13 కంటి ఆపరేషన్ల తర్వాత 14 కంపెనీలు ప్రారంభించాడు. అతని నమ్మకం ముందు చూపు కూడా చిన్నబోయింది
ఓ సాధారణ వ్యక్తి.. కోలుకోలేని ఎదురుదెబ్బను తట్టుకుని విజయం సాధిస్తే... ఆ వ్యవస్థాపకుడిని ఏమనాలి ? విధిరాత కారణంగా జరిగిందో... లేక ప్రమోదంలో ఏర్పడిన ప్రమాదం కారణంగా ఏర్పడిందో... ఏది ఏమైనా వైకల్యాన్ని ఎదిరించి నిలిచి గెలిచిన వ్యక్తి నవీన్. తనకు చూపు లేకపోవడాన్ని జాన్ మిల్టన్ ఒక పద్యంలో ప్రశ్నిస్తారు.
“ దేవుడా, నువ్వేమైనా రోజు కూలీనా ? వెలుతురు లేనప్పుడు కూడా సృష్టి జరుపుతుంటావా ” అని ప్రేమతో అడిగాడు.
దీనికి సమాధానం కూడా ఆయనే ఇచ్చాడు.
“దేవుడికి ఏ వ్యక్తి సాయమూ అవసరం లేదు. ఆయన పెట్టే కష్టాలను ఎవరైతే ఇష్టంగా భరిస్తారో.. వారికే ఎక్కువ సాయం చేస్తాడాయన. అలాంటి వారికి రాజు లాంటి వైభోగం దక్కుతుంది. సమస్యలు ఎదురైనా సరే... ఎవరైతే వారికి ఎదురొడ్డి నిలిచి, ఎదురుచూడగలిగేవారి పక్షానే దేవుడు నిలుస్తాడు.”-జాన్ మిల్టన్
ఇప్పుడున్న స్థాయిలో అప్పుడు వైద్య సదుపాయాలు లేకపోయినా.. ఉన్న కొన్నింటిని కూడా ఉపయోగించుకోకుండా... తన మిగిలిన జీవితాన్ని గుడ్డివాడిగానే గడిపారు జాన్ మిల్టన్. “ వైద్యులు కూడా తమ మాట విని, తమ కోసం ఎదురుచూసినవారే సేవలు చేయగలరు. అంటే వారు కూడా దేవుడి లాంటి వారే. ఆ సమయంలో, అంటే తాను చూపు పోగొట్టుకున్న తర్వాతే, మాస్టర్‌పీస్‌గా పేరుగాంచిన పారడైజ్ లాస్ట్‌ను కంపోజ్ చేశారు మిల్టన్.
నవీన్ జీవితం మారిపోయిన క్షణాలు
అది 1997 సంవత్సరం, ఆగస్ట్ నెల. అప్పటికి నవీన్ లక్కూర్‌కి పెళ్లయి మూడేళ్లు కావస్తోంది. అయితే.. అప్పటివరకూ తన భార్యతో సరిగా సమయాన్ని వెచ్చించలేకపోయారు ఆయన. కారణం.. అప్పటికి మూడేళ్ల క్రితం తానే ప్రారంభించిన వెంచర్ కోసం కష్టపడ్డమే. ఆ సమయంలో నవీన్‌కు తన స్నేహితుడి నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. స్వాతంత్ర్య దినం సందర్భంగా వచ్చిన వీకెండ్‌లో... ఫ్రెండ్, అతని బావమరుదులతో ఎంజాయ్ చేసేందుకు పిలుపు వచ్చింది. అంతే... బ్యాగ్ సర్దుకుని చెన్నై బయల్దేరాడు నవీన్. ఈ ప్రయాణం భవిష్యత్తును మార్చేస్తుందని తెలిస్తే వెళ్లేవాడు కాదేమో.
చెన్నై చేరుకున్నాక.. స్నేహితుడి కుటుంబాన్ని కలిసిన నవీన్... వారితో కలిసి ఎంజీఎం డిజ్జీ వరల్డ్‌కు వెళ్లారు. ఆయనకు నీళ్లంటే ప్రాణం. థీమ్ పార్క్‌లోని స్ల్పాష్ పూల్‌కి వెళ్లారు అందరూ. నవీన్ నీటిలో దిగగానే.. అప్పటికే అక్కడ ఉన్నవారు.. మొహం మీదకు నీళ్లను చల్లారు. చల్లడమంటే అదేమీ చిన్నగా కాదు... చాలా వేగంగా, ఊపిరి తీసుకోలేనంత బలంగా... నీళ్లు మొహంపై, కళ్లపై పడ్డాయి నవీన్‌కు.
ఓ వారం గడిచింది. షారూక్‌ఖాన్ నటించిన పర్దేశ్ మూవీ నైట్ షో చూస్తున్నాడు నవీన్. ఆ సమయంలో కళ్లు షేక్ అవుతున్నట్లుగాను, కంటి ముందు నీరు జలపాతంగా కారుతున్నట్లు అనిపించింది. అప్పుడు ఎడమ కన్ను మూసి, కుడి కంటితో చూస్తే.. అంతా బాగానే అనిపించింది. అదే కుడి కన్ను మూసి, ఎడమ కంటితో చూస్తే మాత్రం.. మళ్లీ అదే నీటి చారికలు తప్ప ఏం కనిపించలేదు. మరుసటి రోజు సాయంత్రం కంటి వైద్యుడిన కలిసిన నవీన్.. జీవితంలో మొదటిసారి పెద్ద షాక్ తిన్నాడు.
“మీ కన్ను ఒకటి పూర్తిగా చూపు కోల్పోయింది. బహుశా జీవితంలో మళ్లీ ఆ కంటితో మీరు చూడలేకపోవచ్చు”అన్నారు ఆ నేత్రవైద్యుడు. అలాగే రెటీనా స్పెషలిస్ట్‌ను కన్సల్ట్ చేయాలని సలహా ఇచ్చారు.
రెటీనా స్పెషలిస్ట్ మరో దుర్వార్త చెప్పారు నవీన్‌కు. రెటీనా పూర్తిగా దెబ్బతిందని.. సర్జరీ చేయక తప్పదని, మరుసటి రోజు ఉదయమే జాయిన్ కావాలని సూచించారు. అప్పటికే తను ఆంట్రర్‌ప్రెన్యూర్ కావడంతో.. వారం రోజులపాటు హాస్పిటల్‌లో ఉండలేనని, 3 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయాలని... డాక్టర్‌ను ఒప్పించారు నవీన్. కంటిపై అత్యంత వేగంగా, బలంగా నీరు పడ్డమే... ఈ సమస్యకు కారణమైందని తేల్చిచెప్పారు రెటీనా స్పెషలిస్ట్. ఆ నీళ్లు రాళ్ల మాదిరిగా కంటిపై ప్రభావం చూపాయని వివరించారు డాక్టర్.
రెటీనా స్పెషలిస్ట్ డా.వై.ఎల్. రాజశేఖర్... సర్జరీ పూర్తయిన తర్వాత, చూపు రావడానికి 20శాతం మాత్రమే అవకాశమున్నట్లు ఇంకో పిడుగులాంటి వార్త చెప్పారు. అయితే... నవీన్ కష్టాలు ఇక్కడితో తీరిపోలేదు. అంతేకాదు మరికొంత కాలంలో పూర్తిగా గుడ్డివాడిగా మారిపోయే ప్రమాదమూ ఉందని డాక్టర్లు షాక్ పై షాక్ ఇస్తూనే వచ్చారు. కుడికంటి రెటినాలోనూ పగులు ఏర్పడిందని చెప్పడంతో... ఆ కంటికి కూడా అదే తరహా ఆపరేషన్ తప్పలేదు. దీంతో ఆయన పూర్తిగా చూపు కోల్పోయారు. చూపు వచ్చేందుకు అంతో, ఇంతో అవకాశాలు ఉన్నాయని చెప్పడమే... మిగిలిన ఆశంతా. ఆ తర్వాత మరో 3 నెలలు పొట్ట బెడ్‌కు ఆనేలా.. బోర్లా పడుకోవాలని చెప్పారు డాక్టర్. వెన్నుపై భారం పడితే.. రెటీనా దెబ్బతింటుందని తెలిపారు. దీంతో.. ఈ సమయమంతా.. నవీన్ బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
సంక్షోభంలో నేర్చుకున్న పాఠాలు
కదల్లేని పరిస్థితుల్లో ఉన్న నవీన్... ఉద్యోగం, వ్యాపారం కాకుండా... తానేం చేయగలనని ఆలోచించారు. తాను టెలిఫోన్ ఆపరేటర్ విధులు నిర్వర్తించగలనని అనుకున్నారు కూడా. భవిష్యత్ అంతా అంధకారమే అనిపిస్తున్న సమయంలో.. రాజేష్ శెట్టి అనే స్నేహితుడు రాసిన ఓ లెటర్‌లోని కొన్ని పదాలు నవీన్ ఆలోచనల్లో మార్పునకు కారణమయ్యాయి. “ సమస్యలన్నీ హీరోలకే వస్తాయి, ఎందుకో తెలుసా ? హీరోలు వాటిని అధిగమించలరు కాబట్టి ”అని రాజేష్ లేఖలో ఉంది.
ఈ మాటలు నవీన్‌ను మళ్లీ సొంతకాళ్లపై నిలబడేలా చేశాయి. స్నేహితులను పిలిచి, తన పరిస్థితిని సమూలంగా వివరించారాయన. ప్రకాష్ వెంకటేషన్ అనే స్నేహితుడు... నవీన్ చేయగల 20 ఉద్యోగాల జాబితాను అందించారు కూడా. దీంతో సమస్తం కోల్పోయానని అనకుంటున్న అతనికి... మళ్లీ ఆశలు చిగురించడం ప్రారంభించాయి. అంతలోనే.. తన వెంచర్ సి డిజైన్ సిస్టమ్స్‌లో పని చేస్తున్న 11మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపి, ఆఫీస్ తాళాలు చేతిలో పెట్టి వెళ్లిపోయారు.
పరిస్థితి అర్ధం చేసుకున్న నవీన్.. ఇక రంగంలోకి తానే దిగక తప్పలేదు. భార్య, మరికొందరు స్నేహితుల సాయంతో.. తిరిగి ఆఫీస్‌ను ఓపెన్ చేసి, ఆరు నెలల కాలంలోనే వ్యాపారాన్ని రెట్టింపు చేయగలిగారు. జీవితంలో అనుకోని, కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినా... అంతా చీకటి తప్ప ఇంకే మిగల్లేదనే పరిస్థితి తలెత్తినా.. ఓటమి అంగీకరించని నైజమే.. ఈ తొలి సక్సెస్‌కు కారణం. శారీరకంగా లోపం ఏర్పడినా... సానుకూల దృక్పథంతో వేసిన ముందడుగు.. ఆ నెప్పి తెలీకుండా చేయడమే కాదు... ఓ లక్ష్యాన్ని నిర్దేశించింది.
“ఒక తలుపు మూస్తే... మరో తలుపు తెరవాల్సిందే”. ఇది ప్రముఖ కొటేషన్. సరిగ్గా నవీన్‌కి ఇలాంటి బ్రేక్ మరొకటి లభించింది. గతంలో నవీన్ కోసం 20 రకాల ఉద్యోగాలను సూచించిన ప్రకాష్ వెంకటేశన్.. వేయింగ్ బ్రిడ్స్ స్టాక్ కోసం.. ఓ సాఫ్ట్‌వేర్ కావాలంటూ వచ్చారు. దేశవ్యాప్తంగా వ్యాపారం ఉన్న ప్రకాష్.. స్టాక్ డీటైల్స్, సప్లై-డిమాండ్ డేటాను సరిచూసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్నిసార్లు ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. మరికొన్నిసార్లు సేల్స్ లేక గోడౌన్‌లో డెడ్ స్టాక్ మూలగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రకాష్‌కు ప్రాస్పెక్ట్ మేనేజ్మెంట్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను అందించారు నవీన్. దీని ద్వారా స్టాక్, సప్లై, డిమాండ్లను సరిగా నిర్వహించుకోవడానికి వీలవుతుంది. వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది.
మూడేళ్లలో 13 ఆపరేషన్లు
2000 సంవత్సరం గడుస్తోంది. అఫ్పుడే నవీన్ జీవితంలో కొంత శాంతి ఏర్పడుతోందని అనుకునేంతలోనే... మళ్లీ కంటి సమస్య మొదలైంది. అంతో ఇంతో కనపడుతున్న కన్ను.. మళ్లీ సమస్యలు తెచ్చిపెట్టింది. కనీసం చూడలేకపోతుండడంతో.. డయాగ్నైజ్ చేయక తప్పలేదు. ఆ తర్వాత చూపు సరిచేసేందుకుగాను.. మూడేళ్లలో 13 ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది. వరుసగా ఇలా కంటి సమస్య తలెత్తడంతో... నవీన్ మరోసారి డిప్రెషన్‌కు గురయ్యారు. తన జీవితాన్ని నాశనం చేసేందుకే... కంటి చూపు ఇలా ఇబ్బంది పెడుతోందని భావించారు.
చూపు రావడం, పోవడం జరుగుతుండడంతో... ఆయనకు చికిత్స చేసిన ఒక డాక్టర్... సత్యసాయిబాబా దగ్గరకు వెళ్లాలని సూచించారు. దీంతో దసరా రోజున పుట్టపర్తి వెళ్లారు నవీన్. ఇక్కడ ఈయన జీవితం భక్తివైపు మళ్లింది. చూపు తప్పకుండా వస్తుందంటూ.. అభయం దక్కింది. దేవుడిపై స్థిరమైన నమ్మకం ఉంచడం, ఎక్కువగా కాంటాక్ట్‌లో ఉండడంతో.. తనకు ఎదురవుతున్న సమస్యలను ప్రశ్నల రూపంలో సంధించి, కావాల్సిన జవాబులను పొందారు నవీన్. సత్యసాయిబాబా ఆశీస్సులతోనే... తనకు తిరిగి చూపు దక్కిందని నమ్ముతారు నవీన్.
ఒక కొత్త ప్రారంభానికి నాంది
జీవితంలో అనేక ఒడిదుడుకులు చవిచూసిన నవీన్... ఇప్పుడు పూర్తిగా మారిన వ్యక్తి. తాను తిరిగి కోలుకునేందుకు సాయం చేసిన ఎంతోమందికి, చివరికి ఆ భగవంతుడితో సహా అందరికీ కృతజ్ఞతలు చెబ్తున్నారు. ఇప్పుడాయన కంటిచూపు కొంత తిరిగొచ్చింది. తన ముందు ఉన్నవాటిని మాత్రమే ఆయన చూడగలరు. పక్కన, పైన, కిందవైపులు ఆయనకు కనపించదు. గుర్రాలకు... ముందు తప్ప మరేం కనిపించకుండా అడ్డంగా బ్లైండర్స్ కడతారు. నవీన్ పరిస్థితి కూడా అలాంటిందే. ఇలాంటి పరిస్థితితో కొన్ని చిక్కులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినా... చేస్తున్న పనిని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. తనను తాను తిరిగి నిర్వచించుకున్నారు నవీన్. ఆయన స్టైల్‌లో చెప్పాలంటే... “నవీన్ లక్కూర్‌కి చూపు పరిమితమే... కానీ దృష్టి మాత్రం అపరిమితం. దేవుడి దయతోనే ఇదంతా సాధ్యం.”
తన 14 ఆలోచనలకు ప్రాణం పోసి విజయవంతమైన వ్యాపారాలుగా మార్చడంలో నవీన్ కృషి చాలా ఉంది. తాజాగా ఈయనకు అమెరికాలోని ఛాప్టర్ ఆఫ్ విస్టేగ్ గ్రూప్(సీఈఓస్ ఫోరమ్) కార్యక్రమంలో మాట్లాడాలంటూ ఆహ్వానం అందింది. సీరియల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్... నవీన్ మాట్లాడాలనుకున్న టాపిక్. అయితే.. ఆడిటోరియంలో బిలియన్ డాలర్ వ్యాపారాలు నిర్వహిస్తున్న దిగ్గజాలు ఉన్నారని గ్రహించిన ఈయన... తన టాపిక్‌ను "ప్రాబ్లెమ్స్ ఆర్ రిలెటివ్స్"కు మార్చుకున్నారు. తన జీవితాన్ని మెల్లగా చెప్పడం ప్రారంభించారు. తనకు ఎదురైన భయంకరమైన అనుభవం, చూపు పోగొట్టుకోవడం, మళ్లీ ప్రపంచాన్ని చూడాలని తహతహలాడ్డం.. అన్నీ వివరించారు. చివరకు నా దృష్టిని పెంచుకునేందుకు చూపును పోగోట్టుకున్నాను. దాని ఫలితమే 14 విజయవంతమైన వ్యాపారాలు”అని చెప్పారు నవీన్.
బెంగళూరు, పూనే, సిడ్నీ, కెంట్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపాసిట్స్.. అనే హైఎండ్ సాప్ట్‌వేర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీకి... నవీన్ కోఫౌండర్. అలాగే తన ఆలోచనలతో 24 స్టార్టప్‌లలో భాగం అయ్యారు కూా. అందులో ఒకటి ఇంటి దగ్గరే సర్వీసులు అందించే హోమ్‌కనెక్ట్.
కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాని స్థాయిని అందుకోవడానికి... బాహ్య ప్రపంచంకంటే... అంతర్గతంగా ఎక్కువగా చూసినందుకే అంటున్నారు నవీన్. మానవ అంతర్గత, మేథో శక్తికి ప్రతిరూపంగా మారారు నవీన్. ఎదురైన సవాళ్లను అధిగమించి అనేక వ్యాపారాల విజయంలో కీలకపాత్ర పోషిస్తూ... జీవితానికి కొత్త అర్ధం చెప్పారు ఆయన. తన జీవితమే ఓ కథగా చెప్పి... ఇతరుల్లో మార్పు తీసుకురాగల స్థాయికి చేరుకున్నారు. ఎన్ని జరిగినా... నవీన్ విషయంలో మాత్రం ఒక అంశాన్ని గమనించాల్సిందే. తానో ఆంట్రప్రెన్యూర్ కావాలనే తపన ఆయనలో అంతరించలేదు. అదే ఆయన్ను ఈ స్థాయికి చేర్చిందని చెప్పాల్సిన పని లేదు.
ఇలాంటి సంఘటనలు వ్యాపారాల్లో చూడ్డం చాలా అరుదు. అయితే... శారీరక శక్తిని మాత్రమే నమ్ముకుంటే దానికి ఏదోరకమైన పరిమితులుంటాయి. నవీన్ చూపించిన తరహాలో మానసిక ధారుడ్యాన్ని ప్రదర్శించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. తన పూర్తి శక్తియుక్తులు, సానుకూల ఆలోచనలు విజయం వైపు నడిపించాయి.
ఇది మరో కోణం
నవీన్ జీవిత గాథంలో మరో కీలకమైన విషయం ఉంది. రచయితగా మారి, తొలి పుస్తకాన్ని రాశారు ఆయన. దాని పేరు The Inseparable Twins: Paired Principles to Inspire Young Minds. యువతలో ఆలోచనలు రేకెత్తించడమే దీని ప్రధాన లక్ష్యం. వ్యాపార ఆలోచనలనే నీతిగాధలుగా మార్చి రాసిన బుక్ ఇది. బెంగళూరులో జరిగిన ఈ పుస్తకం లాంఛింగ్ ఈవెంట్‌లో... నవీన్ మనోధైర్యానికి, చిత్తశుద్ధికి ప్రజలు దాసోహం అన్నారు. చూపులేని దశ(చీకటి, స్పాట్స్) నుంచి గ్రాండ్ విజన్(వ్యాపార విజయాలకు బాటలు వేసి కీలక పాత్రపోషించం)వరకూ సాగిన ప్రయాణంపై వేనోళ్ల పొగిడారు. నవీన్ రాసిన పుస్తకం.. సామాజిక ప్రాజెక్టుల వరకూ సాగుతుంది. ఉదాహరణ విత్తనం మొక్కగా మారి... తర్వాత చెట్టుగా అవతరించి, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా.. అలాగన్న మాట.
వ్యాపారవేత్తగా మారాలన్న తపనతోపాటు... తన లక్ష్యాన్ని సముచిత స్థాయిలో గుర్తుపెట్టుకోవడం, తన సామర్ధ్యంపై తాను నమ్మకం ఉంచడమే.. నవీన్ విజయంలో కీలకమైన అంశాలు. తిరిగి ఆఫీసును ప్రారంభించి పని చేయాల్సి వచ్చినపుడు.... ఆయన చూపిన సానుకూల దృక్పథం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. “ఒకవేళ నాకు ఆ ప్రమాదం సంభవించకుండా ఉంటే... నేను ఇప్పుడు సాధించినదాంట్లో.. పావు వంతుకు కూడా చేరగలిగే వాడిని కాదం”టూ తన సెకండ్ ఇన్నింగ్స్‌పై తానే కామెంట్ చేస్తున్నారు నవీన్.