ఆరు గ్రామాల్లో హరితకాంతి ఇతని పుణ్యమే!!
అడవుల పరిరక్షణకు నడుం బిగించిన సిమోన్ ఉరావ్-6 ఆనకట్టలు, 4 చెరువులు, పదులకొద్దీ కాలువల నిర్మాణం-
వృక్షో రక్షితి రక్షితః చెట్లను కాపాడండి.. అవి మనల్ని కాపాడుతాయి. అందరూ చెప్పే మాటే ఇది. కానీ నిజ జీవితంలో ఆచరించే వారు మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే ఉంచారు. మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనూ చూపే వ్యక్తుల కోవలోకి వస్తారు 81 ఏళ్ల సిమోన్ ఉరావ్. ధృడ సంకల్పం, పట్టుదల ఉండాలే గానీ అడవుల్ని రక్షించడమే కాదు బంజరు భూమిని సైతం బంగారు పంటలు పండించేలా మార్చొచ్చని నిరూపించారు.
జార్ఖండ్ రాజధాని రాంచీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది బేరో గ్రామం. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ఆ ప్రాంతం కొందరు స్వార్థపరుల కారణంగా కళ తప్పింది. కరువు కోరల్లో చిక్కుకుంది. విచక్షణారహితంగా సాగిన చెట్ల నరికివేతతో వర్షాల్లేక పచ్చని పొలాలన్నీ బంజరు భూములయ్యాయి. తినేందుకు తిండి లేక, తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరకక జనం అల్లాడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న బేరోను తిరిగి సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించాడు సిమోన్ ఉరావ్. అడవులపాలిట ఆపద్భాందవుడయ్యాడు.
సిమోన్ లక్ష్యం ఒక్కటే అడవుల్ని కాపాడటం. అప్పటికే చాలా చెట్లు నరికేశారు. ఉన్నవాటినైనా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. కొట్టేసిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటారు. అంతటితో తన పనైపోయిందనుకోకుండా వాటిని కన్నబిడ్డల్లా పెంచారు. కాలం గిర్రున తిరిగింది. సిమోన్ శ్రమకు ఫలితం దక్కింది. బేరో మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది. వర్షాలు సమృద్ధిగా పడటంతో బీడువారిన పొలాల్లో పచ్చదనం పరుచుకుంది. స్థానికుల ఆర్థిక ఇబ్బందులు తీరాయి. తమ పాలిట దైవంగా మారిన సిమోన్ ను స్థానికులు ప్రేమగా రాజాసాహెబ్ అని పిలుచుకుంటారు.
సిమోన్ కృషి తన సొంత ఊరి వరకే పరిమితం కాలేదు. 8 పదుల వయసులోనూ చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని జాగృతం చేసి అడవుల్ని సంరక్షించే పనిలో నిమగ్నమయ్యాడు. విల్లు, బాణం చేతబట్టి చెట్లు నరికేవారిపై విరుచుకుపడే సిమోన్ ఆ కారణంగా జైలుకు కూడా వెళ్లాడు.
“ఎట్టి పరిస్థితుల్లోనూ అడవుల్ని కాపాడాలని, ఎన్ని కష్టాలు ఎదురైనా ఒక్క చెట్టును నరకనివ్వకూడదని నిర్ణయించుకున్నాం. చెట్లను కాపాడే ప్రయత్నంలో నాపై కేసులు పెట్టి జైలుకు పంపారు. అయినా అవేవీ నాపై ప్రభావం చూపలేదు. గ్రామస్థుల సాయంతో ఇంకా కఠిన నియమాలు రూపొందించాం. ఎవరైనా ఒక్క చెట్టు నరికితే బదులుగా 5 నుంచి 10 చెట్లు నాటాలని నిర్ణయించాం”-సిమోన్ ఉరావ్
సిమోన్ కు అక్షరం ముక్క రాదు. అయినా ఆయన సంకల్ప బలం ముందు సవాళ్లు తలవొంచాయి. దాదాపు 50 ఏళ్లుగా అడవుల సంరక్షణతో పాటు తమ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సిమోన్ ఖ్యాతి విదేశాలకు పాకింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పీహెచ్ డీ స్కాలర్ సారా జ్వైట్ తన థీసిస్ లో సైమన్ గురించి ప్రస్తావించారు. ఆయనకున్న పర్యావరణ స్పృహ, అడవుల పరిరక్షణ కోసం పడుతున్న శ్రమ గురించి గొప్పగా రాశారు.
సిమోన్, బేరో చుట్టుపక్కలున్న మరో 6 గ్రామాల్లో కూడా హరిత క్రాంతి తెచ్చారు. 15 ఏళ్ల క్రితం బీడుగా మారిన భూముల్లో ప్రస్తుతం రైతులు రెండు పంటలు పండిస్తున్నారంటే అదంతా ఆయన చలువే అన్నది స్థానికుల మాట.
“ఈ ప్రాంతంలో ఆనకట్టలు, కాల్వలు నిర్మించాలని ప్రభుత్వ అధికారులను ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. సిమోన్ మాత్రం ఓటమి అంగీకరించకుండా గ్రామస్థుల సాయంతో కాలువలు తవ్వారు. ఇప్పటి వరకు 6 ఆనకట్టలు, 5 చెరువులు పదుల సంఖ్యలో కాల్వలు నిర్మించారు” -బంధు భగత్, స్థానికుడు
సిమోన్ ఉరావ్ టార్గెట్ అనుకున్నంత ఈజీగా పూర్తి కాలేదు. లక్ష్యసాధనలో ఆయన ఎన్నో ఇబ్బందులు మరెన్నో కష్టాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకుసాగారు.
“ఆనకట్టలు, కాల్వలు నిర్మించే పని మొదలుపెట్టాక చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత ఎక్కువ నీటిని ఒడిసిపట్టేలా ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించాం. భారీ వర్షాలను సైతం తట్టుకునేలా 45ఫీట్ల ఎత్తులో ఆనకట్ట, కాల్వల లోతు 10 ఫీట్లు ఉండేలా ప్లాన్ రూపొందించా.”- సిమోన్ ఉరావ్
సిమోన్ రూపొందించిన మోడల్ సత్ఫలితాలిచ్చింది. ఆయన పుణ్యమాని ఇప్పుడు బేరో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల వారి కష్టాలు తీరాయి. అడువుల పరిరక్షణ కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న సిమోన్ కృషికి ఎన్నో ప్రశంసలు, మరెన్నో అవార్డులు లభించాయి. అమెరికన్ మెడల్ ఆఫ్ ఆనర్ లిమిటెడ్ స్ట్రయికింగ్ 2002 అవార్డుతో సత్కరించింది. అమెరికాకు చెందిన బయోగ్రాఫిక్ ఇన్ స్టిట్యూట్ ఆయన సేవల్ని ప్రశంసించింది. జార్ఖండ్ ప్రభుత్వం 2008లో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సిమోన్ ను ఘనంగా సన్మానించింది.
అడవులు అంతరిస్తుండటంతో మనిషి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. భూతాపం పెరిగి ప్రకృతి ప్రకోపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే సిమోన్ లాంటి వ్యక్తులు ఊరికి ఒక్కరుంటే చాలు.