సంకలనాలు
Telugu

ఆ 5 రోజులు ఆమె బాధపడొద్దనే..

Sri
15th Apr 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


నెలలో ఆ ఐదు రోజులు... 

మహిళలకు నరకం.. 

రుతుస్రావంతో వారు పడే బాధలు వర్ణనాతీతం..

టెక్నాలజీ యుగంలో కూడా నాకు నెలసరి అని బహిరంగంగా చెప్పుకోలేక పోతున్నారు..

ఇంకా గుసగుసగానే మాట్లాడుతున్నారు. ఇంకా ఆ నిశ్శబ్దం అలాగే ఉంది. 

అందుకే ఆ ఐదు రోజులను ఎలాగోలా గడిపేయాలనే ఆత్రుత తప్ప.. ఎలా చేస్తే మంచిది.. ఎలా చేయకుంటే మంచిది.. అనే విషయం చాలా మంది మహిళలకు బొత్తిగా అవగాహన లేదు. ఆ మాటకొస్తే 45 కోట్ల మందిలో కేవలం 12 శాతం స్త్రీలు మాత్రమే శానిటరీ నాప్కిన్లు వాడుతున్నారంటే- వారు ఎంత వెనుకబడి ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ లెక్కలు ఓ వ్యక్తిని తీవ్రంగా కలచివేశాయి. సాధారణంగా ఆడవాళ్లకుండే ఈ సమస్యలు ఆడవాళ్లకే బాగా తెలుస్తాయి. కానీ ఓ పురుషుడు వారి సమస్యను తెలుసుకొని చలించిపోయాడు. 

దిలీప్ పట్టుబాల. బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. మొదట్లో ఓ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, మురికివాడల్లో అభివృద్ధి కార్యక్రమాలు గట్రా చేశాడు. ఆ ప్రయత్నాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. అక్షయ పాత్ర ఫౌండేషన్, హెల్ప్ ఏజ్ ఇండియాల్లో గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. సామాజిక సేవ గురించి లోతుగా అధ్యయనం చేసిన దిలీప్.. కేంబ్రిడ్జ్ ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ నుంచి సోషల్ వెల్ఫేర్ అండ్ సోషల్ పాలసీలో మాస్టర్స్ చేశారు. లండన్ లోని రెడ్ క్రాస్ సొసైటీకి పనిచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్టప్ పాలినేట్ ఎనర్జీతో కలిసి వర్క్ చేసేందుకు బెంగళూరుకు వచ్చాడు. అక్కడి మురికివాడల్లో ఓ రోజు ఆస్ట్రేలియన్ కొలీగ్స్ తో కలిసి ఫీల్డ్ లో తిరుగుతూ.. పట్టణాల్లోని మురికివాడల్లో మహిళలు రుతుక్రమంలో పాటించే పరిశుభ్రత గురించి ఆరా తీశారు. అక్కడ తెలుసుకున్న విషయాలతో షాకయ్యారాయన.

ఆ సమస్యపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాడు. తీవ్రత ఏంటో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు. పరిశోధనలు చేశాడు. 45 కోట్ల మంది భారతీయ మహిళల్లో కేవలం 12 శాతం మాత్రమే రుతుక్రమం సమయంలో పరిశుభ్రత గురించి ఆలోచిస్తున్నారని తెలిసింది దిగ్భ్రాంతికి గురయ్యాడు. 

image


సుఖీభవ ప్రారంభం

దిలీప్ తన స్నేహితురాలు సహానా భట్ ను కలిశారు. ఆమె 'మీడియా లా'లో మాస్టర్స్ చేశారు. జనాగ్రహ లాంటి సంస్థల్లో పనిచేశారు. దిలీప్ ఈ సమస్య వివరించిన తర్వాత ఇద్దరూ ఈ ఇష్యూపై ఫోకస్ చేశారు. ఆ రోజుల్లో మహిళలు ఎలాంటి పద్ధతులు పాటిస్తారన్న అంశంపై సర్వే చేశారు. 250 మంది నిరుపేద మహిళలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాళ్లు ఊహించిన దానికంటే తీవ్రమైన పరిస్థితులు విన్నారు. రూరల్, అర్బన్, సెమీ-అర్బన్ లో నిరుపేదలు సరైన అవగాహన లేక రుతుక్రమం సమయంలో ప్లాస్టిక్ పేపర్, న్యూస్ పేపర్, ఆకులు, ఇసుక, బూడిద లాంటి ఘోరమైన పద్ధతులు పాటిస్తున్నారని తెలుసుకొని చలించిపోయారు. ఇంకా జీర్ణించుకోలేని విషయం ఏంటంటే... ఇప్పటికీ భారతీయ మహిళల్లో 82 శాతం మంది అపరిశుభ్ర పద్ధతుల్ని పాటిస్తున్నారని తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం ఎంత అత్యవసరమో అర్థమైంది ఇద్దరికీ. అలా మొదలైందే- సుఖీభవ.

బెంగళూరు పట్టణంలోని మురికివాడల్లో సుఖీభవ కార్యకలాపాలు మొదలయ్యాయి. అక్కడి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత అవసరం గురించి అవగాహన కల్పిస్తూనే.. వారికి తక్కువ ధరలోనే శానిటరీ ప్యాడ్స్ అందిస్తోంది. వీటి తయారీపై స్థానిక మహిళా ఆంట్రప్రెన్యూర్స్ కు శిక్షణ ఇచ్చారు. సర్వే ఫలితాల ఆధారంగా సుఖీభవ బృందం 12 వేర్వేరు ఉత్పత్తులతో నాలుగు నెలల పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ఏవి అమ్మాలి? ఎలా అమ్మాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలిశాయి.

* మొదట 25 నిమిషాల ఇంటరాక్టివ్ వీడియోతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

* సబ్సిడీ ధరలకు శానిటరీ ప్యాక్స్ అందించేలా తయారీ దారులతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. రూ.45 ఖరీదు చేసే ఎనిమిది ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్ సుఖీభవకు రూ.25 కే లభిస్తుంది.

* స్థానికంగా ఉండే మహిళలు మైక్రో ఆంట్రప్రెన్యూర్స్ గా మారేలా ప్రోత్సహిస్తోంది. శానిటరీ ప్యాడ్స్ వాడకం గురించి అవగాహన కల్పించడం నుంచి.. వాటిని పంపిణీ చేసేంత వరకు శిక్షణ ఇస్తుంది. నెట్ వర్క్ పెంచుకునేందుకు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు మైక్రో ఆంట్రప్రెన్యూర్లకు మూడు నెలల పాటు సపోర్ట్ ఇస్తుంది. వారికి ఒక్క ప్యాకెట్ అమ్మితే ఐదు రూపాయల లాభం వస్తుంది.

image


ప్రస్తుతం ప్రతీ నెల 7,200 మంది మహిళలకు చవకైన ధరలకే శానిటరీ ప్యాడ్స్ అందిస్తోంది సుఖీభవ సంస్థ. ఇప్పటి వరకు సుమారు 12 వేల మంది మహిళలకు అవగాహన కల్పించింది. వారి ఆధ్వర్యంలో సౌత్ బెంగళూరులో 18 మంది మహిళా మైక్రో ఆంట్రప్రెన్యూర్లు పనిచేస్తున్నారు. సుఖీభవ సేవలకు ఇండియన్ యూత్ ఫండ్, ఆక్యూమెన్ ఫెలోషిప్, దేశ్ పాండే ఫౌండేషన్, నాస్కామ్ ఫౌండేషన్ సోషల్ ఇన్నోవేషన్ అవార్డ్స్, టాటా సోషల్ ఎంటర్ ప్రైజ్ ఛాలెంజ్, ఐఐఎం-బికి చెందిన అన్ సంగ్ హీరోస్ పురస్కారాలు లభించాయి. శానిటరీ ప్యాడ్స్ ని చవకైన ధరలకు అమ్ముతున్నందున లాభాలు తక్కువగా ఉన్నాయంటారు దిలీప్. నిలదొక్కుకోవడానికి మరో ఐదారు నెలల సమయం పడుతుందంటున్నారు.

"సోషల్ ఎంటర్ ప్రైజ్ కు సహకారం లభించడమంటే కొంచెం కష్టమే. అందుకే ప్రతీ ఏరియాలో స్థానికంగా ఉండే సంస్థలను కలుపుకుపోతున్నాం. ప్రస్తుతం మేము ఎంఐటీయూ ఫౌండేషన్, రజా ఎడ్యుకేషన్ సొసైటీ, పసంద్, సరల్ డిజైన్స్, మంత్ర 4 చేంజ్ లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం" - సహానా.
image


కొత్త అడుగులు

2016 నుంచి ఆక్యూమెన్ ఫెలోషిప్ తో దూసుకెళ్తున్నాడు దిలీప్. సుఖీభవ కార్యకలాపాల్లో తీరక లేకుండా ఉన్నాడు. కో-ఫౌండర్ సహానా మార్కెటింగ్ లో ఎంబీఏ చేస్తున్నారు. తమ పనుల్లో బిజీగా ఉన్న వీరిద్దరూ సుఖీభవను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో పది లక్షల మంది మహిళలతో కలిసి పనిచెయ్యడమే తమ లక్ష్యం అంటున్నారు. ఆగస్ట్ 2016లోగా బెంగళూరులో సుఖీభవ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించనుంది. రాబోయే నెలల్లో హుబ్లీ, ధార్వాడ్ గ్రామీణ ప్రాంతాల్లో అడుగుపెట్టనుంది. పుణెలో కూడా కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. జనవరి 2017 నాటికి మూడో నగరంలో పని మొదలుపెడతారు. ప్రతీ మహిళా రుతుక్రమం సమయంలో ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించడమే సుఖీభవ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. .

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags