సర్జరీ చేయించుకోవాలా..? అయితే కేర్ మోటోకి చెప్పండి.. మంచి ఆసుపత్రిని సజెస్ట్ చేస్తారు

22nd Feb 2017
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

రమణారావు మోకాలి శస్త్త్రచికిత్స చేయించుకోవాలి. వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. రానైతే వచ్చాడు కానీ, ఎక్కడ.. ఏమిటి.. ఎలా.. అనేది తెలియదు. తెలిసినవాళ్లెవరూ సిటీలో లేరు. నాలుగైదు ఆసుపత్రులు తిరిగాడు. కొన్నిచోట్ల డాక్టర్ అందుబాటులో లేడు. మిగిలిన ఆసుపత్రుల్లో సర్జరీకి అయ్యే ఖర్చు తన బడ్జెట్లో లేదు. తెల్లారి కూడా ఉండాల్సి వచ్చింది. అయినా సరే ఆపరేషన్ మీద, ఆసుపత్రి మీద క్లారిటీ రాలేదు. ఉసూరుమంటూ తిరుగు ప్రయాణమయ్యాడు. కన్సల్టేషన్ ఫీజు, ఫుడ్, లాడ్జి, బస్ చార్జీలు.. మొత్తం కలుపుకుని 5వేలు ఖర్చయింది.

దీన్నే వైద్యపరిభాషలో మెడికల్ షాపింగ్ అంటారు. ఏ హాస్పిటల్‌లో బాగా చూస్తారు.. ఏ డాక్టరుకు ఎంత అనుభవం ఉంది? ఏ సర్జరీకి ఎంత ఖర్చవుతుంది? ఆసుపత్రి సక్సెస్ రేటెంత ఇలాంటివన్నీ తిరిగి పరిశీలించడాన్నే మెడికల్ షాపింగ్ అంటారు. అయితే రమణారావు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాడు కాబట్టి ఐదు వేలు ఖర్చయింది. ఇంకా దూర ప్రాంతం నుంచి వస్తే రెండ్రోజులకు కలిపి మినిమం 10వేలు అయ్యేది. ఇది యావరేజ్ మాత్రమే. సరే, ఏదో ఒక ఆసుపత్రి అనుకుని సర్జరీకి ప్లాన్ చేసుకున్నా, చివరికి డిశ్చార్జ్ అయ్యేసరికి ఖర్చు ఎస్టిమేషన్ దాటిపోతుంది.

image


హెల్త్ కేర్ రంగంలో ఇదంతా సర్వసాధారణం. అయితే, డబ్బున్నవాళ్లు ఎంత ఖర్చయినా భరిస్తారు. ఎటొచ్చీ మిడిల్ క్లాస్ పీపులే బేలచూపులు చూస్తూ, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడతారు. ఇలాంటి సందర్భాలను, పేషెంట్లు పడే ఆవేదనను కళ్లారా చూసిన డాక్టర్ నిరంజన్.. అలాంటి వాళ్లకోసం ఏదో ఒకటి చేయాలని తపన పడ్డారు. పైసా ఖర్చు లేకుండా వాళ్లకొక మంచి డాక్టర్‌ని, మంచి ఆసుపత్రిని గైడ్ చేస్తే ఎలా వుంటుందని ఆలోచించారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే కేర్‌ మోటో.

డాక్టర్ నిరంజన్ గ్యాస్ట్రో సర్జన్. ఆయన సతీమణి కూడా డాక్టరే. చిన్నపిల్లల స్పెషలిస్టు. ఇద్దరు కలిసి కేర్ మోటోని స్థాపించారు. హైదరాబాద్ లో దాదాపు 650కి పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ అందులో 100 ఆసుపత్రులను మాత్రమే ఎంపిక చేసుకున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ జోలికి పోకుండా, ఎకానమీలో మంచి ట్రీట్మెంట్ ఇచ్చే వాటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎక్కువ సర్జరీలు చేసి అనుభవం సంపాదించిన వాళ్లు.. పేషెంట్లతో అనుబంధం పెంచుకునే వాళ్లు.. రికవరీశాతం ఎక్కువగా ఆసుపత్రులు.. ఇలా అన్ని పారామీటర్లను బేరీజు వేసుకుని, పేషెంట్ల నుంచి పైసా తీసుకోకుండా ఎండ్ టు ఎండ్ సర్వీసు అందిస్తారు.

రిపోర్టులను బట్టి, బడ్జెట్‌ ని బట్టి, ఇన్ష్యూరెన్స్ ఉందో లేదో తెలుసుకుని, వాళ్లకు ఏ ఆసుపత్రి అయితే బెటరో ఆ ఆసుపత్రిని ఎటాచ్ చేస్తారు. అది కూడా ఫిక్స్ డ్ ప్రైస్ మాట్లాడిపెడతారు. సదరు హాస్పిటల్ కేర్ మోటో చెప్పినదానికంటే పైసా ఎక్కువ తీసుకోదు. అయితే అన్ని కేసుల్లో ఇది వర్తించదు. కేన్సర్ లాంటి హైఎండ్ ప్రొసీజర్ ఉన్న పేషెంట్లకు ఫిక్స్ డ్ రేటు వర్కవుట్ కాదు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేనివారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రిని గైడ్ చేస్తారు. అనుభవజ్ఞులైన డాక్టర్లతో మాట్లాడి అవరసమైన సేవల్ని అందిస్తారు. సర్జరీ అవసరం ఉంటే సర్జరీ, మెడిసిన్‌ తో తగ్గితే మెడిసిన్. కచ్చితంగా సెకండ్ ఒపీనియన్ అనేది అందిస్తారు.

కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విషయంలోనూ చేతనైన సాయం చేస్తారు. డోనలర్లకు అవగాహన లేకుంటే జీవన్ దాన్ ద్వారా అప్రోచ్ అయ్యేలా చూస్తారు. ఇదొక విలువైన గైడెన్స్ అంటారు డాక్టర్ నిరంజన్. 35 మంది డాక్టర్లతో రెగ్యులర్ టచ్‌లో ఉన్నామన్నారు. మరో 250 డాక్టర్లతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. క్వాలిఫైడ్ కాని డాక్టర్లు కూడా అప్రోచ్ అవుతున్నారు కానీ, వాళ్లను ప్రిఫర్ చేయట్లేదంటారాయన. ఎందుకంటే కేర్ మోటో అనేది కమర్శియల్ కాదు. సర్వీస్ రిలేటెడ్. సాయం చేయడం అనేది కేర్ మోటో బిగ్గెస్ట్ మోటో.

వెబ్ సైట్ ద్వారా గానీ లాండ్ లైన్ ద్వారాగానీ కేర్ మోటోని అప్రోచ్ అవ్వొచ్చు. రోజుకి 150 కాల్స్ వస్తుంటాయి. ఇప్పటిదాకా సుమారు 450 మంది పేషెంట్లకు గైడెన్స్ ఇచ్చారు. కేర్ మోటో ఇచ్చిన అడ్వయిజ్‌ తో 70 మంది పేషెంట్స్ 10 నుంచి 30 శాతం వరకు డబ్బులు ఆదా చేసుకున్నారు. కాల్స్ రిసీవ్ చేసుకోడానికి 15 మంది కాల్ కేర్ అడ్వయిజర్లను నియమించుకున్నారు. పేషెంట్లతో ఎలా మాట్లాడాలో వారికి నేర్పించారు. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నవాళ్లు ఆన్ లైన్ ద్వారా సంప్రదిస్తున్నారు.

2016 ఏప్రిల్ లో కేర్ మోటో సేవలు మొదలయ్యాయి. ఆరోజు ఉగాది. నాకు బాగా గుర్తుంది. మొట్ట మొదటి కాల్ నల్లగొండ జిల్లాలోని ఒక మారమూల పల్లెనుంచి వచ్చింది. అతనొక దినసరి కూలీ. కాల్ నేనే రిసీస్ చేసుకున్నాను. ముఖంమీద మచ్చ ఉంది. డాక్టర్లు కేన్సర్ కావొచ్చు అంటున్నారు. ఏం చేయాలి సర్ అని భయంభయంగా అడిగాడు. వెంటనే నేను ధైర్యం చెప్పి సిటీకి రమ్మన్నాను. ఎంఎన్జీలో బయాప్సీ తీయించాం. నెగెటివ్ వచ్చింది. అప్పుడతని మొహంలో ఆనందం చూడాలి. మాటల్లో చెప్పలేను. రెండు చేతులెత్తి నమస్కరించాడు. అప్పుడనిపించింది కేర్ మోటో గొప్పస్థాయికి వెళ్తుందని- డాక్టర్ నిరంజన్

ఇప్పుడిప్పుడే కేర్ మోటోకి ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి. కెన్యా నైజీరియా నుంచి పేషెంట్స్ మెయిల్ ద్వారా సంప్రదిస్తున్నారు. మెడికల్ టూరిజంలో కీలక పాత్ర పోషిస్తున్న కేర్ మోటో.. ఆన్ లైన్‌ లోనే సెకండ్ ఒపీనియన్ సిస్టమ్ డెవలప్ చేయాలనే పట్టుదలతో ఉంది. రిపోర్ట్ సబ్మిట్ చేస్తే చాలు సర్జరీ చేయాలా మెడిసిన్ తో సరిపోతుందా అనేది చెప్తారు. ప్రాసెస్ అంతా ఆన్ లైన్ లోనే ఉంటుంది. ఇంటి నుంచే డాక్టర్.. ఇంటినుంచే పేషెంట్.. సెకండ్ ఒపీనియన్ తీసుకునే సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారు. ఉన్న రిపోర్టులతోనే సైంటిఫిక్ ఒపీనియన్ ఇవ్వాలనేది తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నారు.

నానాటికీ ఖరీదవుతున్న కార్పొరేట్ వైద్యం మధ్యతరగతి ప్రజలకు ఇప్పటికే సగం దూరమైంది. అందుకే మెరుగైన వైద్యం వాళ్లకూ అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో కేర్ మోటో ముందుకొచ్చింది. వీళ్ల ఇన్ స్పిరేషన్ తో డాక్టర్లలోనూ కమర్శియల్ ఎలిమెంట్ తగ్గిపోతోంది. ఇది కచ్చితంగా అభినందించాల్సిన విషయం. అన్నట్టు.. కేర్ మోటో సేవల్ని మెచ్చి రచయిత, నటుడు తనికెళ్ల భరణి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తానని ముందుకొచ్చారు. అది కూడా ఉచితంగా.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India