సంకలనాలు
Telugu

పేదలకు మెరుగైన జీవితం కోసం పటియాలా ఫౌండేషన్ పోరాటం

GOPAL
28th Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మానవసేవే మాధవసేవ.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న తృప్తి మరి దేనిలోనూ కనిపించదు. రవి అహ్లువాలియా కూడా ఆ విధంగానే తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. పటియాలా ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోను ఏర్పాటు చేసి పేదలకు ఆర్థిక స్వాలంభన చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్రీన్ క్యాబ్స్ పేరిట రిక్షాలను ఇవ్వడంతోపాటు ప్రజలకు ఏ సేవలు అవసరమో తెలుసుకుని, ఆ పనుల్లో పేదలకు శిక్షణ ఇస్తూ వారికి మెరుగైన జీవితం అందించేందుకు కృషి చేస్తున్నారు.

ఏడాది క్రితం జమీర్ పటియాలాలో కత్తులు, కత్తిపీటలను పాలిష్ చేసే పనిచేసేవాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. పాలిషింగ్ వృత్తిలో చాలామంది ఉండేవారు. అందులో ఒకడు జమీర్. అందువల్ల పని దొరకడం చాలా కష్టంగా ఉండేది. కస్టమర్లను ఎలా ఆకర్షించాలో జమీర్‌కు తెలిసేది కాదు. ఇప్పుడు జమీర్‌కు చేతినిండా పని. రాజేశ్ పటియాలాలో నివసించే మరో వృత్తికారుడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు. ఇప్పుడు రాజేశ్ సొంతంగా ఓ రిక్షా కొనుక్కున్నాడు. అంతేకాదు టూరిస్ట్‌గా కూడా శిక్షణ పొందాడు. వీరిలో ఈ మార్పునకు కారణం పటియాలా కేంద్రంగా నడుస్తున్న పటియాల ఫౌండేషన్.

ఈ పటియాలా ఫౌండేషన్‌ను రవీ అహ్లువాలియా 2009లో ప్రారంభించారు. అసంఘటిత, సెమీ స్కిల్డ్, నైపుణ్యం లేని కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ఈ ఎన్జీవోను ఏర్పాటు చేశారు రవీ. ఇంజినీర్ నుంచి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన 40 ఏళ్ల రవీ తన ఉద్దేశాలను యువర్‌స్టోరీకి వివరించారు.

‘‘అసంఘటిత కార్మికులు, మురికివాడల ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు, వారు మెరుగైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన జీవానాధార ప్రాజెక్ట్‌లను నేను చేపట్టాను. మురికివాడల ప్రజలు గౌరవప్రద జీవనం గడపడమే నా ఉద్దేశం’’- రవి 

‘‘పటియాలా గ్రీన్ క్యాబ్స్’’ పేరుతో ఈ ఫౌండేషన్ ఓ కార్యక్రమం కూడా చేపట్టింది. చాలామంది పేదలకు ఉచితంగా సైకిల్ రిక్షాలను ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆ రిక్షాలను వారికే సొంతంగా ఇచ్చేసింది. ఈ కార్యక్రమం కింద రిక్షా డ్రైవర్లుగా పనిచేసినవారికి యూనిఫామ్, ఇన్స్యూరెన్స్, మెంబర్షిప్ ఐడీ వంటి అవసరమైనవాటిని కూడా అందజేసిందీ సంస్థ. ఈ రిక్షాలు కూడా చాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. చాలా తేలికగా, ప్యాసింజర్లు సౌకర్యవంతంగా కూర్చునేలా, లగేజ్ పెట్టుకునేందుకు వీలు కల్పించడంతోపాటు సీట్ బెల్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు రిక్షా డ్రైవర్లకు జాతీయ బ్యాంకుల్లో అకౌంట్ ఇప్పించి, పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఆర్‌ఐ వంటి పథకాలు అందేలా చర్యలు తీసుకున్నది పటియాలా ఫౌండేషన్.

పటియాలా ఫౌండేషన్ అందించిన రిక్షాలు ఇవే..

పటియాలా ఫౌండేషన్ అందించిన రిక్షాలు ఇవే..‘‘కేంద్ర ప్రభుత్వ పథకాలు రిక్షా డ్రైవర్లకు అందేలా మేం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. గ్రీన్ క్యాబ్స్‌ను సొంతం చేసుకునేందుకు బ్యాంక్ డీఆర్‌ఐ పథకం కింద వీరికి లోన్లు కూడా మంజూరు చేసింది. వీరిని టూరిస్టులగా ట్రైనింగ్ ఇచ్చేందుకు పంజాబ్ హెరిటేజ్ అండ్ టూరిజం ప్రమోషన్ బోర్డుతో ఒప్పందం చేసుకున్నాం’’- రవి 

ఐసేవా..

పటియాలా ఫౌండేషన్ ఇటీవలే మరో కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టింది. పటియాలా ప్రజలకు, అసంఘటిత కార్మికులకు మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలు కోరిన వెంటనే రిక్షా డ్రైవర్, ధోబీ, మోచీ, మాలి వంటి వారి సేవలను అందిస్తున్నది. ఈ కార్యక్రమం పేదలతోపాటు ప్రజలకు కూడా ఉపయోగకారిగా నిలిచింది. దీన్ని ఎసెన్షియల్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఈఎస్‌పీఎస్‌)గా పిలుస్తున్నారు. 

ప్రజలకు ఎలాంటి సేవలు అవసరమో పటియాలా ఫౌండేషన్ ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ రంగాలకు సంబంధించి పేదలకు మంచి శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఈఎస్‌ప్సీస్‌ను ఐసేవా మొబైల్ యాప్‌లో, ఆన్‌లైన్ పోర్టల్‌ (www.patialafoundation.org)లో అప్‌లోడ్ చేసింది. ఐసేవాలో పొందుపర్చిన సేవలను పొందేందుకు ఈ ఫౌండేషన్ ఎలాంటి చార్జీలు తీసుకోలేదు. ఆ వృత్తికారులకే డబ్బు ఇస్తే సరిపోతుంది. అంతేకాదు ప్రజలు తమకు కావాల్సిన సేవల వివరాలను కూడా యాప్ లేదా పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే వీలు కల్పించింది. అందరికీ ఉపయోగపడే కమ్యునిటీని నిర్మించడమే ఈ సంస్థ లక్ష్యం.

ఫొటో: పటియాలా ఫౌండేషన్ అందించే సేవలు ఇలా..

ఒక్కసారి ఎసెన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటే అతనికి మరింత ఆదాయం సమకూరేలా పటియాలా ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నది. ‘‘మా సంస్థలో ఈఎస్‌పీలుగా చేరినవారికి మంచి ఆదాయం అందించేలా కార్యక్రమాన్ని రూపొందించాం. కస్టమర్ల నమ్మకం పొందితే.. అతను మరింత ఆదాయం పొందేలా, శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఈఎస్పీలు లబ్ధి పొందడమే కాకుండా అతని కుటుంబం మెరుగైన జీవితాన్ని అనుభవించడం’’ అని రవి వివరించారు.

undefined

undefined


ఉచిత క్యాంపులు..

ఆదాయం పొందే మార్గాలు చూపెట్టడంతోపాటు ప్రభుత్వ పథకాలు ఎలా పొందాలో కూడా ఈ సంస్థ తెలియజేసేది. అందుకోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది. పటియాలా ఫౌండేషన్ ఇప్పటివరకు 115 గ్రీన్‌క్యాబ్స్‌ను అందించడంతోపాటు 288 మంది రిక్షా డ్రైవర్లను తయారు చేసింది. ఈ రిక్షా డ్రైవర్లంతా ఇప్పుడు తమ వాహనాలకు ఓనర్లయ్యారు. అంతేకాదు ఈ డ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు తరచుగా మెడికల్ క్యాంప్‌లను కూడా ఉచితంగా నిర్వహించింది. అలాగే ఫ్రీ సర్వీస్ క్యాంప్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఐసేవా ప్రాజెక్ట్ పటియాలా, కర్నాల్, హోషియాపూర్‌లలో ఉచితంగా సేవలందిస్తున్నది. మొత్తం 71 రంగాల్లో 722 మంది ఈఎస్పీలుగా ఐసేవలో సభ్యులుగా చేరారు. 

నిధుల సమీకరణ

అలాగే పటియాలాలోని ఓ హాస్పిటల్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించిందీ సంస్థ. ‘‘పంజాబ్‌లో తొలి నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ సొసైటీలో మేం భాగస్వాములమయ్యాం’’ అని రవి చెప్పారు. ఈఎస్పీలను గుర్తించేందుకు ఈ సంస్థ కర్నాల్ మునిసిపల్ కార్పొరేషన్, హోషియాపూర్ డిప్యూటీ కమిషనర్లతో కలిసి పనిచేస్తున్నది. ఇప్పటివరకైతే సొంత మూలధనంతో నడుస్తున్న పటియాలా ఫౌండేషన్ నిధుల సమీకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘‘ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీఎస్‌ఆర్ ఫండ్స్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఐసేవా యాప్‌ బ్యాంక్‌ఎండ్ కార్యకలాపాలు, విస్తరణ కోసం మాకు నిధుల అవసరముంది. మరింత మంది పేదలకు ఈ కార్యక్రమాన్ని చేర్చేందుకు దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలనుకుంటున్నాం’’ అని రవి తెలిపారు.

undefined

undefined


అవార్డులు.. రివార్డులు..

ఆర్థిక లాభాన్ని పక్కన పెడితే, ఈ సంస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో సంస్థలు అవార్డులు, రివార్డులు ప్రకటించాయి. ఈ ఫౌండేషన్ చేసిన సేవలను గత రెండేళ్లుగా కర్నాల్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్ కొనియాడుతున్నది. రెండు సంవత్సరాలు వరుసగా అవార్డులను అందజేసింది. యస్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటైన యస్ ఫౌండేషన్ 2014లో పటియాలా ఫౌండేషన్‌కు కమ్యూనిటీ హీరోస్ అవార్డును ప్రదానం చేసింది. డబ్ల్యూఆర్‌ఐ సహకారంతో ఎంబార్క్ ఇండియా సంస్థ 2015లోకనెక్ట్‌కరో అవార్డును ఇచ్చింది.

సవాళ్లు..

పేదలకు మెరుగైన జీవితం అందించడమంటే మాటలు కాదు. ఈ కొత్త ఐడియాను సమాజం అంగీకరించడం ఒక ఎత్తైతే, ప్రభుత్వ మద్దతు, నిధుల సమీకరణ మరో సమస్య. వీటన్నింటిని తట్టుకుని రవీ అనుకున్న లక్ష్యాలకు చేరువగా వెలుతున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది అదే బాటలో పయనించాలన యువర్‌స్టోరీ కోరుకుంటోంది.

image


 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags