ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ తమిళనాడుకే ఎలా సాధ్యమైంది..?

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ తమిళనాడుకే ఎలా సాధ్యమైంది..?

Saturday December 03, 2016,

3 min Read

మనిషికి నీరు ఎంత ప్రాణాధారమో కరెంటూ అంతే. కరెంటు కూడా అంతే. ఒక్క నిమిషం ఆగిపోతే తట్టుకోలేం. ప్రపంచాన్నంతా ఏకకాలంలో అల్లకల్లోలం చేయగలిగే శక్తి ఒక్క పవర్ కే ఉంది. విద్యుత్ వాడకం నానాటికీ పెరిగిపోతున్న క్రమంలో అంతకంతకూ వనరుల కొరత ఏర్పడుతోంది. థర్మల్, హైడల్, విండ్, సోలార్ ఇలా అనేక పద్ధతుల్లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నా అవసరాలకు సరిపడా రావడం లేదు.

సోలార్, విండ్ ద్వారా 2022 కల్లా 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్త చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మ్యాన్ పవర్, సోర్సులను బట్టి చూస్తే అది అతిపెద్ద టార్గెట్. ఎందుకంటే అందులో ఐదోవంతు కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. అంటే 36 గిగావాట్స్ కరెంటు కూడా ప్రొడక్షన్ కావడం లేదు. అందులో సోలార్ వాటా కేవలం 4,060 మెగావాట్స్ మాత్రమే. 2022 కల్లా 6 కోట్ల మందికి సరిపడా లక్ష మె.వా. సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది కేంద్రం ముందున్న టార్గెట్.

నిజానికి సోలార్ పవర్ ప్లాంట్ స్థాపించడం పెద్ద కష్టం కాదు. ఎటొచ్చీ దానికి కావాల్సిన లాండ్ సేకరించడమే మహా కష్టం. అందునా జనాభా ఎక్కువగా ఉండే మన ఇండియాలో అయితే ఇంకా రిస్క్. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అడానీ గ్రూప్. తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కముతి ప్రాంతంలో సోలార్ మెగా పవర్ హౌజ్ ఏర్పాటు చేసింది. సింగిల్ లొకేషన్ లో అతి తక్కువ టైంలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటుని నిర్మించింది. 2500 ఎకరాల్లో అంటే.. 472 ఫుట్ బాల్ కోర్టులంత పెద్ద మైదానంలో కూలీల దగ్గర్నంచి ఇంజినీర్ల దాకా అహోరాత్రులు శ్రమించి మెగా ప్రాజెక్టుని పూర్తి చేశారు.

image


మొత్తం 2500 ఎకరాలు. 8 నెలల సమయం. చూస్తే మొత్తం చెట్లూ పుట్టలు ఎగుడు దిగుడు భూమి. యుద్ధప్రాతిపదికన జేసీబీలు నేలను చదును చేశాయి. ఒక్క గంట కూడ విశ్రాంతి లేదు. రౌండ్ ద క్లాక్ వర్క్ నడిచింది. చుట్టుపక్కల ఏ సదుపాయమూ లేదు. వస్తే మళ్లీ మధురైకే రావాలి. చిన్న వెహికిల్ కావాలన్నా 90 కి.మీ. పోయిరావాలి. అనుకున్నట్టుగా మ్యాన్ పవన్ లేదు.

నేలను చదును చేయడం ఒకెత్తయితే.. చైనా నుంచి దిగిన సోలార్ ప్యానెల్స్ స్టోర్ చేయడం మరో ఎత్తయింది. పెద్దపెద్ద కంటెయినర్లు. వాటిని ఎక్కడ దాచాలో అర్ధంకాలేదు. లక్షా 20వేల చదరపు మీటర్ల వేర్ హౌజ్ కావాలి. ఇంకా సైట్ రెడీ కాలేదు. వాటిని అన్ లోడ్ చేయడమెలా? అదొక పెద్ద టాస్క్. అయినా ఆగమేఘాల మీద పనిచేశారు. సైట్ క్లియర్ చేసి ప్యానెల్స్ దించారు. లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్. టైట్ డెడ్ లైన్. నిమిషం కూడా విశ్రాంతి లేదు.

ఈ సోలార్ పవర్ ప్లాంటులో మొత్తం 25 లక్షల ఇండివీడ్యువల్ సోలార్ పానెల్స్ ఉన్నాయి. వీటిని ఏ రోజుకారోజు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా శుభ్రపరచాలి. లేకుంటే దుమ్ము పేరుకుపోయి సిస్టమ్ సస్టెయిన్ కాదు.

ఈ ప్లాంట్‌ను తమిళనాడు ట్రాన్స్‌ మిషన్ కార్పొరేషన్‌కు చెందిన కముతి సబ్-స్టేషన్‌ కు అనుసంధానించారు. 3.80 లక్షల ఫౌండేషన్లు.. 25 లక్షల సోలార్ పానెళ్లు.. 27,000 మీటర్ల స్ట్రక్చర్.. 576 ఇన్వర్టర్లు.. 6,000 కిలోమీటర్ల కేబుల్స్‌.. 154 ట్రాన్స్‌ ఫార్మర్లు.. ఇవన్నీ సింగిల్ లొకేషన్లో ఏర్పాటు చేశారు. దీనికోసం దాదాపు 8,500 మంది పనిచేశారు.

ఆమధ్యనే తమిళనాడు సీఎం జయలలిత ప్లాంటుని లాంఛనంగా ప్రారంభించారు. కేవలం తమిళనాడే కాదు దేశం యావత్తూ గర్వించదగిన ప్రాజెక్ట్ ఇది అని అడానీ అన్నారు. ఇంతకు ముందు అమెరికాలోని కాలిఫోర్నియాలో టొపాజ్ సోలార్ ఫామ్ ప్రపంచంలో కెల్లా పెద్దది. ఇప్పుడు దానికంటే పెద్దది ఈ ప్రాజెక్ట్. కాలిఫోర్నియా ప్రాజెక్ట్ కెపాసిటీ 550 మెగావాట్లయితే.. ఇది 648 మెగావాట్ల ప్లాంట్. లక్షన్నర ఇళ్లకు సరిపడా కరెంటు అందించే ఈ ప్లాంటుకైన ఖర్చు 679 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 4,500 కోట్లు.

వచ్చే ఐదేళ్లలో 11వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసి.. ప్రపంచంలోనే రెన్యూవబుల్ ఎనర్జీలో అగ్రగామిగా నిలవాలని అడానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.

రోబోటిక్ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించవచ్చుగాక.. కానీ ఆ టెక్నాలజీ తాగడానికి గుక్కెడు నీళ్లను క్రియేట్ చేయలేదు. సింగిల్ వాట్ కరెంటునూ ఉత్పత్తి చేయలేదు. దానికోసం మళ్లీ మనిషే తన మేథస్సుని ఉపయోగించాలి. అలా మేథస్సుని ఉపయోగించి నిర్మించిన మెగా స్ట్రక్చరే ఈ సోలార్ పవర్ ప్లాంట్. దీన్ని అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా వర్ణిస్తూ నేషనల్ జాగ్రఫీ ఛానల్ అద్భుతమైన డాక్యుమెంటరీ విడుదల చేసింది.