సంకలనాలు
Telugu

మహిళా వ్యాపారవేత్తలు తెంచుకోవలసిన పది సంకెళ్లు...

అనామిక
13th Feb 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఈ రోజుల్లో మహిళలు వ్యాపార రంగంలో కనిపించటం చాలా సాధారణంగా మారింది. ఒంటి చేత్తో బడా కంపెనీల సారధ్యం వహిస్తున్నారు. కానీ, ఎంతమంది వ్యాపారరంగంలో ఉన్నా-వారిలో గుర్తింపు తెచ్చుకుంటున్నది చాలా తక్కువ మందే అని చెప్పాలి. కుటుంబ అవసరాల దృష్ట్యా బిజినెస్ మొదలుపెట్టేవారు కొందరు. ఫ్యామిలీ బిజినెస్ ని చేతుల్లోకి తీసుకునేవారు ఇంకొందరు. మరికొందరు సున్నా నుంచి మొదలు పెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించేవారు. ఈ కేటగిరీలో అతికొద్దిమంది కనిపిస్తారు. ఉదాహరణకు షహనాజ్ హుస్సేన్. సౌందర్య ఉత్పత్తుల రంగంలో ఎదురులేని బిజినెస్ విమన్. మరో ఉదాహరణ కిరణ్ మజుందార్ షా. ఇండియాలోనే పబ్లిక్ గా ట్రేడయ్యే అతిపెద్ద బయో ఫార్మస్యూటికల్ కంపెనీ నిర్మాత. ఈ కొద్దిమందేనా? గ్లోబల్ బిజినెస్ లీడర్స్ గా భారత మహిళ ఎందుకు ఎదగటం లేదు? నూటికి 90 శాతంపైగా ఆడవాళ్లు ఇంటికి లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు ఎందుకు పరిమితమవుతున్నారు?

image


ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళలకు పలురకాల అడ్డంకులున్నాయి. మనదేశంలో కూడా ఇదే తీరు. అయితే, మహిళలను వ్యాపార రంగంలో అడ్డుకునే శక్తులేంటి? మహిళా వ్యాపారవేత్తలు వారి శక్తి సామర్ధ్యాలకు తగ్గట్టు ఎందుకు సంపాదించటం లేదు? అని ప్రశ్నిస్తే, పురుషాధిక్య సమాజమే దీనికి కారణం అని చెప్పటం చాలా తేలిక. 

కానీ రోజులు మారాయి. ఇంకా మారుతున్నాయి. పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది. ప్రతిదానికి మేల్ డామినేటెడ్ సొసైటీనే కారణం అంటే కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు పురుషులతో సమానంగా స్త్రీలూ చదువుకుంటున్నారు. మంచి సంస్థల్లో చదువుకుంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నత స్థానాలు కూడా అధిరోహిస్తున్నారు. సక్సెస్ ఫుల్ మహిళా వ్యాపారవేత్తలను ఓ సారి కదిలించండి. వారి తపనకు లింగవివక్ష ఏ మాత్రం అడ్డు రాలేదనే చెప్తారు. వారి పట్టుదల, అంకిత భావమే వాళ్లనీ స్థానానికి తీసుకొచ్చిందంటారు.

పరిస్థితులను ఓ మహిళ ఎలా ఎదుర్కొటుందో, వాటి ప్రభావాన్ని ఏ రకంగా తీసుకుంటుందో అనేది చాలా ముఖ్యం. అంతే కాదు.. ఆమె ఎలాంటి అవకాశాలవైపు మొగ్గు చూపుతుందో అనేది కూడా ముఖ్యమే. ఈ క్షణాన్నిమించిన మంచి టైం మరొకటి లేదు. అందుకే, మహిళలు తమ శక్తి సామర్ధ్యాలు చూపటానికి వ్యాపార రంగంలో రాణించటానికి ట్రెడిషనల్ మైండ్ సెట్ ని బ్రేక్ చేయక తప్పదు. అలాంటి ఓ పది అంశాలను చూద్దాం..

ఇల్లూ.. పిల్లలు మహిళల బాధ్యత...

ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని అప్పుడెప్పుడో ఓ మగానుభావుడు సెలవిచ్చాడు. అంటే ఇల్లూ, పిల్లలు, భర్త, వంటిల్లు అన్నీ భార్య బాధ్యతలన్నమాట. వెరసి మహిళ ఇంటికే పరిమితం కావాలన్నది సారాంశం. ఇలాంటి భ్రమలను దారప్పోగులను తెంచినట్టుగా తెంచితే కానీ పని మొదలు కాదు. అలాగని ఇంటిని, పిల్లలని వదలమని కాదు.. అవి భార్య భర్తల సమష్టి బాధ్యత అనే నిజాన్ని ఇద్దరూ గుర్తించాలి. బంధనాలు తెంచుకుని మహిళ ఈ ప్రపంచంలో రాణించాలంటే మరింతగా రియలైజ్ అవ్వాలి. మరో విషయం ఏంటంటే, 24 గంటలు ఇంట్లోనే ఉన్న తల్లికంటే, తల్లి కూడా ఉద్యోగం చేస్తున్న ఇళ్లలో పిల్లలు మరింత ఇండిపెండెంట్ గా, ధైర్యంగా పెరుగుతారని సర్వేలు చెప్తున్నాయి.

నా ఉద్యోగ, వ్యాపార బాధ్యతలకంటే, నా భర్త పనే ముఖ్యమైంది...

ఇంట్లో ముఖ్యమైన పని ఉంటే భార్యాభర్తల్లో ఎవరు సెలవు పెడతారు? సమాధానం సింపుల్. భర్త చేసే రాచకార్యానికి భంగం కలగకుండా భార్య సాధారణంగా సెలవు పెడుతుంది. కానీ, పని అంటే పనే. అక్కడ ఆడ మగా సంబంధం లేదు. కమిట్ మెంట్ ఉండాలి.

నేను వ్యాపారంలోకి సంపాదనకోసం రాలేదు...

చేస్తున్న పని వ్యాపకం కోసమో, పాషన్ తోనే అయి ఉండొచ్చు. లేదా అవసరం కోసమైనా కావచ్చు. కానీ, ఏ పనికైనా అందుకు తగ్గ ప్రతిఫలం ఉండాల్సిందే. కాలాన్ని డబ్బులతో కొలిచే సమాజంలో ఓ నిర్ణీత పనికి అందుకు తగ్గ రిటర్న్స్ కూడా ఉండాలి మరి. లేదంటే ఆ వ్యాపారం ఎక్కువ కాలం నడుస్తుందని చెప్పటం కష్టమే. అది ఆర్థికంగానే కాదు. మానసికంగా కూడా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే మహిళలు బిజినెస్ ప్లాన్ చేసేటపుడు.. ఆ పనికి ఎంత రిస్క్ తీసుకోవాలి.. ఎంత ఆదాయాన్ని ఆశించవచ్చనే అంశంపై స్పష్టత ఉంచుకోవాలి.

నా వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి విస్తరించలేను

చాలా మంది మహిళలు తామొక్కళ్లే వీలైనంత రిస్క్ తీసుకుని వ్యాపారాన్ని నడిపిస్తుంటారు. కానీ, నలుగురు ఉద్యోగుల్ని పెట్టుకుందాం.. ఇంకొంచెం పెట్టుబడి పెట్టి కొంచెం విస్తరిద్దాం అని ఆలోచించరు. అలాంటి ఆలోచన వచ్చినా, చేయగలమో లేదో అనే సందేహంలో ఆగిపోతుంటారు. కానీ ఏ వ్యాపారికైనా ఆకాశమే హద్దుగా ఆలోచించే శక్తి ఉండాలి. అలాంటి కలలను సాధించుకునే ధైర్యం గుండెల్లో నింపుకోవాలి. మహిళ నిజంగా అనుకుంటే సాధించలేనిది లేదు. ఈ ప్రపంచాన్ని కచ్చితంగా ప్రభావితం చేయగలదు. తన వైపు తిప్పుకోగలదు..

నేను బాగా చేయగలను.. కానీ, సేల్స్ పై నాకు పట్టు లేదు.

వ్యాపారం బాగా నడవాలంటే ప్రాడక్ట్ లో క్వాలిటీ ఉండటమే కాదు.. దాన్ని అమ్మే చొరవ కూడా అవసరం. సో, అమ్మకంలో మెళకువలు కచ్చితంగా వంటపట్టించుకోవలసిందే. నిజానికి అమ్మకం అంటే ఎదుటివారిని కన్విన్స్ చేయటమే. చిన్నప్పటినుంచి ఇంట్లో పెద్దవాళ్లని, చుట్టుపక్కల వాళ్లని ఎన్ని విషయాల్లో ఒప్పించి ఉంటారో గుర్తు తెచ్చుకోండి. సింపుల్ అక్కడ మీ ఆలోచనని అమ్మారు. ఇక్కడ ఓ వస్తువుని లేదా సర్వీసుని అమ్ముతారు అంతే. అవతలి వారితో చాకచక్యంగా నెగోషియేట్ చేయటం వ్యాపారంలో చాలా ముఖ్యమైన ఎలిమెంట్.. అని గుర్తించాలి.. 

పబ్లిక్ రిలేషన్స్ మెయింటెయిన్ చేయలేను.

కొన్నిసార్లు మహిళల ఆలోచనలు సినిమాలు, టీవీలు చూసి ఓ పరిధి దగ్గరే ఆగుతూ ఉంటాయి. నెటవర్క్ మెయింటెయిన్ చేయటమంటే లేట్ నైట్ పార్టీలో, మందు కొట్టడమో కానవసరంలేదు. ప్రొఫెషనల్ గా సంబంధాలు మెయింటెయిన్ చేయటానికి చాలామందితో సత్సంబంధాలు నిలబెట్టుకోవటం అన్నమాట. వ్యాపారం పట్టాలెక్కాలన్నా, సజావుగా సాగాలన్నా నెట్ వర్క్ చాలా ఉపయోగపడుతుంది.

కొత్త విషయాలు నేర్చుకోటానికి టైమ్ పెట్టలేను..

ఏ కొత్త పని చేయాలన్ని దానికి తగ్గ శిక్షణ అవసరం. అంతేకాదు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండటం కూడా అవసరమే. దీనికోసం ఏ రకంగా అయినా టైమ్ వీలు చేసుకోవాలి మరి. ఎందుకంటే నిరంతర అభ్యాసమే పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. స్కిల్ సెట్ ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవటం వ్యాపారానికి చాలా ఉపయోగపడుతుంది. అలాంటపుడు నాకు టైమ్ కుదరదు.. వెళ్లలేను లాంటి కారణాలను వదిలేసి నిరంతరం అప్ డేట్ అయ్యేలా ప్రయత్నించటం అవసరం. ఒకవేళ అనుభవ పూర్వకంగా నేర్చుకోవచ్చులే అనుకుంటే తప్పులు జరిగే అవకాశాలూ ఉంటాయి కనుక.. అవి వెనక్కి తీసుకోలేనంత నష్టాన్ని కలిగిస్తే, వ్యాపారంలో మొదటికే మోసం వస్తుంది. కాబట్టి సరైన ట్రైనింగ్ తీసుకోవటం చాలా అవసరం.

నేను అందరికీ నో చెప్పలేను..

చాలా మంది మహిళలు ఇల్లుదాటి బయటకు వచ్చేసరికి ముడుచుకుపోతుంటారు. బయటివాళ్లతో మాట్లాడేపుడు మొహమాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో అవసరం ఉన్నా లేకున్నా కొంతమందికి టైమ్ ఇచ్చే పరిస్థితిలో పడతారు. ఎంత పని ఉన్నా వాళ్లతో బిజీగా ఉన్నామని చెప్పలేకపోతుంటారు. కానీ, టైమ్ చాలా విలువైనదని గుర్తించాలి. ఈ విషయంలో గట్టిగా ఉండటం నేర్చుకోవాలి. అవసరమైనపుడు నో చెప్పటానికి వెనుకాడకూడదు..

ఈ పని నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే చేయలేకపోయేదాన్ని..

మహిళలు చాలా సందర్భాల్లో వాళ్లు సాధించిన వాటిని కూడా వాళ్ల కుటుంబాల ఖాతాలో వేస్తుంటారు. అంటే నాదేం లేదు.. అంతా మా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రమే.. మా ఆయన ప్రోత్సాహం లేకపోతే ఏం చేయలేకపోయేదాన్ని అంటూ ఉంటారు. కానీ ఎవరి సపోర్ట్ ఎంత ఉన్నా, తన కృషి, పట్టుదల మాత్రం నిజం కదా.. అందుకే ఫ్యామిలీ ఎంత తోడ్పాటు ఇచ్చినా, తన పొందాల్సిన గుర్తింపు తనకే దక్కాలని గుర్తించాలి. సింపుల్ గా చెప్పాలంటే తనను తాను ప్రమోట్ చేసుకోవాలి..

ఈ పని ఎప్పుడంటే అప్పుడు ఆపేసి మళ్లీ హౌస్ వైఫ్ గా ఉండిపోతా...

నాకు ఈ పని టెంపరరీనే. సరిగ్గా నడవకపోతే మళ్లీ ఇల్లు చూసుకుంటూ ఉండిపోతా.. ఈ ఒక్క ఆలోచన వచ్చిందంటే, అన్నాళ్ల శ్రమ, పట్టుదల, పరిశ్రమ అన్నీ వృధా అయినట్టే. కానీ ఏ వ్యాపారానికైనా వెనుతిరిగే చూసే ఆలోచన మైండ్ లో అసలు ఉండకూడదు. ఎలాగైనా చేస్తున్న వ్యాపారాన్ని సక్సెస్ ఫుల్ గా నిలబెట్టాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటాలనే తపన ఉండాలి. అప్పుడే గెలుపు గుమ్మం ముందు నిలబడుతుంది. మన ప్రయత్నం ఆపేంత వరకు ఓడినట్టు కాదని ఐన్ స్టీన్ అన్నమాటను గుర్తు చేసుకోవటం సముచితం కూడా.. 

ఇలా రాసుకుంటూ పోతే ఈ చిట్టా అంతు లేకుండా సాగుతూనే ఉంటుంది. కానీ, సాధారణంగా మహిళలను ముందంజ వేయకుండా, మొదటి అడుగులోనే కాళ్లకు బంధాలు వేసే కొన్ని అంశాల్లో ఇవి ముఖ్యమైనవి. వీటిని వీలైనంత తేలిగ్గా వదిలించుకుంటే వ్యాపార రంగంలో ఆకాశమే హద్దు అనడానికి సందేహమెందుకు.. !!

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags