అమ్మ కష్టం చూడలేక అద్భుత యంత్రాన్ని ఆవిష్కరించాడు

By team ys telugu
January 17, 2017, Updated on : Thu Sep 05 2019 07:16:30 GMT+0000
అమ్మ కష్టం చూడలేక అద్భుత యంత్రాన్ని ఆవిష్కరించాడు
మల్లేశం ఆశయానికి ఆర్ధిక చేయూతనిస్తున్న ఫుయెల్ ఏ డ్రీం
  • +0
    Clap Icon
Share on
close
  • +0
    Clap Icon
Share on
close
Share on
close

చేతులు లాగుతున్నాయి బిడ్డా అంటే.. ఆ కొడుకు మనసు తల్లడిల్లిపోయింది. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే ఏం చేయాలో తెలియలేదు ఆ కొడుక్కి. అమ్మ కష్టం గట్టెక్కేదెలా..? భుజం నొప్పినుంచి తల్లిని దూరం చేసేదెలా? ఏ దారీ కనిపించలేదు. ఏం చేయాలి...? కాదు.. ఏదో ఒకటి చేయాలి. అంతులేని మానసిక సంఘర్షణ. మెదడులో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి. మెరుపులాంటి ఐడియా తట్టింది. చిమ్మచీకట్లో ఒక కాంతిపుంజం మస్తిష్కం చుట్టూ వెలిగింది. ఆ వెలుతురు పేరు ఆసుయంత్రం. అమ్మకోసం కనిపెట్టాడు కాబట్టే ఆమెపేరు మీదనే లక్ష్మీ ఆసుయంత్రం అని పేరుపెట్టాడు.

చింతకింది మల్లేశం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట అనే ఒక మారుమూల గ్రామీణ నేతకారుడు. నిరుపేద చేనేత కుటుంబం. రోజంతా పనిచేస్తే గానీ రాత్రికి పళ్లెంలో నాలుగు మెతుకులు కనిపించవు. ఒక చీర ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9వేల సార్లు (12-13 కిలోమీటర్ల దూరం) అటూ ఇటూ తిప్పాలి. అలా రోజికి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితేగానీ(25కి.మీ దూరం) రెండు చీరలు తయారుకావు. మెడ లాగేస్తుంది. వేళ్లు పీక్కుపోతాయి. భుజం పట్టేస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. తల్లి పడుతున్న బాధ మల్లేశాన్ని కదిలించింది.

తల్లిని ఆ గండం నుంచి గట్టెక్కించాలన్న ఆలోచన వచ్చింది. ఒక మెషీన్ లాంటిది కనిపెడితే ఎలా వుంటుందీ అని అనుకున్నాడు. చేనేత కుటుంబాలతో ఐడియా షేర్ చేసుకున్నాడు. కానీ వాళ్లు అది అయ్యేపనికాదు వదిలేయ్ అన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ లేదని నిరుత్సాహ పరిచారు. దానికయ్యే ఖర్చు గురించి ఆలోచించావా అని హెచ్చరించారు. అయినా మల్లేశం ఆశ సజీవంగా వుంది. సాధించి తీరుతాననే నమ్మకం ఉంది. ఇక్కడే ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హైదరాబాద్ వచ్చాడు. అక్కడే ఒక పార్ట్ టైం జాబ్ చూసుకున్నాడు. 

image


మనసంతా ఆసుయంత్రం మీదనే ఉంది. పరిశోధిస్తూ, ఒక్కో కాంపోనెంట్ జతచేసుకుంటూ, ఆలోచనలకు పదును పెడుతూ పోయాడు. పార్టులు పార్టులుగా యంత్రాన్ని తయారుచేశాడు. ఏడేళ్లు గడిచేసరికి అనుకున్నట్టే యంత్రం కొలిక్కివచ్చింది. పనిచేస్తోంది. ప్రాణాలు లేచివచ్చాయి. ఇంటిదగ్గర తల్లి కళ్లముందు కదలాడింది. అమ్మకు ఇక ఎలాంటి కష్టం ఉండదని కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక్క తన తల్లికోసమే కాదు.. తన ఊరిలో చేనేత కుటుంబాల్లో ఎందరో తల్లులు కిలోమీటర్ల దూరం పొడవుంటే కండెల్ని చుడుతూ రోజంతా నరకయాతన పడుతున్నారు. వాళ్ల బాధలను గట్టెక్కించాలని తపన పడ్డాడు.

మిషన్ అంటే యంత్రాలతో హడావిడిగా వుండదు. రెండు తక్కువ కెపాసిటీ గల మోటార్లు, వుడ్ ఫ్రేమ్. అంతే. దీని ద్వారా ఎలాంటి ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా ఒక చీరకు అవలీలగా ఆసు పోయవచ్చు. అలా ఒకరోజులో ఇంటిపని వంటపని చూసుకుంటూనే వీలైనన్ని చీరలకు ఆసుపోయవచ్చు. టైం చాలా ఆదా అవుతుంది. ప్రొడక్షనూ పెరుగుతుంది. రోజులో రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం వచ్చాక 6-7 నేస్తున్నారు. మామూలు ఆసు యంత్రం ద్వారా ఒక చీర నేయడానికి 5-6 గంటలు పడుతుంది. ఈ మిషన్ ద్వారా అయితే గంటన్నరలో అయిపోతుంది. దీన్ని జస్ట్ పర్యవేక్షిస్తే సరిపోతుంది.

అమ్మకోసం పడ్డ తపన అందరి కన్నీళ్లనూ తుడుస్తోంది. తల్లి భుజం కోసం పడిన శ్రమ అందరి జీవితాలను భుజాన వేసుకునేలా చేసింది. ఇప్పటిదాకా 800లకు పైగా ఆసు యంత్రాలను తయారు చేశాడు. ఒక్కోదాని ఖరీదు 25వేలు. మొదట్లో 13వేలకే అమ్మాడు. దేశవ్యాప్తంగా ఆసుయంత్రం కొనుగోలు చేస్తున్నారు.

image


ఆరో తరగతిలోనే చదువు ఆపేసి 8 ఏళ్లు కష్టపడి లక్ష్మీ ఆసుయంత్రం ఆవిష్కరించిన మల్లేశం దేశవ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. 2000 సంవత్సరంలో ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. ఏడాది తిరిగేలోపు 60 మిషన్లు తయారు చేశాడు. 2002 నుంచి 2004 వరకు ఏడాదికి వంద మిషన్ల చొప్పున తయారు చేశాడు. 2006లో మిషన్ కు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు జతచేశాడు. 2009లో ఆసుయంత్రం ఆసియాలో ద బెస్ట్ అని అమెరికాకు చెందిన పాబ్ లాబ్స్ ప్రశంసించింది.

 అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. 2010లో యంత్రంమీద పేటెంట్ హక్కులొచ్చాయి. అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు వచ్చింది. 2011లో ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది. ఇలా అనేక ప్రశంసలు, అవార్డలు, రివార్డులు అందుకున్న మల్లేశం ఆశయం ఒకటే. వీలైనన్ని చేనేత కుటుంబాలకు లక్ష్మీ ఆసుయంత్రాన్ని సరఫరా చేయాలి.

మారుమూల పల్లెలో పుట్టి, ప్రపంచం మెచ్చే యంత్రాన్ని తయారు చేసిన మల్లేశం ఆశయానికి అండగా నిలబడింది ఫుయెల్ ఏ డ్రీం సంస్థ. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నాలుగు లక్షలు సేకరించి మల్లేశానికి సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరో వారం రోజులు గడువుంది. టార్గెట్ దగ్గరికి వచ్చింది. 3లక్షల 80వేలకు పైగా కలెక్టయ్యాయి. మొదట 3.5 లక్షలే అనుకున్నారు. కానీ క్యాంపెయిన్ కు విపరీతమైన రెస్పాండ్ రావడంతో టార్గెట్ నాలుగు లక్షలు చేశారు. ఈ మొత్తంతో 20 చేనేత కుటుంబాలను నిలబెట్టాలని సంకల్పించారు.

ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న మల్లేశం

ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న మల్లేశం


బెంగళూరుకు చెందిన ఫుయెల్ ఏ డ్రీమ్.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ద్వారా సోషల్ సర్వీస్ చేస్తుంది. సంస్థ ఫౌండర్ కమ్ సీఈవో తోట రంగనాథ్. ముంబై యూనివర్శిటీ నుంచి బీఈ, ఎంబీయే చేశారు. గోద్రెజ్, వర్ల్ ఫూల్, హిందుస్తాన్ టైమ్స్, పెప్సీ వంటి ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో సెంటర్ హెడ్ గా, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు చేతనైనంత మేర సాయం చేయడం.. ఆర్ధిక స్తోమత లేక అడుగున పడిపోయిన క్రియేటివ్ ఐడియాలకు ఫైనాన్షియల్ గా ఊపిరిపోయడం.. ఫుయెల్ ఏ డ్రీం అనే సంస్థను ఆశయం.

పేదరికం వల్ల మరుగున పడిపోతున్న ఎందరో టాలెంటెడ్ వ్యక్తులకు పైకి తెచ్చి, ప్రపంచానికి దూరంగా బతుకీడుస్తున్న నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపి, వారికి ఆర్ధికంగా సామాజికంగా చేయూతనిస్తున్న ఫుయెల్ ఏ డ్రీంతో మనసున్న మారాజులెవరైనా చేతులు కలపొచ్చు అంటున్నారు రంగనాథ్.

క్యాంపెయిన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి