Telugu

ల్యాబొరేటరీల వివరాలు చెప్పే ఆన్ లైన్ డైరెక్టరీ!!

పాథాలజీ ల్యాబ్ ల వివరాలు చెప్పే ల్యాబ్ గో-గుర్తింపు పొందిన ల్యాబ్ లకు మాత్రమే వెబ్ సైట్ లో చోటు-4 నెలల్లోనే కస్టమర్లకు చేరువైన స్టార్టప్-

uday kiran
25th Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఒంట్లో కాస్త నలతగా ఉండి హాస్పిటల్ కు వెళ్తే డాక్టర్ మందుగా రాసేది టెస్టులే. చిన్న ఆరోగ్య సమస్య అయినా రిపోర్టు వచ్చాకే ట్రీట్ మెంట్ స్టార్టవుతుంది. ఇదే అదునుగా దేశంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్ లు వీధికొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా యధేచ్చగా దందా సాగిస్తున్నాయి. ఒక్క డయాగ్నోస్టిక్ సెంటర్ లే కాదు. పుడ్, వాటర్, ఫార్మా ఇలా అనేక రంగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించే సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో ఎన్ని ప్రభుత్వ గుర్తింపు పొందాయన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇదే విషయం 33 రాహుల్ గుప్తాను ఆలోచనలో పడేసింది.

ఢిల్లీకి చెందిన రాహుల్ గుప్తాకు పదేళ్లు ల్యాబొరేటరీ, దాని సంబంధింత రంగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ ఎక్స్ పీరియన్స్ తో తానే స్వయంగా ఓ ల్యాబ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇదే సమయంలో ఆయనకు దేశంలో ఎన్ని ల్యాబ్ లు ప్రమాణాలను పాటిస్తున్నాయి, వాటిలో ప్రభుత్వ గుర్తిపు ఉన్నవి ఎన్ని అనే డౌట్ వచ్చింది. గుర్తింపులేని ల్యాబ్ లలో పరీక్షలు చేయించి జనం పడుతున్న అవస్థలు గుర్తొచ్చాయి. ఈ సమస్యను పరిష్కారం చూపే ల్యాబ్ గో ప్రారంభించారు. 2015 సెప్టెంబర్ లో ఢిల్లీ హెడ్ క్వార్టర్ గా ఎస్ జీఎం ల్యాబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా ఈ ఆన్ లైన్ సెర్చింజన్ ల్యాబ్ గో కార్యకలాపాలు మొదలయ్యాయి. దేశంలో వివిధ రంగాలకు సంబంధించి నాణ్యత పరీక్షలు నిర్వహించే గుర్తింపు పొందిన ల్యాబొరేటరీల ఆన్ లైన్ డైరక్టరీయే ల్యాబ్ గో. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ ల్యాబొరేటరీస్(NABL), అక్రిడేషన్ కమిషన్ ఫర్ కన్ఫర్మిటీ అసెస్ మెంట్ బాడీస్ (ACCAB) గుర్తింపు పొందిన 1400లకు పైగా ల్యాబ్ ల సమాచారం ల్యాబ్ గో లో దొరుకుతుంది. 8లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ స్టార్టప్ చాలా తొందరగానే కస్టమర్లకు చేరువైంది.

image


“భారత్ లో బీ2బీ, బీ2సీ మార్కెట్ ల సమస్యలకు పరిష్కారం చూపడమే ల్యాబ్ గో లక్ష్యం. నిధుల కోసం ఇప్పటి వరకు ఏ ఇన్వెస్టర్ ను సంప్రదించలేదు. మరిన్ని ల్యాబ్ లు వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యేలా చేసి ఇన్వెస్టర్లను ఆకర్షించాలని అనుకుంటున్నాం.”-రాహుల్

ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన రాహుల్ 2003లో అడ్వర్టైజింగ్ సెక్టార్ లో కెరీర్ ప్రారంభించి 2004లో ల్యాబొరేటరీ ఎక్విప్ మెంట్ ట్రేడింగ్ లో అడుగుపెట్టాడు. 2009లో సిగ్మా టెస్ట్ అండ్ రీసెర్ట్ సెంటర్ లో కన్సల్టెంట్ గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ 2014లో ఫుడ్ రీసెర్చ్ అండ్ స్టాండర్డైజేషన్ ల్యాబొరేటరీ తరఫున ల్యాబొరేటరీ అక్రిడేషన్ కన్సల్టెంట్, ట్రైనర్ గా అపాయింట్ అయ్యాడు.

ల్యాబ్ గో 12 సెగ్మెంట్లకు సంబంధించి పాథాలజీ సర్వీసులు అందించే ఆన్ లైన్ డైరక్టరీగా పనిచేస్తుంది. వాటర్ టెస్టింగ్, ఫుడ్, టెక్స్ టైల్, మెటల్, కన్ స్ట్రక్షన్, ఫార్మాస్యూటికల్, ఆటో మొబైల్, పెట్రోలియం, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల తదితర రంగాలకు సంబంధించి ల్యాబ్ ల వివరాలను ఈ వెబ్ సైట్ అందిస్తుంది. హోం పేజ్ లోని సెర్చ్ ఆప్షన్స్ లో ఏ వస్తువును టెస్ట్ చేయించాలనుకుంటున్నారో ఎంటర్ చేస్తే దేశవ్యాప్తంగా సదరు సేవను అందించే టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ ల్యాబ్ ల వివరాలు ప్రత్యక్షమవుతాయి.

“మా వెబ్ సైట్ ఆన్ లైన్ రెస్టారెంట్ల వివరాలు అందించే జొమాటోను పోలి ఉంటుంది. ప్రస్తుతం ల్యాబ్ గో నెలకు 10 నుంచి 15వేల మంది యూజర్లకు సేవలందిస్తోంది. ఈ ఆన్ లైన్ డైరెక్టరీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, పర్చేజ్ మేనేజర్స్, రీసెర్చ్ అనాలసిస్ట్స్, క్వాలిటీ ప్రొఫెనషనల్స్ తో పాటు సాధారణ ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తుంది.”- రాహుల్

15 మంది సిబ్బంది ఉన్న ల్యాబ్ గో NABL అక్రిడేషన్ ఉన్న దాదాపు అన్ని టెస్టింగ్, కాలిబరేషన్ ల్యాబొరేటరీల వివరాలు అందిస్తోంది. వెబ్ సైట్ లో ఉన్న ఫిల్టర్ సాయంతో ప్రాంతాలవారీగా వివరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ స్టార్టప్ కు కచ్చితమైన ఆదాయ వనరంటూ ఏమీ లేదు. ప్రస్తుతం బీటా వెర్షన్ లో పనిచేస్తున్న ఈ వెబ్ సైట్ ను త్వరలోనే అడ్వర్జైజింగ్ బేస్డ్ రెవెన్యూ మోడల్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెయిడ్ లిస్టింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.

“కంపెనీని గాడిలో పెట్టడంతో పాటు నిధుల సమీకరణ కోసం ఇన్వెస్టర్లను సంప్రదించే పనిలో ఉన్నారు. మరిన్ని సర్టిఫైడ్ ల్యాబొరేటరీలను వెబ్ సైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. డిజిటల్ టీంను తయారు చేసి కంపెనీ తరఫున టెస్టింగ్ హబ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో ఆన్ లైన్ శాంపిల్ బుకింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెస్తాం. ఏటా 200 కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నాం.”- రాహుల్

యువర్ స్టోరీ టేక్

ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద రంగాల్లో హెల్త్ కేర్ సెక్టార్ కూడా ఒకటి. 2017 నాటికి ఈ రంగం విలువ 160 బిలియన్ డాలర్లు, 2020 నాటికి 280 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ హెల్త్ కేర్ సెక్టార్ లో కీ రోల్ ప్లే చేస్తుండటంతో గత రెండేళ్లుగా ఈ రంగంలో అనేక స్టార్టప్స్ వస్తున్నాయి.

ముంబైకి చెందిన మెడ్ ఎక్విప్స్ పేషంట్స్ కు సర్టిఫైడ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ల సమాచారంతో పాటు అవి ఛార్జ్ చేసే రేట్లను కంపేర్ చేసి బెస్ట్ ఆప్షన్ ఎంచుకునేందుకు సహకరిస్తోంది. ఇక గుర్గావ్ కు చెందిన ల్యాబ్ స్ట్రీట్ తక్కువ ధరకు సర్టిఫైడ్ పాథాలజీ సర్వీసులు అందించే కంపెనీల గురించి వివరాలు చెబుతుంది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సీ.. ల్యాబ్ ల వివరాలతో పాటు ఏ టెస్టుకు ఎంత ఛార్జ్ చేస్తారన్న విషయాన్ని చెబుతుంది. ఆన్ లైన్ బుకింగ్ అవకాశాన్ని కల్పిస్తోంది.

భారత్ లో ఈ కామర్స్ రంగం దూసుకుపోతుండటంతో బ్యూటీ సర్వీసులు, గృహావసరాలు, క్యాబ్ సర్వీసులు అందించే స్టార్టప్ ల సేవలు విస్తృతం అవుతున్నాయి. పాథాలజీ సర్వీసుల్ని కస్టమర్ల చెంతకు చేర్చే ప్రయత్నంలో ఉన్న స్టార్టప్ లతో పోటీ పడుతున్న ల్యాబ్ గో మార్కెట్ లో నిలదొక్కుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags