ఆ చిన్నారి కోసం ఏడాది పోరాటం..

చిన్న వయస్సులో దత్తత తీసుకున్న తొలి యువకుడు ఆదిత్య

ఆ చిన్నారి కోసం ఏడాది పోరాటం..

Monday January 04, 2016,

2 min Read

మానవత్వం... మనిషికి ఉండాల్సిన ఏకైక ఆభరణం..మంచి గంధంలా పరిమళించే మానవత్వం గల మనుషులు ఎక్కడున్నా స్వాగతం పలకాలి.. మానవత్వం మృగ్యమై పోయిన ఈ కాలంలో ఇంకా అలాంటి వాళ్లు మనమధ్య కూడా ఉన్నారనడానికి ఈ వాస్తవమైన ఘటనే ఓ నిదర్శనం.


image


పిల్లలు లేనివారు, శ్రీమంతులు , ప్రముఖులు అనాధలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడంలేదు. కానీ..ఓ యువకుడు గుండె జబ్బుతో బాధపడుతున్న అనాధ చిన్నారి కోసం ఏడాది పాటు పోరాడి ఎట్టకేలకు విజయం సాధించాడు.. నూతన సంవత్సరం కానుకగా ఆ చిన్నారిని తన జీవితంలోకి ఆహ్వానించి కొత్త జీవితాన్నిచ్చాడు.. 

వివరాల్లోకి వెళితే..

పుణెకి చెందిన 28 ఏళ్ళ ఆదిత్య తివారి.. ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు . ఓసారి న్యూస్ పేపర్ తిరగేస్తుంటే అందులో పుట్టుకతోనే డౌన్స్ సిండ్రోమ్ (గుండెలో చిన్న రంద్రం) ఉన్న ఒకటిన్నరేళ్ల వయసుగల అనాధ చిన్నారి బిన్నీ గురించి చదివాడు.ఆ బాలుడి పరిస్థితి ని చూసి చలించిన ఆదిత్య వెంటనే ఆ సంస్థను సంప్రదించి బిన్నీని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాడు . అయితే భారతీయ చట్టాల ప్రకారం 30 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న వారికి దత్తత తీసుకునేందుకు అర్హులు కారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి దత్తత తీసుకునే వారి వయస్సును 25కి తగ్గించేలా ఒప్పించగలిగాడు. 2015 ఆగస్ట్ లో దత్తత వయస్సును 25 కి తగ్గిస్తూ చట్టాల్నికూడా సవరించింది కేంద్రం. అయినా బిన్నీదత్తతకు అడ్డంకులు తొలగిపోలేదు. ఆదిత్యకు పెళ్లి కాకపోవడం తో సింగిల్ పేరెంట్ కి దత్తత ఇవ్వడం కుదరదని అధికారులు పేచీ పెట్టారు. దీంతో బిన్నీ కోసం కొన్ని వందల సార్లు మాతృచాయ సంస్థ చుట్టూ తిరిగాడు.

చివరికి ఈ విషయం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ దృష్టికి కూడా వెళ్లింది. వివరాలను పరిశీలించి బిన్నీని ఆదిత్య కి ఇవ్వాల్సిందిగా మంత్రి కూడా ఆదేశించారు. అయినా పని జరగలేదు. దత్తత తీసుకోవాలంటే బిడ్డకు తల్లిదండ్రి ఉండాలి. కానీ. ఆదిత్య ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి దత్తత ఇవ్వడం కుదరని రూల్స్ చెప్పారు. ఎన్ని సార్లు అభ్యర్థించినా లాభం లేకపోవడంతో ఆదిత్య చివరికి న్యాయస్థాన్నాన్ని కూడా ఆశ్రయించాడు. చివరికి ఆధికారులు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి జనవరి1 న బిన్నీని అధికారికంగా ఆదిత్య కి అప్పగించారు. కొత్త సంవత్సర కానుకగా బిన్నీని జనవరి 1న తన జీవితంలోకి ఆహ్వానించి అవినాష్ తివారి అని పేరు పెట్టాడు. అంతేగాకుండా అవినాష్ భవిష్యత్ కు కావాల్సిన అన్ని వసతులను అందిస్తానని భరోసా ఇస్తున్నాడు.

ఆదిత్య వంటివారు అనాధలను దత్తత తీసుకోడానికి ముందుకొస్తే దేశంలో అనాధల సంఖ్య కొంచమైనా తగ్గుతుంది..రేపటి భారత పౌరులను మొగ్గలోనే కాపాడుకునే అవకాశం ఉంటుంది!ప్రభుత్వం కూడా దత్తత నిబంధనలను మార్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.