36-24-36.. ఇదే ఆడవారి పర్ ఫెక్ట్ బాడీ షేప్ అని ఆ పాఠ్యపుస్తకంలో ఉంది..!
మీరు కరీనా కపూర్ మాదిరి సైజ్ జీరో కోసం వర్కవుట్ చేస్తున్నారా? అయితే మీరు ఔట్ డేటెడ్ అయిపోయినట్టే. ఇంకా సూటిగా చెప్పాలంటే జీరో సైజ్ యావలో ఉన్నారంటే ఇంకా అనాగరికులే. పర్ ఫెక్ట్ షేప్ అంటే ఏంటో 12వ తరగతి సీబీఎస్ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠ్యపుస్తకాన్ని అడిగితే చెప్తుంది.
36-24-36. ఇదే ఆడవారి పర్ ఫెక్ట్ బాడీ షేప్. అవును. ఇది ఎవరో చెప్పిన సంగతి కాదు. 12వ తరగతి ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠ్యపుస్తకం పుస్తకం చెప్పిన భాష్యం. ఇంకా ఆ పుస్తకంలో ఏముందంటే.. ఎందుకీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటిషన్లు.. పైన చెప్పిన కొలతలను ప్రాతిపదికగా తీసుకుంటే అందాల పోటీకి సరిపోవా అని ప్రచురించారు. అంతటితో సరిపెట్టలేదు.. 36-24-36 ఫిగర్ రావాలంటే స్పోర్ట్స్ విపరీతంగా ఆడాలని కూడా సెలవిచ్చారు.
మొత్తం చాప్టరంతా ఆడవారి బాడీషేప్ మీదనే ఫోకస్ చేసింది. చాలామంది మహిళలు, అమ్మాయిలకు తమ బాడీ సైజ్ గురించి పెద్దగా తెలియదు. ఇంకొందరు అసలు ఫిగర్ నే మెయింటెన్ చేయరు అని రాశారు. ఈ రకమైన టాపిక్ లో ఆటలకు ఆడవారు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాన్ని కోట్ చేయడం పైకి కనిపించినా- మహిళల శరీరాకృతి మీద ఒకరకమైన దాడి, అవహేళన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
క్రీడల పట్ల మహిళలు ఆసక్తి కనబరచాలి అన్న అంశాన్ని ప్రస్తావించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ, ఆటల్లో వారు నెగ్గుకు రావడానికి ఎలాంటి అవరోధాల్ని, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో వివరించలేదు. మేరీ కోమ్ లాంటి వాళ్ల విజయం వెనుక ఎంతటి కఠోర శ్రమ వుందో, సామాజికంగా, ఇటు కుటుంబ పరంగా వారు ఎంత వివక్ష, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. ఇలా మొత్తం చాప్టరంతా సెక్సిజం మీదనే నడిచింది.
ఇటీవలి అధ్యయనం ప్రకారం మహిళలు పురుషులకు సంబంధించిన ఆటల్లో పాల్గొంటే వాటి రేటింగ్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే అది ఔట్ అండ్ ఔట్ ఆడవారి ఆట కాదుకాబట్టి. కారణం, ఇప్పటికీ మన దగ్గర క్రీడలు మగవారికి సంబంధించినవే అన్న భావన ఉంది. అందులో ఆడవారు పాల్గొంటే ఇలాగే నిరుత్సాహ పడాలి. ఈ దిశగా వారిని ప్రోత్సహించాలని పాఠ్యాంశంలో ఎక్కడా ప్రస్తావించలేదు.
పితృస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూనుకున్న ఈ వ్యవస్థలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉపదేశాన్ని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. పాఠ్యాంశంలో ఇలాంటి అంశాలను పొందుపరచాల్సి వచ్చినప్పుడు- సవాళ్లను ఎలా అధిగమించాలో కూడా సూచించాలి. అప్పుడే విద్యార్ధులకు సరైన దిశానిర్దేశం చేసినవాళ్లవుతారు.