సంకలనాలు
Telugu

నలుగురినీ నవ్విస్తూ... మహిళా కమెడియన్‌గా చరిత్ర సృష్టిస్తున్న‌ నీతి పల్టా

GOPAL
9th Jul 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

స్టాండప్ కామెడీ గురించి ఆలోచిస్తే, మన మెదడులో మెదిలేవారు కేవలం మేల్ కమేడియన్లే. ఆలిండియా బాక్చోద్, ఫన్నీ లియోన్.. ఇలాంటి కమెడియన్లే కనిపిస్తారు. స్టాండప్ కామెడీలో మహిళల కంటే పురుషుల ఏమాత్రం గొప్పగా చేయలేరని కొందరి విశ్వాసం. దేశంలో అతి కొద్ది మహిళా స్టాండప్ కమెడియన్లలో నీతి కూడా ఒకరు. నీతి జేడబ్ల్యూటీ అడ్వర్టయిజింగ్ కంపెనీలో అత్యున్నత పొజిషన్‌లో పనిచేశారు. ‘‘యువతకు కోలా అమ్మి అలిసిపోయాను’ అని నీతి అంటారు. దీంతో అడ్వర్టయిజింగ్ రంగం నుంచి ఆమె బయటకు వచ్చారు. ఏదీ ముందే నిర్ణయించుకుని, ప్రణాళిక ప్రకారం చేసే అలవాటు నీతికి లేదు. అందుకే ఉద్యోగాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదంటారామె.

అడ్వర్టయిజింగ్ నుంచి ‘గల్లి గల్లి సిమ్ సిమ్’కు స్క్రిప్ట్ రాయడం ప్రారంభించారు. ఎప్పుడైతే సెస్మే స్ట్రీట్ సిరీస్ భారత్‌లో ప్రసారమైందో, అప్పటి నుంచి నాలుగేళ్లపాటు నీతి ఆ షో చేశారు. ‘ఆ షోలో నేను చేసిందేమిటంటే కాస్త ఫన్నీ చేయడమే. ఇలాంటి షోలకు సాధారణంగా మహిళలను తీసుకునేవారం కాదని నిర్వాహకులు ఒప్పుకున్నారు. కానీ నాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇదంతా నాలుగేళ్ల కిందటి మాట. అప్పటినుంచి నీతి దేశవ్యాప్తంగా, విదేశాల్లో చాలా ఫన్నీ కార్యక్రమాలను నిర్వహించారు.

నవ్వించడం ఎలా ?

అన్ని వృత్తుల‌కంటే కమెడియన్‌గా ఉండటమే చాలా కష్టం. జీవితంలో ఎప్పుడూ ఫన్నీగా ఉండేందుకే తాను ప్రయత్నిస్తుంటానని నీతి చెప్తున్నారు. పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా, ఆ పరిస్థితులనే కామెడీకి వస్తువుగా చేసుకునేవారు నీతి. ‘‘గ్రూప్‌లో కానీ, కుటుంబంలో కానీ ప్రతి ఒక్కరూ ఫన్నీగానే ఉంటారు. వేదికపై ఫన్నీగా ఉండటం మాత్రం కష్టం. పబ్‌లలాంటి ప్రదేశాల్లో తాగి గంతులేస్తున్న వ్యక్తులను ఎంటర్‌టైన్ చేయడం, వారిని నవ్వించడం అంత సులభం కాదు. కమెడియన్లకు థిక్ స్కిన్ ఉండటం అత్యంత అవశ్యకం. అందుకే నన్ను చాలాసార్లు తిరస్కరించారు’’ అని నీతి వివరించారు. చాలాసార్లు ఆమె కోపం, నిరాశల నుంచే కామెడీకి వస్తువులు పుట్టుకొచ్చాయి.

విమెన్ కమెడియన్ నీతీ పల్టా

విమెన్ కమెడియన్ నీతీ పల్టా


కామెడీ షోలకు వచ్చేవారి యాటిట్యూడ్‌ను మరో పెద్ద సమస్య అంటారు నీతి. తినుకుంటూ, గట్టిగా అరుస్తూ, పక్కవారితో మాట్లాడుతూ కామెడీ షోలను చూస్తారు ప్రేక్షకులు. సగం మాట్లాడుతూ, సగం కామెడీని వింటుంటారు. ఆ ప్రవర్తన ఎంతో అమర్యాదకరంగా ఉంటుంది. కానీ ఎవరూ కూడా దాన్ని గుర్తించేందుకు ఇష్టపడరు. కామెడీలో పంచ్‌లైన్ మిస్ అయినా,జోక్ మిస్ అయినా అందరూ నిందలు వేస్తారు. ‘కమెడియన్ వేస్ట్ క్యాండిడేట్. ఒక్కసారి కూడా నవ్వించలేకపోయారు’ అంటూ ఆరోపిస్తారని నీతి చెప్తారు. తరచుగా ప్రాక్టీస్ చేయడం కూడా విజయవంతమైన కమెడియన్ల అలవాట్లలో ఒకటి. టాపిక్‌ను గుర్తించి, ఆ లైన్లను రాసుకున్న తర్వాత ఎలా వ్యక్తీకరించాలన్న అంశంపై ప్రాక్టీస్ తప్పనిసరి. ప్రతిసారీ కొత్త విషయంతో రావడం చాలా కష్టమని నీతి అంగీకరిస్తారు. ఒకేపాటను ఎన్ని సార్లయినా వినేందుకు ఇష్టపడతారు. అదే జోక్ చెప్పిందే చెబితే అసహనం ప్రదర్శిస్తారు’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

తాను వేసిన జోక్‌లను ఆడియన్స్ అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురయ్యాయంటారామె. ఇలాంటి సమస్యలకు నవ్వొక్కటే పరిష్కారమంటారు. ప్రేక్షకులు ఆగ్రహంతో ఉన్నా, నవ్వుతూ ఉంటే పరిస్థితి అదే చక్కబడుతుందని చెప్తారు. విమెన్ కమెడియన్ కావడం వల్ల చాలా సార్లు పరీక్షలను ఎదుర్కొవాల్సి వచ్చిందామె. ‘‘కొందరు షో ను చూస్తున్నప్పుడు వల్గర్ కామెంట్స్ చేస్తుంటారు. మరికొందరు, నా దగ్గరకు వచ్చి మీ వాయిస్ చాలా బాగుంటుందని, మాకు ఎంతో నచ్చుతుందని చెప్తుంటారు’ అని తనకు ఎదురైన సంఘటనలను నీతి వివరించారు.

ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రశంసలే తనపడ్డ కష్టానికి ప్రతిఫలమని ఆమె అంటారు. తాను వేసే జోక్స్‌కు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుతుంటే తనకు ఎంతో సంతప్తిగా ఉంటుందంటారు. కొన్నిసార్లు పూర్తిగా ఆరోగ్యంగా లేక, వందశాతం ప్రదర్శన ఇవ్వలేనప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారామె. అయితే షోకు ముందు ప్రాక్టీస్ కారణంగా, ప్రేక్షకుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు.

కమెడియన్‌గా ఏడాది పూర్తయిన తర్వాత, ఓ షోకు తన తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లడం తన కెరీర్‌లోనే గర్వించదగ్గ సంఘటనగా ఆమె చెప్పుకొస్తారు. తాను కమెడియన్ కావడాన్ని, వేదికపై నలుగురిని నవ్వించాలనుకున్న తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులను సంతోషపర్చలేకపోయిందట. ‘మా నాన్న ఆర్మీలో పనిచేస్తుంటారు. ఇవన్నీ ఎందుకంటూ మా నాన్న అసంతప్తి వ్యక్తం చేశారు. నువ్వు మంచి రచయితవు.. దాన్నేకొనసాగించాల్సింది అంటూ బాధపడ్డారు. మా అమ్మ భద్రత విషయంలో ఆందోళన చెందారు. అర్ధరాత్రి వరకు ఒంటరిగా తిరగడం అంత మంచిది కాదని భయపడింది. ఢిల్లీలాంటి నగరాల్లో కొన్నిసార్లు ప్రజలకు డబ్బు అంటే లెక్కే ఉండదు‘ అని నీతి అంటారు. ఓ కామెడీ షోకు తన తల్లిదండ్రులను తీసుకుపోయిన సమయంలో ఓ సర్దార్‌జీ నీతిపై ప్రశంసల వర్షం కురిపించారు. జోక్స్‌ను మళ్లీ చెప్పాలంటూ కోరడం ఆమెను అమితంగా సంతోషపర్చింది. ‘కొందరు కమెడియన్ల షోలకు పిల్లలతో కలిసి సర్దార్ జీ వెళ్లినప్పుడు కాస్త, ఇతర కమెడియన్లు వాడిన భాషతో అసౌకర్యానికి గురయ్యారట ఆయన. నా షో ఎంతగానో నచ్చిందని చెప్పారు. దీంతో మా అమ్మా నాన్న కూడా ఎంతో సంతోషపడ్డారు. మా తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని, ఆ సర్దార్‌జీకి తెలియదు’ అని నీతి తెలిపారు.

భవిష్యత్ ప్రణాళికలు

భవిష్యత్‌లో తాను ఎంతో సాధించాల్సి ఉందంటున్నారామె. కొందరు స్టార్లు తన షోలపై ఎప్పుడూ కన్నేసి ఉంచుతారని గర్వంగా చెప్తున్నారు నీతి. కామెడీ షోలకే కాదు.. మూవీలకు స్క్రిప్ట్‌లు రాస్తున్నారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘ఓ తేరీ’ సినిమాకు రచయితగా పనిచేశారామె. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగులు రాసింది నీతినే. ‘సల్మాన్‌ను చూసేందుకు ప్రజలు రెండుమూడేళ్లు వేచి చూస్తారు. కానీ నేను నా తొలి సినిమాకే సల్మాన్‌తో పనిచేశాను. సినిమా కథ గురించి ఆయనకు వివరించాను. నేను చెప్పిన కథ నచ్చడంతో, ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయాల్సిందిగా, తన చెల్లెలి భర్త, బావ అతుల్ అగ్నిహోత్రికి సూచించారు’ అని నీతి వివరించారు.

కామెడీ గ్రూప్‌ లూనీ గూన్స్..

ఓ వైపు తన కామెడీ షోలకు పనిచేస్తూనే, మరోవైపు ‘లూనీ గూన్స్’ అనే కాన్సెప్ట్‌ను కూడా తయారు చేశారు. దేశ వ్యాప్త కమెడియన్లందరినీ ఒక్కచోటికి చేర్చి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలకు ప్లాన్ చేస్తున్నారు నీతి. ‘ఢిల్లీలో జరిగిన ఓ షో ఓ కుర్రాడు చూశారు. అందులో నా ప్రదర్శన అతనికి బాగా నచ్చింది. కామెడీ షోల విషయానికొస్తే ముంబైలో చాలా ప్రదర్శనలు జరుగుతాయి. చాలామంది ప్రజలు కామెడీ షోలకు వెళ్తారు. దీంతో ఇతర నగరాల నుంచి కమెడియన్లను ముంబైకి పిలిపిస్తారు. అదే ఢిల్లీ విషయానికొస్తే పెద్దగా కామెడీ సర్క్యూట్ లేదు. దీంతో ఆ కుర్రాడు ఢిల్లీలో కూడా ఇలాంటి కామెడీ షోలను తరచుగా నిర్వహించాలని భావించారు. అలా పుట్టిందే లూనీ గూన్స్. దీంతో దేశవ్యాప్తంగా కమెడియన్లతో నేను చర్చలు జరిపాను. ఇప్పుడు వారితో కలిసి ప్రదర్శనలిస్తున్నాను. ఢిల్లీ మార్కెట్ కొత్తది కావడంతో వారు కూడా దేశరాజధానిలో ప్రదర్శనలు ఇచ్చేందకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు’ అని నీతి వివరించారు.

కామెడీ రంగంలో అవకాశాలు పుష్కలం..

భారత్‌లో కామెడీ మార్కెట్ చాలా కొత్తది. ఈ రంగంలో సాధించేందుకు ఎంతో ఉందని నీతి అనుకుంటున్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, కామెడీ షోల కోసం ఎదురుచూసే ప్రేక్షకులతో టై అప్ కావడం చేస్తున్నారామె. లూనీ గూన్స్‌ను ముందుకు తీసుకెళ్లాలా, కామెడీ వ్యాపారాన్ని విస్తరించాలా అన్నదానిపై ఆమె ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే కామెడీ షోలను నిర్వహించడం కంటే ప్రదర్శించడంపైనే ఆమెకు ఆసక్తి.

కామెడీని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే మహిళలను ఎంతో ప్రోత్సహిస్తున్నారు నీతి. ‘ధైర్యంగా అడుగులేయండి. మీరు సంతోషంగా ఉండే వ్యక్తయితే.. ఇతరులను సులభంగా సంతోషపెట్టగలరు. చాలామంది కమెడియన్లు భయపడుతూనే ప్రదర్శనలిస్తుంటారు. ఒత్తిడితో, విచారంతో ఉన్న కమెడియన్లను నేను ఎంతో మందిని చూశాను. మీకు జోక్‌ను సిద్ధం చేసే టాలెంట్ ఉంటే, ఇతరులను నవ్వించగలరు. అప్పుడే కామెడీ మంచి ఎంపిక అవుతుంది’ అని వివరించారు నీతి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags