మంచి కోసం టెక్నాలజీని ఎలా వాడచ్చో నిరూపించిన తెలుగమ్మాయి

19th Aug 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


వినూత్న ఆలోచనలతో దూసుకుపోతున్న విమెన్ కోడర్..

కోడింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం..

టెక్నాలజీని సామాన్యులకు పనికొచ్చేలా చేస్తున్న వైనం..

వైజాగ్ వాసి శ్రీలక్ష్మిని చూసి మనమూ చాలా నేర్చుకోవచ్చు..

నేను స్కూల్ రోజుల్లో చదువుతూ ఉండగా.. నాకు ఏ రోజూ అనిపించలేదు భవిష్యత్తులో నేను కోడర్ అవుతానని. అలాంటి లక్షణాలూ ఉండేవి కావు. తన బాల్యం గురించి తాను ఇలా చెప్పుకునే శ్రీలక్ష్మి, కొద్దికాలం ఒమన్‌లో ఇప్పుడు విశాఖపట్నంలో గడుపుతున్నారు.

చదువులో ఎప్పుడూ ముందుండే తనకు రోల్ మోడల్‌ అంటూ ఎవరూ లేరు. అలా అని భవిష్యత్తులో తానో చేంజ్ మేకర్ అవుతానని కూడా అనుకోలేదు. ఇప్పుడు శ్రీలక్ష్మి కథ వింటే.. మనపై మనకే నమ్మకం రెట్టింపవుతుంది, సంకల్పం ఉంటే లక్ష్యాలను చేరుకోగలమనే ధైర్యమొస్తుంది.

శ్రీలక్ష్మి- విమెన్ కోడర్ - చేంజ్ టెర్రా యాప్ డెవలపర్

శ్రీలక్ష్మి- విమెన్ కోడర్ - చేంజ్ టెర్రా యాప్ డెవలపర్


ఆతృత ఉన్నా అవకాశం దొరకలేదు

శ్రీలక్ష్మికి పదో ఏటనే కంప్యూటర్ పరిచయమైంది. అయితే అప్పట్లో కేవలం గేమ్స్ ఆడుకోవడానికి తాను పరిమితమయ్యేది. కానీ మెల్లిమెల్లిగా C నేర్చుకోవడంపై మనసు మళ్లింది. అందులోని ప్యాటర్న్స్‌పై ఆసక్తి నానాటికీ పెరుగతూ వచ్చింది. అదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరేందుకూ కారణమైంది.

శ్రీలక్ష్మి శ్రీకాకుళంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న 35 మంది బ్యాచ్‌లో ఆరుగురు అమ్మాయిలే ఉన్నారు. అందులో తనూ ఒకరు. తన ఆలోచనల పరిధి విస్తృతంగా, నేర్చుకోవాలనే తపన విపరీతంగా ఉన్నా.. అక్కడి వాతావరణం ఆమెను కట్టడి చేసింది.

కాలేజీ సమయం తర్వాత లైబ్రరీ కూడా మూసేసేవారు. తను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ ప్రాజెక్ట్‌తో పాటు కాలేజీ వెబ్ సైట్‌కు కంటెంట్ మేనేజ్మెంట్ తయారు చేసి ఇచ్చారు.

''నాకు ఏదో ఒకటి గొప్పగా చేయాలని ఉండేది. కానీ సరైన అవకాశాలు రాలేదు. ఇంట్రోవర్ట్ కావడం వల్ల జనాలతో ఎలా మెలగాలో బాగా తెలుసుకున్నాను''.
image


ఆ తర్వాత C, Java, HTML, Java script నేర్చుకున్నారు శ్రీలక్ష్మి.

కాలేజీ తర్వాత జావా డెవలపర్‌గా అవకాశం రావడంతో ఢిల్లీ వెళ్లారు. డేటా బేస్ మేనేజ్మెంట్‌పై పనిచేస్తున్న పది మంది సభ్యుల బృందంలో తానొక్కతే అమ్మాయి. వివిధ ప్రాంతాల్లో జరిగే, వివిధ సమావేశాలపై జనాలకు వివరాలను అందించే ప్రాజెక్ట్ అది. ఏడు నెలల తర్వాత తనను బెంగళూరుకు మార్చారు, రెండు నెలల పాటు పనిచేసిన తర్వాత కంపెనీ నుంచి బయటికొచ్చేశారు.

ప్రమాదంతో మరింత పదును

ఒక రోజు విశాఖపట్నం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి తన జీవితంలో అనేక మార్పులు జరిగాయి. అయితే తనకు కుటుంబ సభ్యులతో పాటు భర్త సహకారం ప్రోత్సాహం వెన్నంటే ఉండడం ధైర్యాన్నిచ్చింది. ఆరోగ్యం సహకరించకున్నా మెదడు మాత్రం చురుగ్గా పనిచేసేది. కొత్త ఐడియాలతో ప్రొడక్ట్స్ తయారు చేయాలనే కాంక్ష లోలోపల ధృడంగా మారుతూ వచ్చింది. ఫుల్ టైం జాబ్ మానేసిన తర్వాత తన పూర్తి దృష్టి అంతటినీ కలల ప్రాజెక్టులపై కేంద్రీకరించారు.

ఆన్‌లైన్‌కు మారాలి అనుకుంటున్న చైన్ షాపులకు సరుకుల నిర్వాహణ (ఇన్వెంటరీ మేనేజ్మెంట్)ను ఓ ప్రాజెక్టులో భాగంగా తయారు చేశాను.

మొబైల్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నప్పుడు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌ను కూడా శ్రీలక్ష్మి నేర్చుకున్నారు. అప్పుడే ఓ వినూత్నమైన యాప్ తయారు చేసి అందరి మన్ననలూ పొందాలని నిశ్చయానికి వచ్చారు.

image


మీ మొబైల్ మీ మాటే వింటుంది

2014లో ఎంఐటి ల్యాబ్స్‌ వర్క్ షాప్‌లో తను పాల్గొన్నారు. అక్కడే బ్లిమి (BLIMEY)అనే ఓ అప్లికేషన్‌ను తయారు చేశారు. స్మార్ట్ ఫోన్లకు ఇది అదనపు సెక్యూరిటీ ప్రోటోకాల్‌లా పనిచేస్తుంది.

మీ ఫోన్‌లో గరిష్టంగా ఒకటి, రెండు యాప్స్‌ మాత్రమే పనిచేసే విధంగా మోడ్‌ను సెట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ ఇతరులు వాడుతున్నప్పుడు ఇది చాలా ఉపయోగ పడ్తుంది. మీ పర్సనల్ వివరాలు, పిక్చర్స్ వంటివి వాళ్లు చూడకూడదు అనుకున్నప్పుడు బాగా ఉపకరిస్తుంది. అంతే కాదు కాల్స్ కూడా కొన్ని సెకెన్లకే ఆటోమేటిక్‌గా కట్ అయిపోయే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది కాలేజీ స్టూడెంట్స్‌కు చాలా ఉపకరిస్తుంది. ఎందుకంటే వాళ్ల స్నేహితులకు ఫోన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ సేపు మాట్లాడద్దని చెప్పడానికి సిగ్గుపడే వారికి ఉపయుక్తం.

ప్లేస్టోర్‌లో కూడా లభ్యం కాని వీటి ద్వారా బిజినెస్ మోడల్‌ తయారు చేయలేకపోయారు. వీటితో పాటు మొబైల్, వెబ్ ఈ-కామర్స్ కన్సల్టేషన్ పనులను చేస్తూనే ఉన్నారు. ఫ్రంట్ ఎండ్‌లో డేటాబేస్ మొత్తం శ్రీలక్ష్మి తయారు చేశారు.

టెక్నాలజీతో సమాజ సేవ

డిసెంబర్ 2014లో బ్లడ్ డోనార్స్ కొరతను ఆమె ఓ సందర్భంలో గుర్తించారు. ఒక సందర్భంలో కుటుంబ సభ్యులకే ఓ బ్లడ్ గ్రూప్ రక్తం అవసరం పడి నానా తంటాలు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు ఏదైనా చేయాలని శ్రీలక్ష్మి అప్పుడే సంకల్పించారు. మార్చ్ 2015 నాటికి చేంజ్ టెర్రా (change terra) అనే యాప్‌ను తయారు చేశారు. రక్తం అవసరమైనవాళ్లనూ.. దాతలనూ కలిపే వేదికగా దీన్ని రూపొందించారు.

''ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు వాళ్ల నెట్వర్క్‌పైనే ఎక్కువగా ఆధారపడ్తారు. కొంత మంది సోషల్ మీడియాను కూడా నమ్మకుంటారు. కానీ చేంజ్ టెర్రాలో ఇలాంటి వాళ్లందరికీ ఓ వేదిక. వాళ్లు ఇక్కడ రిజిస్టర్ చేసుకుని, ఇతరుల నుంచి సాయం పొందొచ్చు''.
image


చేంజ్ టెర్రా అనే పదం మారుతున్న భూమి (చేంజింగ్ ఎర్త్) నుంచి ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నారు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే తన ఉద్దేశం కావడం వల్ల ఈ పేరును ఖరారు చేసుకున్నారు.

శ్రీలక్ష్మి తానే స్వయంగా రెండు వారాల్లో ఈ ప్లాట్‌ఫాం మొత్తాన్ని కోడింగ్ చేశారు. యూజర్ ఇంటర్‌ఫేజ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ యాప్ కేవలం వివరాలు మాత్రమే చూపిస్తుంది. డోనర్ ఒప్పుకునేంత వరకూ వారి వివరాలు మాత్రం ఇందులో కనపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రోత్సాహం అవసరం

కోడింగ్‌లో మహిళలకు మెరుగైన భవిష్యత్తు ఉందని శ్రీలక్ష్మి బలంగా విశ్వసిస్తున్నారు. కానీ వాళ్లకు ఇప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయి ప్రోత్సాహం అవసరం ఉందని సూచిస్తున్నారు.

''ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంక ఎవరు ? ''

''ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంక ఎవరు ? ''


"ఒకే దానిపై ఎప్పుడూ పూర్తిగా ఆధారపడిపోకుండా, ఇతర అవకాశాలనూ ఎప్పుడూ సజీవంగా ఉండే విధంగా మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి. మన లక్ష్యాలేంటో గుర్తించి, అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి''.

ఎప్పుడు ఏది అవసరమో దాన్ని గుర్తించి అందుకు తగ్గట్టు పనిచేయడం, ఎప్పుడూ వెనుదిరగకపోవడమే శ్రీలక్ష్మి జీవితంలో కీలక పాత్ర పోషించాయి. ఆమె ఇప్పుడో లాభాపేక్షలేని సంస్థ నిర్వాహణతో పాటు విమెన్ కోడర్‌ కూడా. అంతేకాదు మహిళల కోసం వర్క్ షాపులు, టెస్టింగ్‌పై సెషన్స్ కూడా నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding Course, where you also get a chance to pitch your business plan to top investors. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India