సౌర విద్యుత్ రంగంలో వెలిగిపోతున్న హైదరాబాదీ కంపెనీ ఫోర్త్ పార్ట్‌నర్

23rd Sep 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


సౌర విద్యుత్ రాబోయే రోజుల్లో పెద్ద విప్లవాన్నే తీసుకురాబోతోంది. ఖర్చుతో కూడుకున్నదంటూ దశాబ్దాల కాలంగా తోసిపుచ్చుతున్నప్పటికీ.. ఇదే భవిష్యత్ అని ప్రపంచం మొత్తం ఇప్పుడిప్పుడే ఆలోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సోలార్ పార్కుల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. 2022 నాటికి 100 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఐదేళ్ల క్రితమే హైదరాబాద్‌కు చెందిన ఫోర్త్ పార్ట్‌నర్ సంస్థ సౌరవిద్యుత్ సామర్ధ్యాన్ని గుర్తించింది. ఉన్నతోద్యోగాలు వదిలేసి మరీ ముగ్గురు మిత్రులు చేసిన సాహసం ఇప్పుడిప్పుడే ఫలితాలను అందిస్తోంది.

పోర్ట్ పార్ట్‌నర్ ఏర్పాటు చేసిన ఓ రూప్ టాప్ ప్లాంట్

పోర్ట్ పార్ట్‌నర్ ఏర్పాటు చేసిన ఓ రూప్ టాప్ ప్లాంట్


సౌరవిద్యుత్తుకు ఇప్పుడు ఎక్కడలేని డిమాండ్ కనిపిస్తోంది. సామాన్యులతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించేందుకు దీన్నో ప్రత్యామ్నాయ మార్గంలా చూస్తున్నాయి. ఇళ్లలో పెట్టుకునే లాంతర్ల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు అవసరమైన రూఫ్ టాప్‌ల వరకూ ఎన్నో మార్గాల్లో సంప్రదాయ విద్యుత్‌ను పొదుపు చేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు దీన్నో మార్గంగా చూసేవాళ్లు ఎక్కువే ఉన్నారు కానీ.. ఏర్పాటుకు అయ్యే భారాన్ని చూసి వెనుకాడుతూ వస్తున్నారు. సరిగ్గా దీన్నే ఓ అవకాశంగా మార్చుకున్నారు ముగ్గురు మిత్రులు. ఆర్థిక సేవల రంగంలో కనీసం దశాబ్ద కాలంపాటు అనుభవం సంపాదించి, వివిధ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన తర్వాత ఈ రంగంలోకి దూకారు. విస్తృతంగా పెరగబోయే మార్కెట్‌ను సొమ్ము చేసుకోవడమే ఏకైక లక్ష్యంలో బరిలోకి దూకి సక్సెస్ సాధించారు. ఐదేళ్లుగా లాభాల బాటలో నడుస్తూ.. మంచి ఫండింగ్ కూడా తెచ్చుకున్నారు.

ఫోర్త్ పార్ట్‌నర్ సంస్థ 2010లో హైదరాబాద్ కేంద్రంగా మొదలైంది. వివేక్ సుబ్రమణియన్, సైఫ్ దొరాజీవాలా, వికాస్ సలుగుటి కలిసి దీన్ని ప్రారంభించారు. వీళ్లంతా మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు. వీళ్లలో వివేక్ ఢిల్లీ, సైఫ్ పూణే, వికాస్ మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన వారు. ముప్ఫైలు దాటి నలభై ఏళ్లలో అడుగుపెడ్తున్నప్పుడు.. ఉద్యోగాలు వదిలేసి సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నారు. అప్పుడు వచ్చిన ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చారు.

'' కంపెనీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడానికి కూడా కారణముంది. ఇది సోలార్ పరికరాలకు ఇదో హబ్ లాంటిది. సప్లై చైన్ కూడా మెరుగ్గా ఉంటుంది. అందుకే వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లమైనా హైదరాబాద్‌నే ఎంపిక చేసుకున్నాం '' అంటారు కంపెనీ సహ వ్యవస్థాపకులు వివేక్ సుబ్రమణియన్.
వివేక్ సుబ్రమణియన్, ఫోర్త్ పార్ట్‌నర్ కో ఫౌండర్

వివేక్ సుబ్రమణియన్, ఫోర్త్ పార్ట్‌నర్ కో ఫౌండర్


సొంత నిధులతో కంపెనీ ప్రారంభించిన ముగ్గురూ.. మొదటి ఏడాదిలో ఓ సోలార్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీని కొనుగోలు చేశారు. దాని వల్ల ఆ రంగంలో అప్పటికే ఉన్న వాళ్ల అనుభవం కంపెనీకి కలిసొచ్చింది. సోలార్ ఉత్పత్తుల తయారీతో మొదలైన వ్యాపారం.. ఆ తర్వాత టర్న్ కీ సొల్యూషన్స్, రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ స్థాయికి ఎదిగింది. ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ ఇన్‌స్టలేషన్, మెయింటెనెన్స్ రంగాల్లో నైపుణ్యం సాధించింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, పూణె వంటి ఐదు చోట్ల ఆఫీసులనూ నెలకొల్పింది. ఇప్పుడు సంస్థలో 50 మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వికాస్ సలుగుటి, సైఫ్ దొరాజీవాలా - ఫోర్త్ పార్ట్‌నర్ సహ వ్యవస్థాపకులు

వికాస్ సలుగుటి, సైఫ్ దొరాజీవాలా - ఫోర్త్ పార్ట్‌నర్ సహ వ్యవస్థాపకులు


బ్యాంకర్లు ఛీకొట్టారు

మేం కంపెనీ ఏర్పాటు చేసిన కొత్తల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా అనుభవంతో అంతా సాఫీగా సాగిపోతుందని భావించినప్పటికీ అంత సులువుగా ఏం జరగలేదు. అప్పట్లో విద్యుత్ రంగం వల్ల బ్యాంకింగ్ పరిశ్రమకు కష్టాలు వచ్చాయి. దీంతో రుణాల గురించి బ్యాంకుల దగ్గరికి వెళ్తే.. దాదాపు ఛీకొట్టినంత పనిచేశారు. మా మొహం చూసేందుకు కూడా నిరాకరించిన రోజులు ఉన్నాయని గుర్తుచేసుకుంటారు వివేక్ సుబ్రమణియన్. అయితే అలా ఆటుపోట్లను ఎదుర్కొంటూనే రెండు, మూడేళ్ల పాటు నిలదొక్కుకుంది.

ఇప్పుడు ఫోర్త్ పార్ట్‌నర్ వివిధ రాష్ట్రాల్లో 400 వరకూ ఇన్‌స్టలేషన్స్ చేశారు. 50 మంది వరకూ క్లైంట్లను కూడా సంపాదించుకుంది. ఐదేళ్లుగా కంపెనీ నష్టాల్లోకి జారకుండా లాభాల్లోనే ఉండేట్టు వ్యవస్థాపకులు జాగ్రత్తపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూఫ్ టాప్ సొల్యూషన్స్ ద్వారానే 50 కోట్ల ఆదాయం రావొచ్చని ఆశిస్తోంది.

2022 నాటికి కేంద్రం భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇందుకు 40 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని వివేక్ చెబ్తున్నారు. అందులో తాము చిన్న వాటాను తీసుకున్నా.. ఐదేళ్లలో 1000 కోట్ల టర్నోవర్ సులువుగా సాధ్యమవుతుందని ధీమాగా ఉన్నారు.

కేవలం ప్రొడక్ట్స్ అమ్మకానికి మాత్రమే పరిమితం కాకుండా.. సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం, సౌర విద్యుత్ అమ్మకం, ప్రాజెక్టుల నిర్వాహణ వంటి కార్యకలాపాల్లో కూడా కంపెనీ చురుగ్గా ఉంది. ఏదైనా కంపెనీకి సౌరవిద్యుత్ పలకలను అమర్చుకునే ఆర్థిక సామర్ధ్యం లేకపోతే.. అక్కడ వాళ్లే వెళ్లి ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. సాంప్రదాయ విద్యుత్‌కు బదులు సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసి వాళ్లకు అమ్ముతారు. దీనివల్ల మొదట్లో అధికంగా ఖర్చుచేసే అవసరం తప్పి, నెలవారీ ఖర్చులో కూడా తేడా కనిపిస్తుందని ఫోర్త్ పార్ట్‌నర్ చెబ్తోంది.

ఫండింగ్

2014 ఆగస్టులో చెన్నై ది చెన్నై ఏంజిల్స్ నుంచి మిలియన్ డాలర్ల మొత్తం ఫండింగ్‌గా అందింది. తాజాగా.. 2 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండింగ్‌ కూడా ఫోర్త్ పార్ట్‌నర్‌ దక్కించుకుంది. చెన్నై ఏంజిల్స్‌తో పాటు ఇన్‌ఫ్యూస్ వెంచర్స్ నుంచి ఈ మొత్తం అందింది. ఆసియా అభివృద్ధి బ్యాంకుతో పాటు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్‌మెంట్ ప్రోగ్రాం నుంచి కూడా ప్రోత్సాహం అందనుందని కంపెనీ సహ వ్యవస్థాపకులు వివేక్ సుబ్రమణియన్ యువర్ స్టోరీకి వెల్లడించారు.

'' సౌర విద్యుత్తుకు వ్యాపారపరంగా నిలదొక్కుకునే సామర్ధ్యం ఉందని ఇప్పుడు అందరికీ అర్థమైంది. అందుకే రాబోయే రోజుల్లో ఇదో అతిపెద్ద వ్యాపారం కాబోతోంది. జర్మనీలో 25-30 శాతం అవసరాలు సోలార్ ద్వారానే తీరుతున్నాయి. మన దగ్గర 1 శాతంకన్నా తక్కువే సౌర విద్యుత్ వినియోగం ఉంది. అందుకే మా వృద్ధికి ఢోకా లేదనే నమ్మకం కుదిరింది '' - వివేక్ సుబ్రమణియన్.


website

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India