సంకలనాలు
Telugu

వెదురుతో వందేళ్లు నిలిచే ఇళ్లు కడుతున్న సివిల్ ఇంజినీర్

Poornavathi T
23rd Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


చిన్నతనంలో ఏడేళ్లపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నివసించడంతో... పునరుత్పాదక వనరులపై మక్కువ పెంచుకున్నారు ఇంద్రాణి. ముఖ్యంగా ప్రపంచంలో ఎంతో విస్తారంగా లభించే వెదురును ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చని తెలుసుకున్నారామె. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా పునర్వినియోగం చేయగలిగే వస్తువు కూడా వెదురే అని అర్ధం చేసుకున్నారు ఇంద్రాణి. ఆమె తండ్రి ఓఎన్‌జీసీలో సీనియర్ ఫైనాన్స్ విభాగంలో పని చేసేవారు. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉండేది. ఆమెకు నెల రోజుల వయసున్నపుడు త్రిపురకు ట్రాన్స్‌ఫర్ కాగా... కొన్నేళ్ల తరువాత అసోంకు బదిలీ అయింది ఇంద్రాణి తండ్రికి. దట్టంగా, విస్తారంగా ఉండే వెదురు అడవులను చూడ్డం ఎంతో ఉత్సాహంగా ఉండేదని చెబ్తారు 'బాంబూజ్' సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ ఇంద్రాణి ముఖర్జీ.

పునరుత్పాదక వనరు అయిన వెదురును... తగిన అభివృద్ధి కోణంలో ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో మొదలైంది బాంబూజ్. దేశంలో ఏ ప్రాంతంలో అయినా విస్తారంగా లభించే వెసులుబాటు ఉండడమే... వెదురును ఎంచుకోవడానికి ప్రధాన కారణం.

తన కుటుంబంలో తొలితరంగం పారిశ్రామికవేత్త అయిన ఇంద్రాణి... ప్రస్తుతం బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తన సంస్థ బాంబూజ్ ద్వారా అనేక కంపెనీలు వెదురును ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నారు. దీనిపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. సివిల్ ఇంజినీర్‌గా 13ఏళ్లపాటు పలు బహుళ జాతి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్నా... తన ఇష్టానుసారమే సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్నానని చెబ్తారు ఇంద్రాణి. సమాజానికి గ్రీన్, రెన్యూవబుల్ సొల్యూషన్స్ అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారామె.

వెదురుతో నిర్మించిన రిసార్ట్

వెదురుతో నిర్మించిన రిసార్ట్


ప్యాషన్‌తో మొదలైన బాంబూజ్ ప్రారంభించినా... దీన్ని కమర్షియల్‌గా సక్సెస్ చేయడమే ఇంద్రాణి లక్ష్యం. “సుదీర్ఘకాలం సంప్రదాయ నిర్మాణ రంగంలో ఉన్నా.. నేనెప్పుడూ ప్రకృతికి అనువైన, స్థిరమైన పరిష్కారాలు అందించాలనే తపించా. అందుకే ఈ అడుగు వేయాల్సి వచ్చింది” అంటారు ఇంద్రాణి.

బాంబూజ్ ఎలా మొదలైంది ?

ఇంద్రాణి, ఆమె భర్త సమ్రాట్ సాహా కూడా సివిల్ ఇంజినీర్లే. అయితే... తమ పేరెంట్స్‌ను స్టార్టప్ విషయంలో ఒప్పించేందుకు వీరు చాలా కష్టపడాల్సి వచ్చింది. పూర్తిగా వారిలో నమ్మకం లేకపోయినా... స్థిరమైన ఉద్యోగాలను వదిలేయాల్సి రావడం మరో ముఖ్య విషయం. “మా ఇద్దరి పేరెంట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఇలాంటి వ్యాపార ఆలోచనలకు వారు అంత సానుకూలం కాదు. అయినా ఐదేళ్ల క్రితం మా స్టార్టప్ మొదలైంది” అన్నారు ఇంద్రాణి.

“ఆంట్రప్రెన్యూర్‌షిప్ అంటే అదో రోలర్ కోస్టర్ లాంటిది. ప్రతీ రోజూ సమస్యలు ఎదుర్కోవాల్సిందే. రిస్క్ భరించగలిగే సామర్ధ్యం, సహజసిద్ధమైన ఆలోచనలతో సమస్యలను పరిష్కరించగలిగే తత్వం స్టార్టప్ ప్రయాణంలో అలవర్చుకోవాల్సి వస్తుంది” అంటున్నారు ఇంద్రాణి.

సాధారణంగా నిర్మాణాలకు ఉపయోగించే వస్తువులు కాకుండా... వెదురును సాధనంగా ఎంచుకున్న కంపెనీలకు ఇది మరింతగా అనుభవంలోకి వస్తుంది. ప్రజల్లో అహగాహన పెంచేందుకు బడా కంపెనీలు, ప్రభుత్వ రంగ ఏజన్సీలను కలిసేవారు. తమ సంస్థ బాంబూజ్‌లో పెట్టుబడులు చేయాల్సిందిగా కోరారు. వారికి బాంబూజ్ కార్యకలాపాలపై నమ్మకం కలిగించడం ఇంకా కష్టమైన విషయం.

తన పనివారికి సూచనలిస్తున్న ఇంద్రాణి

తన పనివారికి సూచనలిస్తున్న ఇంద్రాణి


ఒక మహిళగా తానే ఏర్పాటు చేసుకున్న సంస్థ కావడం కూడా.. సవాళ్లను మరింతగా అధిగమించాల్సి రావడానికి కారణమైంది. ఓ మహిళా పారిశ్రామికవేత్తగా బాంబూజ్ వెంచర్‌కు తానే పూర్తి బాధ్యతలు వహిస్తున్నారు. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, డెలివరీ వరకూ అన్నిటినీ ఇంద్రాణియే పర్యవేక్షిస్తున్నారు.

నిర్మాణ వస్తువుగా వెదురు !

నిర్మాణం పూర్తయ్యాక అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కంటే... వెదురు వల్ల మరో ఉపయోగముంది. వెదురుతో నిర్మించిన నిర్మాణాలకు వందేళ్లకు పైగా జీవిత కాలం ఉండడం విశేషం. “అలాగే భూకంప ప్రభావ ప్రాంతాలకు ఈ తరహా ఇళ్లు చక్కని పరిష్కారం”అంటున్నారు ఇంద్రాణి. ఇళ్లతో పాటు గెజాబో, రిసార్ట్స్, రూఫ్‌టాప్, కాటేజెస్, ఈటరీస్, పార్కింగ్ షెడ్స్ వంటి అనేక ఇతర నిర్మాణాలపైనా దృష్టి పెట్టారు ఇంద్రాణి ప్రస్తుతం. బాంబూసా బాల్కో రకం వెదురునే నిర్మాణాల కోసం వినియోగిస్తారు.

నిర్మాణ రంగంలో స్థిరమైన నూతన పరిష్కారం చూపగలిగినందుకు అవార్డ్ అందుకుంటున్న ఇంద్రాణి

నిర్మాణ రంగంలో స్థిరమైన నూతన పరిష్కారం చూపగలిగినందుకు అవార్డ్ అందుకుంటున్న ఇంద్రాణి


వాహనాల బాడీ తయారీలో వెదురుతో తయారు చేసిన మ్యాట్ బోర్డుల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నుంచి... బాంబూజ్ అనుమతి పొందడం విశేషం. బస్సులు, వాహనాల్లో ఫ్లోరింగ్, సీట్స్, పార్టిషన్స్ తయారీకి ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లైబోర్డుల స్థానంలో వెదురును ఉపయోగిస్తోందీ సంస్థ.

ఇంద్రాణి రోల్ మోడల్స్ వీరే

తన కన్నతల్లి, స్వామి వివేకానందలను రోల్ మోడల్స్‌గా పరిగణిస్తారు ఇంద్రాణి. గృహిణి అయిన తల్లి నుంచి ఓర్పు, కరుణలను అలవర్చుకున్నానని చెబ్తారు. ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు కోసం తన కెరీర్‌ను వదులుకున్నారామె. అలాగే స్వామి వివేకానంద బోధనలు ఇంద్రాణి జీవితంపై ఎంతో ప్రభావం చూపాయి. తనపై తాను నమ్మకం, క్రమశిక్షణ అలవర్చుకోడానికి ఇవి ఉపయోగపడ్డాయంటారు ఇంద్రాణి.

ఒకరికి ఒకరుగా ఆ జంట

బాంబూజ్ సహ వ్యవస్థాపకులైన ఇంద్రాణి, సమ్రాట్‌లు వీరు తమ సొంత నిధులతో 2010లో బాంబూజ్ వెంచర్‌ను ప్రారంభించారు. భార్యాభర్తలే అయినా... వీరు ఒకరి సామర్ధ్యాన్ని, సమర్ధతను ప్రశంసించుకోవడం విశేషం. “ నా నిర్ణయాలు, సామర్ధ్యంపై ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. తనతో కలిసి కంపెనీ నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో తన పూర్తి మద్దతు పలికారు సమ్రాట్”అంటున్నారు ఇంద్రాణి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags