సంకలనాలు
Telugu

ఈ అమ్మ దాతృత్వం యావత్‌ సమాజానికే ఆదర్శం

 అభాగ్యులకు నిస్వార్థ సేవ చేస్తున్న శాంతి మహిళా మండలి పిచ్చమ్మ

team ys telugu
6th Mar 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

తనలాంటి కన్నీళ్లు మరెవరకీ రావొద్దని కోరుకునేవాళ్లు చాలా అరుదుగా వుంటారు. అలాంటి పెద్ద మనసే పిచ్చమ్మది. జగమంత కుటుంబం ఉన్నా ఏకాకి జీవితం గడిపే ఒంటరి మహిళకు ఆమె ఆత్మబంధువైంది. దివ్యాంగులను చేరదీసి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తోంది. శాంతి మహిళా మండలి పేరుతో అభాగ్యులకు నిస్వార్థ సేవ చేస్తున్న పిచ్చమ్మకు యువర్ స్టోరీ హ్యాట్సాఫ్ చెప్తోంది.

image


పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ పిచ్చమ్మ జీవితంలో అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఊహ తెలియని వయసులోనే పెళ్లి చేసారు. చేసుకున్నవాడు మధ్యలోనే కాలం చేశాడు. సంతానం లేదు. భర్త హఠాన్మరణంతో పిచ్చమ్మ ఒంటరైపోయింది. ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు ఇంకిపోయాయి. చీకటిల్లు ఇంకెన్నాళ్లు..? చుట్టుపక్కల వాళ్ల మాటలు ఆలోచింపజేశాయి. మనిషి ఒంటరే కావొచ్చు. కానీ సమాజం ఒంటరి కాదు. తనలాంటి వాళ్లు ఎందరో ఇంకా లోకంలో దిక్కూమొక్కూ లేక పడివున్నారు. వాళ్లకోసం ఏమైనా చేయలేమా అని ఆలోచించింది.

కన్నవారికి భారం కాకూడదని పుట్టిన ఊరు పెద్ద సూరారం నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చింది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని 1990లో మహిళల కోసం టైలరింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. కొంత మంది మహిళల్ని చేరదీసి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చింది. వాళ్లను సొంత కాళ్ల మీద నిలబడేందుకు ప్రోత్సహించించింది. అందరి నుంచి ప్రశంసలు వెల్లువలా వచ్చాయి. అధికారులు కూడా పిచ్చమ్మ మంచితనాన్ని ప్రోత్సాహించారు. రెండేళ్ల తర్వాత శాంతి మహిళా మండలి పేరుతో మహిళల వృద్ధాశ్రమాన్ని నెలకొల్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల మంది ఒంటరి, వృద్ధ మహిళలు పిచ్చమ్మ ఆశ్రమంలో చేరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శాంతి మహిళా మండలి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు.

25 ఏళ్లుగా ఒంటరి మహిళలు, అనాథలు, మానసిక వికలాంగులు, దివ్యాంగులు ఎందరో పిచ్చమ్మ ఇంట్లో తలదాచుకున్నారు. వారికి భోజన వసతి కల్పించడం, అవసరమైన వైద్య సేవలందించడం, తోడబుట్టిన వాళ్లు కూడా అలాంటి చేయరు. మాటలకందని సేవ చేస్తోంది పిచ్చమ్మ.

మహిళల అభ్యున్నతి కోసం పాటు పడే ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న పిచ్చమ్మను సాక్షాత్తూ కలెక్టర్లే సన్మానం చేశారు. ప్రజాప్రతినిధులు ఎన్నో అవార్డులు అందజేశారు. ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెరవకుండా ధైర్యంగా ముందుకు సాగింది. ప్రస్తుతం పిచ్చమ్మ వృద్ధాశ్రమంలో 46 మంది ఆశ్రయం పొందుతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు డబ్బుల్లేని పేదవారికి తనవంతు సాయం చేస్తుంది. నలుగురు మహిళలను వెంటతీసుకెళ్లి వారి పాడెమోసి, అంతిమ సంస్కారాలు చేస్తుంది. 

ఇంత చేస్తున్నా పిచ్చమ్మకు దాతల సాయం కూడా అంతంత మాత్రమే. కేవలం ప్రభుత్వం నుంచి డీఆర్డీఏ నుంచి వచ్చే డబ్బులతోనే పిచ్చమ్మ ఆశ్రమాన్ని నడుపుతోంది. కొన్నిసార్లు అప్పులు చేసి మరీ వారిని పోషిస్తోంది.

వృద్ధాశ్రమానికి సొంత భవనం లేకపోవడంతో ప్రభుత్వం స్థలం కేటాయించింది. కానీ భవనమే ఇంతవరకూ లేదు. ఎవరైనా దాతలు సాయం చేస్తే ఆశ్రమం నిలబడుతుంది. పండుటాకులకు ప్రభుత్వం ఆసరా పింఛన్లతో పాటు అంత్యోదయ కార్దుల ద్వారా రేషన్ బియ్యాన్ని అందిస్తున్నది. కానీ చాలా మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి వైద్యం చేయించే స్థోమత లేదని పిచ్చమ్మ వాపోతున్నది. వైద్య పరంగా సాయంచేస్తే ఆ అభాగ్యులకు మరికొంత జీవితాన్నివ్వొచ్చని పిచ్చమ్మ అంటోంది.

25 ఏళ్ల నిస్వార్థ సేవలో మంచి పేరు తప్ప ఏమీ సంపాదించుకోలేదు. తనకంటూ ఒక కుటుంబం లేదు.. భర్త లేడు.. పిల్లలు లేరు.. అయిన వాళ్లు, ఆత్మీయులు లేరు. ఉన్నదల్లా నలభై మంది అనాథలు, ఒక రేకుల షెడ్డు. సంతోషమైనా, బాధొచ్చినా తన చుట్టూ వారితోనే పంచుకుంటుంది.

జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా పట్టించుకోని ప్రస్తుత సమాజంలో.. పిచ్చమ్మ దాతృత్వం యావత్‌ ప్రపంచానికి ఆదర్శం. తను పడ్డ బాధను మరెవరూ అనుభవించొద్దని నిస్వార్థ సేవా మార్గాన్ని ఎంచుకున్న పిచ్చమ్మ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సమాజమే దేవాలయంగా భావించి సేవకే అంకితమైన ఆమె నిస్వార్ధ సేవకు యువర్ స్టోరీ హ్యాట్సాఫ్‌ చెప్తోంది. 

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags