2015లో అదరగొట్టాయి..!! మరి 2016లో ఏం చేస్తాయి..??

కొత్త కంపెనీలు.... విన్నూత్న ఆలోచనలు.. మార్కెట్ కైవసమే ధ్యేయం..

13th Jan 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

2015లో ఇండియాలో స్టార్టప్ రెవల్యూషన్ కొనసాగింది. ఎందరో ఔత్సాహికుల ఎంట్రీ.. మరెన్నో ఒప్పందాలు.. ఉత్సాహాన్నిచ్చిన పెట్టుబడుల వెల్లువ.. వెరసి చాలా స్టార్టప్ లకు 2015 బ్రహ్మాండమైన టేకాఫ్ ని ఇచ్చింది. వీటిలో కొన్ని అద్భుతంగా ప్రతిభను చూపుతుంటే, మరికొన్ని మొదట్లోనే చతికిల పడ్డాయి. మరి 2016లో మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? కొత్త కంపెనీల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

2015 అదిరింది.... 2016 ఎలా ఉంటుంది..??

2015 అదిరింది.... 2016 ఎలా ఉంటుంది..??


మెయిన్ రోడ్ నుంచి గల్లీని చేరిన బిజినెస్ లు..

ఎక్కడో షాపింగ్ మాల్ కౌంటర్ లోనో, లేక ఆన్ లైన్ సెల్లర్ గానో కాదు.. కస్టమర్ వీధి చివర కాచుకుని ఉండటమే తాజా వ్యాపార సూత్రమని చాలా కంపెనీలు గుర్తించాయి, ఇదే క్రమంలో 2015లో చాలా కంపెనీల బిజినెస్ తీరే మారిపోయింది. ఉదాహరణకు అమెజాన్, ఓలా, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, పేటిఎమ్, మొదలైన కంపెనీలన్నీ వీలైనంత లోకల్ గా మారి, కస్టమర్ గడప తొక్కేందుకు తహతహలాడాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు నిత్యావసరాలు, హోమ్ సర్వీసులు అందించే దిశగా తమ వ్యాపారాన్ని విస్తరించాయి. ఇందుకోసం టెక్నాలజీని కావలసినంత ఉపయోగించుకున్నాయి. మొబైల్ యాప్ లతో బిజినెస్ ట్రెండ్స్ లో నూతన శకాన్ని ఆవిష్కరించాయి.

ఈ ట్రెండ్ ఉత్సాహంగా కొనసాగి 2015లో పలు స్టార్టప్ లు దేశంలో పలు నగరాల్లో తమ జెండాను ఎగరేశాయి. 2014లో మొదలైన ఫుడ్ డెలివరీ స్టార్టప్ యుమిస్ట్ కొద్ది కాలంలోనే 2మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించింది. ఇది గుర్గావ్ తో మొదలై సౌత్ ఢిల్లీ, బెంగుళూరు వరకు విస్తరించింది. అదే సమయంలో ఇదే తరహా స్టార్టప్ స్విగ్గి ఢిల్లీ, ముంబయి, పూనె, గుర్గావ్, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వరకు విస్తరించి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు తన సర్వీస్ అందిస్తోంది. అదే సమయంలో హోమ్ సర్వీసులను అందించే హౌస్ జాయ్ గత జనవరిలో 40 ఆర్డర్లు పొందితే, ఏడాది చివరకు 4వేల ఆర్డర్లు పొందేంతగా క్లిక్ అయింది. అదే సమయంలో రతన్ టాటా పెట్టుబడి పెట్టిన అర్బన్ క్లాప్ అదిరిపోయే స్పీడ్ లో దూసుకుపోతోంది. షాపిస్టీ, మొమో, బియాండ్ రెస్టారెంట్స్ లాంటి స్టార్టప్ లు కూడా 2015లో మాంచి ఊపుమీద కనిపించాయి.

మదర్ టంగ్ తోనే కస్టమర్ మనసు గెలవాలి...

దేశంలో దాదాపు 80శాతం జనాభా ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోలేరు. ఈ విషయాన్ని చాలా కంపెనీలు గుర్తించాయి. స్నాప్ డీల్ నుండి, లోకల్ ఈ కామర్స్ స్టార్టప్ స్టోర్ కింగ్ వరకు స్థానిక భాషలవైపు మళ్లుతున్నాయి. వ్యాపార ప్రకటనల రంగంలో ఉన్న క్వికర్ కూడా ఇదే బాటలో ఉంది. ఇక న్యూస్ మీడియాలో యువర్ స్టోరీ 10 భాషల్లో మొదలయి రికార్డ్ సెట్ చేసింది.

మెట్రోలనుంచి మధ్య తరహా నగరాలకు విస్తరిస్తున్న వ్యాపారాలు

2015లో చాలా స్టార్టప్ లు మెట్రోలను దాటుకుని ఇతర నగరాలు, పట్టణాల దిశగా వచ్చేశాయి.. అక్కడ అంతులేని మార్కెట్ ఉందని కూడా గ్రహించాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ ఫాసో.. బరోడా, అహ్మదాబాద్ లాంటి నగరాలకు కూడా విస్తరిస్తే, నిత్యావసరాలు సప్లై చేసే గ్రోఫెర్స్ 17 చిన్న నగరాలకు చేరింది. ఇక ఆటో రిక్షా ఎగ్రిగేటర్ జుగ్నూ మరో స్టెప్ ముందుకేసి ఉదయపూర్ లాంటి చిన్న పట్టణాలకూ చేరింది. ఇక క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్, మేరు లాంటి కంపెనీలు మెట్రోలు దాటుకుని మధ్యస్థాయి నగరాలు పట్టణాల దిశగా వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి..

కార్ పూలింగ్ కు పెరుగుతున్న డిమాండ్

2015 జనవరి లో ఫ్రెంచ్ కంపెనీ బ్లాబ్లా కార్స్ ఎంట్రీతో టాక్సీలను ఉపయోగించటంలో కొత్త ట్రెండ్స్ వచ్చాయి. షేరింగ్ లో కారు ప్రయాణం మొదలయింది. మేరు క్యాబ్స్, ఓలా, కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇక సరి బేసి అంటూ ఢిల్లీ సర్కారు తీసుకునే నిర్ణయం దీనికి మరింత డిమాండ్ తీసుకు రాబోతోంది.

ప్రోత్సాహమే కాదు.. ఎదురు దెబ్బలు కూడా..

2015 చాలా స్టార్టప్ లకు ఉత్సాహం కలిగించిన మాట వాస్తవం. కానీ, వాటిలో అన్నీ జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నాయని చెప్పలేం. చాలా కంపెనీలు ఇంకా బాలారిష్టాలతోనే సతమతమౌతుంటే, మరి కొన్ని పడుతూ లేస్తూ నడుస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు దాదాపు చేతులెత్తేసినంత పనిచేసి వందలాది ఉద్యోగులకు రాంరాం కూడా పలికేశాయి. రియల్ ఎస్టేట్ ప్లాట్ ఫామ్ హౌసింగ్... ఆ సంస్ధ కో ఫౌండర్, సీఈవో రాహుల్ యాదవ్ తో పాటు, 800మంది ఉద్యోగులను కూడా తీసేసింది. ఫుడ్ డెలివరీ కంపెనీ టినీ వూల్ వందమంది ఉద్యోగాలు తీసేయటమే కాదు.. పుణె ఆఫీసును కూడా మూసేసింది. ఇక్కడ ఉద్యోగులు ఆందోళనకు కూడా దిగాల్సి వచ్చింది. ఇదే బాటలో మరికొన్ని స్టార్టప్ లు నడిచాయి. ఈ పరిణామాలు చూస్తే, ఈ తరహా బిజినెస్ లు ఏ మేరకు నిలదొక్కుకుంటాయనే సందేహాలు రావటంలో ఆశ్చర్యం లేదు.

సైట్లను వదిలి యాప్ లలో సెటిల్ అవుతున్న ఈ కామర్స్..

2015లో చాలా కంపెనీలు వెబ్ సైట్లనుంచి మొబైల్ యాప్స్ లుగా మారిపోయాయి. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి కంపెనీలతో ఈ కథ మొదలయింది. ఆ తర్వాత చాలా ఈ కామర్స్ కంపెనీలు యాప్స్ గా మారి అరచేతిలో ఇమిడిపోయాయి. దేశం లో పెరుగుతున్ స్మార్ట్ ఫోన్ల వాడకం దృష్ట్యా వచ్చిన నయా ట్రెండ్ ఇది. పెద్ద పెద్ద కంపెనీలే కాదు.. ఎలానిక్ లాంటి గృహోపకరణాలు, బట్టలకు సంబంధించిన స్టార్టప్ కూడా కేవలం యాప్ మాత్రమే పరిమితం కావటం ఈ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పును సూచిస్తోంది. ఇదే క్రమంలో మింత్ర గత మేలో యాప్ ఓన్లీ సర్వీస్ గా మారింది. అయితే, ఫ్లిప్ కార్ట్ కూడా కేవలం యాప్ గా అందుబాటులో ఉంటుంది అనే వార్తలు వినిపించినప్పటికీ, యాప్ తో పాటు మొబైల్స్ కోసం ఫ్లిప్ కార్ట్ లైట్ ని కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా, స్నాప్ డీల్ కూడా యాప్ తో పాటు స్నాప్ లైట్ ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 70శాతం కొనుగోళ్లు యాప్స్ ద్వారా జరగటం గమనించిన ఈ కామర్స్ కంపెనీలు, ఎక్స్ క్లూజివ్ లీ ఆన్ యాప్స్ పేరుతో పండుగ సమయాల్లో ఆఫర్లు కూడా అందించటం మొదలు పెట్టాయి.

కస్టమర్లను ఆకట్టుకోవాలంటే కొత్త స్ట్రాటజీలు

ఈ కామర్స్ మార్కెట్ ని ఆక్రమించటం మొదలు పెట్టి చాలా ఏళ్లయింది. మొబైల్ యాప్ లకు దిశగా మళ్లడం ద్వారా ఈ ట్రెండ్ లో మరింత మార్పు వచ్చింది. ఇంకో అడుగు ముందుకేసి, లోకల్ స్టోర్స్ ను కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ కస్టమర్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతోంది. ఆన్ లైన్ కామర్స్ సంస్థలు, స్థానిక స్టోర్స్ రెండూ కలసి కస్టమర్ కి సరికొత్త కొనుగోలు అనుభవాన్ని ఇస్తున్నాయి. ఫాష్ ఎలాట్ సంస్థ తన యాప్ ద్వారా కస్టమర్లకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తోంది. స్నాప్ డీల్ సంస్థ తన ఓమ్ని ఛానల్ ప్లాట్ ఫామ్ ని గత అక్టోబర్ లోనే లాంచ్ చేసింది. ఇదే క్రమంలో టాటా, రిలయయ్స్, యునిలివర్, ఆదిత్యబిర్లా గ్రూప్ లాంటి రిటెయిల్ జెయింట్స్ కూడా ఆన్ లైన్ కామర్స్ కు అనుసంధానం అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి సంస్థల ద్వారా అందుబాటులోకి కూడా వచ్చేశాయి

పడుతూ లేస్తూ... స్టార్టప్ లు సాగుతూ..

2015లో ప్రథమార్ధంలో ఫుడ్ స్టార్టప్స్ కు పెట్టుబడుల వెల్లువ సాగింది. ఆ తర్వాత పెట్టుబడులు చాలా మందగించాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 74 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఫుడ్ డెలివరీ స్టార్టప్స్ రికార్డు సృష్టించాయి. కానీ, ఆగస్ట్ నాటికి సీన్ మారిపోయింది. జొమాటో, టినీవూల్, ఫుడ్ పాండా లాంటి సంస్థలు అనేక సమస్యలల్లో పడ్డాయి. ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. స్పూన్ జాయ్, డేజో సంస్థలు నిధుల్లేక అల్లాడితే, ఈట్ లో సంస్థ అక్టోబర్ నాటికే షట్టర్ మూసేసింది. ఫుడ్ డెలివరీ స్టార్టప్స్ కి డెలివరీ టైమ్ సవాల్ గా మారటం, ఆదాయం అంతంత మాత్రంగా ఉండడటం పెద్ద సమస్యగా నిలిచింది. అయితే, ఈ ఒడిడుదుకులు రాబోయే కొత్త ప్రాజెక్టులకు పాఠాలు నేర్పుతాయనటంలో సందేహం లేదు.. 

స్టార్టప్ లకు ఊతమిస్తున్న రతన్ టాటా

టాటా గ్రూప్ చైర్మన్ గా 2012లో బయటికొచ్చిన రతన్ టాటా స్టార్టప్ లను ప్రోత్సహించటం పలు స్టార్టప్ లకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. రతన్ టాటా.. స్నాప్ డీల్, అర్బన్ ల్యాడర్, బ్లూ స్టోన్ లలో 2014లోనే పెట్టుబడులు పెట్టారు. ఇక 2015లో ఏకంగా 11 కంపెనీలకు ఊతాన్నిచ్చారు. ఓలా, పేటీఎమ్, అర్బన్ ల్యాడర్, జియోమి, కార్యా, హోలాఛెఫ్, కార్ దేఖో, లిబ్రేట్ సంస్థల్లో పెట్టబడులు పెట్టారు. ఇక అజీమ్ ప్రేమ్ జీ... మింత్ర , స్నాప్ డీల్ లలో ఆల్ రెడీ ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అమెజాన్ పక్కన నిలబడ్డారు. అత్యంత అనుభవజ్ఞులైన కార్పొరేట్స్ ఇలా ఇస్టార్టప్ లకు ప్రోత్సాహాన్నివ్వటం యువ పారిశ్రామికవేత్తలకు విలువైన పాఠాలు నేర్చుకునే అవకాశాన్నిచ్చిందని చెప్పాలి.

ఇంటిబాటపట్టిన సిలికాన్ వాలీ వ్యాపారవేత్తలు

ఏళ్లుగా విదేశాల్లో బడా కంపెనీల్లో పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్న వాళ్లు చాలా మంది స్వదేశానికి తిరిగి రావటం 2015లో కనిపించిన విశేషం. ఈ క్రమంలో గూగుల్, యాహూ, ఫేస్ బుక్ లాంటి బడా కంపెనీలకు పెద్ద దెబ్బే పడింది. ఆయా సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు చాలామంది ఇక్కడి కంపెనీల్లో బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో చేరారు. మోటారోలాకు ఊపిరిపోసిన పునిత్ సోని ఫ్లిప్ కార్ట్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ గా చేరారు. ఈయన గతంలో గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ గా కూడా పనిచేశారు. గూగుల్ లో పనిచేస్తున్న నికిత్ దేశాయ్ కి ఫ్లిప్ కార్ట్, ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు అప్పగించింది. అదేసమయంలో స్నాప్ డీల్ సిలికాన్ వ్యాలీలో పెద్ద తలకాయలాంటి గౌరవ్ గుప్తాను ఇంజనీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. ఇంకా విక్రమ్ పి కుమార్, మెహుల్ సుతారియా, సంకేత్ అవ్లాని లాంటి ప్రముఖులు సిలికాన్ వ్యాలీని వదిలి స్వదేశం బాట పట్టారు.

కొన్ని కలిసిపోతూ, కొన్ని కైవసం చేసుకుంటూ...

భారత్ లో ఐపీవోకి వెళ్లటం అంత తేలిక కాదు. అందుకే మెర్జ్ అవటం లేదా, కైవసం చేసుకునే ప్రక్రియలను ప్రిఫర్ చేస్తుంటారు. 2015లో ఈ ట్రెండ్ బాగా నడిచింది. ఇలా దాదాపు 200 కంపెనీల రాతలు మారాయి. ఉదాహరణకు ఫ్రీఛార్జ్ ని.. స్నాప్ డీల్, టాక్సి ఫర్ ష్యూర్ ని ఓలా, బేబీఓయ్ ని మహీంద్రా, క్విక్ వెల్ మరియు ఇన్ స్టా హెల్త్ లను ప్రాక్టోలు కైవసం చేసుకున్నాయి. ఇదిలాగే కంటిన్యూ అవుతూ 2016లో ఈ ట్రెండ్ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లాభాలే కాదు.. సేవ కూడా చేస్తాం..

మార్కెట్ ని కైవసం చేసుకునే స్ట్రాటజీలే కాదు.. కస్టమర్లు కష్టంలో ఉంటే మానవత్వంతో స్పందించే లక్షణం కూడా తమకుందని 2015లో చాలా స్టార్టప్ కంపెనీలు రుజువు చేసుకున్నాయి. దీనికి చెన్నై వరదలు పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఓలా బోట్స్ ని ఏర్పాటు చేయటం, ఉబర్ ఉచిత రవాణా అందించటం, పేటీఎమ్ మొబైల్స్ కు ఫ్రీ రీచార్జ్ చేయటం జోమాటో ఉచిత భోజనాన్ని అందించటం లాంటి చర్యలతో ఆకట్టుకున్నాయి. ఇక డేటా కలెక్షన్ స్టార్టప్ సోషల్ కాప్స్ చెన్నైలోనే కాదు నేపాల్ భూకంపం వచ్చినపుడు కూడా ఇదీ రీతిలో స్పందించింది. ఇలా 2015లో బ్రహ్మాండమైన టేకాఫ్ తీసుకున్నఅనేక స్టార్టప్స్ 2016లో ఏ మలుపు తీసుకుంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది.


Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India