్న కోరిక మనస్సును తొలచివేసేది" అంటూ గుర్తు తెచ్చుకుంటారు అదితి.

తోటి తల్లుల సలహాలు, సూచనల కోసం పలు ఆన్ లైన్ వెబ్ సైట్లలో ప్రయత్నించింది. అలాంటివి కనిపించినా అందులో ఏం పాటిస్తే ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడింది. ఏదీ అధికారికం కాదు. దీంతో ఏది ఫాలో అవ్వాలో తెలియలేదు. ఇవన్నీ చూసిన తర్వాత తాను కేవలం తల్లిగా మిగిలిపోవాలనుకోలేదు అదితి. గతంలో తనకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పరిష్కారం కోసం ఆలోచించింది. తనలా సందేహాలతో బుర్రలు పాడుచేసుకుంటున్న తల్లుల కోసం ఏదైనా చేయాలనుకుంది. అదితికి గతంలో కోల్ కతాలో కొన్ని ఐటీ స్టార్టప్స్ కోసం పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు మహిళల విషయంలో కనిపించే పక్షపాతాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

"కోల్ కతాలోని పెద్దపెద్ద ఐటీ కంపెనీల్లో నన్ను అడిగిన ప్రశ్నలు విచిత్రంగా ఉన్నాయి. 'వృత్తిలో భాగంగా మీరు ఎలా ప్రయాణిస్తారు?', 'ఇలాంటి పరిస్థితుల్లో పనిని ఎలా మేనేజ్ చేసుకుంటారు?' అని నేను మహిళనని గుర్తుచేసేలా ప్రశ్నలు అడిగేవాళ్లు. నేను ఆ ఉద్యోగానికి సరిపోయే అవకాశం లేకపోవడంతో నాకు ఉద్యోగం రాలేదు" అని తనకెదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకుంటారు అదితి.

ఉద్యోగాల విషయంలో ఇలాంటి ఎదురుదెబ్బలు ఉండటంతో సొంతగా వ్యాపారం నిర్వహించాలనుకుంది. భర్త కలిసి వెబ్ డిజైన్, డెవలప్ మెంట్ కు సంబంధించిన డిజిటల్ ఏజెన్సీ 'ఒయ్యం' ప్రారంభించారు. ఇందులో అదితి మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకునేవారు. ఈ అనుభవాలతోనే గర్భవతులు, తల్లుల కోసం ఏదైనా చేద్దామనిపించింది. తన ఆలోచనలను భర్తతో పంచుకుంది. అలా 'మదర్ హెన్' ప్రారంభమైంది. తల్లైన కొత్తలో ఎదురయ్యే సమస్యలకు, సందేహాలకు చేతివేళ్లపై సమాధానాలు అందించే యాప్ ఇది. సొంత డబ్బులతో ఈ యాప్ ని ప్రారంభించారు అదితి.

undefined

undefinedఎలా పనిచేస్తుందంటే..?మదర్ హెన్... తల్లులు, గర్భవతుల కోసం రూపొందించిన మొబైల్ కమ్యూనిటీ. రియల్ టైమ్ చాట్ తో ఒకరికొకర్ని కనెక్ట్ చేస్తుంది. ఇందులో మాతృత్వపు అనుభవాల్ని పంచుకోవచ్చు. సందేహాలు తీర్చుకోవచ్చు. తల్లుల ఆహారం దగ్గర్నుంచి పిల్లల ఆహారం వరకు విలువైన సలహాలు, సూచనలు పొందొచ్చు. పిల్లల నిద్రకు సంబంధించిన సమస్యలు, వంటకాలు, ఆటలు... ఇలా ఏదైనా తెలుసుకోవచ్చు. పిల్లల డాక్టర్లు, హోమియోపతీ, గైనకాలజిస్టుల్లాంటి నిపుణుల సలహాలు, సూచనలు అందించే ఎక్స్ పర్ట్ సెక్షన్ ఉంది. సమాధానాల కోసం ఎక్కువ సేపు ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

"ఈ గ్రూపులో ఉన్న అమ్మలను రాత్రైనా, పగలైనా నిపుణుల సలహాలు కోరొచ్చు. ఓసారి బ్రిటన్ లోని భారతీయ తల్లి ఒకరు మదర్ హెన్ ని సంప్రదించారు. తన నాలుగేళ్ల బిడ్డ పేగు సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తెల్లవారుజామున టెంపరేచర్ ఎక్కువైంది. స్థానికంగా డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో మదర్ హెన్ ని సంప్రదించింది. మిగతా తల్లుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో ఆమె కుదుటపడింది. ఈ యాప్ ద్వారా పిల్లల వైద్యుడిని ఫోన్ లోనే సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంది" అని చెబుతున్నారు అదితి.

ఇవే కాదు... మీ నగరంలో పిల్లలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలు అందిస్తుంది. మ్యాగజైన్లు, పేపర్లల్లో వచ్చే ఆర్టికల్స్ షేర్ చేస్తుందీ యాప్. పిల్లల కోసం వచ్చే ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లు, పార్టీ వేదికలు, పార్కులు, ప్లే ఏరియాలు, ప్రిస్కూల్స్ ఇలా సమస్త సమాచారాన్ని అరచేతిలో అందిస్తోంది. పసిపిల్లల డైపర్ల ఆఫర్ల దగ్గర్నుంచి ఐదేళ్ల పిల్లల ట్రైనింగ్ క్లాసుల వరకు ఏం కావాలన్నా తెలుసుకోవచ్చు. ఈ యాప్ లో మెంబర్స్ గా తల్లులు లేదా కాబోయే తల్లులు మాత్రమే ఉంటారు.

"తల్లులు తమకున్న సందేహాల్ని చర్చించేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్లాట్ ఫామ్ ను తయారు చేయడమే మా లక్ష్యం. చాలామంది అమ్మలు మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్లీ డ్యూటీలకు వెళ్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. తల్లిగా, భార్యగా, కోడలిగా ఒకే సమయంలో అనేక పాత్రలతో కుస్తీ పడుతున్నారు. దీంతో పిల్లల్ని పట్టించుకోవడానికి సరైన సమయం ఉండట్లేదు. దీనికి తోడు ఉద్యోగం చూసుకోవాలి. వీటి వల్ల యంగ్ మామ్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు" అంటారు అదితి.

ఈ యాప్ కు ఎలాంటి స్పందన వస్తుందన్న దిగులు మొదట్లో ఉండేది. ముంబైలోని ధనికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో 200 మంది అమ్మలతో కలిసి టెస్ట్ రన్ నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాలు, నేపథ్యాల్లోని వారికీ ఈ కమ్యూనిటీ అవసరం ఉందని తెలిసింది. దీంతో మార్కెటింగ్ పై దృష్టి పెట్టారు. టైర్ టూ నగరాల్లోనూ సేవలు మొదలుపెట్టారు. అక్టోబర్ 2015లో ప్రారంభమైన ఈ యాప్ లో ఇప్పుడు ఐదువేల మందికి పైగా తల్లులు మెంబర్స్ గా ఉన్నారు. ప్రతీ నెలా వంద శాతం వృద్ధి కనిపిస్తోంది. ఆశించినంత మంది సభ్యులు చేరిన తర్వాత అమలు చేసేందుకు పలు రకాల రెవెన్యూ మోడల్స్ రెడీగా ఉన్నాయి. పెయిడ్ లిస్టింగ్స్, స్పాన్సర్డ్ కంటెంట్, ఇ-కామర్స్, కమిషన్ల కోసం ఒప్పందాలు... ఇలా రకరకాల మార్గాల్లో రెవెన్యూ కోసం ప్రణాళికలు రూపొందించారు.

"మిగతా తల్లుల్లాగా నా రెండేళ్ల బిడ్డే నా బలహీనత. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అంత సులువుకాదు. నా కొడుక్కి బై చెబుతున్నప్పుడు 'అమ్మా నన్నొదిలి వెళ్లొద్దని' వాడంటుంటే ఇప్పటికీ నా గుండె బద్దలవుతుంది. కానీ నా కుటుంబం నాకు వెన్నుదన్నుగా నిలిచింది. ఓ ఎమ్మెన్సీ కంపెనీ ఇచ్చే భారీ చెక్ కన్నా... తల్లిగా విజయం సాధించడమే మధురానుభూతి. నా విషయంలో మంచి మనిషిగా ఉండటం, సమాజసేవ చేయటం, నమ్మిన దానిపట్ల, చేస్తున్నపని విషయంలో ఇష్టంగా ఉండటంలోనే విజయం ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర విజయాలన్నీ వాటంతట అవే వస్తాయి" అంటూ తన సక్సెస్ మంత్రను వివరిస్తారు అదితి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags