సంకలనాలు
Telugu

చితికిపోయిన కళాకారులను బతికిస్తున్న ఇద్దరమ్మాయిలు..!

ప్రాచీన హస్తకళాకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇష్మ

team ys telugu
26th Oct 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఆరంకెల జీతాలు.. వారాంతపు వినోదాలు.. ఈ మోజులో పడి యువత సమాజాన్నీ, సామాజిక స్పృహనీ బొత్తిగా మరిచిపోయింది. ఎంతసేపూ నేనూ, నా జీవితం అనుకునే రోజులు. అలాంటి జమనాలో.. ఫ్యాషన్ టెక్నాలజీ చదివిన ఒక ఇద్దరమ్మాయిలు అంతరించిపోతున్న కళకు పూర్వవైభవం తెచ్చే యజ్ఞంలో కూర్చున్నారు. సోషల్ ఆంట్రప్రెన్యూర్లుగా మారి.. చితికిపోతున్న కళాకారులకు జీవనోపాధి కల్పిస్తున్నారు.

వంద్యా, రేఖ. ఇద్దరూ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) స్టూడెంట్సే. కాలేజీ రోజుల్లో ప్రాడక్ట్ డిజైనింగ్ లో భాగంగా ఒకసారి క్రాఫ్ట్ విజిటింగ్ చేశారు. ఆ వారం రోజులు వాళ్ల గమనాన్నే మార్చేశాయి. అంతరించిపోతున్న ప్రాచీన కళకు జీవం పోయాలని ఆ రోజే మనసులో బలంగా నాటుకుంది. మరుగున పడిపోతున్న సృజనకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో అడుగు ముందుకు వేశారు. ప్రాచీన సంప్రదాయానికి ఆధునికత మేళవించి మసకబారిన కళాకారుల జీవితాల్లో కొత్తవెలుగులు తేవాలనే మహత్కార్యాన్ని భుజాన వేసుకున్నారు. ఇష్మ పేరుతో ఒక స్టార్టప్ మొదలుపెట్టారు.

ఆలోచన బాగుంది! ఆశయం ఇంకా బాగుంది! కానీ ఎలా? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? దిశానిర్దేశం ఎవరు చేయాలి? సరిగ్గా ఇలాంటి వారికోసమే బాలవికాస ఇంటర్నేషనల్ పనిచేస్తోంది. సమాజిక స్పృహ కలిగిన సోషల్ ఆంట్రప్రెన్యూర్లకు బాలవికాస కావల్సినంత చేయూతనిస్తుంది. అన్ లిమిటెడ్ హైదరాబాద్ కూడా ఆ కోవలోకి చెందిందే. ఈ రెండింటి సహకారంతో వంద్యా, రేఖ కలిసి ఇష్మ అనే స్టార్టప్ మొదలుపెట్టారు.

జివెల్రీ యాక్సెసిరీస్ అంటే అందరూ ఇష్టపడతారు. అందుకే ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టాం. డిజైనింగ్ కాకుండా బిజినెస్ కోసం ఏమేం అవసరముంటాయి.. ఫైనాన్షియల్, మార్కెటింగ్ ఎలా చేయాలి..? బిజినెస్ ప్లాన్ ఎలా చేసుకోవాలి..? వీటన్నిటిపై బాలవికాస, అన్ లిమిటెడ్ హైదరాబాద్ శిక్షణనిస్తాయి- వంద్యా, రేఖ
వంద్యా, రేఖ

వంద్యా, రేఖ


ఇష్మ కాన్సెప్ట్ ఏంటి?

తోలుబొమ్మలు. ఇది అతి ప్రాచీనమైన జానపద కళారూపం. మొట్టమొదటి రంగస్థల ప్రదర్శన అని కూడా చెప్తారు. ఒకప్పుడు అది భారతదేశంలోనే ఒక విలక్షణమైన ఆర్ట్. సంగీతం, నాట్యం కలగలిసిన ఈ కళ నుంచే 2డీ యానిమేషన్, షాడో ఆర్ట్ పుట్టుకొచ్చాయి. అయితే కాలక్రమేనా ఆ కళ మసకబారింది. ఇప్పుడు తోలుబొమ్మలు చూద్దామన్నా కనిపించట్లేవు.

ఇష్మ వేసిన మొదటిఅడుగు తోలుబొమ్మల నుంచే మొదలైంది. కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన లెదర్ ఇయర్ హ్యాంగింగ్స్, యునిక్ పెండెంట్స్, టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్, ఫ్లోరల్ స్టేట్‌మెంట్, గోల్డ్ టోన్ హాంగింగ్స్, గార్డెన్ థీమ్ ఇంకా అనేక రకాల యాక్సెసిరీస్ తయారు చేయిస్తున్నారు.

ఆ తర్వాత పెంబర్తి క్రాఫ్ట్స్ మీద ఫోకస్ చేశారు. జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో ఈ లోహ కళాకారులున్నారు. కాకతీయుల శైలిని అనుకరించడం వీరి ప్రత్యేకత. ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు కలగలిసిన నైపుణ్యం వీరిది.

ప్రస్తుతానికి తోలుబొమ్మలు, పెంబర్తి కళాకారుల నుంచి జివెల్రీ, డెకొరేషన్ ఐటెమ్స్ లాంటివి తయారుచేయించి వాటికి మార్కెటింగ్ కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు డైనమిక్ ట్రెండ్ ఫాలో అవుతూ లెదర్ జివెల్రీని, మెటల్ ఆర్నమెంట్స్ ను మార్కెట్లోకి తీసుకు వస్తున్నారు.

కొన్ని డిజైన్లను క్లిప్ ఆర్ట్ రూపంలో పేపర్ మీద ప్రింట్ చేసి, కళాకారులకు ఆ డిజైన్ల గురించి విడమరిచి చెప్తారు. వీళ్లిచ్చిన ఇన్ పుట్ ఆధారంగా వాళ్లు ఆర్నమెంట్స్ అవుట్ పుట్ చేసిస్తారు. వాటిని ఎగ్జిబిషన్ల ద్వారా కస్టమర్ టు కస్టమర్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఐదుగురు కళాకారులు ఇష్మ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. బంజారా కుట్లు అల్లికలను ఇప్పుడిప్పుడే ప్రోత్సహిస్తున్నారు.

image


అనేక సవాళ్లతో కూడుకున్న ప్రయాణం

మొదలుపెట్టిన ప్రయాణం అనుకున్నంత ఈజీ కాదు. ఎన్నో ఆవాంతరాలు. మరెన్నో ప్రతికూల అంశాలు. అయినా వంద్యా, రేఖ భయపడలేదు. సామాజిక స్పృహతో ముందుకు వేసిన అడుగును.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు. ముఖ్యంగా పెంబర్తి కళాకారులను ఒప్పించడం అతిపెద్ద సమస్యగా మారిందంటారు వంద్యా. వీళ్లకు కావల్సిన ఔట్ పుట్ రాబట్టుకోవడం కష్టతరమైన పనే అంటారామె. అయినా ఓపికగా వివరించి ఐటెమ్స్ తయారు చేయించుకుంటారు. తోలుబొమ్మల విషయంలోనూ అంతే. వీళ్లిచ్చిన డిజైన్‌ అనుగుణంగా ఒక ప్రాడక్ట్ రాబట్టుకోడానికి చాలా శ్రమించాల్సి వస్తోందని రేఖ అంటోంది. ఇదంతా ఒకెత్తయితే జివెల్రీ చేసే కళాకారులను వెతికి పట్టుకోవడం మరోఎత్తని వంద్యా చెప్తోంది.

ప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోదు. ప్రస్తుతానికైతే వీరికి బాలవికాస ఇంటర్నేషనల్, అన్ లిమిటెడ్ హైదరాబాద్ చేయూతనందిస్తోంది. తమలాంటి సోషల్ ఆంట్రప్రెన్యూర్లను టీ హబ్ కూడా ప్రోత్సహించాలని వంద్యా కోరుతోంది. టెక్ స్టార్టప్స్ మాత్రమే కాదు.. కళాకారులనూ బతికించాలని తపనపడే ఇష్మ లాంటి స్టార్టప్స్ ను కూడా ఇంక్యుబేట్ చేయాలని రేఖ అభిప్రాయ పడుతోంది.

image


నిజమే.. వీళ్లిద్దరు కోరుతున్నదాంట్లో తప్పేంలేదు. టీ హబ్ ఏర్పాటు చేసిందే ఇలాంటి యంగ్ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి. యువత ఆలోచనలకు ఆవిష్కరణలు జతచేసే సదుద్దేశంతో స్థాపించిన టీ హబ్.. సోషల్ ఆంట్రప్రెన్యూర్లను కూడా అక్కున చేర్చుకోవాలి. నిర్మల్ కొయ్యబొమ్మల విషయంలో ఎలాగైతే చొరవ తీసుకుని.. వాటికి ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఎలాగైతే క్రియేట్ చేశారో.. ఇష్మ, అల్లిక, ఇంకా ఇతర సోషల్ స్టార్టప్‌లను కూడా వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

image


ప్రస్తుతానికి తెలంగాణ, ఏపీ మీద ఇష్మ ఫోకస్ చేసింది. దేశంలోని అన్ని హస్తకళలను మేళవించి జివెల్రీకి సరికొత్త రూపం తీసుకురావాలన్నది వీరి ముందున్న భారీ టార్గెట్. ఈ యంగ్ అండ్ డైనమిక్ ఆంట్రప్రెన్యూర్ల లక్ష్యం నెరవేరాలని యువర్ స్టోరీ మనసారా కోరుకుంటోంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags