టీ వాలెట్ ని ఎలా వాడుకోవాలంటే...

టీ వాలెట్ ని ఎలా వాడుకోవాలంటే...

Friday June 02, 2017,

1 min Read

తెలంగాణ ప్రభుత్వం టీ వాలెట్ పేరుతో కొత్త ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ సహాయంతో ప్రభుత్వ సంస్థలకు చెల్లించే బిల్లులే కాకుండా, ఇతర ప్రైవేటు కంపెనీల బిల్లులు కూడా చెల్లించవచ్చు. నగదును కూడా సులభంగా అవతలి వ్యక్తులకు బదిలీ చేయవచ్చు. కంప్యూటర్ గానీ, స్మార్ట్‌ ఫోన్ ద్వారా గానీ టీ వాలెట్ ని వాడుకోవచ్చు. ఫోన్ లేని వారు కూడా దీని సేవలను ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్‌లో అయితే https://twallet.telangana.gov.in/LoginPage.aspx వెబ్‌సైట్‌ ను సందర్శించాలి. అదే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు ప్రత్యేకంగా టీ వాలెట్ యాప్ స్టోర్‌లలో లభిస్తుంది.

image


టీ వాలెట్‌ను ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ముందుగా పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్లతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత లావాదేవీలు జరపొచ్చు. మీ సేవ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, ఆర్టీఏ సైట్లలో చెల్లింపులు చేయవచ్చు. ప్రైవేటు కంపెనీలకు చెందిన బిల్స్ కూడా కట్టుకోవచ్చు. మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. నగదును అవతలి వ్యక్తికి పంపవచ్చు. లోడ్ చేసిన డబ్బులను ఐఎంపీఎస్ సేవ ద్వారా సొంత బ్యాంక్ అకౌంట్‌కు కూడా బదిలీ చేసుకోవచ్చు. అవ‌త‌లి వ్య‌క్తుల‌కు మ‌నీ రిక్వెస్ట్ పంపుకోవ‌చ్చు.

ఫోన్ లేని వారు కూడా టీ వాలెట్ యాప్‌ను ఉపయోగించవచ్చు. సమీపంలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌లను ఇచ్చి టీ వాలెట్‌లో పేరు జిస్టర్ చేసుకోవచ్చు. ఆ తరువాత డబ్బు డిపాజిట్ చేసి లావాదేవీలను నిర్వహించవచ్చు. అత్యంత సురక్షితమైన ఇంటర్నెట్ సేఫ్టీ జాగ్రత్తలను తీసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చాలా సులుభంగా టీ వాలెట్‌ను వాడుకోవచ్చు.

టీ వాలెట్‌ను త్వరలో రాష్ట్రంలోని 16వేల రేషన్ షాపులకు అనుసంధానం చేయనున్నారు. దీంతో చెల్లింపులు చాలా సులభం అవుతాయి. అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఆసరా, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ చెల్లింపులను కూడా టీ వాలెట్‌తో త్వరలో జరపనున్నారు. ప్రస్తుతం తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో టీ వాలెట్ సేవలు లభిస్తున్నాయి.