చదివింది పదో తరగతి… సంపాదిస్తున్నది నెలకు రెండు లక్షలు
“మనీ కాంట్ బై హ్యాపీనెస్” చాలా ఫేమస్ ఇంగ్లిష్ సామెత. అంటే డబ్బుతో సంతోషాన్ని కొనలేమని అర్థం. చాలామంది వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇదే మాట చెబుతుంటారు. కానీ ఇప్పుడు డబ్బుచుట్టూ భూమి తిరుగుతోంది. డబ్బులేనిదే ఇంటి నుంచి కాలు బయటపెట్టలేం. డబ్బు లేకుంటే డుబ్బుకు కూడా కొరగారంటారు. 33 ఏళ్ల నందిని కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంది. గత ఏడాది వరకు రెండు పూటలు భోజనం దొరికితే చాలనుకుంది. చిన్నప్పుడు పేదరికంలో మగ్గిపోయింది. డాక్టర్ కావాలని కలలు కనేది. అయితే డబ్బులు లేకపోవడంతో పదో తరగతిలోనే చదువును ఆపేయాల్సివచ్చింది. అలాంటి నందిని జీవితాన్ని ఊబర్ కంపెనీ మార్చేసింది.
కుటుంబ నేపథ్యం
బెంగళూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో పెరిగింది నందిని. ఆమె తండ్రి చిన్న ఆలయంలో పూజారిగా పనిచేసేవాడు. చాలీచాలని ఆదాయం. అందుకే పదే తరగతి తర్వాత స్కూల్ మాన్పించేసి పెళ్లి చేసేశారు. కొన్నాళ్లు గృహిణిగా ఉండిపోయింది. కానీ నందినికి సగటు ఇల్లాలిగా మిగిలిపోవడం ఇష్టం లేదు. ఏదో సాధించాలన్న తపన. భర్త శ్రీశాంత్ శాస్త్రి కూడా పూజారిగానే పనిచేసేవారు. వచ్చిన ఆదాయం తిండికి మాత్రమే సరిపోయేది. అందుకే చిన్నా చితకా పనులు చేసి తనవంతుగా కుటుంబానికి ఎంతో కొంత ఇచ్చేది.
సినిమా కష్టాలు
చిన్న చిన్న వ్యాపారాలు చేసి విజయం సాధించింది నందిని. ట్రావెల్ ఏజెన్సీ నడిపింది. పెయింటింగ్, హోమ్ ఇంటీరియర్ వర్క్స్ చేసింది. అప్పుడే పాప పుట్టింది. కొన్నాళ్లకు నందిని తన తండ్రి ఆకస్మికంగా చనిపోయారు. కష్టాలు ప్రారంభమయ్యాయి. తండ్రి మరణంతో తన చెల్లెలి బాధ్యత తనపైనే పడింది. ఆమె చదువు, పెళ్లి.. నందిని అప్పుల్లోకి దిగబడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఉబర్ దోస్త్
ఉబర్ దోస్త్ గురించి 2015లో నందినికి తెలిసింది. అందులో చేరి డ్రైవర్లను రిఫర్ చేస్తే డబ్బులొస్తాయని స్నేహితులు చెప్పారు. ఉబర్ రిఫరెల్ ప్రోగ్రాంకు తెలిసిన డ్రైవర్ ను జస్ట్ రిఫర్ చేస్తే చాలు అతను ఉబర్ తరపున కొన్ని ట్రిప్స్ వేస్తే మనకు 3 వేల రూపాయలు వస్తాయి. ఈ స్కీం హైదరాబాద్ లో కూడా ఉంది. సొంతకారు ఉన్నవారు ఉబర్ లో పార్ట్ టైం డ్రైవర్స్ గా చేరవచ్చు. ఇదేదో బాగానే ఉందనిపించింది నందినికి.
విజయబావుటా
ఉబర్ లో చేరాక కాలం కలిసి వచ్చింది. తెలిసిన డ్రైవర్లను ఉబర్ లో చేర్చింది. డ్రైవర్ జాబ్స్ కావాలా అంటూ… సిటీలో పోస్టర్లు అంటించింది. తర్వాత ఫుల్ టైం డ్రైవర్స్ రిఫర్ చేసే కార్యక్రమం చేపట్టింది. నందిని పడ్డ కష్టం ఫలించింది.
ఇప్పటివరకు 600 మంది డ్రైవర్లను రిఫర్ చేసింది. బెంగళూరులో ఒక చిన్న ఆఫీసు ఏర్పాటు చేసుకుంది. తనకు సహాయకులుగా నలుగురు ఉద్యోగులను నియమించుకుంది. అడ్మినిస్ట్రేషన్, ఫీల్డ్ వర్క్ లో వారు సాయం చేస్తుంటారు. ఇప్పుడు నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. అప్పులన్నీ తీర్చేసి బెంగళూరులో సొంతంగా ఇల్లు కట్టుకుంది. తన కుమార్తెను ప్రఖ్యాత ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివిస్తోంది.
భర్త స్ఫూర్తితో..
తన భర్త సహకారం వల్లే తానిప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతోంది నందిని. కష్టాల్లో ఉన్నప్పుడల్లా భర్త సహకరించేవారని చెప్తోంది. “నేనున్న ఫీల్డ్ లో చాలామంది అబ్బాయిలతో మాట్లాడాలి. వారితోనే కలిసి పనిచేయాలి. నా భర్త ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదు. అందుకే నేను పూర్తిగా పనిమీద ధ్యాస పెట్టగలిగాను. మా అమ్మ నాతోనే ఉంటూ నా కుమార్తెను చూసుకుంటుంది. నా విజయ రహస్యం అంటారామె
ఉబర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ ను ఎప్పుడో ఒకరోజు కలుస్తాననేది నందిని డ్రీమ్. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే చదువే అవసరం లేదని… ధైర్యం, సహనం ఉంటే చాలు మహిళలు ఏ రంగంలోనైనా దూసుకుపోవచ్చంటోంది నందిని.