Telugu

బిజినెస్ ఎలా చేయకూడదో తెలుసుకోవాలంటే ఇలాన్ మస్క్ మాటలు వినండి !

20 కంపెనీలు పెట్టి, అందులో పదిహేడు కంపెనీల్లో నష్టపోయానని చెప్పుకునే జేమ్స్ అల్టూషర్.. ఓ అంట్రప్రన్యూర్. బెస్ట్ సెల్లింగ్ రచయిత కూడా. ఫైనాన్సియల్ టైమ్స్, ది స్ట్రీట్ .కామ్, థాట్ క్యాటలాగ్, హఫింగ్‌టన్ పోస్ట్ లాంటి పత్రికలకూ వెబ్ సైట్లకు కాలమిస్టుగా కూడా వున్నారు. తన జీవితంలో స్ఫూర్తి పొందిన ఇలాన్ మస్క్ చెప్పిన కొన్ని కొటేషన్స్..తన జీవితంపై చూపిన ప్రభావం గురించి జేమ్స్ యువర్ స్టోరీకి వివరించారు..

bharathi paluri
5th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
ఇలాన్ మస్క్, స్సేస్ X, టెస్లా మోటార్స్ సిఈఓ. ఆంట్రప్రెన్యూర్, ఇన్వెస్టర్, ఇన్వెంటర్

ఇలాన్ మస్క్, స్సేస్ X, టెస్లా మోటార్స్ సిఈఓ. ఆంట్రప్రెన్యూర్, ఇన్వెస్టర్, ఇన్వెంటర్


నచ్చిన దారిలో నడవడం అంటే అంత తేలిక కాదు.. ఎవరేమనుకున్నా లెక్క చేయకూడదు. ఓటమికి భయపడకూడదు.

నీకు నచ్చిన దారిలో నువ్వు నడవాలంటే, ఆ ప్రయాణం పదిమందికీ ఉపయోగపడాలి. నీ వల్ల నలుగురికి ప్రయోజనం వున్నప్పుడే, నీ ప్రయాణం వల్ల నీకు కూడా ఉపయోగం వుంటుంది.

అందుకే ఇలాన్ మస్క్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. అతని నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళలో నేను కూడా ఒకడిని.

నిజానికి స్ఫూర్తితో కూడా కొన్ని చిక్కులున్నాయి. అప్పటివరకు నీకు తెలిసిన ప్రపంచం నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి, ఓ కొత్త ఆలోచనని, ఐడియాని, వ్యక్తిని, నీకు పరిచయం చేస్తుంది.

అందుకే ఇలాన్ మస్క్ చెప్పిన మాటల్లో అత్యంత స్ఫూర్తి దాయకమైన కొన్నింటిని ఎంచుకున్నాను. ఇవన్నీ చదివితే, ఒక స్ఫూర్తి నుంచి మరో స్ఫూర్తి పొందడమెలాగో తెలుస్తుంది.

అలాంటి కొన్ని కొటేషన్స్ ఇవి.

1. నిజంగా అవసరమైన పనయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా... నువ్వు సాధించి తీరుతావు..’’

ఈ కొటేషన్ చూస్తే నాకొక సందేహం వస్తుంది... అసలు నిజంగా అసాధ్యమైనవి వుండవా ? అని.. ఇలాంటప్పుడే ఇలాన్ మస్క్ మరో కొత్త సవాల్ విసురుతాడు. ‘‘మార్స్ కి వెళ్దాం పద అంటాడు’’, లేకపోతే, ‘‘వందకోట్ల డాలర్ల బ్యాటరీ ఫాక్టరీ పెడదాం’’ అంటాడు. కనుక, అసాధ్యమైనదాన్ని ఛేదించడంలో వుండే మజానే వేరు.

2. పేపాల్ తర్వాత నేనొక్కటే ఆలోచించాను..‘‘ డబ్బు సంపాదించడం కాకుండా.. మనిషికి భవిష్యత్తులో రాబోయే ఇతరత్రా కష్టాలేంటి’’ అని..

నేనొక వందమందిని ఇంటర్వ్యూ చేసాను. వీళ్ళంతా జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని సాధించినవాళ్ళే. ఏది అద్భుతం అనేది వేరే విషయం. నా వరకు నాకు అవన్నీ అద్భుతాలే. కానీ వాళ్ళెవరూ వాటిని డబ్బు సంపాదించే మార్గంగా సాధన చేయలేదు. ఉదాహరణకు కూలియో విషయాన్నే తీసుకోండి. 1995లో బెస్ట్ సెల్లింగ్ సాంగ్ ఇతనిదే. కానీ ఇతను 1977నుంచి పాటలు రాస్తున్నారు. మొదటి హిట్ రావడానికే 17 ఏళ్ళు పట్టింది.

‘‘నేనెప్పుడూ డబ్బు కోసమో, అమ్మాయిలను ఆకర్షించడం కోసమో రాయలేదు...’’ అంటాడు కూలియో.

3. ‘‘ఫిజిక్స్.. మన ఆలోచనను బాగా పదునుపెడుతుంది. దేన్నైనా.. దాని మౌలిక రూపం దాకా వెళ్ళి ఆలోచించాలని చెబుతుంది. ’’

ఈ మాటలు ఇలాన్ కేవలం ఫిజిక్స్ నుద్దేశించి చెప్పట్లేదు. ఒక విషయాన్ని విజువలైజ్ చేయడమెలాగో చెప్తున్నడు. ఒక కల ఎలా సాకారమవుతుందో చెప్పడానికి, ఒక ఐడియా వాస్తవ రూపంలో ఎలా సాధ్యమవుతుందో నిరూపించడానికి ఈ సిద్ధాంతాన్ని వాడుకున్నాడు.

అసలు ఫిజిక్స్ లో ఇంకో తమాషా వుంది. ఇక్కడ నియమాలు ఎప్పటికప్పుడు మారుతూవుంటాయి.

ఓ భవిష్యత్ ప్రపంచాన్ని ఊహించడం.. మన ఊహ ఎలా నిజం కాగలదో మూలాల దాకా వెళ్ళి నిరూపించడం.. ఇదే ఫిజిక్స్.. ఇదే ఇలాన్ చెప్పింది.

4. ఒక విషయం సాద్యమేనని ముందు నిరూపించాలి.. తర్వాత దానికదే సాద్యమవుతుంది.

నాకిది చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. అసాద్యమైనదేముంటుంది? టైమ్ మెషిన్ లాంటివి సాధ్యం కావేమో...

కానీ ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేయాలంటే, ముందు ఒక హైబ్రీడ్ కారు ఊహించుకోవాలి. గ్యాస్ బదులు శక్తిమంతమైన బ్యాటరీలను ఇంధనంగా వాడడాన్ని ఊహించుకోవాలి. ఆ తర్వాత అసాధ్యం కాస్తా సుసాధ్యంగా మారిపోతుంది.

5. నీ బుట్టలో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ వున్నంత కాలం.. నీ గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టడం పెద్ద తప్పేం కాదు..

బిజినెస్ లో సాధారణంగా ఒక సూత్రం వుంటుంది. గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదు అని. ఒకటిపోయినా మిగిలినవి అయినా వుంటాయని ఈ సూత్రం ఉద్దేశం. అంటే చాలా మంది బిజినెస్ అంటే రిస్క్ అని అనుకుంటారు. కానీ మంచి బిజినెస్ అంటే, రిస్క్‌ను లెక్కపెడతూ కూర్చోవడం కాదు. నష్టాల నుంచి నేర్చుకోవడం కాదు. సమస్యలకూ దూరంగా వుండడం కాదు. సమస్యలను పరిష్కరించడమే మంచి బిజినెస్ మెన్ లక్షణం. X.com లో సమస్యలొచ్చినప్పుడు ఇలాన్ మస్క్, ప్రత్యర్థులను ఓడించి తాను గెలవాలనుకోలేదు. తన కంపెనీని ప్రత్యర్థి కంపెనీ (పేపాల్) లో విలీనం చేసి సమస్యను పరిష్కరించారు.

6. ఓపిక చాలా ముఖ్యం. దేన్నయినా తప్పనిసరయితే తప్ప వదిలిపెట్టకూడదు.

ఓపిక + ప్రేమ = అనంతం. నాకు బాగా నచ్చిన సమీకరణం.. దేన్నైనా భరించగలిగేంతగా ప్రేమించాలి. నువ్వెంత లోతుగా ప్రేమిస్తే, అంతగా భరించగలవు.

కెరీర్ అయినా, స్నేహం అయినా. బిజినెస్ అయినా ఇదే వర్తిస్తుంది. మనకే కాదు.. మన చుట్టూ వున్నవారికి కూడా దీని వల్ల ప్రయోజనమే. ఎందుకంటే, చుట్టూ వున్న వారికోసం సంపాదించే వారి వద్దకే సంపద వస్తుంది.

7. మంచిని ఆశించే వాడికే భవిష్యత్తు వుంటుంది తప్ప, ఏం చేసినా చెడే జరుగుతుందని ఊహించే వాడికి భవిష్యత్తు వుండదు.

ఇది చాలా ముఖ్యమైన కొటేషన్. న్యూస్ రిపోర్టర్లకి ప్రజలకి సమాచారం ఇచ్చే అర్హత ఏముండదు. ఏదో వాళ్ళ పేపర్లు అమ్ముకోవడానికి నిరాశను ప్రచారం చేస్తారు.

కానీ, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేవాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోరు. ముందు ఓ బంగారు భవిష్యత్తును ఊహించుకుని, దాన్ని ఎలా సాధించాలో ఆలోచిస్తారు.

8. ఎక్కువ మంది వుంటే కష్టమైన పని చేయగలుగుతారనే ఆలోచనే తప్పు. టాలెంట్‌కి , ఉద్యోగుల సంఖ్యకి సంబంధంలేదు. నిజానికి ఎక్కువ మందితోనే పరిష్కారం ఇంకా జటిలమవుతుంది. మరింత ఖరీదవుతుంది.

నాకో సాఫ్ట్ వేర్ కంపెనీ వుండేది. అక్కడే ఈ విషయం అర్థమయింది. మంచి ప్రోగ్రామర్ అయితే, ఎంత కష్టమైన సమస్య అయినా ఒక్క రాత్రి చాలు. అరకొర నాలెడ్జి వున్న వాళ్ళు పది మంది వున్నా.. నెలరోజులు టైమ్ వేస్ట్ చేసి సమస్యను మరింత జటిలం చేస్తారు.

నీకో టీవీ షో చేయాలనుందనుకో.. ఎవరెవరో వుండాలని అనుకోవద్దు. ఓ కెమెరా తీసుకో.. ఒక యూట్యూబ్ వీడియో షూట్ చెయ్. అలాంటివి ఓ వంద షూట్ చేసావనుకో.. నీ దగ్గర ఓ టీవీ షో వున్నట్టే లెక్క.

9. కొన్నివందల ఏళ్ళ వెనక్కి వెళ్ళి ఆలోచించండి. ఇప్పుడు మనం సునాయసంగా చేస్తున్న పనులన్నీ అప్పట్లో అద్భుతాలు, మాయలుగా అనిపిస్తాయి. ఎక్కడో వున్న వాళ్ళతో మాట్లాడడం, బొమ్మలను పంపించడం, గాల్లో ప్రయాణం చేయడం, ఇవన్నీ వందల ఏళ్ళ క్రితం అద్భుతాలే.. మాయలూ, మంత్రాలే..

ఇప్పుడు ఒక మూడువందల ఏళ్ళు ముందుకెళ్ళి ఆలోచించండి.. అప్పుడు వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారు. ‘అప్పట్లో జనం ఇంటర్నెట్‌కు ’కనెక్ట్‘ చేయాల్సొచ్చేదట. న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వెళ్ళడానికి ఏడుగంటలు పట్టేదట’ అని వింతగా చెప్పకుంటారేమో.

10. ఒక వ్యక్తి మనస్తత్వం మీద కాకుండా, అతని టాలెంట్‌నే ఎక్కువగా నమ్ముకోవడం నేను చేసిన పెద్ద తప్పు. మంచి మనసు వుండడం కూడా చాలా అవసరం.

వందల కోట్లు సంపాదించిన ఒక కంపెనీ జీరోకి వెళ్ళిపోవడం నేను ఈ మధ్య చూసాను. ఎందుకంటే, ఆ కంపెనీ ఫౌండర్స్ లోఒకరు 90 మిలియన్ డాలర్లను దొంగలించాడు.

నిజాయితీ, నమ్రత, పనిలో నిబద్ధత .. ఇవన్నీ చాలా ముఖ్యం. నీ దారిని నువ్వే నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు, నీ చుట్టూ వున్నవారిలో ఇవన్నీ వుండేలా తప్పనిసరిగా చూసుకోవాలి. లేకపోతే, నువ్వే ఏ అగాధాన్ని దాటాలనుకుంటున్నావో.. అందులోనే పడిపోతావు.

11. నేను కాలేజి రోజుల నుంచే ప్రపంచాన్నిమార్చే పనులు చేయాలనుకునే వాడిని. ఇప్పుడవే చేస్తున్నను.

నాకు మొదటినుంచి ‘ప్రపంచాన్ని మార్చడం’ అనే వ్యాక్యం చాలా అబ్బురంగా వుండేది. ఒక వ్యక్తి ప్రపంచాన్ని మార్చగలడా.?

దీనికి ముందు నన్ను నేను మార్చుకోవడం నుంచి మొదలు పెట్టాలి. శారీరకంగా ఆరోగ్యంగా మార్చుకోవాలి. మానసికంగా ఆరోగ్యవంతమైన వ్యక్తుల చుట్టూ వుండేలా మార్చుకోవాలి. క్రియేటివ్ గా మార్చుకోవాలి... చేసిన మేలు మర్చిపోకుండా నన్ను నేను మార్చుకోవాలి..

ఇవన్నీ ఒకేసారి జరగవు. రోజుకు ఒక్క శాతమైనా మార్చుకోవాలి. అప్పుడే నేను ప్రపంచం మార్చడం గురించి ఆలోచించగలను.

12. మనం చేసే పని మీద నిరంతరం సమీక్ష వుండడం చాలా అవసరం. మనం ఏం చేసాం.. ఇంత కంటే బాగా ఎలా చేసుండొచ్చు.. అని ఆలోచిస్తూ వుంటాం. నా సలహా కూడా అదే. ఏ పనైనా ఇంతకంటే ఎంత బాగా చేసుండొచ్చు.. అని నిరంతరం మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ వుండాలి.

నేనో వంద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాను. ఎక్కడైతే సి ఇవోలు తమని తాము గొప్పవాళ్ళుగా ఊహించుకుంటారో ఆ కంపెనీలు నష్టపోయాయి.

టెక్నాలజీ, పోటీ, తో పాటు వినియోగదారులు కూడా ఎప్పుడూ మారుతూనే వుంటారు. కానీ మనం మాత్రం మనం చేసే పని చాలా గొప్పదనే భావనలో వుంటాం.

ఇందులో తప్పేంటి ?

మనల్ని మనం ఒక బయటి వ్యక్తిలా నిరంతరం ప్రశ్నించుకుంటూ వుండాలి. లేకపోతే, ఏ వ్యాపారమైనా ఫెయిల్ కావడం ఖాయం.

నీ గురించి నువ్వు నిష్పక్షపాతంగా విశ్లేషించుకోలేకపోతే, నమ్మకస్తుడైన వ్యక్తిని ఆ పనికి ఎంచుకోవాలి. నేను నదైన దారిలో నడుస్తున్నానా లేదా.. అని అతన్నే అడగండి.

అలాంటి వ్యక్తి ఒకరు దొరికాక.. అలాంటి వాళ్ళే మరికొందరితో ఒక గ్రూప్‌ను తయారు చేయండి. భావసారూప్యత వున్న వారితో సమావేశాలు పెట్టుకోండి. నలుగురితో కలిసినప్పుడే మనకంటూ ఓ దారి దొరుకుతంది.

13. నాకు భయం లేదని చెప్పను. కానీ నా పనికి అడ్డం పడుతూ, నా నాడీ వ్యవస్థను దెబ్బతీసే భయం వీలైనంత తక్కువుంటే బావుండనుకుంటాను.

కొంచెంగా భయం వుండడం కూడా అవసరమే. అదున్నప్పుడే నా ప్రణాళికలు కరెక్టుగా వుంటాయి. ఇది కాకపోతే, మరొకటేంటనేది ప్లాన్ చేసుకుంటాను. ఏ మల్టీమిలియనీర్ ను తీసుకున్నా.. అతనికి ఏడు రకాల ఆదాయ మార్గాలు వుంటాయి. వాళ్ళందరికీ బ్యాకప్ ప్లాన్స్ వుంటాయి.

ఇలాన్ మస్క్ కి కూడా టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ లాంటి డజన్ కు పైగా కంపెనీలున్నాయి.

నేనే పని చేసినా.. నా ప్లాన్ బి ఏంటని ప్రశ్నించుకుంటాను. అలాగే ఎవరూ ఆశించని పాఠం దీన్నుంచి నేనేం నేర్చుకోబోతున్నానని కూడా ఆలోచిస్తాను.

14. ఈ చిన్న జీవితంలో పెద్ద పెద్ద పగలు పెంచుకోకూడదు..

నా చుట్టూ వుండే అయిదుగురిలో సగటు లక్షణాలన్నీ నాలో వుంటాయని నేను అనుకుంటూ వుంటాను. అందుకే నాకు ఈ కొటేషన్ చాలా ముఖ్యమైనది. అసలు మీలో పగ, పంతాలను పెంచే వాళ్ళను మీ చుట్టూ కూడా వుండనివ్వకండి. నేనైతే, నేను ప్రేమించే వారితో, నన్ను ప్రేమించే వారితోనే ఎక్కువగా గడుపుతాను.

ఏదైనా చెడు జరిగితే, ఎవరో ఒకరిని నిందించడం కంటే, దాన్నుంచి నేనేం నేర్చుకోగలనని ఆలోచిస్తాను. మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా వుండడానికి ప్రయత్నిస్తాను.ఇది కొంచెం కష్టమే అయినా.. రోజూ కొంతచొప్పున నేర్చుకోవచ్చు.

15. కొత్త పనులు చేయడానికి భయపడకండి.

ఇందాకే చెప్పినట్టు స్ఫూర్తి పొందడంలో ఒక రిస్క్ వుంటుంది. మన సౌకర్యాలని కాస్త పక్కన పెట్టి, ఇంత వరకు ఎప్పుడూ చేయని పని చేయాలి. రోజుకొకటైనా ఇలాంటి పని చేయడం నా దినచర్యలో భాగంగా పెట్టుకుంటాను.

మొన్నొక రోజు రెండు డాలర్లిస్తాను.. ఒక డాలర్ ఇస్తారా అని అడిగాను. ఇక్కడున్న వాళ్ళంతా నన్ను పిచ్చివాడిలా చూసారు. మిగిలిన వాళ్లు మాత్రం నాదగ్గర రెండు డాలర్లు తీసుకుని ఒక డాలర్ ఇచ్చారు.

ప్రయోగాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. అయితే, సౌకర్యాన్ని మర్చిపోయి కొత్తవి చేయడంలో ఒకరకమైన సరదా భయం, కలగలిసి వుంటాయి.

16. సాధారణమైన వ్యక్తులు కూడా అసాధారణ జీవితాన్ని ఎంచుకోవచ్చు.

సాధారణమైన వ్యక్తులు సాధారణంగా వుండిపోవచ్చు. సాధారణమైన జీవితం బావుంటుంది కూడా. కానీ ప్రతిరోజూ మన జీవితాన్ని శారీరకంగా, మానసికంగా, సృజనాత్మకంగా.. ఎంతోకొంత మెరుగుపరుచుకోవడం మంచిది. (ఒక్క శాతం అంటే మనం లెక్కించడానికి కూడా సరిపోదు.)

ఈ ఒక్కో శాతం పెంచుకుంటూ పోవడమే అసాధారణ భవిష్యత్తుకు దారి. అయితే, ఇప్పుడే ఆ అసాధారణ రేపటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దు. ఈ రోజు మెరుగుపరుచుకునే ఈ ఒక్కశాతం గురించే ఇవాళ ఆలోచిద్దాం.

17. ఒక పని జరుగుతుంటే చూస్తూ వుండొచ్చు. లేదా ఆ పని మనమే చేయడంలో మనమూ పాల్పంచుకోవచ్చు.

కొంత మంది అవకాశం చేజారిపోయిందని చెప్తుంటారు. అయితే, మనకిష్టమైన పని చేయడంలో ఆలస్యమనేది లేదు. నీకిష్టమైనది ఎప్పుడూ నిన్ను చేరుకోవడానికి ఎదురు చూస్తూనే వుంటుంది.

18. ఆంట్రప్రన్యూర్ కావడంటే, పాషాణాన్ని నోట్లో వేసుకుని నరకాన్ని చూస్తూ నిల్చోవడం లాంటిదే..

ఇంకా ఎన్నిరోజులీ ఉద్యోగాలు చేస్తాం. మనకంటూ ఓ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటుంటారు.

కానీ వ్యాపారం మొదలుపెట్టడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. 85 శాతం మంది ఆంట్రప్రన్యూర్లు ఫెయిలవుతారు. వైఫల్యం అనేది ఎంత కష్టమో వేరే చెప్పక్కర్లేదు. ఇటు కస్టమర్లు, అటు ఉద్యోగులు, పెట్టుబడదారులు, ఇలా ఎంతో మందిని ఎదుర్కోవాలి. వీళ్ళందరికీ మీరు బాస్ అనుకుంటారు కానీ, నిజానికి వాళ్ళే మీ బాస్‌లు.

ఇంతే కాదు.. మీ ఉత్పత్తులు అమ్మాలి. సంస్థను పెంచుతూ పోవాలి. ఒక దశలో అమ్మేయాలి..

ఇక్కడ ఇలాన్ మస్క్ పద్ధతి నాకు నచ్చుతుంది. ఆయన ఒకేసారి చాలా పనులు చేస్తుంటారు. చాలా ప్లాన్ బి లు వుంటాయి. దీని వల్ల ఒక్కదానితోనే మైండ్ పాడుచేసుకోవాల్సిన అవసరం వుండదు.

ఒక్క లాభదాయకమైన కస్టమర్ తో మీ వ్యాపారం మొదలు పెడితే, మీ ఫెయిల్యూర్ అవకాశాలు 85 శాతం నుంచి 20 శాతానికి తగ్గించుకోవచ్చు.

19. నేను మార్స్ లో చనిపోవడానికి ఇష్టపడతాను..

ఇక్కడ ఆండీ వీర్స్ రాసిన ‘ది మార్షియన్’ పుస్తకం చదవండి దాన్ని ఆయనే రాసి ప్రచురించాడు. ఆ తర్వాత ఒక మేజర్ పబ్లిషర్ దాన్ని కొన్నారు. ఇప్పుడు రిడ్లీ స్కాట్ సినిమాగా కూడా తీస్తున్నారు. మస్క్ చెప్పిన టాపిక్ గురించే ఈ పుస్తకంలో వీర్స్ చర్చించాడు.

20. టీనేజిలో తనకు నచ్చిన పుస్తకం ‘ ది హిచ్ హైకర్స్ గైడ్ టు గలాక్సీ’’ గురించి... ఏం ప్రశ్నించాలనేది తెలుసుకుంటే చాలు.. మిగిలినవన్నీ వాటంతట అవే జరిగిపోతాయి..

హిచ్ హైకర్స్ గైడ్ టు ది గలాక్సీలో నాకు నచ్చిన అంశాలు ఇప్పుడు చెప్తాను.. నీ దగ్గర ఒక టవల్ వుంటే చాలు..తర్వాత జరగాల్సినదంతా ప్రపంచమే చూసుకుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.

21. వార్ధక్యం నా శక్తిని హరించకముందే, నేను రిటైర్ కావాలని అనుకుంటున్నాను. నేను అలా రిటైర్ కాకపోతే, నా వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.

మనం పుట్టిన సంవత్సరం, మనం రిటైర్ అయ్యే సంవత్సరాలే.. మన జీవితంలో అత్యంత కీలకమైనవి.

ఈ రకంగా చూస్తే ఇలాన్ మస్క్ అసలు రిటైర్ కారేమో.

గెస్ట్ రచయిత - జేమ్స్ అలుచర్ James Altucher is an American hedge fund manager, entrepreneur, and bestselling author.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags