రైతుల పాలిట కల్పవృక్షం... లారెన్స్‌డేల్‌ ఆగ్రో

రైతుల కష్టాలు తీరుస్తున్న లారెన్స్ డేల్ అగ్రో..విత్తనం దశ నుంచి వినియోగదారులు కొనేదాకా..కమ్యూనిటీ వ్యవసాయంతో విస్తరణ..

రైతుల పాలిట కల్పవృక్షం... లారెన్స్‌డేల్‌ ఆగ్రో

Thursday September 03, 2015,

5 min Read

మన దేశంలో రైతు పడుతున్న కష్టాలను చూసి ఎందరికో మనసు చివుక్కుమంటుంది. బలవన్మరణాల వార్తలు చదివి ఎందరి కళ్లో వర్షిస్తాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కానీ అందరిలా అలా బాధతో సరిపెట్టుకుని చూస్తూ ఊరుకోలేకపోయారు పాలట్ విజయరాఘవన్. ఆయనది ఊటీ. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి రమణీయత, పచ్చదనం పరుచుకున్న కొండలు వంటి ఎన్నో ప్రత్యేకతలతో ఉండే ఊటీ అందాలు ఆయన్ను ఆకట్టుకోలేదు. పచ్చని పొలాల్లో పనిచేసే రైతులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఆయన మనసును తట్టాయి. రైతుల బాధలను అనునిత్యం ప్రత్యక్షంగా గమనించటం ఆయన హృదయాన్ని కలిచివేసింది. అందుకే రైతులకు ఏదన్నా చేయాలని బలంగా కోరుకున్నారు. ఆ ఆలోచనలోనుంచి పుట్టుకొచ్చిందే లారెన్స్ డేల్ అగ్రో. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్నింటినైనా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే పాలట్ విజయరాఘవన్ లారెన్స్ డేల్ అగ్రో స్థాపించారు. అనేక దశల్లో వ్యవసాయం ద్వారా చిన్న, సన్నకారు రైతులు సాధికారత పొందేలా చేయాలన్నది ఆయన కోరిక. ఇది మరో సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తుంది. వ్యవసాయరంగంలో ఉపాధి దొరక్క నగరాలకు వలస బాట పడుతున్న పల్లె జీవుల కష్టానికి అడ్డుకట్ట వేస్తుంది.

లారెన్స్ డేల్ అగ్రో ఆధ్వ‌ర్యంలో వ్య‌వ‌సాయం

లారెన్స్ డేల్ అగ్రో ఆధ్వ‌ర్యంలో వ్య‌వ‌సాయం


లారెన్స్ డేల్ అగ్రో సేవలు

వ్యవసాయంలో తాజా దిగుబడులకు లారెన్స్ డేల్ అగ్రో కొత్త నిర్వచనం ఇస్తోంది. ఆ సంస్థ అనుసరిస్తున్న విధానానికి సర్వత్రా ఆమోదం లభిస్తోంది. కొత్త రకాల వ్యవసాయ పద్ధతులు కూడా ఈ విధానంలో ఇమిడి ఉంటాయి. జన్యుపరంగా అధిక దిగుబడులనిచ్చే మొక్కలు నాటటం, పంట పండిన తరువాత జరిగే నష్టాన్ని తగ్గించటానికి సాంకేతికంగా సాయమందించటం, శీతల గిడ్డంగుల్లో పంట నిల్వ, పండిన పంటను కోయటం దగ్గర నుంచి....ఉత్పత్తిని ప్యాకింగ్ చేసి వినియోగదారుడి చెంతకు చేర్చేదాకా అన్ని వ్యవహారాలను కంపెనీ దగ్గరుండి నిర్వహిస్తోంది.

లారెన్స్ డేల్ అగ్రో చేపట్టిన కార్యక్రమానికి ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అస్పాడా ఇన్వెస్ట్‌మెంట్ సహకారమందిస్తోంది. ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఫండ్ జార్జి సోరో, అస్పాడా ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి మద్దతు లభిస్తోంది.

పొలంలో రైతుల‌తో లీఫ్ బృందం

పొలంలో రైతుల‌తో లీఫ్ బృందం


భారతదేశంలో రీటైల్ రంగంలో వేగంగా మార్పులొస్తున్నాయి. బ్రాండెడ్ ఉత్పత్తులను కొనటానికే వినియోగదారులు మొగ్గుచూపిస్తున్నారు. అందుకే బ్రాండ్‌తో రంగంలోకి దిగాలని లారెన్స్ డేల్ నిర్ణయించింది. శుభ్రపరిచి, వర్గీకరించి, ప్యాక్ చేసిన కూరగాయలను లీఫ్ బ్రాండ్ పేరుతో లారెన్స్ డేల్ 2012 మధ్యలో మార్కెట్లో ప్రవేశపెట్టింది. పంట ప్రారంభం నుంచి ప్రతి దశనూ ఆ సంస్థ పర్యవేక్షిస్తోంది. కూరగాయల్లో పోషకాలు దెబ్బతినకుండా ఉండటంతో పాటు, అవి ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు, పంట చేతికందిన వెంటనే శీతల గిడ్డంగులకు తరలిస్తారు. అనంతరం లేజర్ కోటింగ్ ఉన్న ప్యాకేజింగ్ మెటీరియల్‌తో కూరగాయలను ప్యాక్ చేస్తారు. దీనివల్ల కూరగాయల తాజాదనం దెబ్బతినకుండా ఉంటుంది. ప్యాకెట్లపై లీఫ్ బ్రాండ్ పేరును ముద్రించి అనంతరం వాటిని శీతల వ్యానుల్లో అమ్మకం దార్ల వద్దకు చేరుస్తారు. 

ఉద్గారాలను తొలగించటానికి కొత్తగా వచ్చిన విధానాలను తాము ఉపయోగిస్తున్నామని, దీనివల్ల కూరగాయల్లో ఉద్గారాల అవశేషాలు పూర్తిస్థాయిలో నశిస్తాయని లారెన్స్ డేల్ అగ్రో సీఎఫ్ వో , సంస్థ సహ వ్యవస్థాపకులు అయిన ఆర్ బాలకృష్ణన్ చెప్పారు. తాజా ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని, ఇందుకోసం తాము అనుసరిస్తున్న పద్ధతి సరైనదని ఆయన తెలిపారు. పోషకాలు దెబ్బతినకుండా చేసిన ప్యాకేజీల్లో తమ ఉత్పత్తులు మార్కెట్ లో ఉండడంతో వినియోగదారులు మరో ఆలోచన లేకుండా వాటిని ఎంచుకుంటున్నారని, తమ కూరగాయల వాడకం అంతకంతకూ పెరుగుతోందని ఆయన వివరించారు.

లారెన్స్ డేల్ ప్రభావం

దక్షిణ భారతదేశంలో కమ్యూనిటీ వ్యవసాయం కోసం చొరవ చూపిన కంపెనీ ఆ దిశగా ఎంతో ప్రభావం చూపింది. కంపెనీ పరిధిలో ఇప్పుడు మూడువేల ఎకరాల్లో సాగు జరగుతోంది. పంట చేతికందిన తరువాత వాటిని జాగ్రత్త పరచి దగ్గరలోని రీటైలింగ్ స్టోర్లకు తరలించటానికి తాము అనుసరించిన వ్యూహం సత్ఫలితాన్నిచ్చిందని పాలట్ విజయరాఘవన్ తెలిపారు. రైతుల నమ్మకాన్ని చూరగొనటమే తమ విజయసూత్రమన్నారు. విస్తరణ ప్రణాళికల్లో రైతులతో అనుబంధం, వారి సంక్షేమమే ప్రధాన విషయాలని వివరించారు.

పాల‌ట్ విజ‌య‌రాఘ‌వ‌న్‌

పాల‌ట్ విజ‌య‌రాఘ‌వ‌న్‌


2009లో కార్యకలాపాలు ప్రారంభమైన దగ్గరినుంచి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది లారెన్స్ డేల్. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో లారెన్స్ డేల్ ఆధ్వర్యంలో కూరగాయల సాగు జరుగుతోంది. కార్యకలాపాలను మరింతగా విస్తరించటంతో పాటు కమ్యూనిటీ వ్యవసాయ పరిధిలో ప్రస్తుతం, మూడు వేలగా ఉన్న రైతుల సంఖ్యను ఈ ఏడాది చివరినాటికి ఐదువేలకు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సరాసరి రోజుకు 20 టన్నుల కూరగాయలను కంపెనీ ప్రాసెస్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 50 టన్నులకు పెంచాలని భావిస్తోంది. రోజుకు వంద టన్నులను ప్రాసెస్ చేయగల ఒక యూనిట్‌ను వారు నెలకొల్పారు. మరో మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించాలన్నది వారి కోరిక.

విత్తనం దగ్గర నుంచి కూరగాయలు రీటైల్ షాపుల్లోని అరల్లో చేరటం దాకా ప్రతి దశా తమ పర్యవేక్షణలో ఉందన్నారు విజయరాఘవన్. పంట చేతికందిన తరువాత వాటిని భద్రపరచటానికి నిపుణుల సాయం తీసుకోవటం ద్వారా మొత్తం సాగును ఒక క్రమపద్ధతిలో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. “తమ ఉత్పత్తులను మాకు మాత్రమే ఇవ్వాలని రైతులను ఒప్పంద పద్ధతుల్లో నిర్బంధం చేయటం లేదు. కమ్యూనిటీ వ్యవసాయాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. తమకు ఏది మంచిదో రైతులే నిర్ణయించుకుంటారు” అని విజయరాఘవన్ వివరించారు.

రీటైల్ స్టోర్ల‌లో లీఫ్ కూర‌గాయ‌లు

రీటైల్ స్టోర్ల‌లో లీఫ్ కూర‌గాయ‌లు


ఉత్పత్తులను ఇలా ఏకమొత్తంలో తీసుకోవటం వల్ల రైతుల్లానే.. రీటైలర్లూ లాభపడుతున్నారు. పాత రీటైల్ సంస్కృతిని లారెన్స్ డేల్ సంపూర్ణంగా మార్చివేసింది. ఉత్పత్తి నాణ్యత, పరిమాణంపై వ్యాపారులు పూర్తి పారదర్శకతతో ఉన్నారు. కూరగాయలను పోషకాలు చెడిపోకుండా ఉండే ప్యాకెట్లలో నిల్వచేసి, శుభ్రమైన అట్టపెట్టెల్లో ఉంచి శీతల ట్రక్కుల్లో తరలిస్తుండటంతో వ్యాపారులు నష్టపోయే శాతం కనీస స్థాయిలో మాత్రమే ఉంటోంది.

తాము చేస్తున్న పని కనిపించినంత తేలికగా జరిగిపోయేది కాదంటారు విజయరాఘవన్. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో ఎదురయ్యే సవాళ్లు అసాధారణ రీతిలో ఉంటాయని, వెనక్కి తగ్గని పట్టుదల, అంకితభావం ఉండాలని ఆయన తెలిపారు. “మేం బ్రోకర్లం కాదని రైతులకు నచ్చజెప్పి, వారి నమ్మకాన్ని చూరగొనాలి. మార్కెటింగ్ విషయానికొస్తే....వ్యాపారులకు తాజా కూరగాయలను అందిస్తామని, మొదటి నుంచి చివరి దాకా అంతా మేమే చూసుకుంటామని వారికి నచ్చచెప్పగలగాలి. రైతులు కొత్త పద్ధతులను అనుసరించేందుకు సాయపడాలి. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. లారెన్స్ డేల్ ఈ విధిని ముందుండి నిర్వర్తిస్తోంది. తాజా ఉత్పత్తుల సరఫరాలోనూ, నాణ్యతలోనూ మా కంపెనీ స్థిరంగా ముందుకు సాగిన తరువాతే రీటైలర్లు మాపై ఆసక్తి కనబర్చారు '' అని లారెన్స్ డేల్ మనుగడలోని కష్టనష్టాలను వివరించారు” విజయరాఘవన్.

మిగిలిన వాటికి భిన్నంగా...

ప్రస్తుతం లారెన్స్ డేల్ రోజుకు సరాసరి 20 టన్నుల కూరగాయలను సరఫరా చేస్తోంది. నిజానికి రిటైలర్లు కూరగాయల సరఫరాపై పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉండరు. లారెన్స్ డేల్ సరఫరా వల్ల వ్యాపారులకు వ్యర్థాల వల్ల కలిగే నష్టం చాలా వరకు తగ్గిపోయింది. అందుకే కూరగాయల సరఫరాకు వారికి ఈ కంపెనీ వ్యూహాత్మక భాగస్వామిగా కనిపిస్తోంది. చిన్న, పెద్ద స్థాయి వ్యాపారులకు కూరగాయల సరఫరానే తమ ప్రధాన ఆదాయ వనరని విజయ రాఘవన్ చెప్పారు. “ మేము చేస్తున్న వాటిని చేయటానికి గతంలో కొన్ని కంపెనీలు ప్రయత్నించాయి. కానీ ఫలితం సాధించలేకపోయాయి. రవాణాపైనో, శీతల గిడ్డంగులపైనో, మరో రకంగా సరఫరా చేయటంపైనో వారు దృష్టిపెట్టారు. లారెన్స్ డేల్ లాగా పంట ఉత్పత్తి నుంచి రీటైలర్లకు చేర్చేదాకా అన్నిదశలపై సమగ్రంగా దృష్టిపెట్టిన కంపెనీ ఒక్కటీ లేదు” అని తమ ఘనతను వివరించారు పాలట్ విజయరాఘవన్.

వ్యవసాయాన్ని ప్రోత్సహించి, రైతు బతుక్కు భరోసానిచ్చేందుకు విజయరాఘవన్ లాంటి ప్రైవేట్ వ్యక్తులు మరింత మంది ముందుకు రావాలి. అటు ప్రభుత్వమూ రైతు ప్రాముఖ్యతను గుర్తించి సరైన చర్యలు చేపట్టాలి. “మన వ్యవసాయానికి, తద్వారా దేశానికి.. రైతే వెన్నెముక అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. రైతు నమ్మకాన్ని సజీవంగా ఉంచగలిగితే, అది మొత్తం దేశానికీ లాభదాయకంగా మారుతుంది. రైతు గౌరవప్రదంగా జీవించగలిగేలా చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ” అని రైతు ప్రాముఖ్యతను చాటిచెప్పారు విజయరాఘవన్.