Telugu

కాఫీ తాగండి...! పర్యావరణాన్ని పరిరక్షించండి...!!

-ట్రెండ్ సృష్టిస్తున్న కాఫీ బ్రాండ్-జీవ వైవిధ్యంలో కాఫీ రైతుల భాగస్వామ్యం

Sri
4th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

పర్యావరణ పరిరక్షణ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక కప్పు కాఫీ తాగండి. అదేంటీ... కప్పు కాఫీకి, పర్యావరణ పరిరక్షణకి సంబంధమేంటీ అన్నది మీ డౌటా? వినడానికి వింతగా ఉంటుంది కానీ... లోతుగా తెలుసుకుంటే అమ్మో ఇంత ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం. కప్పులో కాఫీ సిప్ చేస్తూ చదివెయ్యండి.

బ్లాక్ బాజా భారత్

బ్లాక్ బాజా కాఫీ... ఇండియాలో లభించే కాఫీ బ్రాండ్లలో ఇదీ ఒకటి. అందుకే బ్లాక్ బాజా భారత్ అని పిలుచుకోవచ్చు. అసలు బ్లాక్ బాజా పేరే వింతగా ఉంది కదూ. ఈ పేరు ఎక్కడా విన్నట్టు కూడా అనిపించదు. దీని వెనుక ఓ కహానీ ఉంది. బ్లాక్ బాజా అనేది ఓ పక్షి పేరు. దక్షిణ, ఆగ్నేయాసియాలోని అడవుల్లో కనిపించే చిన్న పక్షి. ఈ పక్షులు ఎక్కువగా దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. ఎత్తైన చెట్లపై నివసిస్తుంటాయి. కానీ విచిత్రంగా ఇవే పక్షులు కాఫీ తోటల్లో కూడా కనిపిస్తుంటాయి. దట్టంగా ఉండే కాఫీ తోటల్లో ఈ పక్షులు నివాసం ఏర్పరుచుకుంటాయి. అంటే వాటి దృష్టిలో దట్టమైన అడవులు, కాఫీ తోటలు ఒకటే అన్నమాట. అలా బ్లాక్ బాజా కాఫీ బ్రాండ్ పుట్టుకొచ్చింది. మార్కెట్లో అనేకమైన కాఫీ బ్రాండ్లు ఉన్నాయి. కానీ ఈ బ్రాండ్ కు ఉన్న ప్రత్యేకతలు వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే కాఫీ తాగుతూ పర్యావరణాన్ని పరిరక్షించే అవకాశం కల్పించడం ఈ బ్రాండ్ స్పెషాలిటీ.

image


పర్యావరణ పరిరక్షణే లక్ష్యం

బ్లాక్ బాజా కంపెనీ వ్యవస్థాపకురాలు ఆర్షియా ఉర్వీజ బోస్. తాను యాక్సిడెంటల్ ఆంట్రప్రెన్యూర్ అని చెప్పుకుంటారీమె. పైకి కంపెనీ యజమానిగా కనిపించినా ఆమె గొప్ప పర్యావరణ ప్రేమికురాలు. అందుకే తన బ్రాండ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. సరైన పద్ధతుల్లో కాఫీ ఉత్పత్తి ద్వారా పర్యావరణ పరిరక్షణ అన్నది ఈమె నినాదం. ఎన్విరాన్మెంట్ డెవలప్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అర్షియా... 'స్థిరమైన పద్ధతుల ద్వారా కాఫీ ఉత్పత్తులు' అనే అంశంపై కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ కూడా చేశారు.

"పీహెచ్డీ చేస్తున్నప్పుడు స్థానికులతో నేను కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించాను. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల ఆ తర్వాత పర్యావరణంపై నాకూ ఆసక్తి పెరిగింది" అంటూ కాఫీ తాగుతూ అప్పటి ముచ్చట్లు చెబుతారు అర్షియా.

ప్రత్యేక పద్ధతుల ద్వారా కాఫీ ఉత్పత్తి చేయడం పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఈ కంపెనీ చాలా పరిశోధనలు చేస్తోంది. కొద్దిపాటి మార్పులతో సాగు చేస్తే పర్యావరణానికి మరింత మేలు చేయొచ్చన్న విషయాన్ని కాఫీ రైతులకు వివరిస్తోంది ఈ కంపెనీ.

సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ ప్రాజెక్ట్

భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి విశిష్టమైన, ప్రత్యేకమైన చరిత్రుంది. కానీ సాగు చేసే పద్ధతులతో పర్యావరణానికి హాని కలుగుతోంది. ఇదే విషయం అర్షియాను కలవరపరుస్తోంది. అందుకే సాగు పద్ధతుల్ని మార్చడం ద్వారా పర్యావరణానికి హాని తగ్గించడమో, అసలు హాని లేకుండా చేయడమనే లక్ష్యంతో బ్లాక్ బాజా కంపెనీని ప్రారంభించారామె. పర్యావరణాన్ని, వన్యప్రాణుల్ని, జలవనరుల్ని పరిరక్షిస్తూ కాఫీ సాగు చెయ్యడం సాధ్యమని నిరూపించారామె. జీవవైవిధ్యాన్ని పెంపొందించేలా కాఫీ తోటలను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కంపెనీ ముందుకెళ్తోంది. సుమారు 300 మంది కాఫీ రైతులతో ఈ ప్రాజెక్ట్ పై చర్చించారు. కాఫీ ఉత్పత్తిదారులను తన లక్ష్యంలో భాగస్వాములను చేస్తున్నారు. రసాయనాలు వాడకుండా, దేశీయ పద్ధతుల ద్వారా కాఫీని ఎలా సాగుచేయొచ్చో వివరించారు. ఒక ఎకరా స్థలంలో 60 శాతం కాఫీ మొక్కలతో పందిరి ఏర్పాటు చెయ్యడం, వంద చెట్లు, 20 జాతుల దేశీయ వృక్షాలు పెంచడం అనేది వీరి ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా సాగు చేస్తూ చెట్లు, పక్షులు, క్షీరదాలు, కీటకాల సంఖ్యను పర్యవేక్షించారు. జీవవైవిధ్యంలో చాలా మార్పును చూశారు. ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ముందుకెళ్తున్నారు. అలా సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది.

image


బ్రాండ్ 'బ్లాక్ బాజా'

ఒకే ప్రాంతంలో 250-300 ఎకరాలల్లో కాఫీ సాగు చెయ్యడం ద్వారా పర్యావరణానికి మేలు చేయొచ్చని గుర్తించారు. ఇప్పటికే నలుగురు కాఫీ ఎస్టేట్ ఓనర్లతో పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చే ఏడాది నాటికి పదిహేను ఎస్టేట్లలో కాఫీ ఉత్పత్తి చెయ్యడమే లక్ష్యం. ఆమె విధించే నియమ నిబంధనలు సాధారణమైనవే. జీవ వైవిధ్యానికి విలువ ఇవ్వాలి. చెట్లను ఎక్కువగా పెంచాలి. నీటి వనరులను కాపాడాలి. కెమికల్స్ వాడకాన్ని తగ్గించాలి. వన్యమృగాల ఆవాసాలను పునరుద్ధరించాలి. కాఫీ క్వాలిటీ పెంచాలి. ఇవీ ప్రధానమైన నిబంధనలు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ బ్రాండ్ పై కాఫీ అమ్మడం మొదలుపెట్టారు. బ్లాక్ బాజా రోస్ట్, ఆస్పైర్ టు ఆటర్, లూనా రోస్ట్ పేర్లతో కాఫీని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ పదాలకు ఆసక్తికరమైన అర్థాలున్నాయి. బ్లాక్ బాజా ఓ పక్షి పేరు. ఆటర్ అంటే కాఫీ తోటల పరిసరాల్లో ఉన్న నదులను పరిరక్షించడం. లూనా అంటే భారతదేశంలో ఎక్కువగా లభించే పట్టుపురుగులను కాపాడటం.

"మంచి సాగు పద్ధతులను పాటించడం ద్వారా జీవజాతులను, వన్యప్రాణులను, నీటివనరులను సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చు. మా కంపెనీ చేస్తున్నది అదే. ఆర్థికంగా వచ్చే లాభాలను పక్కనపెడితే... కాఫీ రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. మేం పర్యావరణానికి అనుకూలమైన పద్ధతుల్ని ఎలా పాటిస్తున్నామో కాఫీ ప్యాకెట్లపై వివరించడమే కాదు... వాటిని ఉత్పత్తి చేసిన రైతుల పేర్లనూ ముద్రిస్తున్నాం. అలా వారికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అదే వారికి పెద్ద అవార్డు" అంటారు అర్షియా.

ప్రముఖ రీటైల్ స్టోర్లకు బ్లాక్ బాజా బ్రాండ్ కాఫీ అమ్మడమే కాదు... కప్ టేస్టింగ్, కాఫీ టేస్టింగ్ లాంటి ఈవెంట్స్ ని కూడా నిర్వహిస్తోందీ కంపెనీ. మార్పును ఎక్కువగా నమ్ముతారు అర్షియా. మార్పు తీసుకురావడంపై ఆసక్తి ఎక్కువ. కేవలం అధ్యయనాలు చేస్తే సరిపోదని ఆమెకు అర్థమైంది. మిగతావాళ్లతో పోలిస్తే నాలుగడుగులు ముందుండడం ద్వారానే మార్పు సాధ్యమని తన తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నారు.

"ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా పర్యావరణానికి మేలు చెయ్యడం మా అంతిమ లక్ష్యం. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ పై ఉండే కప్పు కాఫీ తాగడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి."

భారతదేశంలో కాఫీ లవర్స్ ఎక్కువ. అందుకే కాఫీ ద్వారా పర్యావరణ పరిరక్షణ అనే సందేశాన్ని అందించడం సులువన్న విషయాన్ని గుర్తించారీమె. 'బాధ్యతాయుతమైన కాఫీ ప్రేమికులు అవండి' అంటూ పిలుపునిస్తున్నారు.

ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోజల్ ఫెదరర్ కు పెద్ద ఫ్యాన్ అర్షియా. తను కూడా టెన్నిస్ ఆడతారు. కానీ ఆంట్రప్రెన్యూర్ షిప్ తన ఫుల్ టైమ్ జాబ్ అని చెబుతుంటారు. ప్రముఖ నేచర్ డాక్యుమెంటరీ మేకర్ డేవిట్ అట్టెన్ బారో కూడా ఆమెకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. "ప్రకృతి గురించి డాక్యుమెంటరీల ద్వారా ఆయన వివరించినంతగా గొప్పగా ఇంకెవరూ చెప్పలేదు. ఆ డాక్యుమెంటరీలు నిజంగా అద్భుతం" అంటుంటే అర్షియా ఓ గొప్ప పర్యావరణ ప్రేమికురాలిగా కనిపిస్తారు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags