ఇంటి దగ్గరి షాప్‌లో ఏం దొరుకుతాయో చెప్పేసే 'సెర్చ్ ఎరౌండ్'
జైపూర్ లో హైపర్ లోకల్ సర్వీసులువెబ్ సైట్ లో షాపుల వివరాలు, లొకేషన్ మ్యాప్ లునలుగురు విద్యార్థుల ఘనత
మనదేశంలో రీటైల్ రంగం అస్తవ్యస్తంగా ఉంది. దేశంలో ఆదాయాన్నిచ్చే రంగాల్లో రీటైల్ మార్కెట్ ముందువరుసలో ఉన్నా....అది వ్యవస్థీకృతంగా లేదు. రీటైల్ రంగాన్ని అనుసంధానిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. స్థానికతకు పెద్ద పీట వేస్తూ ఇది జరిగితే....రీటైల్ రంగం స్వరూపమే మారిపోతుంది. నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఆ పనే చేస్తున్నారు. సెర్చ్ ఎరౌండ్ పేరుతో హైపర్ లోకల్ స్టార్టప్ మొదలుపెట్టారు.
దేశంలో రీటైల్ షాపులు పెద్ద ఎత్తున ఉన్నా......ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి....ఏ ప్రాంతాల ప్రజలకు ఏయే వస్తువులు అవసరమవుతాయి అనే సమాచారం వినియోగదారులకు, వ్యాపారస్తులకు స్పష్టంగా తెలియటంలేదు. ఈ కామర్స్ రంగం దీనిపై దృష్టిపెట్టిందనే చెప్పవచ్చు. అయితే డబ్ల్యువేర్, అండ్నర్ బై, హియర్ నౌ, కైక్, అర్బన్ క్లాప్, హౌస్ జాయ్ వంటి హైపర్ లోకల్ ప్లాట్ ఫాంలు ప్రధానంగా సంప్రదాయక రీటైలర్లు, హౌస్ హెల్పర్లు, రిక్రియేషనల్ క్లాసెస్ పై దృష్టిపెట్టటంతో అవి పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
నలుగురు కలిసి...
రీటైల్ మార్కెట్‌ను అనుసంధానించటంపై దృష్టిపెట్టింది సెర్చ్ ఎరౌండ్. షాపుల వివరాలు....అవి ఎక్కడ ఉన్నాయో సూచించే లొకేషన్ మ్యాప్‌లు సెర్చ్ ఎరౌండ్ వెబ్ సైట్‌లో ఉంటాయి. ఈ స్టార్టప్‌ను జైపూర్‌లోని జేఈసీఆర్సీ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఆదిత్య కుమార్, రోనక్ మాథూర్, కపిల్ యాదవ్, పూణెలోని సింగాడ్ కాలేజ్‌కు చెందిన సుబాంగ్ శర్మ కలిసి ప్రారంభించారు. వీరితో పాటు జైపూర్ ఎన్ ఐటీ పూర్వ విద్యార్థులు శుభమ్ జైశ్వాల్, హేమరాజ్, దినేష్, జంషెడ్ పూర్ ఎన్ ఐటీకి చెందిన తరుణ్ కేడియా కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
సెర్చ్ ఎరౌండ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బృందం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రారంభించిన తొలినాళ్లలో సభ్యులంతా నిరంతరం రోడ్ల మీదే ఉండేవాళ్లు. అన్ని చోట్లా తిరుగుతూ షాపు యజమానుల నుంచి సమాచారం సేకరించటం, ఫొటోలు తీసుకోవటం, వాళ్ల సైట్‌ను ఉపయోగించుకునేలా వ్యక్తిగతంగా వారిని ఒప్పించటానికి ప్రయత్నించటం చేసేవాళ్లమని ఆదిత్య కుమార్ చెప్పారు.
పగలంతా వ్యాపారులను కలిసేందుకు రోడ్లు పట్టుకుని తిరగటం, సేకరించిన సమాచారాన్ని సాయంత్రాలు, రాత్రివేళల్లో పరిశీలించటం, విశ్లేషించటం చేసేవాళ్లు బృంద సభ్యులు. అనంతరం ప్రతి స్టోర్‌కు కచ్చితమైన మ్యాప్ లొకేషన్ సూచించేవారు. తగ్గింపు ధరలకు వారి సేవలను అందించేలా యజమానులను ఒప్పించటం తమ బృందానికి చాలా కష్టమైన లక్ష్యమని ఆదిత్య వివరించారు.
మూడు నెలల్లో వంద మంది యూజర్లు
బృందం సభ్యులంతా పగలనక, రాత్రనక మూడు నెలలు శ్రమించిన తరువాత...వెబ్ సైట్ ను ప్రస్తుతం 300 మంది వీక్షిస్తున్నారు. వందకు పైగా రిజిస్టర్ట్ యూజర్లు ఉన్నారు. యూజర్ల రిజిస్టర్ విధానంలో వెబ్ సైట్ రెండు రకాల విధానాలు అవలంబించింది. ఒకటి ఉచిత సభ్యత్వ నమోదు కాగా...మరొకటి ప్రీమియం మెంబర్ షిప్. ఫ్రీ మెంబర్ షిప్ కింద సెర్చ్ ఎరౌండ్ సమాచార జాబితాను అందిస్తుంది. ప్రీమియం మెంబర్ షిప్ కింద ప్రత్యేక ప్రాంతాల గురించి సవివరంగా తెలియజేస్తుంది. వినియోగదారులకు కొన్ని ప్రత్యేక సర్వీసులను సెర్చ్ ఎరౌండ్ తగ్గింపు ధరలపై కూడా అందిస్తోందని ఆదిత్య తెలిపారు.
సెర్చ్ ఎరౌండ్ ద్వారా వివిధ రకాల సేవల గురించి సులభంగా సమాచారం పొందటంతో పాటు... మనం కావాలనుకుంటే ధరలు, డిస్కౌంట్ ఆఫర్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. వీటితో పాటు...వినియోగదారుల సంతృప్తిపైనా దృష్టిపెడుతోంది.
ఒక వయసు వాళ్లను లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టటం సెర్చ్ ఎరౌండ్ ఉద్దేశం కాదు. అన్ని వయసుల వాళ్లూ తమ వెబ్ సైట్ ద్వారా లాభం పొందాలన్నదే ఆదిత్య, ఆయన సహచరుల లక్ష్యం. సెర్చ్ ఎరౌండ్ పెరుగుదల, అభివృద్ధిలో ఇంటర్నెట్ విప్లవం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుందని ఆదిత్య నమ్ముతున్నారు.
హైపర్ లోకల్ మార్కెట్
ఇంటర్నెట్ వినియోగిస్తున్న దేశాల్లో చైనా, అమెరికా తరువాత భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మనదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అమెరికాను మించిపోతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ అపూర్వమైన పెరుగుదల దేశం డిజిటలైజేషన్‌గా రూపాంతరం చెందటానికి అనేక అవకాశాలను కల్పిస్తోంది.
సాధారణ స్టోర్లు కూడా డిజిటలైజేషన్ ఇండియాలో భాగం కావటానికి ప్రస్తుతం అనేక హైపర్ లోకల్ ప్లాట్ ఫాంలు సాయపడుతున్నాయి. 2020 నాటికి రీటైల్ రంగం మార్కెట్ పరిమాణం దేశంలో ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. నివేదికల ప్రకారం భారతీయ రీటైల్ రంగం దాదాపు 98శాతం సంప్రదాయ వ్యాపారుల చేతుల్లోనే ఉంది. వారందరినీ ఒక్కవేదికపైకి తీసుకొస్తే అటు వినియోగదారులూ...ఇటు వ్యాపారులూ ఇద్దరికీ ఎంతో లాభం చేకూరుతుంది. డిజిటలైజేషన్ ద్వారా ఆ లక్ష్యం సాధించాలని సెర్చ్ ఎరౌండ్ భావిస్తోంది.
సెర్చ్ ఎరౌండ్ ప్రస్తుతం జైపూర్ కేంద్రంగా నడుస్తోంది. త్వరలోనే మెట్రో, టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించాలని వెబ్ సైట్ బృందం భావిస్తోంది. తొలి దశలో భాగంగా...ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పూణె, ఔరంగాబాద్, బెంగళూరు, వారణాసి, పాట్నా, జంషెడ్ పూర్, రాంచీ, అహ్మదబాద్ కు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రారంభమయిన సెర్చ్ ఎరౌండ్ ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దశలో ఉంది. వెబ్ సైట్ లో పెట్టుబడులు పెట్టేవారికోసం ఈ బృందం అన్వేషిస్తోంది.
రీటైల్ రంగానికి దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ స్థానమే ఉన్నా షాపుల మధ్య అనుసంధానం లేకపోవటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.మన దేశంలో మూలమూలకో షాపు ఉంటుంది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని షాపుల్లోనూ మనం కొనుగోలు చేస్తుంటాం. కొన్నిసార్లు కొన్ని వస్తువుల కోసం అదే పనిగా ఎన్నో షాపులకు తిరుగుతుంటాం. ఒక్కోసారి మనకు కావల్సిన వస్తువు దొరుకుతుంది. కొన్నిసార్లు ఎంత శ్రమపడినా కావల్సినది దొరకదు. ఇది ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ ఎదురయ్యే అనుభవమే. సెర్చ్ ఎరౌండ్ లో షాపులన్నీ భాగస్వామ్యులయితే వినియోగదారులకు ఈ శ్రమ తప్పుతుంది. ఏ యే షాపుల్లో ఏ వస్తువులు దొరుకుతాయో వారికి తెలుస్తుంది. అదే సమయంలో షాపుల వారికి కూడా వినియోగదారులు ఏ వస్తువులు కోరుకుంటున్నారో అర్ధమవుతుంది. సెర్చ్ ఎరౌండ్ అలా ఉభయతారకంలా పనిచేస్తుంది. అందుకే రీటైల్ రంగానికి, డిజిటలైజేషన్ కు భవిష్యత్తు ఉన్న ప్రస్తుత తరుణంలో సెర్చ్ ఎరౌండ్ అందరికీ చేరువవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సెర్చ్ ఎరౌండ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందులో పెట్టుబడులు పెడితే అద్భుత లాభాలనార్జించవచ్చు.