సంకలనాలు
Telugu

ఎంత ఎత్తుకు ఎదిగినా సొంతూరిని చిన్నచూపు చూడలేదు

సొంత ఊరు నిజామాబాద్‌పై తరగని ప్రేమ....సేవకు సిద్ధమైన ఫణీంద్ర సామ,రాజు రెడ్డి....కాకతీయ శాండ్ బాక్స్ పేరుతో వినూత్న కార్యక్రమం....అన్ని స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలూ ఒకే గూటి కిందికి....

team ys telugu
13th Apr 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


రెడ్ బస్ (redbus.in)ను ఇతరులకు అప్పగించాక ఫణీంద్ర సామలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందామన్న నా ప్రశ్నకు హైదరాబాద్ లో జరిగిన బిట్స్ పిలానీ పాత విద్యార్థుల అతి పెద్ద సమ్మేళనం - బిట్సా గ్లోబల్ మీట్-2014లో సమాధానం దొరికొంది. ఈ సమ్మేళనానికి సుప్రసిద్ధ విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, వ్యాపార వేత్తలు, కళాకారులు, రాజకీయ వేత్తలు ఎందరెందరో హాజరయ్యారు. చాలాకాలంగా ఆచరణకు నోచుకోని ఓ పనిని పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లుగా... ఫణి మోములో చిరుదరహాసం కదలాడుతోంది. తన మనోఫలకాన కదలాడుతున్న భావాలను పంచుకోవడానికి పెద్దగా జాగు చేయలేదాయన. “లాభదాయక, లాభరహిత సామాజిక వ్యాపారవేత్తలంటే నాకెన్నటికీ గొప్ప గౌరవం. ధనార్జన భావనను పక్కన పెట్టి.. ఓ నిర్దిష్ట కారణం కోసం వారు ప్రదర్శించే చిత్తశుద్ధి నన్ను ఆకట్టుకుంటుంది. అందరిలాగానే వారికీ బాధ్యతలు ఉంటాయి... అంచనాలు ఉంటాయి.. ఒత్తిళ్ళు ఉంటాయి... అయినా, వీటన్నింటినీ అధిగమించి రావడమే ఓ చమత్కారం” అని చెప్పుకొచ్చారు ఫణీంద్ర. రెడ్ బస్ డాట్ ఇన్ ను స్వాధీనం చేసుకున్నాక, తన ఆలోచనలు సామాజిక రంగం వైపు మళ్ళాయనే చెప్పాలి.

రాజు రెడ్డి, ఫణీంద్ర సామ

రాజు రెడ్డి, ఫణీంద్ర సామ


ఫణీంద్రతో ముచ్చటిస్తున్నప్పుడే.. మరో బిట్సియన్, సియెర్రా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజు రెడ్డి మా వద్దకు వచ్చారు. రాజురెడ్డికి ఎలాంటి ప్రశ్న వేయాలా అన్న తర్జనభర్జనలో నేనుండగానే.. ఫణి అందుకున్నారు. “రాజు తొలినాళ్ళలో నా దిక్సూచి అని, రెడ్ బస్ డాట్ ఇన్ బోర్డు సభ్యుల్లో ఒకరని చాలా మందికి తెలుసు. అయితే.. మా ఇద్దరినీ కలిపే మరో అంశముంది.. అదే మా సొంతూరు నిజామాబాద్” అని తెలిపారు. ఒకనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో (ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో) ఓ చిన్న జిల్లా కేంద్రమే నిజామాబాద్. రాజధాని హైదరాబాద్ కు 171 కిలోమీటర్ల దూరంలో.. ముంబై-హైదరాబాద్ మార్గంలో ఉంటుంది. నిజామాబాద్ అక్షరాస్యత.. జాతీయ సగటు 74 శాతం కన్నా అధికంగా 80 శాతం మేర ఉంది. దాదాపు మూడు లక్షల మందికి పైగా జనాభా ఉన్న నిజామాబాద్ అభివృద్ధి చెందని ప్రాంతమేమీ కాదు. అయితే.. విద్య, నైపుణ్యాల అభివృద్ధి అంశాల్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒకే సంస్థ కన్నా.. వివిధ సంస్థలను ఒక్కఛత్రం కిందికి తెస్తేనే.. ఈ ప్రాంతపు అభివృద్ధి సాధ్యమన్న విషయంలో.. రాజు రెడ్డి, ఫణీంద్ర సామలకు చాలా స్పష్టత ఉంది.

“మేము చాలా స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడాము. దేశ్‌పాండే ఫౌండేషన్ సంస్థ సేవలు మాకు నచ్చాయి. అన్ని వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేసే వారి విధానం మాకు బాగా నచ్చింది. వ్యాపారవేత్తలు సామాజిక అంశాలపై స్పందించాలన్న ఆలోచన కూడా ఆకట్టుకుంది” అని రెడ్డి వివరించారు. 

ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాల కారణంగా.. నిజామాబాద్ లో అభివృద్ధి ఫలాలు అత్యధికమనే చెప్పాలి. ఈక్రమంలో.. వీరిద్దరూ నిజామాబాద్ అభివృద్ధికి సిద్ధపడడం నిజంగా మంచి ఆలోచనే. దేశ్‌పాండే ఫౌండేషన్, కర్ణాటకలోని హుబ్లిలో అమలు చేస్తున్న హుబ్లి శాండ్ బాక్స్ తరహాలో.. ఇక్కడ కూడా కాకతీయ శాండ్ బాక్స్‌ను రూపొందించారు. ఈ ప్రయత్నం.. దాదాపు మూడు నెలల శ్రమానంతరం కార్యరూపం దాల్చింది. ఫలితంగా... నిజామాబాద్ తో పాటు, కరీంనగర్, మెదక్ జిల్లాలనూ అభివృద్ధి చేసే దిశగా.. మూడు సంస్థలు ఒకే గొడుగు కిందికి వచ్చాయి.

సామాజికాభివృద్ధి : డ్రైనేజీల నిర్మాణం, మొక్కలు నాటడం, ఉపాధి కార్డుల కేటాయింపు తదితర పనుల్లో చిన్నారులు, యువతను భాగస్వాములను చేయడంలో లీడ్ నిజామాబాద్ కార్యక్రమం కీలక పాత్రను పోషించింది. డిసెంబర్ 28వ తేదీన, మహిళలపై వేధింపులు, చిన్నారుల పట్ల అసభ్య వర్తనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, నిజామాబాద్ లోని దాదాపు ఎనిమిది స్కూళ్ళు, నాలుగు కళాశాలకు చెందిన పదిహేను వందల మంది విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చారు. ఈ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

విద్య : అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ప్రాథమిక విద్య స్థాయిలో, విద్యార్థులకు గణితం, సైన్స్ పాఠ్యాంశాలను.. మొబైల్ సైన్స్ ల్యాబ్‌తో, సులభ రీతిలో బోధిస్తోంది. ఈ బృందం సభ్యులు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి, విద్యార్థులకు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేయడంతో పాటు.. గణితం, సైన్స్‌లను సులభంగా బోధించే మెళకువలను ఉపాధ్యాయులకు నేర్పుతోంది. ఈ కార్యక్రమాల కోసం ఫౌండేషన్ వెచ్చిస్తోన్న ప్రతి డాలర్ మొత్తానికి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది రూపాయలు మ్యాచింగ్ కింద అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలలో సైన్స్ ల్యాబ్‌లను పరిపుష్టం చేసే దిశగా కార్యక్రమాలు సాగుతున్నాయి.

జీవనం : ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ, శిక్షణ కేంద్రాల ద్వారా, ప్రజలకు వాణిజ్య సూత్రాలను బోధిస్తోంది. ఎల్&టి సంస్థ.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు, శిక్షణను ప్రోత్సహించడమే కాదు.. ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు నెలకు రూ.5000 నుంచి రూ 7000 వరకూ ఉపాధి లభించేలా ఉద్యోగాలు కల్పిస్తోంది.

ఇప్పటివరకూ సాగించిన ప్రస్థానం గురించి ఫణి మాట్లాడుతూ.. “ నిజామాబాద్ ప్రజలతో పాటు.. కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రజలను వివిధ స్థాయి వ్యాపార రంగాల్లో ప్రోత్సహించాలని మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో మహిళలకూ సమాన భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నాము. రెడ్ బస్ డాట్ ఇన్, సియెర్రా అట్లాంటిక్‌లను రూపొందించినదానికన్నా.. ఈ ప్రయత్నమే కాస్తంత కష్టంతో కూడుకొన్నది” అని చెప్పారు.

ఈ మూడు జిల్లాల్లో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు రాజురెడ్డి, ఫణీంద్రలే పూర్తిగా నిధులు సమీకరిస్తున్నారు. ఎంతో అనుభవం గల ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేస్తుండడం వల్ల కొత్తగా ప్రయోగాలు చేయడం కానీ, తప్పులు దొర్లే అవకాశం కానీ ఉండవు. విజ్ఞానం, సుశిక్షతం, విశ్వాసం.. ఈ మూడు అంశాలే కాకతీయ శాండ్ బాక్స్ ఇనిషియేటివ్‌ని సమున్నతం చేస్తున్నాయన్నది వారి భావన. వచ్చే సంవత్సరపు లక్ష్యాల గురించి ఫణి, రెడ్డి లిద్దరూ ఇలా వివరించారు. “ ఈ సంవత్సరాంతానికి ఎనిమిది నుంచి పది సంస్థలతో ఏకకాలంలో పనిచేయాలని భావిస్తున్నాము. 20-30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకుల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంటున్నాము. ఈ సంస్థ వచ్చే సంవత్సరాంతానికి సొంతకాళ్ళపై నిలిచేలా కృషి చేస్తున్నాము. హుబ్లి శాండ్ బాక్స్ నమూనాను, దేశంలోని కనీసం ఇరవై ప్రాంతాలకు విస్తరిస్తే.. 25% గ్రామీణ ప్రాంత ప్రజలు అంటే దాదాపు 20 కోట్ల మందిని ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నాము. ఇటీవలే కాకతీయ శాండ్ బాక్స్ ఇనిషియేటివ్‌లో చేరిన కేర్ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.కృష్ణారెడ్డి లాంటి ప్రముఖుల సహకారంతో.. మా సామాజిక సేవా ప్రయత్నాలు సరైన మార్గంలో సాగుతాయనే విశ్వసిస్తున్నాము. ఫణి, రెడ్డి లిద్దరూ.. రెడ్ బస్ డాట్ ఇన్, సియెర్రా అట్లాంటిక్‌లలో వేర్వేరుగా ప్రయాణిస్తున్నా.. ఇద్దరూ కాకతీయ శాండ్ బాక్స్‌ను ఉమ్మడి పథంగా మలచుకున్నారు. కాకతీయ శాండ్ బాక్స్ గురించిన మరిన్ని విశేషాలు త్వరలో అందించే ప్రయత్నం చేస్తాము.

- అలోక్ సోనీ

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags