మన దేశంలో 7 కోట్ల మందికి సబ్బు ఎలా ఉంటుందో కూడా తెలియదు !
సబ్బు వాడ్డం కూడా హక్కే అంటూ ప్రచారంసబ్బు వాడడమంటే శుభ్రంగా ఉండడమేపేద దేశాల్లోని మురికివాడల్లో సేవ చేస్తున్న అమెరికన్ యువతిడాక్యుమెంటరీ చూసి థాయ్‌లాండ్‌కి పయనంస్లమ్డాగ్ మిలియనీర్ సినిమా చూశాక కళ్లు తెరిచానంటున్న ఎరిన్
యూనిలీవర్ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం... దేశంలో ఏడు కోట్ల మంది ప్రజలు ఇప్పటివరకూ సబ్బును ఉపయోగించలేదు. ప్రతీ 30 సెకండ్లకు ఒక చిన్నారి అపరిశుభ్రత కారణంగా సంక్రమించే... డయేరియా తదితర వ్యాధులతో మరణిస్తున్నారు. ఇక్కడ సబ్బులు, శుభ్రత అవసరం చాలా ఉంది. అందుకే నేనిక్కడ ఉన్నా- ఎరిన్ జైకిస్, 'సుందర' ఫౌండర్
“సోప్ అంటే ఏంటి ?”... ఒళ్లంతా మురికిపట్టిన థాయిలాండ్ పిల్లల గుంపు ఎరిన్‌ను అడిగిన ప్రశ్న ఇది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ అమెరికా యువతి... పిల్లల అక్రమ రవాణా అరికట్టేందుకు పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ కోసం థాయ్‌లాండ్ వెళ్లారు. థాయ్‌లోని ఓ చిన్న గ్రామంలో పాఠశాలను సందర్శించినపుడు... ఆమెకు ఆలోచింపచేసే సంఘటన ఎదురైంది. బాత్రూమ్కి వెళ్లినపుడు... ఎరిన్‌కు సోప్ అవసరమైంది. అక్కడెక్కడా సబ్బు దొరకలేదు. అసలు ఆ మాటే అక్కడ ఎవరూ వినలేదని తెలిసి ఆశ్చర్యపోయింది ఆమె. దీన్ని నమ్మలేక... పక్కనే ఉన్న టౌన్‌కి వెళ్లి... కొన్ని సోప్స్ కొని, ఆ గ్రామానికి తెచ్చింది ఎరిన్. “ఆ సబ్బులను ప్యాక్‌ల నుంచి ఓపెన్ చేసి, అదేంటో తెలుసుకోవడానికి గోళ్లతో రక్కి చూశారు వారు. మరికొంతమంది తమ తలలపై వాటితో కొట్టుకుని పరిశీలించారు. నాకు అప్పుడే అర్ధమైన విషయం ఏంటంటే... దాంతో ఏం చేయాలో, ఉపయోగమేంటో వారికి అసలు తెలీదని” అంటూ తాను ఆశ్చర్యపోయిన ఘటనను ఎరిన్ గుర్తు చేసుకున్నారు.
“ఈ అనుభవం తర్వాత... ఈ సమస్య గురించి ప్రపంచానికి చెప్పడం, పరిష్కారం చూపడానికి... నా జీవితాన్ని వెచ్చించినా పర్లేదనే నిర్ణయానికి వచ్చాను. చాలా మంది నీటి సమస్య గురించి మాట్లాడుతుంటారు. కానీ ఆరోగ్యంపై ప్రభావం చూపే సబ్బు విషయాన్ని ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు ? మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో సబ్బు చాలా ముఖ్యమైనది కదా” అంటున్నారామె.
మా పిల్లలను ఎలా చూసుకోవాలో మాకు తెలియదా ?
ఇలాంటి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి జీవిత కాలం కూడా సరిపోదనే విషయం ఎరిన్‌కు బాగానే తెలుసు. వారిని చైతన్యపరచడానికి ఒకోసారి అంతకంటే ఎక్కువగానే సమయం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
“ఏదైనా ఒక డాక్యుమెంటరీ చూసి... ఇక అక్కడికి వెళ్లాల్సిందే, వారికి ఏదైనా సాయం చేయాల్సిందే.. అని భావించేవారిలో నేను కూడా ఒకరిని” అంటారు ఎరిన్. అయితే.. ఇలా ఆమె చూసిన డాక్యుమెంటరీ సబ్బులకు సంబంధించినది కాదు. చైల్డ్ ట్రాఫికింగ్ గురించి. కానీ థాయ్ వచ్చాక ఆమె చేస్తున్నది వేరు. ప్రయత్నిస్తున్నది వేరు. దీనికి కారణం ఇక్కడ ఆమె చూసిన, అనుభవించిన పరిస్థితులే.
“కొంతమంది తల్లులు నా దగ్గరకు వచ్చి ప్రశ్నించేవారు. ‘మా పిల్లలకు ఏం చేయాలో చెప్పడానికి నీకు ఎంత ధైర్యం ? నువ్వు ఎప్పుడైనా నీ భర్తతో తన్నులు తిన్నావా ? 3రోజులు తిండి లేకుండా గడపడం అంటే ఏంటో తెలుసా ? ’... ఇలా ఉండేవి వారి ప్రశ్నలు. ఇవన్నీ విన్న తర్వాత నేను గందరగోళానికి గురయ్యాను. ఇలాంటి పరిస్థితులు నేనెన్నడూ ఎదుర్కోలేదు. మరి నా ఉద్దేశ్యాలను వారిపై రుద్దడానికి నేనెవరు అనిపించేది. నేను ఆ ప్రాంతాన్ని వదిలేసి రావడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. చేసినదంతా వదిలేసి, ఏ ప్రయోజనం సాధించకుండానే... ఆ ప్రదేశాన్ని వదిలేసి వచ్చేశా”అని చెప్పారు ఎరిన్.
సబ్బు, దాని ద్వారా వచ్చే పరిశుభ్రత చాలా ముఖ్యమైనవి. సోప్ వాడకంపై ఎరిన్ ప్రయత్నించిన వాటికి వ్యతిరేకంగా.. యాంటీ సోప్‌పై ప్రదర్శనలు జరిగాయి థాయ్‌లాండ్‌లో. ఇది కూడా ఆ ప్రాంతంనుంచి ఆమె బయటకు రావడానికి కారణమే. నిజానికి సబ్బు చాలా ముఖ్యమని మనమందరం అంగీకరించాల్సిందే. ఇది మనకు గౌరవాన్ని ఇస్తుంది. అసలు శుభ్రంగా ఉండడం మనందరి హక్కు అంటారు ఎరిన్. ప్రపంచవ్యాప్తంగా కనీస వైద్య సదుపాయాలు కూడా లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అన్ని అవకాశాలు కల్పించలేకపోయినా.. కనీసం శుభ్రంగా ఉండడం కూడా తెలియచెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తుండడం ఆశ్చర్యకరమైన విషయం. పెద్దలుగా మారే క్రమంగా... దేశంలోని పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో కూడా... ప్రజా నేతలు విఫలమవుతున్నారనే విషయం దీనితో స్పష్టమవుతోంది. శుభ్రంగా ఉండడం కోసం కనీసం సబ్బులైనా అందించాలనే ఆలోచన చాలా మంచిది అన్నారు ఎరిన్.
సబ్బుల రీ సైక్లింగ్
థాయ్‌లో ఎరిన్ చూసిన ఈ సమస్యతో పాటు... సోప్ రీసైక్లింగ్ ప్రారంభించడానికి ఇంకా పలు కారణాలున్నాయి. “ఒక్క అమెరికా హోటళ్లలోనే... కొంచెం వాడిన తర్వాత పారేసే సబ్బులు ఏడాదికి వంద కోట్లకు పైగా ఉంటాయి. వీటిని పల్లపు ప్రాంతాల్లో పాతిపెట్టేయడం తప్పచేయడానికి ఏమీ ఉండదు. అయితే... భారత్‌లో మాత్రం చాలా పల్లపు ప్రాంతాలు ఇప్పటికే నిండుగా ఉన్నాయి. ఇందుగా ఇలాంటి సోప్ వేస్టేజ్‌ను పర్యావరణానికి అనవుగా ఉపయోగించుకోవాలని ఆలోచించాం. ఇందుకోసం స్లమ్స్‌లోని మహిళలను రిక్రూట్ చేసుకుని... వారికి తగిన జీతం ఇస్తూ పని చేయించుకోవడం ప్రారంభించామంటారు ఎరిన్.
పబ్లిక్‌లో మాట్లాడ్డంతోపాటు.. వారికి అవసరమైన లీడర్షిప్ నైపుణ్యాలను కూడా నేర్పిస్తోంది 'సుందర' సంస్థ. వీరిని ఆయా సమాజాలకు లీడర్లను చేసి, ఆరోగ్యానికి అంబాసిడర్లుగా ఉపయోగించుకుంటున్నారు. ఏళ్ల తరబడి తమలాగే ఉన్నవారు.. ఇప్పుడు ఆరోగ్యం, దాని అవసరంపై మాట్లాడుతుంటే.. వినేవారిలోనూ చైతన్యం కలుగుతుంది. తమలాగే కనపడుతూ.. తమతోనే ఉండేవారు, తమ భాషలోనే చెప్పేవారు చెబ్తే... ఏ విషయమైనా తొందరగా మనసులో నాటుకుపోతుంది. సమాజం నిర్లక్ష్యం చేసిన వర్గాలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, సోప్స్ వాడకంతో ఉపయోగాలు తెలియజేస్తోంది 'సుందర'. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలే కాదు... మారుమూల గ్రామాలు, గిరిజనులు నివసించే ఏరియాలనూ ఎంపిక చేసుకున్నారు. ఆరోగ్యంపై అందించే విద్య, సబ్బు వాడకం వంటి చర్యలతో... ఈ చిన్నారులు పెద్దలుగా మారేనాటికి మరింత ఆరోగ్యంగా ఉంటారు. తమ ఆరోగ్యం తమ చేతుల్లోనే విషయం వారికి అర్ధమయితే... తమ లక్ష్యం నెరవేరినట్లే”అంటున్నారు ఎరిన్.
ఒక ''సుందర''మైన స్టోరీ
'సుందర' అనే సంస్కృత పదానికి తెలుగు అర్ధం.. అందమైన అని. తన సంస్థకు ఈ పేరే పెట్టడానికి తగిన కారణాలనే చెప్పారు ఎరిన్. “నేను ఇరవైల్లోనే ఈ సంస్థను ప్రారంభించాను. ఇతర బాలికలు, యువతుల మాదిరిగానే అందం కోసం తెగ తాపత్రయపడే పడే వయసు అది. నేను థాయ్‌లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్లాక... చాలా మంది స్నేహితురాళ్ల నోటి వెంట'బ్యూటిఫుల్' అనే మాట విన్నాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక సైట్లలో దీనికి ఎంత డిమాండ్ ఉందో తెలిసొచ్చింది.
నాకు ఆ క్షణంలో అనిపించింది ఇదే. "ఇది అసలు నిజమైన అందమేనా? అన్నీ ఉండి, ఖరీదైన దుస్తులు ధరించినా సరే... అందం అంటే పడి చచ్చే వాళ్ల సంఖ్య చాలానే ఉంది. మృదువైన చర్మం ఉండీ... మచ్చలు లేకుండా కనిపించడం కోసం తాపత్రయం, తర్వాత ఇతరులకు చూపించి మెప్పు పొందడం కోసం ఫోటోలు తీసుకోవడం చేస్తున్నాం. నేనా పల్లెటూరులో ఎంతో అందమైన వారిని చూశాను. వారికి ఎప్పటికీ వేలకొద్దీ ఫాలోయర్స్ రాబోరు. ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీల మాదిరిగా వారికి గుర్తింపు కూడా దక్కదు. తమ పిల్లలను చదివించి అందమైన భవిష్యత్తు ఇవ్వడం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వ్యక్తుల గురించే ఇదంతా" అంటున్నారు ఎరిన్.
అందం మనసులో ఉంటుంది. ఆ అందం ఆ గ్రామ మహిళల్లో ఉంది. అందుకే దానికి గుర్తింపు వచ్చేలా చేయాలని నిర్ణయించుకున్నారు ఎరిన్. ఇతరులకు సహాయం చేయడం, మంచి భవిష్యత్తు కోసం జీవితంతో పోరాటం చేయడం, మెరుగైన సమాజం కోసం ప్రయత్నించడం... ఇలాంటి అందమైన కార్యకలాపాలను హైలైట్ చేయాలని భావించారామె. అలా 2013లో 'సుందర' ప్రారంభమైంది.
'సుందర' ఎలా పని చేస్తుంది ? A complete win win
తమ కార్యకలాపాల్లో ఉన్న సింప్లిసిటీయే అతి ముఖ్యం అంటారు ఎరిన్. “ముంబైలోని పెద్ద హోటల్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి చిన్నబొటిక్స్ వరకూ... సోప్‌లను కలెక్ట్ చేస్తారు. ఈ సోప్ వేస్ట్‌ను కల్వాకు తరలించి.. వీరే ట్రైనింగ్ ఇచ్చిన స్థానిక మహిళలతో సబ్బులు తయారు చేయిస్తారు. పోగు చేసిన సబ్బులకు బయట లేయర్‌ను తొలగించి, దాన్ని గ్రైండింగ్ చేసి... బ్లీచ్ సొల్యూషన్ కలిపుతారు. దాన్ని ఓ మెషీన్‌లోకి పంపి కొత్త సబ్బులు తయారు చేస్తారు. ఇలా ఒక సబ్బును తయారు చేయడానికి 7 నిమిషాలు పడుతుంది. ఆరోగ్యం - పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న 30 స్కూళ్లకు వీటిని సరఫరా చేస్తారు.
సింప్లిసిటీ ఒకటే తమ ఆయుధం కాదంటారు ఎరిన్. లాండ్‌ఫిల్ వేస్ట్‌ను తగ్గించడం ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లే. హోటల్స్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో పాల్గొన్నట్లే. కొందరు మహిళలకు ఉద్యోగావకాశాలు లభించినట్లే. చిన్నారులకు ఆరోగ్యం అందిచడం అంటే... మొత్తం సమాజం విజయం సాధించనట్లే అంటారు ఎరిన్. ఇప్పటికి తాము చిన్న కంపెనీగానే ఉన్నా... భారతదేశానికి ఇలాంటి పరిష్కారాలు చాలా కావాలని చెబ్తున్నారామె.
ఇంటికెళ్లి పెళ్లి చేసుకో
మన దేశంలో విదేశీ మహిళలు ధైర్యంగా ఉండగలగడం అంత తేలికైన విషయం కాదనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. అయితే... ముంబైలో పర్యటించేందుకు తనకు ఎలాంటి భయం లేదంటారు ఎరిన్. ప్రతీ రోజు అధికారులతో మాట్లాడేందుకు పలువురు పురుషులతో కలిసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. “మీటింగులకు కొంతమంది మగవారితో కలిసి రావాల్సి ఉంటుంది. అయితే చాలామంది నాకు మీ సొంతూరు వెళ్లి, పెళ్లి చేసుకోవచ్చుగా అని సలహాలిచ్చారు. అయితే వీటిని నేను సీరియస్‌గా తీసుకోలేద”ని ఎరిన్ చెప్పారు.
'సుందర'కు పలు దఫాలుగా నిధులు అందడంతోపాటు... ప్రజలు కూడా విరాళాల రూపంలో ఇచ్చారు. కార్పొరేట్ కంపెనీలు కూడా దీనికి జతయ్యాయి. సోషల్ ఆంట్రప్రెన్యూర్లకు లింక్డ్ఇన్ ఫర్ గుడ్ అనే కార్యక్రమం ద్వారా లింక్డ్ఇన్ నిర్వహించిన పోటీలో నెగ్గింది 'సుందర'. ఉద్యోగుల సంఖ్య పెంచుకునేందుకు, హోటల్ భాగస్వాముల సంఖ్యను పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఎరిన్. బాస్ అనిపించుకోడానికి ఏమాత్రం ఇష్టపడరామె. ఓ సమస్యను చూసి ప్రతిస్పందించి, పరిష్కారం ఆలోచించిన సాధారణ వ్యక్తిని అంతే అంటారు ఎరిన్. తమ కార్యకలాపాల్లో కొన్ని తప్పులు దొర్లాయని, అయితే వాటినుంచి తాను చాలా నేర్చుకోగలిగానని చెప్పారు. మరింత చురుకైన వ్యక్తులను నియమించుకోవడం ద్వారా... ఆరోగ్యం కోసం తాను చేపట్టిన మిషన్ మరింతగా ముందుకు వెళ్తుందని అంటున్నారామె. తానొక్కదాన్నే ఓ మహాయజ్ఞాన్ని పూర్తి చేయలేనని నిజాయితీగా ఒప్పుకుంటున్నారు ఎరిన్.
స్ఫూర్తినిచ్చిన స్లమ్‌డాగ్ మిలియనీర్
పదిమందికీ ఉపయోగపడే సామాజిక కార్యకలాపాలు చేపట్టేలా స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీ తనను ఇన్స్పైర్ చేసిందన్నారు ఎరిన్. చాలామంది భారతీయులు ఈ సినిమాను కేవలం పేదరికం, కటిక దారిద్ర్యం, వెట్టిచాకిరీ వంటి అంశాలపై తీసినట్లుగా భావిస్తున్నా... అదో అద్భుతమని, కళ్లు తెరిపించేంతటి సత్యాలను అందులో చూపించారని ఎరిన్ అంటున్నారు.
“ఇండియన్స్ చాలామందికి ఈ సినిమా నచ్చలేదు. తమ దేశాన్ని అవమానించారని అనుకుంటున్నారు. అయితే.. ఈ సినిమా నా కళ్లు తెరిపించింది. సమాజంలో మన చుట్టూ జరుగుతున్న... మనకు తెలియని విషయాలకు అద్దం పట్టింది. ఇలాంటి సమస్యలు ఎదుర్కుంటున్న దేశాలు చాలానే ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా స్లమ్‌డాగ్. నా ఉద్దేశ్యంలో ఈ మూవీ తీసిన ఉద్దేశ్యం నెరవేరింది. అసలు నిజమైన పేదరికం అంటే ఏంటో కూడా చాలామంది అమెరికన్స్‌కు తెలియదు. గతం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. లాటిన్ ఎనిమిదేళ్లపాటు నాకు ఎందుకు నేర్పారు ? సమాంతర చతుర్భుజాల గురించి నేర్చుకుని ఉపయోగమేంటి ? ఓ వ్యాపారం చేయాలని ఎవరూ ఎందుకు నేర్పలేదు ? కష్టాలొస్తే కోలుకోవడం గురించి ఎందుకు చెప్పలేదు ? ఇలాంటి విషయాలను హాలీవుడ్ సినిమాలు కాకుండా... విద్యా వ్యవస్థలోనే నేర్పాల్సి ఉంది. ఈ మార్పు చాలా అవసరం ” అంటున్నారు ఎరిన్.
సినిమా చూసి ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చారా అనే వెక్కిరింతలు కూడా ఎదురయ్యాయి ఈ అమెరికన్‌కి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి.. పేద దేశాల్లో సేవ చేయడాన్ని 'వైట్ సేవియర్ కాంప్లెక్స్' అంటారు. ఇలాంటి కాంప్లెక్స్ తనకు లేదని, తాను అసలు ఆ మాటలనే పట్టించుకోనని చెబ్తారామె. తన సంస్థకు తాను హీరో కాదని, కేవలం విధానాన్ని రూపొందించిన వ్యక్తిని మాత్రమే అంటారు ఎరిన్. ప్రతీ రోజు ఎంతో కష్టాలకు ఓర్చి పని చేస్తున్న మహిళలే రియల్ హీరోస్గా అభివర్ణిస్తారామె. నిజానికి ఆరోగ్యంగా విద్య చాలా సున్నితమైన విషయం. యుక్త వయసు దాటాక ఓ మహిళ మురికివాడలకు వెళ్లి... పిల్లలకు మురికిగా ఉండకండి అంటూ పాఠాలు చెప్పే పరిస్థితి మరోసారి రాకుండా చేయడమే తన లక్ష్యంగా చెప్తున్నారు ఎరిన్.
తమకు సోప్ వేస్ట్ అందిస్తున్న హోటల్స్ సంఖ్యను ఏటా రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తోంది 'సుందర'. ముంబైతోపాటు ఇతర నగరాలకు విస్తరించే ప్రణాళికలపైనా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సోప్ రీసైక్లింగ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకుంటామని చెబ్తోంది.
ఎరిన్ ఇచ్చిన సలహా
ఒక సామాజిక వేత్తగా మారాలా వద్దా అన్న సంశమయే తనను ఎక్కువగా వేదించిన సమస్యగా చెప్పారు ఎరిన్. దీనిపై తెలిసినవారు, అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకునేందుకు ఆమె ఎన్నడూ సిగ్గుపడలేదు. “మొత్తం ప్రయాణంలో ఎదురయ్యే పరాజయమేంటి, తానేం కోల్పోతాను అని ముందుగానే ఆలోచించా'నంటారు ఎరిన్. అయితే “అతి తక్కువమందే ప్రయాణం చేస్తున్న ఒక దారిలోకి చాలా మంది రావాల్సిన అవసరముంది. మీరు కూడా వారిలో ఒకరయ్యేందుకు ప్రయత్నించండి. ఇలా చేయగలిగితే.. మీకు మీరు ఇంకా నచ్చుతారు అంటున్నారు” ఎరిన్ జైకిస్.
వెబ్సైట్ : http://sundarafund.org/