సంకలనాలు
Telugu

ఆడ్ - ఈవెన్ ఫార్ములాకు ఇంత గొప్ప స్పందన వస్తుందని ఊహించలేదు !!

కాలుష్యా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరిస్తున్న ఢిల్లీ ప్రజలు-ప్రజా భాగస్వామ్యంతో ఆడ్ - ఈవెన్ ఫార్ములా సూపర్ సక్సెస్-

uday kiran
11th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అసత్య ప్రచారం, గుడ్డిగా విమర్శలు చేసే వారి నోటికి ఇప్పటికైనా తాళం పడుతుందని ఆశిస్తున్నా. వీళ్లంతా ఆప్ ప్రభుత్వానికి ఆందోళనలు చేయడం తప్ప ప్రభుత్వాన్ని నడపడం చేతకాదని జనాల్లో అపోహ సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఆప్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ప్రయోజన కార్యక్రమం వారికి దిమ్మదిరిగేలా చేసింది. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం చేపట్టిన ఆడ్ - ఈవెన్ ఫార్ములాకు జనం నుంచి ఇంతటి స్పందన వస్తుందని ఊహించలేదు. కొన్ని రోజులుగా మెట్రోరైలు ప్రయాణంలో కలిసిన చాలా మంది వ్యక్తుల్ని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది పొగడ్తలతో పాటు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజల సహకారం లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదన్నది నిజం. అందుకే ఢిల్లీవాసులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను.

image


 ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ మహనగరాన్ని గ్యాస్ ఛాంబర్ తో పోల్చినప్పుడే ఆప్ ప్రభుత్వం నగరాన్ని కాలుష్యరహితంగా మార్చాలని నిర్ణయించుకుంది. దీన్నో సవాల్ గా తీసుకుంది. పెరుగుతున్న కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రతి నెలా 22వ తేదీని కార్ ఫ్రీ డేగా పాటించాలని నిర్ణయించింది. కానీ పెరుగుతున్న కాలుష్యంతో అత్యవసరంగా ప్రభుత్వం కొన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వ్చచింది. వాస్తవానికి ఇది చాలా పెద్ద లక్ష్యం. దీన్ని సాధించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు అవసరం. సమస్యను ఆషామాషీగా తీసుకుంటే అది మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడుతుంది. భవిష్యత్ తరాలకు ద్రోహం చేసినట్లవుతుంది. అందుకే కఠినమైన మార్గాన్నే ఎంచుకోవాలని నిర్ణయించాం. ఆడ్ - ఈవెన్ ఫార్ములా గురించి ప్రకటించనప్పుడు చాలా మంది శ్రేయోభిలాషులు ఇందులో చాలా రిస్క్ ఉందని, విజయవంతం కాకపోవచ్చని, ఫార్ములా ఫెయిల్ అయితే ప్రభుత్వ పనితీరుకు మాయని మచ్చవుతుందని అన్నారు. కానీ మాకు, పార్టీకి మాత్రం మా సామర్థ్యాలపై నమ్మకముంది. ప్రజల సహకారాన్ని కూడగట్టగలిగితే ఇది సాధ్యమవుతుందన్న విషయం మాకు ముందే తెలుసు.

ఆడ్ - ఈవెన్ ఫార్ములా సక్సెస్ ఎన్నో అపోహల్ని తొలగించింది. పాలనలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఆప్ ప్రభుత్వానికి ఇలాంటి సహసోపేతమైన విధానాలను రూపొందించి అమలు చేసే మేథో శక్తి ఉందని రుజువైంది. ఆప్ ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పనలో సూక్ష్మమైన అంశాలకు ప్రాధాన్యమిచ్చి సమర్థంగా అమలుచేయగలుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి విధానపరమైన నిర్ణయాల అమలులో స్పష్టత లేకపోవడం అభివృద్ధికి అవరోధంగా మారింది. ప్రభుత్వ గొప్ప ప్రణాళికలు రూపొందిస్తున్నా అమలులో మాత్రం విఫలమవుతున్నాయి. ఆడ్ - ఈవెన్ ఫార్ములా ఈ అపోహను తొలగించింది. ఆడ్ - ఈవెన్ ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించినప్పుడే అన్ని విభాగాల సమస్వయంతోనే ఇది సాధ్యమవుతుందన్న విషయాన్ని గ్రహించింది. అందుకే ప్రభుత్వం ప్రతి విభాగం కూడా కచ్చితంగా సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంది. ఎన్నో చర్చోపచర్చలు జరిగారు. ప్రతి ఒక్కరూ కూడా సానుకూల ధృక్పథంతో బృందంగా పనిచేశారు.

ప్రజల సహకారం లేనిది ఇలాంటి పద్ధతులు విజయవంతం కావడం కష్టమన్న విషయం తెలుసు. అందుకే ప్రతి వ్యక్తి ఆడ్ - ఈవెన్ ఫార్ములా ప్రాధాన్యాన్ని గుర్తించాలి. తన కుటుంబం, పిల్లలు, భవిష్యత్ తరాల ఆయురారోగ్యాలకు ఇది ఎంత కీలకమో తెలుసుకోవాలి. కాలుష్యం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ రోగాల పాలు చేస్తోంది. ధనిక, పేద అని తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తి కూడా కాలుష్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించేందుకు సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు. ప్రతి డిస్కషన్ లోనూ ఆడ్ - ఈవెన్ ఫార్ములా చర్చనీయాంశంగా మారింది. దేశమంతటా ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడారు. ఆడ్ - ఈ వెన్ ఫార్ములాలోని ప్రతి అంశంపైనా కూలంకుషంగా చర్చించారు.

మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. గత నెలలో మంత్రులు, ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో నిబంధనలు అతిక్రమించిన వారికి ఎంత ఫైన్ వేస్తారన్న విషయాన్ని ముందుగానే ప్రకటించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అందుకు ఒప్పుకోలేదు. చర్చ జరగనివ్వండి, ప్రభుత్వానికి సూచనలు అందనివ్వడి. ఇప్పుడే తొందరెందుకు అన్నారు. తొలుత అసంతృప్తితో మొదలైన చర్చ కాస్తా ప్రభుత్వం పౌరుల కోసమే పని చేస్తోందన్న విషయం అర్థమయ్యేలా చేసింది. ఈ చర్చలు సమాజంలోని ప్రతి వర్గం వారి ఆందోళన అర్థం చేసుకునేందుకు ప్రభుత్వానికి సాయపడింది. డిసెంబర్ చివరి వారంలో ఆడ్ - ఈవెన్ పాలసీకి సంబంధించి అధికారిక ప్రకటన చేసేటప్పటికీ ఏకాభిప్రాయం సాధించగలిగాం. ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు. ఢిల్లీ సర్కారుకు బదులు ప్రజలే స్వయంగా ఆడ్ - ఈవెన్ ఫార్ములా అమలుచేసే బాధ్యత భుజాలకెత్తున్నారు. ఈ ఫార్ములా విధాన నిర్ణయాల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తే ప్రతిష్మాత్రకమైన ప్రణాళికలు రూపొందించడమే కాదు.. విజయవంతంగా అమలు చేయగలుగుతామన్న పాఠాన్ని ప్రభుత్వాలకు నేర్పింది.

ఆడ్ -ఈవెన్ ప్లాన్ సక్సెస్… ఆప్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని, ప్రభుత్వం ఏం చేసినా అందులో నిజాయితీ ఉంటుందే తప్ప దురుద్దేశం ఉండదన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం మా నైజం కాదు. మేం చేయగలం అనుకుంటేనే హామీ ఇస్తాం. ఒకరితో పోల్చి చూడటమన్నది నా అభిమతం కాదు. కానీ మోడీ ప్రభుత్వం గత 20 నెలల్లో చేపట్టిన పెద్ద ప్రాజెక్టుల పరిస్థితి చూడండి. స్వచ్ఛ్ భారత్ నిజానికి ఓ మంచి ఉద్యమం. మనస్పూర్తిగా మేం దానికి మద్దతు పలికాం. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ప్రస్తుతం మీడియా ఈవెంట్ గా, పబ్లిసిటీ స్టంట్ గా మిగిలిపోయింది. ఇందులో ప్రజల్ని భాగస్వాముల్ని చేసే ప్రయత్నమే జరగలేదు. ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్వర్టైజ్ మెంట్ల కోసం ఖర్చుచేస్తున్నారు. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ప్రజల్ని భాగస్వామ్యం లేకపోవడంతో ఇలాంటివి ప్రచార ఆర్భాటాలుగానే మిగిలిపోతున్నాయి.

ప్రయాణం మొదలైంది. కానీ గమ్యం చేరాలంటే ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి. దారిలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించాలి. కలిసికట్టుగా ఢిల్లీని కాలుష్యరహితంగా మార్చాలి. జనవరి 15న ఢిల్లీ ప్రభుత్వం ఆడ్ - ఈవెన్ ఫార్ములాపై సమీక్ష, విశ్లేషణ జరిపి అవసరమనుకుంటే మన ఆరోగ్య పరిరక్షణ కోసం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనుంది. వాటిలో కొన్ని మరీ కఠినంగా ఉండొచ్చు. మెరుగైన సమాజం కోసం ఇలాంటివి తప్పవు. స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం, ఇబ్బంది లేకుండా పిల్లలు శ్వాస తీసుకోవడం, ఉపిరితిత్తుల్లోకి పొగ చేరకుండా సీనియర్ సిటిజన్లు వాక్ చేసే స్వచ్ఛమైన వాతావరణం త్వరలోనే ఏర్పడనుంది. ఆడ్ - ఈవెన్ ఫార్ములా కొత్త ఆశ, కొత్త ప్రజా ఉద్యమం, సరికొత్త పాలనా విధానాన్ని బాటలు వేసింది. విధాన నిర్ణయాల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తై అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందన్న నమ్మకాన్ని పెంచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేరున్న ఢిల్లీ మహానగరం భారతదేశంలోనే మొట్టమొదటి కాలుష్యరహిత నగరంగా మారుతుందన్న నమ్మకం నాకు కలిగింది. థాంక్యూ ఢిల్లీ.

రచయిత : అశుతోష్, మాజీ జర్నలిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags