సంకలనాలు
Telugu

సోలార్ పడవను సృష్టించిన కేరళ కుర్రాడు..!

Chanukya
23rd Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

బస్సులు, రైళ్లు, కార్లు.. ఇలా ఎన్నో ప్రయాణ సాధనాలు. వీటన్నింటికీ ఏదో ఒక రూపంలో ఇంధనం అవసరం. ఇవన్నీ కాలుష్యాన్ని భారీ స్థాయిలో వెదజల్లేవే. ఇవే కాదు... నీటిపై ప్రయాణించే వాహనాలకు కూడా ఎక్కువ స్థాయిలోనే ఫుయెల్ అవసరమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ప్రయాణ సాధనం ఏదైనా సరే.. వాటివల్ల మారుమూల ప్రాంతాలు కూడా కాలుష్యం బారిన పడుతున్నాయి. అందుకే కనీసం వాటర్ ట్రాన్స్‌పోర్ట్‌కైనా ఇంధన అవసరాలు తగ్గే విధంగా ఎంతోమంది ఔత్సాహికులు ఈ రంగంపై విస్తృత పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ల ఆలోచనల నుంచి పుట్టిందే సోలార్ ఫెర్రీస్. సౌరశక్తిని వినియోగించుకుని నడిచే ఇలాంటి పడవల వల్ల నీరు కలుషితం కాదు, గాల్లోకి వాయువులు చేరవు. ఇంకో లాభం ఏంటంటే.. శబ్ద కాలుష్యం కూడా వుండదు. చడీచప్పుడు చేయకుండా నడిచే సోలార్ ఫెర్రీస్‌లో నిర్వాహణా ఖర్చులు కూడా తక్కువే.

ప్రపంచ వ్యాప్తంగా సోలార్‌తో నడిచే ఫెర్రీలు ఎన్నో ఉన్నా.. అవి మన దేశంలోకి మాత్రం ఇంతకాలం అడుగు పెట్టలేకపోయాయి. ఇందుకు కారణం.. వాటి ధర చాలా ఎక్కువగా ఉండడమే. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో సోలార్ ఫెర్రీ ఎంతలేదన్నా రూ. 7 కోట్ల వరకూ ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం మెటీరియల్, సీటింగ్ సామర్ధ్యం ఆధారంగా పెద్ద పడవల ధర 60 లక్షల నుంచి మొదలై 2 కోట్ల వరకూ ఉంటుంది.

image


అడ్డంకిగా మారిన అధిక ధర సమస్యకు పరిష్కారం సూచించేందుకు ముందుకు వచ్చింది నవ్‌ఆల్ట్ సోలార్ అండ్ ఎలక్ట్రిక్ బోట్స్. కేరళకు చెందిన ఈ సంస్థ ప్రత్యేకత అందుబాటు ధరలో సోలార్ ఫెర్రీస్‌ను నిర్మించడమే. మన దేశంలో మొట్టమొదటిసారిగా సౌర ఆధారిత పడవలను ఈ సంస్థ తయారుచేస్తున్నది. అదికూడా అంతర్జాతీయ మార్కెట్ల రేట్లతో పోలిస్తే 50 శాతం తక్కువ ధరకు నిర్మించి ఇస్తున్నారు. ప్రస్తుతం 20 మీటర్ల పొడవుండే సోలార్ ఫెర్రీస్‌ల కోసం కేరళ నీటి రవాణా శాఖ ఆర్డర్ ఇచ్చింది. ఇవి నిర్మాణ దశలో ఉన్న ఈ పడవలు త్వరలో కేరళ బ్యాక్ వాటర్స్‌లో కనిపించబోతున్నాయి.

20 కిలోవాట్ల సామర్ధ్యం ఉండే రెండు ఎలక్ట్రిక్ మీటర్లు ఈ పడవల్లో ఉంటాయి. వీటికి 50కెవిహెచ్ లిథియం బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తి అందుతుంది. 20kWp సోలార్ మాడ్యూల్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఫోటోవోల్టాయిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, నేవల్ ఆర్కిటెక్చర్‌కు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పవచ్చు. ఓసారి బ్యాటరీలు ఫుల్‌గా ఛార్జ్ అయితే ఆరు గంటల పాటు సుదీర్ఘంగా గంటకు 7.5 నాట్ల వేగంతో ఫెర్రీ ప్రయాణించగలదు.

నావ్‌ఆల్ట్ సోలార్ అండ్ ఎలక్ట్రిక్ బోట్స్ అనే సంస్థ నవగతి మెరైన్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్‌తో పాటు ఆల్ట్ ఎన్, ఈవ్ సిస్టమ్స్ అనే రెండు ఫ్రెంచ్ సంస్థలు కలిసి స్థాపించాయి. కోచికి చెందిన నవగతి సంస్థకు బోట్స్, షిప్స్ డిజైనింగ్‌లో మెరుగైన అనుభవం ఉంది. ఆల్ఎన్ అనే సంస్థ యూరోప్‌లో సోలార్ ఫెర్రీస్‌కు అవసరమైన టెక్నాలజీని రూపొందిస్తోంది. ఈవ్ అనే మరో సంస్థ.. ఎలక్ట్రికల్ పవర్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలిస్ట్‌. ఇలా ఒక్కో సంస్థకు ఒక్కోరంగంలో విశేషమైన అనుభవం ఉండడం వల్ల అందరూ చేతులు కలిపారు.

నవ్‌ఆల్ట్ సంస్థను 38 ఏళ్ల సాందిత్ తాండశెర్రి ఏర్పాటు చేశారు. ఇతనికి నావెల్ అర్కిటెక్చర్ రంగంలో విస్తృతమైన అనుభవం ఉంది. ఐఐటి మద్రాసులో నావెల్ ఆర్కిటెక్చర్ చదివిన సాందిత్.. ఆ తర్వాత గుజరాత్ లోని షిప్‌యార్డుల్లో రెండేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత దక్షిణ కొరియా వెళ్లి అక్కడ కూడా వివిధ షిప్ యార్డుల్లో విధులు నిర్వహించారు. ఫ్రాన్స్‌లోని ఇన్సీడ్‌లో ఎంబిఏ చేసిన తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన పుట్టింది. అది కూడా భారత్‌ అవసరాలకు అనుగుణంగా సోలార్ ఫెర్రీస్ నిర్మించడం కోసం.

షిప్‌యార్డ్స్, షిప్స్‌కు అవసరమైన డిజైన్ల బాధ్యతను నవగతి సంస్థ చూసుకునేది. ఇదే సమయంలో చిన్న సోలార్ బోట్లపై ముమ్మరంగా ప్రయోగం చేయడం ప్రారంభించారు.

''పరిశోధనలపై భారీగా ఖర్చు చేశాం. 20 మంది ప్యాసింజర్ల సామర్ధ్యం గల సోలార్ బోట్‌ను నిర్మించడం, మాలో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి స్టార్టప్‌ వాతావరణంలో మేం అనుకోనివి చాలానే జరుగుతాయి. ప్రభుత్వ నిబంధనల నుంచి టెక్నాలజీ వరకూ మేం మొదట్లో అనుకున్న చాలా పనులు జరగలేదు. ఊహించని ఎన్నో పరిణామాలు జరిగాయి. ఒక్కో సందర్భంలో ఎంతో చిరాగ్గా అనిపించినా, చివరకు వాటి నుంచి ఎంతో అనుభవం వచ్చింది '' -సాందిత్.

భాగస్వామ్యం కోసం వివిధ ప్రభుత్వాలతో సంస్థ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కేరళ జలరవాణా సంస్థ చేతులు కలపడంతో, మహారాష్ట్ర సర్కారు కూడా ఇదే బాటలో అడుగులు వేస్తోంది. మొదటి బోటు నిర్మాణం పూర్తై.. జలాల్లోకి అడుగుపెట్టిన వెంటనే.. మరిన్ని డీల్స్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సాందిత్ నమ్మకంగా ఉన్నారు.

''అందరూ మొదటి బోటును చూడాలని ఆతృతగా ఉన్నారు. అందుకే మొదటి బోటును మార్కెట్లోకి వెంటనే విడుదల చేయాలని మాలో మేం చెప్పుకుంటూనే ఉంటాం. ఆ నమ్మకమే మా అందరిలో స్ఫూర్తిని నింపుతోంది'' అంటారు సాందిత్.

అయితే, సాందిత్ సమస్యలు ఇక్కడితో తీరలేదు. ఇది పెద్ద ప్రాజెక్టు కావడంతో నిత్యం నిధుల కటకట వేధిస్తోంది. నవగతి సంస్థలో అతని స్నేహితులు కొంతమంది పెట్టుబడులు పెట్టారు. ఐఐటి చదివేటప్పుడు స్నేహితుడైన విద్యానంద్ నవగతిలో భాగస్వామిగా చేరారు. మిగిలిన ఇన్వెస్టర్లలో విద్యా జితేష్, హృషికేష్ ఉన్ని, అమ్రితా ఉన్ని ఉన్నారు. షిప్పింగ్ పరిశ్రమలో ఉన్న మదన్ కొచ్చర్, కేకే దేవానంద్ వంటి వాళ్లు కూడా మొదటి బోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అందరి అంచనాలు చేరుకోగలిగితే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

చౌకధరలో మన భారతీయ అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దడమే నవగతి ప్రత్యేకత. టెక్నాలజీని ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్నా.. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇక్కడే జరుగుతోంది. ఫెర్రీల నిర్మాణం ఖర్చు భారీగా తగ్గేందుకు ఇదే కారణమైంది. యూరప్‌లో తయారయ్యే సోలార్ ఫెర్రీ ధర రూ.7.5 కోట్ల వరకూ ఉంటే.. ఇండియాలో తయారయ్యేది మాత్రం రూ.3 కోట్లలోపే. ఇండియాలో మామూలు ఫెర్రీల నిర్మాణం కోసం రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుంది. కానీ వీటికి ఏటా రూ.20 లక్షల వరకూ ఫ్యూయల్ ఛార్జీల భారం ఉంటుంది. సోలార్ వాటికైతే ఆ బాధే ఉండదు, అంతే కాకుండా నిర్వాహణా ఖర్చు కూడా బాగా తక్కువ.

కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టుల కోసం ఇస్తున్న సబ్సిడిలను పరిగణలోకి తీసుకుంటే.. కస్టమర్లకు వీటిఖర్చు బాగా తగ్గిపోతుంది. సాధారణ ఇంధనంతో నడిచే వాటితో పోల్చినా కూడా.. తక్కువ ధరకే వస్తాయి కాబట్టి కస్టమర్లు కూడా మొగ్గుచూపే అవకాశం ఉంది. అందుకే తమ బిజినెస్ ప్లాన్ విజయవంతం అవుతుందనే నమ్మకం ఉందంటున్నారు సాందిత్.

''పొల్యూషన్‌ వల్ల వచ్చే నష్టంతో పోల్చుకుంటే.. వీటి ధర ఎక్కువేం కాదు. సోలార్ ఫెర్రీలు తీసుకోవడం వల్ల అందరికీ ఉపయోగమే. ప్రభుత్వాలు ముందుకొస్తాయనే నమ్మకం ఉంది. కస్టమర్లు కూడా ధర, నాణ్యత విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని వల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది''.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags