పేదల ఆకలిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు !

అతడు ఆస్తిలో శ్రీమంతుడు కాదు.. కానీ ఆకలిగొన్న వాళ్ల పాలిట మాత్రం దేవుడే..తనలా ఆకలితో ఎవరూ అలమటించొద్దనే ఈ సాహసం..చేసేది చిరువ్యాపారమే అయినా రోజూ 150 మందికి అన్నదానం..

పేదల ఆకలిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు !

Saturday July 25, 2015,

3 min Read

మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని సంబరపడిపోతున్న ఈ రోజుల్లో కూడా ఆకలితో చనిపోయేవారున్నారు. గజం నీడ, పిడికెడు అన్నం కూడా దొరకని వారు కోట్లల్లో ఉంటారు. ఇక స్వయంగా అలాంటి జీవితాన్ని అనుభవించి, ఆకలి విలువ తెలిసిన ఈయన, ఈ రోజు వందల మందికి కడుపునిండా అన్నం పెట్టే దేవుడిగా మారాడు.

image


ఇప్పటికీ ఇతని దగ్గర సొంత ఇల్లు లేదు, సొంత షాపు లేదు, అద్దె ఇంట్లో ఉంటూ, అద్దె షాపులో చిన్న వ్యాపారం చేసుకుంటూ, తనకు వచ్చిన ఆదాయం నుండే ప్రతీ రోజూ సుమారు 150 మందికి ఉచితంగా అన్నం పెట్టి ఈ సమాజానికే ఆదర్శంగా నిలుస్తున్నారు సయ్యద్ ఉస్మాన్ అజ్హర్ మక్సూసీ.

ఆకలిగొన్నవారికి స్వయంగా తానే వడ్డిస్తున్న అజ్హర్

ఆకలిగొన్నవారికి స్వయంగా తానే వడ్డిస్తున్న అజ్హర్


హైదరాబాద్‌లోని డబీర్‌పురా ఫ్లై ఓవర్ కింది నుండి వెళ్తున్న అజ్హర్, ఓ రోజు ఆకలితో మూడు రోజుల నుండి నరకయాతన అనుభవిస్తున్న లక్ష్మి అనే వృధ్ధురాలిని చూసారు. ఆకలి విలువేంటో తెలిసిన అజ్హర్, ఆ రోజు నుండి అన్నదానం చేస్తూ తనకు తోచిన సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 2011లో అదే బ్రిడ్జ్ కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం, ఇప్పటికీ ప్రతీ రోజూ ఉచితంగా సుమారు 150 మందికి అన్నదానం చేసే స్థాయికి వచ్చింది.

అన్నదాన శిబిరంగా మారిన ఈ బ్రిడ్జ్ కింది స్ధలంలో కూర్చుని భోజనం చేయడానికి కులమత బేధాలు ఉండవు. ఆకలిగొన్న వారు ఎవరైనా ఇక్కడికి వచ్చి కడుపారా తిని వెళ్లొచ్చు.

image


అజ్హర్ కహానీ

హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో పుట్టి పెరిగిన అజ్హర్, చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. ముగ్గురు అన్నదమ్ములు, ఓ చెల్లి , అమ్మ, ఇది ఈయన కుటుంబం. అప్పట్లో రెండు, మూడు రోజుల పాటు ఆకలితో అలమటిస్తూ గడిపిన రోజులు తనకు ఇప్పటికీ బాగా గుర్తు. 5వ తరగతికే చదువును ఆపేసిన అజ్హర్, ఓ టైలర్ షాపులో రోజుకు రూపాయి వేతనంపై పని చేసేవారు. కొంత కాలం తరువాత మరో షాప్‌లో ఉద్యోగం చేస్తున్న అజ్హర్, అదే షాప్ ను 7 వేలకు కొనేసారు. ఇక తన సొంత షాపులో టైలరింగ్ నేర్చుకున్న అజ్హర్‌కు ఆ వ్యాపారం అచ్చి రాలేదు. కొంత కాలం గ్లాస్ వర్క్ చేసి ఆ తరువాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు చేసే ఓ కాంట్రాక్టర్ దగ్గర రోజుకు 40 రుపాయల వేతనానికి ఉద్యోగం చేసారు. క్రమంగా పని నేర్చుకున్న ఆయనకు, 2000 సంవత్సరంలో సొంతంగా కాంట్రాక్ట్ తీసుకుని అవకాశం దొరికింది. అప్పుడు ఆయనకు లభించిన ఆదాయం 5వేలు.

“ తొలి సారి ఐదు వేల రూపాయలు చూశాను.500 రుపాయల నోట్లను తాకినందుకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదంటారు అజ్హర్ ”.

2001లో 1500 రుపాయలకు భార్య రింగ్ అమ్మి, సుమారు 4 -5వేల పెట్టుబడితో తన సొంత షాపు ప్రారంభించారు. ఇప్పటికీ అదే అద్దే షాపులో తన చిరు వ్యాపారం చేస్తుంటారు అజ్హర్.

పెళ్లై ముగ్గరు పిల్లలు ఉన్న అజ్హర్‌కు, ఈ కార్యక్రమాల్లో భార్య సహకారం కూడా ఎంతో ఉంది. “ముందు రెండు నెలలు ఇంత మందికి తనే వండి పెట్టేది, ఆ తరువాత ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు చూసి, నేనే ఓ వంట మనిషిని పెట్టుకున్నా” అంటారు అజ్హర్.

ఇతర సేవా కార్యక్రమాలు

అన్నదానంతో పాటు మలక్‌పేట్ ప్రాంతంలో ఓ చిన్న క్లినిక్ కూడా పేదల కోసం ప్రారంభించారు. అక్కడ డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు మందులు కూడా ఫ్రీ. ప్రతీ రోజూ సాయంత్రం 8 నుండి 10:30 వరకూ ఈ క్లినిక్ అక్కడి పేదలకు వరం. వైద్యంతో పాటు విద్యను కూడా అందించాలనే కోరిక అజ్హర్‌లో ఉంది. అందుకు ఓ చిన్న ఫ్లాట్ అద్దెకు తీసుకుని 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్ధులకు ఉచితంగా ట్యూషన్ కూడా ప్రారంభించారు. సానీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రారంభించిన ఈ అకాడమీని క్రమంగా విస్తరించాలనే కోరిక ఉందంటున్నారు అజ్హర్.


స్ప్లాష్ హార్ట్ ఆఫ్ గోల్డ్ సంస్ధ అందిస్తున్న అవార్డుతో

స్ప్లాష్ హార్ట్ ఆఫ్ గోల్డ్ సంస్ధ అందిస్తున్న అవార్డుతో


అపరిచితుల సహాయం

ఈ కాలంలో కూడా మానవత్వం ఇంకా ఉందని చెప్పుకోవడానికి ఇదో మంచి ఉదాహరణ. ఓ రోజు దారి తప్పి డబీర్‌పురా బ్రిడ్జ్ నుండి వెళ్తున్న ఓ ఎన్‌ఆర్‌ఐ, పేదలకు అన్నం వడ్డిస్తున్న అజ్హర్‌ని చూసారు. ఇది నిజమేనా అని అనుమానించిన ఆయన, తన బంధువులతో ఎంక్వైరీ కూడా చేయించారు. అజ్హర్ సేవా స్ఫూర్తి నచ్చి అప్పటి నుండి ఆ అపరిచితుడు ప్రతీ నెల 400 కిలోల బియ్యం అందేలా సహాయం చేస్తున్నారు. అంతే కాకుండా, అజ్హర్ గురించి ఫేస్ బుక్ ద్వారా, ఇతరుల ద్వారా సమాచారం తెలుసుకున్న వారు కూడా అక్కడికి వచ్చి మరీ అన్నం వడ్డించడం, తోచినంత సహాయం చేస్తుంటారు. అయితే అజ్హర్ మాత్రం ఇప్పటికీ తను చేస్తున్న ఈ కార్యక్రమం కోసం ఏ ఒక్కరితో సహాయం కోరరు.

“ నాతో అయినంత కాలం నేను చేస్తాను, ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయచ్చు తప్ప, ఏదో ఆశించి మాత్రం ఈ కార్యక్రమం చేయనని అంటున్నారు అజ్హర్.”
image


అల్లాదయ ఉంటే దేశమంతా విస్తరిస్తా !

ఆకలి ఏ ఒక్క మతాన్ని చూసో, కులాన్ని చూసో కలగదని, మతాలు కులాల కన్నా మానవత్వం ముందుండాలంటారు అజ్హర్. కుల మతాల తేడా లేకుండా అన్నదానం చేస్తున్న అజ్హర్, భవిష్యత్తులో దేవుడు తలుచుకుంటే దేశం మొతం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే కోరిక ఉందని అంటున్నారు. ఆకలితో ఏ ఒక్కరు చావకూడదని, త్వరలో ఇలాంటి కార్యక్రమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తానని అంటున్నారు. అతని సేవా తత్పరత చూసి కొన్ని విదేశీ సంస్థలు అతని సత్కరించాయి. స్ప్లాష్ హార్ట్ ఆఫ్ గోల్డ్ సంస్థ దుబాయిలో ఓ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తనకు ఓ అవార్డును బహకూరించింది. ఇలాంటి వాటి వల్ల తనలో ఇంకా ధైర్యం పెరగడంతో పాటు ఇంకా ఏదైనా చేయాలనే కోరిక బలపడ్తుందని ముగిస్తారు అజ్హర్.

https://www.facebook.com/Azharmaqsusi1/timeline