ఇది కథ కాదు.. హృద‌యం ద్ర‌వించిపోయే జీవితగాథ

కేన్సర్ జయించిన ధీర వనిత లక్ష్మీ

29th Dec 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

కాళ్లు తడవకుండా సముద్రాన్ని ఈదవచ్చేమోగానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని ఈదలేం. కష్టాలు కన్నీళ్లు ఒక్కసారిగా చుట్టిముడితే ఎంత భద్రగుండె అయినా బరువెక్కుతుంది. ఆ సమయంలో పాదం కింద భూమి కదిలిపోయే వార్త చెవిన పడితే- శూన్యం అలుముకోవడం తప్ప మరో అవకాశం లేదు. ఆమె జీవితంలో అలాంటి దట్టమైన చీకటే అలుముకుంది. మరణం తప్ప మరో మార్గం లేని బ్లడ్ కేన్సర్ మహమ్మారి కబళిస్తే.. తిరుగుబాటు చేసి తరిమేసింది. ఒక ఆడపిల్లకు ఇన్ని కష్టాలా.. అని మనసు చలించిపోయే రియల్ స్టోరీ మీరే చదవండి.

లక్ష్మీ ఖనగార్. కష్టాలు కన్నీళ్లు ఆమెకు చుట్టాలు పక్కాలు. పేగు పంచిన అమ్మానాన్నలే ఆగర్భ శత్రువులు. ఆర్ధిక సమస్య అనే పెద్ద అగాథం ఆమెను ఎక్కడికో విసిరేసింది. కర్నాటకలోకి బెల్గాం జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి లైఫ్ గోవాకు మారిపోయింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఒక శ్రీమంతుల ఇంట్లో పనిమనిషిగా కుదరింది. పసిపిల్ల అని కూడా చూడకుండా తల్లిదండ్రులు బయటకి బలవంతంగా నెట్టేశారు.

పొద్దున లేస్తే పాచిపని. ఇంటెడు చాకిరీ. తన చిట్టిచేతుల వల్ల కాలేదు. అమ్మతో చెప్పుకుని ఏడ్చింది. నాన్నను ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకెళ్లండి అని ప్రాధేయపడింది. చదువుకుంటానని కన్నీళ్ల పర్యంతమైంది. కానీ ఆమె వేదన అరణ్య రోదనే అయింది. లాభంలేదని ఎలాగోలా అక్కడి నుంచి బయటపడింది. తిరిగి కర్నాటకలోని గోకాక్‌ చేరుకుంది. అక్కడో హాస్టల్లో చేరిపోయింది. స్కూలింగ్ కంప్లీట్ చేసింది. ఎక్కడో ఒక చిన్న నమ్మకం. ఏదో సాధించాలనే తపన.

అన్నాళ్ల హాస్టల్ లైఫేం గొప్పగా లేదు. టైంకి తిండి ఉండేది కాదు. ఒక్కోసారి పస్తులు ఉండాల్సి వచ్చేది. వేరే ఆప్షన్ కూడా లేదు.

టెన్త్ క్లాస్ వరకైతే చదివింది. కానీ తన కాళ్లమీద తను నిలబడాలంటే ఆ చదువు సరిపోదు. అమ్మానాన్నల నుంచి హోప్స్ అంతకన్నా లేవు. అందుకే ఒక హాస్పిటల్‌లో నర్సుగా కుదిరింది. వచ్చిన జీతంతో కాలేజీ ఫీజులు కట్టొచ్చని భావించింది. పగలంతా క్లాసులు. రాత్రిపూట ఉద్యోగం. అలా రెండేళ్లు గడిచాయి. ఇంటర్ కంప్లీట్ అయింది. తనకు తెలుసు. ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు తక్కువని. పైగా గోకాక్ లాంటి చిన్న టౌనులో ఏం అవకాశాలుంటాయి? అయినా సరే తనవంతు ప్రయత్నం మానలేదు.

ఒక పేపర్లో క్లాసిఫైడ్ యాడ్ చూసి ఇంటర్వ్యూకి అటెండయింది. ఏదో లోకల్ కంపెనీ. డెంటల్ ప్రాడక్ట్స్ మార్కెటింగ్ చేయాలి. ఇల్లిల్లూ తిరిగి అమ్మాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక ఉద్యోగం అనుకుని జాయిన్ అయింది. రోజుకు కొన్ని మైళ్ల దూరం నడక. ఎవరూ కొనేవారు కాదు. కనీసం చెప్పేది కూడా వినేవాళ్లు లేరు. ఇల్లిల్లూ తిరిగి బేజారొచ్చేది. కానీ అమ్మితేనే జీతం డబ్బులు. అసాధ్యం అనిపించింది. వేరే మార్గం కనుచూపు మేర కూడా కనిపించడం లేదు. అదృష్టం బాగుండి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టు నుంచి మేనేజర్ పోస్టుకి మారింది. సంతోషానికి అవధుల్లేవు.

image


విష్ణు పరిచయం అయింది అక్కడే. ఆ పరిచయం స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా మారింది. ఒకరి బాధలు ఒకరు పంచుకున్నారు. ఒక కష్టాలు ఒకరు షేర్ చేసుకున్నారు. అభిప్రాయలు కలిశాయి. మనసులూ కలిశాయి. విష్ణు పరిచయం తర్వాతే లక్ష్మీ మొదటిసారిగా తనివితీరా నవ్వింది.

కొంతకాలం తర్వాత ఇద్దరూ బెంగళూరుకు షిఫ్టయ్యారు. అక్కడ ఒక హెల్త్ కేర్ కంపెనీలో ఉద్యోగం చూసుకున్నారు. కానీ పెళ్లి కానందుకు వేర్వేరు ఇళ్లలో ఉండాల్సి వచ్చింది. మళ్లీ ఒంటరిగా ఉన్న హాస్టల్ రోజులు గుర్తుకొచ్చాయి.

పర్లేదు. కష్టాలు లేవని కాదు. కానీ అప్పటన్ని లేవు. ఓ మోస్తరు జీవితం. పేషెంట్లు, వారికి సపర్యలు. టైం దొరికినప్పుడు కలుసుకోవడం.. మాట్లాడుకోవడం.

ఇలాగైతే లాభం లేదని మళ్లీ గోకాక్ షిఫ్టయ్యారు. లక్ష్మీ బెల్గాంలోని ఒక ఎన్జీవోలో చేరింది. అక్కడ అసిస్టెంట్ నర్సు ఉద్యోగం. మళ్లీ కొన్నాళ్లకే విష్ణు పుణెకి మారిపోయాడు. అతనికి అక్కడ కాల్ సెంటర్ జాబ్.

లైఫ్ గాడిన పడుతున్నట్టు అనిపించింది. పనికి తగ్గ జీతం.. ఆప్యాయంగా పలకరించే జనం.. ఇంకెన్నాళ్లు.. మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయిలే అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది.

తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది

లక్ష్మీ పైకి నవ్వుతోంది కానీ ఆమె శరీరం పూర్తిగా అలసిపోయింది. నీరసం ఆవహిస్తోంది. చిన్నపాటి బరువు కూడా ఎత్తలేకపోతోంది. జ్వరం వస్తూ పోతూ ఉంది. ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు.. కొన్నేళ్లపాటు టైంకి తినకపోవడం, అసలు తినకపోవడం వల్ల వచ్చిన ఎఫెక్ట్. ఎందుకైనా మంచిది చెకప్ చేయించుకో అని కలిగ్ సలహా ఇచ్చింది. భయంభయంగా డాక్టర్ దగ్గరికి వెళ్లింది. అతను బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నాడు. రిపోర్టులు వస్తున్నాయి. తెల్లరక్త కణాల పరిమాణం గణనీయంగా తగ్గింది. ఏదో అనుమానం. ఈ టెస్టులు సరిపోవు.. ఇంకా చేయాలన్నాడు డాక్టర్.

ఈలోగా చెల్లిపెళ్లి కుదరిందని ఇంటినుంచి ఫోన్ వచ్చింది. రాకరాక అమ్మానాన్నల నుంచి పిలుపు. పరుగు పరుగున వెళ్లింది. పెళ్లి పనుల్లో బిజీ అయింది. ఒకరోజు హాస్పిటల్ నుంచి సడెన్‌ గా ఫోన్ వచ్చింది.

మీ రిపోర్టులు వచ్చాయి.. ఎవరైనా పెద్దవాళ్లను తీసుకుని రండి.. మాట్లాడాలి.. అని ఫోన్ సారాంశం.

ఒక్కసారిగా శూన్యం అలుమకుంది. వెన్నులో మిన్నాగు దూరినట్టుగా- భయం పట్టుకుంది. చల్లగా చెమటలు పట్టాయి. ఈ విషయం ఎవరికి చెప్పాలి..? ఎలా చెప్పాలి..? తర్జన భర్జన. మనసంతా అల్లకల్లోలం.

ఎవరికీ చెప్పలేదు. ధైర్యం కూడదీసుకుని ఒంటరిగానే ఆసుపత్రికి వెళ్లింది. ఈవెన్ విష్ణుకి కూడా తెలియదు.

డాక్టర్ ని కలిసింది. అతను సైలెంట్‌ గా ఉన్నాడు. చెప్పడానికి ఇష్టపడలేదు. వెళ్లి.. ఎవరైనా పెద్దవాళ్లుంటే తీసుకురామ్మా అన్నాడు. ఏమయిందో లక్ష్మీకి అర్ధం కాలేదు. ఎలా కన్విన్స్ చేయాలో తెలియలేదు. ఉన్నట్టుండి వాళ్లు రమ్మంటే రాలేరు అని తన పరిస్థితి వివరించింది. అంతా విన్న డాక్టర్... సావధానంగా ఒక పిడుగులాంటి మాట చెప్పాడు.

బ్లడ్ కేన్సర్. డాక్టర్ మాట పూర్తికాకముందే లక్ష్మీ అదిరిపడింది. కాళ్లకింద భూమి కంపించి పోయింది. చీకట్లు అలుముకున్నాయి. మృత్యువు కళ్లముందు కనిపించింది. కన్నీళ్లు సముద్ర కెరటాల్లా పోటెత్తాయి.

ఏడుస్తున్న లక్ష్మీని డాక్టర్ ఓదార్చాడు. ఇదేమంత ప్రాణాంతకం కాదని వివరించాడు. రోజూ మెడిసిన్ వాడితే నయమవుతుందని చెప్పాడు. డాక్టర్ మాటలతో మనసు కుదట పడింది. కాకపోతే నెలకి ఆరువేలు ఖర్చవుతాయి. లక్ష్మీ పునరాలోచనలో పడింది. తను ఉన్న పరిస్థితుల్లో అది పెద్ద మొత్తమే. అందుకే వేరే ఆలోచన లేకుండా మెడిసిన్ వాడొద్దని డిసైడయింది. తలరాత ఎలా వుంటే అలా జరుగుతుందని.. భారంగా హాస్పిటల్ నుంచి బయటకు కదలింది.

ఈ విషయం విష్ణుకి తెలియదు. ఇటు ఇంట్లో వాళ్లకూ చెప్పలేదు. అందరితో మాట్లాడం తగ్గించింది. విష్ణ ఫోన్ చేస్తే కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అతనికి భారం కావొద్దనే ఉద్దేశంతోనే దూరం కావాలనుకుంది. మృత్యువును వెంటేసుకుని వెళ్లి అతడి బంగారం లాంటి జీవితాన్ని స్పాయిల్ చేయడం ఎందుకుని కఠిన నిర్ణయం తీసుకుంది.

విష్ణుకి అర్ధమవుతోంది. లక్ష్మీ కావాలని అవాయిడ్ చేస్తోందని. అసలేం జరిగిందో తెలుసుకుందామని ఒకరోజు పుణె నుంచి దిగాడు. ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశాడు. అడగ్గా అడగ్గా చెప్పింది. షాక్ తిన్నాడు. అయితే మాత్రం.. మరిచిపోతావా అని ఏడ్చాడు. నా ప్రాణం ఏమైపోవాలి అని గుడ్లనీరు తీసుకున్నాడు. నువ్వు నన్ను వదులుకుంటావేమో గానీ.. నేను నిన్ను వదులుకోను అని కరాఖండిగా చెప్పేశాడు. నువ్వు బతికేది ఒక నెలకానీ.. ఒకరోజు కానీ.. ఒక గంటకానీ.. కడదాకా నీతోనే ఉంటాను. నడు.. పెళ్లి చేసుకుందాం అని చేయి పట్టుకున్నాడు.

కొంత మానసిక సంఘర్షణ. ఎటూ తేల్చుకోలేకపోయింది. మనసు మాత్రం విష్ణ చేయిపట్టుకుని నడువు అని చెప్తోంది. బతికినన్ని రోజులు అతని సహచరిగా ఉందామని నిర్ణయించుకుంది.

రోజులు దొర్లుతున్నాయి. ఒకరోజు యథాలాపంగా పేపర్ తిరగేస్తుంటే కనిపించిందొక ప్రకటన. ప్రాణం లేచివచ్చినంత పనైంది. బెంగళూరులో ఒక పేరున్న హాస్పిటల్ ఉచితంగా కేన్సర్ ట్రీట్మెంట్ ఇస్తోందని ఆ ప్రకటన సారాంశం. ఇద్దరూ వెళ్లి డాక్టర్ ని కలిశారు. లక్ష్మీ తను చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నదో చెప్పింది. ఆమె కన్నీళ్లను అర్ధం చేసుకున్న వైద్యులు.. ఒక్క చికిత్సే కాదు.. మందులు కూడా ఫ్రీగా ఇస్తామని భరోసా ఇచ్చారు.

దేవుడి కూడా ఆమె కష్టాలను చూసి చలించిపోయాడో ఏమో.. ఇన్నాళ్లకు వైద్యుల రూపంలో ఎదురొచ్చి కన్నీళ్లు తుడిచాడు.

ప్రస్తుతం లక్ష్మీ బ్లడ్ కేన్సర్ ను జయించిన యోధురాలు. విష్ణ ఇచ్చిన ధైర్యం, డాక్టర్లలో రూపంలో ఎదురైన దైవం.. వెరసి లక్ష్మీ మళ్లీ మామూలు మనిషైంది.

ఇప్పుడైనా పెళ్లి చేసుకుందామా అని విష్ణు దీనంగా అడిగాడు. లక్ష్మీ మనసు కరిగి నీరైపోయింది. అమాంతం వెళ్లి అతని గుండెల మీద వాలిపోయి ఏడ్చింది. 2014 పెళ్లి చేసుకుని ఇద్దరూ కొత్త ప్రపచంలోకి అడుగుపెట్టారు.

ఆరోగ్యం పూర్తిగా కుదటపడింది. ఎన్జీవోలో ఉద్యోగం మానేసింది. ఇంటిదగ్గరే ఉంటూ తనకిష్టమైన సంగీతం మీద మనసు లగ్నం చేసింది. లక్ష్మీకి పాడటం అంటే ఇష్టం. పాటతోనే హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. ఖాళీగా ఉండటం ఎందుకు అని తెలిసిన వాళ్ల ఆర్కెస్ట్రాలో చేరింది. విష్ణు మాట సగం బతికితే.. పాట పూర్తిగా కోలుకునేలా చేసింది.

చావు అనివార్యం. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రేపు ఏం జరుగుతుందో ఊహించలేం అంటారామె.

కేన్సర్ ని జయించిన లక్ష్మీ గుండెనిబ్బరం ఆమె తల్లిదండ్రులను కూడా ధైర్యంగా ఉండేలా చేసింది. 

లక్ష్మీ మాటల్లోనే ఆమె జీవితం

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India