సంకలనాలు
Telugu

కుమ్మరివాళ్లకు ఉపాధినిస్తున్న 'మాటి' కళాఖండాలు

Sri
4th Nov 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

పుట్టిన ప్రతీ మనిషి మట్టిలో కలిసిపోవాల్సిందే. కానీ మనిషి పుట్టిందే మట్టి నుంచి అన్నది కొందరి విశ్వాసం. విశ్వాసం మాత్రమే కాదు... ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మనిషిని పుట్టించాలనుకున్న బ్రహ్మ ముందుగా మట్టినే బొమ్మగా మలిచాడట. ఆ తర్వాత ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేసి మనిషిని చేశాడని చెబుతుంటారు. ఇదీ మట్టి గొప్పదనం. ఈ మట్టిని నమ్ముకొని జీవిస్తున్న కళాకారులున్నారు. వాళ్లే కుమ్మరివాళ్లు. కానీ ఆధునిక సమాజంలో అంతా మారిపోతోంది. కులవృత్తులు చెల్లాచెదురైపోతున్నాయి. ఎవరు ఏ పనిచేస్తారో తెలియనంతగా మారింది పరిస్థితి. కులవృత్తుల్ని భావితరాలు చేపట్టే పరిస్థితులు అంతంతమాత్రమే. ప్రతికూల పరిస్థితులు ఉండటంతో కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. కులవృత్తిని నమ్ముకొని జీవించే కుమ్మరివాళ్లు తగ్గిపోతున్నారు. తమ తరంతోనే ఈ వృత్తి అంతమవుతుందేమో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఇలా ఆందోళన చెందుతున్న వారికి సరైన ఉపాధి కల్పిస్తూ కులవృత్తిని కాపాడుతోంది 'మాటి' సంస్థ.

image


మాటి @ బెంగళూరు

అది బెంగళూరు నగరం. నగరం కాబట్టి అంతా కాంక్రీట్ జంగిల్‌లా కనిపిస్తుంది. కానీ అంతోఇంతో పల్లె సువాసనలు, పచ్చని చెట్లు, పిల్లగాలుల హొయలు ఆస్వాదించే ఆస్కారమున్న ప్రాంతాలు బెంగళూరులో కొన్ని మిగిలున్నాయి. వెడల్పు రోడ్లు, పచ్చని చెట్లు, విశాలమైన స్థలాల్లో ఇళ్లు, ఇంటి ముందు చూడచక్కని గార్డెన్... వీటన్నింటితో పాటు ఘుమఘుమలాడే సౌతిండియన్ ఫిల్టర్ కాఫీ... వాహ్ భూలోకంలో స్వర్గం అంటే ఇదేనేమో. బెంగళూరు జయానగర్‌లోని మొదటి బ్లాక్‌లో ఉన్న ఇళ్లను చూస్తే ఇదే అనిపిస్తుంది. ఈ పక్కనే లాల్ బాగ్ గార్డెన్స్‌లో నివసిస్తారు శశి బగ్చీ. ఇక్కడ ఆమెకు రెండంతస్తుల చిన్న బిల్డింగ్ ఉంది. పురాతన మోడల్‌లో ఓ గార్డెన్ కూడా. ఇంటి చుట్టూ చెట్లుకొబ్బరి, మామిడి చెట్లతో పాటు ఇతర పూల మొక్కలు కనిపిస్తాయి. శశికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. తన తండ్రి ద్వారా గార్డెనింగ్ పై మక్కువ పెంచుకున్నారు. సమయం దొరికితే చాలు ఎక్కువగా గార్డెన్‌లో గడుపుతుంటారామె. ఆమె ఇంట్లో పూలమొక్కలన్నీ టెర్రకోటతో చేసిన కుండీల్లోనే ఉంటాయి. ఇవన్నీ మాటి స్టోర్ లోనివే. ఆ స్టోర్ ఆమెదే. ఇప్పుడు బెంగళూరులో మాటి ఓ బ్రాండ్.

"నేను మా గార్డెన్ లోకి టెర్రకోట కుండీల కోసం వెతికా. ఎక్కడ తిరిగినా నిరాశే మిగిలింది. మార్కెట్లో అన్నీ సిమెంట్, ప్లాస్టిక్ కుండీలే కనిపించాయి. కానీ అవి మొక్కల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆ మెటీరియల్స్ వల్ల మొక్కలకు శ్వాస అందదు. రోడ్డు పక్కన కొన్ని టెర్రకోట కుండీలు కనిపించినా... అవి అంత అందంగా లేవు, నాణ్యమైనవి కావు. అందుకే వాటిని నేనే తయారుచేసుకోవాలనుకున్నా. పాటరీ మేకింగ్ నేర్చుకోవడానికి డిజైన్ స్కూల్ లో జాయిన్ అయ్యా. నా డిజైన్లతో కుండీలను తయారు చేయించేందుకు కుమ్మరివాళ్ల దగ్గరికెళ్లా" అంటూ తనకెదురైన అనుభవాన్ని వివరిస్తారు శశి.

టెర్రకోట చరిత్ర

క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో గ్రీకులు టెర్రకోట కళను ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. వారి దేవుళ్లను పూజించేందుకు విగ్రహాలు తయారు చేసేవాళ్లు. ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిన టెర్రకోట జ్యువెలరీ అప్పట్లోనే ఉంది. ఇక చైనాలో టెర్రకోటకు సంబంధించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ అతి పెద్ద టెర్రకోట మ్యూజియం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. దీనికి ఓ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 221 కాలంలో చైనాను పాలించిన కిన్ షి హువాంగ్డి... తన మరణానంతరం కూడా తన జీవితం అలాగే కొనసాగుతుందని నమ్మేవాడట. తాను చనిపోయిన తర్వాత కూడా ఇలాగే సైన్యంతో కలిసి ఉండాలనుకున్నాడట. అందుకే చనిపోవడానికి ముందే ఏడు లక్షల మంది నిపుణులతో 38 ఏళ్ల పాటు శ్రమించి సమాధిని నిర్మించుకున్నాడట. సైనిక దళాలు, ఏనుగులు, గుర్రాలు ఆయుధాలను తయారు చేయించుకున్నాడట. తన మరణం తర్వాత ఆ పరివారంతో జీవించాలన్నది ఆయన కోరిక. ఈ సమాధిపై 90 అడుగుల భవంతిని కూడా నిర్మించారు. దీనిలో రాజుగారి ఆత్మ నిత్యం తిరుగుతుందన్నది అక్కడి ప్రజల విశ్వాసం. పురావస్తు శాఖ తవ్వకాల్లో ఎనిమిది వేల సైనికుల బొమ్మలు బయటపడటం ఆశ్చర్యపరిచింది. అలా చైనీయుల చరిత్రలో యుద్ధవీరులకు పెట్టింది పేరు టెర్రకోట.

image


వెంటిలేటర్ పై టెర్రకోట

బెంగళూరులో టెర్రకోటకు సంబంధించిన గొప్ప చరిత్ర ఉంది. అసలు దక్కన్ పీఠభూమి టెర్రకోటతో తయారైనట్టు ఉంటుందంటారు. బెంగళూరులో పనిమంతులైన, అంకితభావం గల కుమ్మరివాళ్లు చాలామంది ఉన్నారు. ఎంతగా అంటే... ఇక్కడ పాటరీ టౌన్ అనే ప్రాంతం కూడా ఉంది. అక్కడికి వెళ్లే వీధికి పాటరీ రోడ్ అని పేరు. శశి కూడా అక్కడికెళ్లారు. అక్కడి కుమ్మరివాళ్లతో మాట్లాడితే అసలు విషయం ఆమెను ఖంగుతినిపించింది. ఆధునిక కాలంలో ప్లాస్టిక్, కాంక్రీట్, షీట్ మెటల్‌తో తయారు చేస్తున్న కుండీల వల్ల తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదంటూ పాతతరం కుమ్మరివాళ్లు ఆమెతో ఆవేదన పంచుకున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉండటంతో ఈ కళ నేర్చుకోవాలంటూ తమ పిల్లల్ని ప్రోత్సహించట్లేదు. ఇది వారి కులవృత్తి అని చెప్పుకోవడానికి అవశేషాలు మిగిలాయి తప్ప జానెడు పొట్ట నింపుకోవడం కష్టమైపోయింది. అయినా కళను బతికించడానికి వాళ్లు పోరాడుతూ ఉండటం శశికి స్ఫూర్తిగా నిలిచింది. అసలు సమస్య మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో చాలామంది నిరక్షరాస్యులు. కళాఖండాలు తయారు చెయ్యడంలో వారికి పూర్తిస్థాయి మెళకువలు తెలియవు. మౌలిక సదుపాయాల కొరత ఉంది. అందుకే వ్యాపారంలో అట్టడుగు స్థానానికి పడిపోయారని గుర్తించారు శశి. ఇలాగే కొనసాగితే టెర్రకోట కళ గురించి ఇక పుస్తకాల్లో చదువుకోవాల్సిందేనని ఆమె బెంగపడ్డారు. మార్కెట్లో నాణ్యమైన టెర్రకోట ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకొని వారికి ఎలాగైనా ఉపాధి కల్పించాలని సంకల్పించారు శశి.

కళాకారులకు చేయూత

స్వతహాగా పెయింటర్, కళాకారిణి అయిన శశి... తనకు చేతనైనది చేయాలని నిర్ణయించుకున్నారు. కేవలం పరిశోధనకే ఆమెకు రెండేళ్లు పట్టింది. తన సొంత స్థలంలో వెంటనే మాటి పేరుతో ఓ స్టోర్ ప్రారంభించారు. డిజైన్ చెయ్యడం, వాళ్లతో కళాఖండాలు తయారుచేయించడం, అమ్మడం ద్వారా ఉపాధి మార్గం చూపించారు. ఇప్పుడామె దగ్గర అంకితభావం గల ముగ్గురు కుమ్మరివాళ్లు ఉన్నారు. మిగతా వాళ్లు అవసరమైనప్పుడు సేవలందిస్తారు. వీరికి పూర్తిస్థాయి శిక్షణ అందించారు. వారికి మంచి పారితోషికం ఇస్తున్నారామె. అవసరమైతే అడ్వాన్స్ ఇచ్చి మరీ ఉత్పత్తులు తయారు చేయించుకుంటున్నారు. మొత్తంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని తన వంతుగా ఆదుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్న శశి... మాటి పేరుతో దక్షిణాదిలో టెర్రకోట కళాఖండాలకు బ్రాండ్ సృష్టించారు. ఇంటి గేటు నుంచి ఇంట్లో హాల్ వరకు... ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి కావాల్సిన టెర్రకోట షోపీస్‌లు ఆమె దగ్గరుంటాయి. పూల కుండీలు, షాండ్లియర్స్, లాంప్స్, పక్షి గూళ్లు, కుడ్య చిత్రాలు... ఇలా చాలావరకున్నాయి.

"టెర్రకోట కళాఖండాలు ఏ గదికైనా అందాన్ని తీసుకొస్తాయి. బాల్కనీ అయినా, గార్డెన్ అయినా... జంతువుల్లా ఉండే కళాఖండాలు, కప్స్ అండ్ సాసర్స్, బాస్కెట్స్, ఇలా చాలా ఉన్నాయి. వీటిలో ఏ కళాఖండం చూసినా మీ ముఖంపై చిరునవ్వు వికసించడం ఖాయం" అంటూ నవ్వుతూ చెబుతారు శశి.
image


మార్కెట్... కాంపిటీషన్

బెంగళూరులో ప్లాస్టిక్, రాయి, కాంక్రీట్, షీట్ మెటల్ ఉత్పత్తులతో పాటు తక్కువ ధరకు దొరికే టెర్రకోట ఉత్పత్తులు చాలా ఉన్నాయి. కానీ మాటి బ్రాండ్ కళాఖండాల డిజైన్, ఫినిషింగ్ బాగా ఉండటంతో వీరికి పెద్ద కాంపిటీషన్ లేదనే చెప్పాలి. ఇప్పుడు మాటి మార్కెట్ లీడర్. కొయంబత్తూర్, చెన్నై ప్రాంతాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి వీరికి. మిగతా కళాఖండాల సంగతి పక్కనపెడితే... ప్రస్తుతం ఏడాదికి పదివేల పూలకుండీలను అమ్ముతోంది మాటి. మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. శశి భర్త అనిన్ వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నారు. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తుల్ని తయారు చెయ్యడం వీరికి పెద్ద సవాల్. అందుకు తగ్గ నైపుణ్యం గల లేబర్ లేరు. మరోవైపు రవాణా ఖర్చులు వెనక్కి లాగుతున్నాయి. కానీ ఎప్పటికైనా చేయగలమంటున్నారు. ఇక ఆన్‌లైన్ సేల్స్ గురించి మాట్లాడుతూ...

"టెర్రకోట సున్నితత్వం, మట్టి బరువు చూసుకుంటే... ఆన్ లైన్ సేల్స్ అంటే ఆలోచించాల్సిన విషయమే. అందుకే లైట్ వెయిట్ ఉత్పత్తుల్ని తయారు చెయ్యాలనుకుంటున్నాం. అప్పుడే షిప్పింగ్‌కు ఈజీగా ఉంటుంది. కానీ అన్ని ఉత్పత్తుల్ని ఆన్ లైన్‌లో ఉంచి అమ్మడం అంటే కష్టమే. ఈ పరిస్థితిని అధిగమించాలనుకుంటున్నాం. అయితే... ఈ రోజుల్లో హైపర్ లోకల్ డెలివరీ మెకానిజం మాకేదైనా పరిష్కారం చూపిస్తుందేమో చూడాలి " అంటారు అనిన్.

ప్రముఖ క్లైంట్లు

మా దగ్గర ఎవరైనా ఏదైనా కళాఖండం కొన్నారంటే మళ్లీ మళ్లీ వస్తారని గర్వంగా చెబుతారు శశి. జయానగర్ లోని ఇంటి దగ్గర ఉన్న స్టోర్ లో వీకెండ్ లో కస్టమర్లను చూసుకోవడంలో బిజీగా ఉంటారామె. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కస్టమర్స్ వస్తుంటారు. వైట్ ఫీల్డ్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి వస్తుండటమూ విశేషమే. శశి గురించి, మాటి గురించి లైఫ్ స్టైల్ మేగజైన్లు, జాతీయ దినపత్రికలు, టీవీ ఛానళ్లల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా మాటికి క్యూ కడుతున్నారు కళా ప్రేమికులు. ఇక స్థానికంగా జరిగే ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వల్ల మాటి పాపులర్ లోకల్ బ్రాండ్ అయింది. ఫేస్ బుక్ లోనూ విస్తృత ప్రచారం లభిస్తోంది. వీరికి పెద్దపెద్ద కస్టమర్లూ ఉన్నారు. ఆరతి కిర్లోస్కర్(ఇంటికోసం), బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్, ఒబెరాయ్ హోటల్స్, మోవెన్ పిక్ హోటల్ అండ్ స్పా, అంగ్సానా స్పా, శ్రీకృష్ణ హాస్పిటల్, పార్క్ హోటల్ లాంటి చోట మాటి కళాఖండాలు అబ్బురపరుస్తుంటాయి.

భవిష్యత్తు

వీరి భవిష్యత్తుకు ఢోకా లేదు. టెర్రకోట కళాఖండాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కుమ్మరివాళ్లకు ఉపాధి చూపాలన్న కల నెరవేరుతున్నందుకు శశి కూడా సంతోషంగా ఉన్నారు. బెంగళూరులో వైట్ ఫీల్డ్ ప్రాంతంలో స్టోర్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడన్నది సరిగ్గా తెలియదు. అంతేకాకుండా... టైర్-1 నగరాలైన పూణె, కొయంబత్తూర్, మైసూర్ లో అడుగుపెట్టాలనుకుంటున్నారు. కానీ ఇంకాస్త సమయం పడుతుంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags